గుంటూరు

నేడు దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 23: ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈనెల 24వ తేదీన దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శుక్రవారం కార్యక్రమ నిర్వహణపై కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దోమల నివారణకు, ప్రజ ల ఆరోగ్యం కోసం గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినా ప్రస్తుత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వాములయ్యేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున, ప్రజలకు ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరో గ్య శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామగ్రామానా వైద్య శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో చెత్తాచెదారాన్ని తొలగించడమే కాకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలన్నారు. దీంతో పాటు మొక్కలు కూడా విరివిగా నాటాలని సూచించారు. పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు ప్రతి విద్యార్థిలో అవగాహన కల్గించి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి ప్రాంతం ఒక మంచి వాతావరణం సంతరించుకునేలా ఉండాలన్నారు. కార్యక్రమ అమలుపై అధికారులందరూ వారి వారి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కార్యక్రమం జయప్రదమయ్యేలా కృషి చేయాలన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండదని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలు, వాతావరణంలో మార్పు కారణంగా ప్రజలకు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వైద్య, ఆరోగ్య, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడదని స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణ కోసం, విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు ఈనెల 24న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జరగనున్న పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిందన్నారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని తొలుత ప్రభుత్వ కార్యాలయాల నుండే ప్రారంభించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను వ్యాధి రహిత ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దనుందని, ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలోని 1004 గ్రామ పంచాయతీలలోనూ, 12 మునిసిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే జివి ఆంజనేయులు, ఇన్‌ఛార్జి సంయుక్త కలెక్టర్ ఎం వెంకటేశ్వరరావు, డిఆర్‌ఒ కొసనా నాగబాబు, పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకురాలు అనూరాధ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.