గుంటూరు

వరద నష్టంపై ప్రభుత్వానిది కంటితుడుపు చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచేపల్లి, సెప్టెంబరు 26: వరదల నేపథ్యంలో గుంటూరు జిల్లా దాచేపల్లి దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో వరద వలన నష్టపోయిన పంటపొలాలను వైసిపి అధినేత జగన్ సోమవారం స్వయంగా పొలాల్లో నడుచుకుంటూ వెళ్లి పరిశీలించి నష్టంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం కంటితుడుపు చర్యలు మాత్రమే చేపడుతుందని రైతులను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో పని చేయడంలేదని విమర్శించారు. వేలాది ఎకరాల పంటలు వరదలో మునిగిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతంలో వరద వలన నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు దాచేపల్లికి వచ్చిన జగన్‌కు ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మండలంలోని పొందుగల గ్రామం వద్ద ఘన స్వాగతం పలికారు. జగన్ రాక కోసం ప్రజలు ఉదయం నుండి ఎదురుచూశారు. జగన్ పొందుగల బ్రిడ్జిపై దిగగానే ఆ పార్టీ కార్యకర్తలు కేరింతలు కొట్టుకుంటూ జగన్‌కు ఎదురు వెళ్లి ఘన స్వాగతం పలికారు. పొందుగల గ్రామం నుండి బయలుదేరిన జగన్‌కు గామాలపాడు అధిక సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం దాచేపల్లి చేరుకున్న జగన్‌కు స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వేచివుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం జగన్ ముత్యాలంపాడు గ్రామానికి చేరుకొని అక్కడి పొలాలలోని వరదకు పాడైపొయిన పంటలను పరిశీలించారు. తిరిగి దాచేపల్లి వచ్చిన జగన్ దాచేపల్లి ఎస్టీ కాలనీలో వరదకు గురైన గృహాలను పరిశీలించి మహిళలను పరామర్శించారు.

వరదపై కూడా బురద రాజకీయాలు
* జగన్‌పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజం
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 26: వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలవాల్సిన సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి బురద రాజకీయాలు చేయడం హే యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జగన్‌కు బాధితులను ఆదుకోవాలన్న ఉద్దేశం లేదని, అధికారంలో ఉన్న తెలుగుదేశంపై విమర్శలు చేయడమే పర్యటన ఉద్దేశమన్నారు. దాచేపల్లి ప్రాంతంలో కాల్వలు కుచించుకుపోయే విధంగా రోడ్ల నిర్మాణం చేయబట్టే ఈ రోజు తీవ్ర నష్టం జరిగిందని, ఈ రోడ్లు వేసింది కూడా వైసిపికి చెందినవారేనన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి హెలికాప్టర్‌లోనే తిరుగుతున్నారని ప్రచారాలు చేస్తున్నారని, తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు హెలికాప్టర్‌లో తిరగలేదా అని ప్రశ్నించారు. చివరకు జగన్ బెంగుళూరులోని ఆయన గృహంలో రెండు హెలిప్యాడ్‌లను నిర్మించుకోలేదా అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఏనాడైనా ప్రజా సమస్యలపై చర్చించారా, రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మంచిపేరు వస్తుందనే అక్కస్సుతోనే జగన్ వాటికి అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడును విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదని, రాజకీయ పరిజ్ఞానం లేని జగన్‌కు చంద్రబాబు భయపడతారా అని ప్రశ్నించారు. వరద బాధితులకు ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, చనిపోయిన వారికి చిన్న, పెద్ద తేడా లేకుండా సమాన ఎక్స్‌గ్రేషియా ఇచ్చిందని, ఒక్కో కుటుంబానికి 20 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, నూనె ఇవ్వాలని సిఎం ఆదేశించారని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 95 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి 5200 రూపాయలు, పూరిళ్లకు 2 వేలు అందిస్తున్నామన్నారు. అలాగే 12 మంది ఐఎఎస్ అధికారులు, 40 డిప్యూటీ కలెక్టర్లతో వరద ప్రాంతాల్లో అంచనాలు రూపొందిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై ఎంపిలతో రాజీనామా చేపిస్తామన్న జగన్ మాట నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ ప్రత్యేక హోదా వలన హిమాచల్‌ప్రదేశ్‌కు గడిచిన 13 యేళ్లలో 1,28,179 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. సమావేశంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ తదితరులు పాల్గొన్నారు.

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది
అచ్చంపేట, సెప్టెంబర్ 26: ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం వేగవంతంగా సర్వే జరిపించి నివేదికలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తయారు చేయించుకుంటున్నారని పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అన్నారు. ఆయన సోమవారం వరదల తాకిడికి నష్టపోయిన కృష్ణాపరివాహక గ్రామాలైన మాదిపాడు, చల్లగరిగ, తాడువాయి గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలను సందర్శించి బాధితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. పర్యటన అనంతరం ఎండిఒ కార్యాలయ సమావేశ మందిరంలో విలేఖర్లతో మాట్లాడుతూ మాదిపాడు గ్రామంలో రెండు మట్టిమిద్దెలు నేలకొరిగాయన్నారు. వరదనీటి ఉద్ధృతికి జాలర్ల చేపల వలలు, పడవలు, కొట్టుకుపోయినట్లుగా బాధితులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. సుమారు 16 వేల ఎకరాల వరకు పంటనష్టం జరిగినట్లు ఇప్పటికే ప్రాథమిక నివేదికలు అందాయన్నారు. క్రోసూరు మండలంలోని ఊటుకూరు, విప్పర్ల, బయ్యవరం, పీసపాడు, అందుకూరు, మరికొన్ని గ్రామాల్లో నిరాశ్రయులైన వారికి 20 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందించామన్నారు. ఇళ్లు, పంటలు నష్టపోయిన బా ధితులకు యుద్ధప్రాతిపదికన సహాయం అందేలా ముఖ్యమంత్రి స్వయంగా పర్యటించి వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వరద బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. మాదిపాడులో మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు జాన్‌సాహెబ్ మృతిపట్ల సంతాపం తెలియజేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వరద భాదితులకు బియ్యం పంపిణి
సత్తెనపల్లి, సెప్టెంబర్ 26: పట్టణంలోని వరద ముంపునకు గురైన 21వ వార్డులో 400 మంది బాధితులకు డెప్యూటీ కలెక్టర్ కె నాగేశ్వరరావుచేతుల మీదుగా సోమవారం బియ్యం పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కుటుంబాలకు సహాయ చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వరద భాదిత కుటుంబాలకు నిత్యవసర సరుకుల నిమిత్తం బియ్యం, కందిపప్పు, పంచదార, పామాయిల్ సరుకులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, తహశీల్దార్ బిబిఎస్ ప్రసాద్, సిఎస్ డిటి సివిల్ ఫణికుమార్, కౌన్సిలర్లు కౌత్రపు సావిత్రి శ్రీనివాస్, చౌటా శ్రీనివాసరావు, అంజి, నందం కబ్బయ్య, మళ్లేశ్వరరావు, బుడే, సతీష్, విఆర్వో, విఆర్‌ఎలు తదితరులు పాల్గొన్నారు.

మురుగునీటి నిల్వపై ఆగ్రహం
మంగళగిరి, సెప్టెంబర్ 26: పట్టణంలోని 24వ వార్డులో ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపునీరు, మురుగునీరు నిలిచిపోయి ప్రజలకు అసౌకర్యంగా ఉండటంతో మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం వార్డులో పర్యటించిన చైర్మన్ దృష్టికి వార్డుకౌన్సిలర్ మండ్రు రమాదేవి మురుగునీటి నిల్వ విషయం తీసుకువెళ్లారు. మురుగునీరు చేరి దోమలు విజృంభిస్తున్నాయని, ఇప్పటికే అనేకమంది వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్పందించిన చిరంజీవి కమినర్‌తో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు నందం అబద్దయ్య, మండ్రు రాము, ఊట్ల శ్రీమన్నారాయణ, ముశం రవికుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వరద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
మేడికొండూరు, సెప్టెంబర్ 26: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా ఇళ్లలోని నీరుచేరి నిరాశ్రయులైన వరద బాధిత కుటుంబాలను సోమవారం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పరామర్శించారు. మండలంలోని కొర్రపాడు, పాలడుగు గ్రామాల్లో బాధితులకు 20 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా కూడా అన్ని సహాయక చర్యలు చేపడుతున్నారు. పాలడుగులో సయ్యద్ మస్తాన్‌వలికి చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబానికి సాయం అందజేశారు. మండలంలో అధికంగా వాణిజ్య పంటలైన ప్రత్తి, మిర్చి పంటలను అధికంగా పండిస్తున్నారని, వరదల వల్ల పంటనష్టం అంచనాలను అధికారులు సిద్ధంచేశారన్నారు. 300 ఎకరాల్లో ప్రత్తి, 300 ఎకరాల్లో మిర్చి దెబ్బతిన్నట్లు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ గుంటుపల్లి సాంబశివరావు, ఎంపిపి మొక్కల సుబ్బారావు, ఎంపిటిసి ఎ సాయిబాబా, మాజీ జెడ్పీటీసీ పాములపాటి శివన్నారాయణ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నార్నె శ్రీనివాసరావు, సర్పంచ్ ఎం వెంకటరావు, ఎండిఒ పద్మజ, తాడికొండ నియోజకవర్గ వరదనష్టం ప్రత్యేక అధికారి బాలాజి దిగంబర్, సత్తెనపల్లి ఎడిఎ రవికుమార్ పాల్గొన్నారు.

’గృహకల్ప‘లో బినామీలు
* లబ్ధిదారులకు నోటీసులు
* నివాసం లేకుంటే గృహాలు రద్దు
గుంటూరు, సెప్టెంబర్ 26: పేదలకు సొంత ఇల్లు కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో బినామీలు నివశిస్తున్న విషయం గృహనిర్మాణ సంస్థ అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది. వెంటనే స్పందించిన అధికారులు సంబంధిత లబ్ధిదారులకు నోటీసులు పంపారు. నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు ఏరియాలో రాజీవ్‌గృహ కల్ప పథకం కింద జిప్లస్-2 పద్ధతిన 360 గృహాల సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించింది. అయితే దాదాపు 122 మంది లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండటం లేదని, మరో 29 మంది లబ్ధిదారులు ఫ్లాట్లను విక్రయించగా 65 మంది లబ్ధిదారులు అద్దెకు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు సంబంధిత లబ్ధిదారులకు నోటీసులు జారీచేశారు. వచ్చేనెల 14వ తేదీలోగా కేటాయించిన గృహాల్లో లబ్ధిదారులు నివాసం ఉండని పక్షంలో సంబంధిత గృహాల కేటాయింపును రద్దుచేస్తామని అధికారులు స్పష్టంచేశారు. రద్దుచేసిన గృహాలను అర్హులైన పేదలకు తిరిగి కేటాయిస్తామని అధికారులు పేర్కొన్నారు.