గుంటూరు

ఎస్సీ, ఎస్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 27: రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం స్థానిక పోలీసు పెరెడ్‌గ్రౌండ్స్‌లో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ దళిత, గిరిజనబాట కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు వీలుగా విదేశీ విద్య పథకం కింద ఒక్కొక్కరికీ 10 లక్షల రూపాయల వంతున ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. అంతేకాకుండా పారిశ్రామికంగా ఎదిగేందుకు కూడా అవసరమైన సహకారాన్ని అందిస్తుందన్నారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ ఉప ప్రణాళిక కింద 12 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. వారి అభివృద్ధికి కేటాయించిన నిధులు వారికే ఆయా శాఖలు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. సుమారు 24 శాఖలకు ఉప ప్రణాళిక నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. పథకాలు పకడ్బందీగా అమలు చేయడంలో, నిధులను సక్రమంగా వినియోగించడంలో ఆయా శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. వ్యవసాయశాఖ ద్వారా ఉప ప్రణాళిక కింద రైతుల సంక్షేమానికి రూ. 350 కోట్లు, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని అన్ని రహదారులను అభివృద్ధి చేసేందుకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. వీటిని రాబోయే మూడు సంవత్సరాల కాలంలో రహదారులను అభివృద్ధి చేయడం ద్వారా నిధులను వెచ్చిండం జరుగుతుందని చెప్పారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద కాలనీల్లోని రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలను మూసి వేయడం జరగదని స్పష్టంచేశారు. వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమై, మెరుగైన సాంకేతిక పరమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఎపి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం నివశిస్తున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించాలని కోరారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ విదేశాల్లోని విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సంస్థ అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, వారి అర్హత మేరకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉప ప్రణాళిక నిధుల కింద సుమారు 4,21,339 మందికి రూ.229.13 కోట్లు విలువగల మెగా చెక్కును మంత్రులు అందజేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం చిత్రపటాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి రావెల కిషోర్‌బాబు, కలెక్టర్ కాంతిలాల్ దండే తదితరుల సందర్శించి లబ్ధిదారులకు ఉపకరణాలను అందజేశారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు గురునాధం, ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ సభ్యులు దేవానంద్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి బాలాజీనాయక్, డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు మల్లిఖార్జునరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నారాయణుడు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.