గుంటూరు

టీడీపి క్యాడర్‌లో అసమ్మతి సెగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 21: జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు రగులుకుంటున్నాయి.. నామినేటెడ్ పదవులు భర్తీచేయక పోవడంతో ద్వితీయశ్రేణి నాయకులు, క్యాడర్‌లో అసహనం పెరుగుతోంది.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ నామినేటెడ్ పదవులకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత నిర్లిప్త వైఖరి ఇందుకు కారణమనే విమర్శలు వినవస్తున్నాయి.. వర్గపోరును పార్టీ అధిష్ఠానమే పెంచిపోషిస్తోందని చెప్తున్నారు. రాజధానికి అవసరమైన అన్ని వనరులు గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తూ పొరుగున ఉన్న కృష్ణా జిల్లాకు నామినేటెడ్‌తో పాటు, నాలుగు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆసియాలో కెల్లా అతిపెద్దదైన వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే గుంటూరు మిర్చి యార్డు పదవుల పంపకాల్లో పార్టీనేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.. ఒకే ఒక్క ఎమ్మెల్యే మార్కెట్ యార్డు చైర్మన్, డైరెక్టర్ల నియామకాల్లో పేచీ పెట్టటంతో పాటు ఈ పదవుల కోసం సం..కుల..సమరం జరుగుతున్నా జిల్లా మంత్రులతో పాటు ఇన్‌చార్జి మంత్రులూ పట్టీపట్టనట్లు వ్యవహరించటాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ అధికారంలోకి రాకముందు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ అంకితభావంతో పనిచేసిన వారిని విస్మరించటం సమంజసం కాదనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.. పార్టీలో కుమ్ములాటలను ప్రేరేపించే నేతలను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మిర్చి యార్డుతో పాటు ఆలయ పాలకవర్గాలు ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీలో మితిమీరిన జాప్యం జరుగుతోంది.. ఇందుకు నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా చెప్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఉడా చైర్మన్ సైతం గుంటూరు జిల్లాకు కేటాయించారని వివిధ కార్పొరేషన్లకు ఐదుగురిని చైర్మన్లుగా జిల్లాకు అవకాశం దక్కిందని అయితే తమ పార్టీలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని పార్టీ కార్యకర్తలు అంతర్మథనం చెందుతున్నారు. గత నెల 25వ తేదీన జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి సమన్వయ యత్నాలు జరిపిన నేపథ్యంలో ఎట్టకేలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మిర్చియార్డు పదవులకు తన తరఫున పేర్లు ప్రతిపాదించేందుకు అంగీకరించారు. అదీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఒకరి కోసం పార్టీలోని మిగిలిన వారిని నిరాశకు గురిచేయటం సమంజసంకాదని వాదిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని గుంటూరు మిర్చియార్డు పరిధి నుంచి వేరుచేయాలని డిమాండ్ చేశారు. అయితే అది ఇప్పట్లో సాధ్యమయ్యేపనికాదని చెప్తున్నారు. యార్డు పరిధిలో ప్రత్తిపాడు నియోజకవర్గం కింద 74 గ్రామాలు, పొన్నూరు పరిధిలో 16, తాడికొండలో నాలుగు, చిలకలూరిపేటలో మూడు, మంగళగిరిలో 2, మొత్తం 99 గ్రామాల వరకు ఉన్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో ఒక గ్రామం కానీ, ఒక ఎకరం కానీ లేకపోయినా పదవీ పంపకాలలో పేచీలు పెట్టటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ నాయకులకే పదవీ పంపకాలలో ఇన్ని ప్రతిబంధకాలు ఎదురవుతుంటే ఇక తమకు ఎలా సాధ్యపడతాయని ద్వితీయ శ్రేణి నాయకులు నిట్టూర్పు విడుస్తున్నారు. కాగా పార్టీనేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా కార్యకర్తలు నలిగిపోతున్నారు. జిల్లాలో నివాసం ఏర్పాటుచేసుకున్న ముఖ్యమంత్రి గుంటూరు పంచాయతీని పరిష్కరించటంలో విఫలమవుతున్నారనేది స్పష్టమవుతోంది. గ్రూపుల ఆధిపత్యపోరు నడుమ ఆదివారం మినీమహానాడు జరుగుతోంది. స్వయాన అధినేత హామీ ఇచ్చిన నాయకులకు కూడా పదవులు దక్కకపోవటంతో జిల్లా పార్టీలో నిరాశ, నిస్పృహలు చోటుచేసుకున్నాయి.