గుంటూరు

నవనిర్మాణ దీక్షను ఘనంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 31: జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో, మండల, గ్రామ స్థాయిల్లోనూ ఈనెల 2వ తేదీన నవ నిర్మాణ దీక్షను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే కోరారు. మంగళవారం కలెక్టరేట్ నుండి మండలాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 2వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయిస్తారని, అదే సమయానికి జిల్లాలోని 50 లక్షల మంది జనాభా కూడా ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుందన్నారు. 3 నుండి 7వ తేదీ వరకు ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై పలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 2వ తేదీ ప్రతిజ్ఞ చేసే సమయానికి జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపి అందరూ ప్రతిజ్ఞ చేసేలా చూడాలని ఆర్టీసీ, రవాణా శాఖాధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై ఆయన సమీక్షించారు. జిల్లాలోని 1011 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కొక్క గ్రామంలో 100 సేద్యపు కుంటలు ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నాయని, వాటిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గ అధికారి తప్పక వారి పరిధిలోని గ్రామాలను స్వయంగా సందర్శించి అక్కడ అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించుకోవాలని సూచించారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఇంకుడుగుంతల నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. రాబోయే వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ప్రతి నీటిబొట్టును పొదుపు చేసుకోవాలని, ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల అంశంలో జిల్లాలో 462 గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని బహిరంగ మల విసర్జన లేని గ్రామంగా ప్రకటింపజేయాలని లక్ష్యం కాగా లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు కృషిచేయాలని కోరారు. జిల్లాలో మంచినీటి సమస్య ఉన్న గ్రామాల్లో పూర్తి పరిష్కారానికి రూ.7.92 కోట్లు మంజూరయ్యాయని, మంజూరైన పనులను త్వరితగతిన చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికీ 462 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారని, శాశ్వత చర్యలు పూర్తయ్యే వరకు వీటిని కొనసాగించాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కనీసం రోజుకు 4 నుండి 6 కిలోమీటర్ల సిసి రహదారుల నిర్మాణాలు చేపట్టి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద చేపట్టిన చెరువుల పూడికతీత పనుల్లో తీసిన మట్టిని ఆయా గ్రామాల్లో గృహ నిర్మాణాలకు తదితర ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలన్నారు. ఈ వీడియా కాన్ఫరెన్స్‌లో జెసి-2 ముంగా వెంకటేశ్వరరావు, డిఆర్‌ఒ కె నాగబాబు, ప్రణాళిక శాఖ సంయుక్త సంచాలకుడు జి శ్రీనివాస్, ఆర్‌టిసి ప్రాంతీయ మేనేజర్ జె శ్రీహరి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్లకు స్థలాల కరవు
మంగళగిరి, మే 31: పట్టణానికి మంజూరైన విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి గత కొన్ని నెలలుగా స్థల కొరత ఉండటంతో నిర్మాణాలకు బ్రేక్ పడింది. దీంతో స్థలాల కేటాయింపుపై మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తహశీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు, విద్యుత్ శాఖ ఎడీఈ రాజేష్‌ఖన్నాలతో మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి సమావేశమై చర్చించారు. పురపాలక సంఘానికి చెందిన స్థలాలు ఉన్నప్పటికీ సబ్‌స్టేషన్‌కు కేటాయించే అధికారం తనకు లేదని కమిషనర్ రంగారావు స్పష్టంచేశారు. సబ్‌స్టేషనకు అవసరమైన ప్రభుత్వ స్థలాలు రెవెన్యూ పరిధిలో కూడా లేవని విజయలక్ష్మి అన్నారు. పురపాలక సంఘం స్థలాలే కేటాయించే అంశంపై చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుందామని నిర్ణయించారు.
బషిరూన్ మృతికి కారకులైన
కొడుకలు, కోడళ్ల అరెస్ట్
వినుకొండ, మే 31: స్థానిక 21వ వార్డులోని కుందుర్తి వీధులో నివసిస్తున్న షేక్ బషిరూన్ అనే వృద్ధ మహిళ కొడకులు, కోడళ్ళ హింసకు గురై భవనం నుండి దూకి మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ కేసుకు సంబంధించి తల్లి మృతికి కారణమైన కసాని కొడుకులు షేక్ కరిముల్లా, షేక్ కాలేషా, కోడళ్ళు షేక్ హసినా, నాగుర్‌బీలను మంగళవారం సిఐ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మీనారాయణరెడ్డి అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ కొడుకులను, కోడళ్ళను విలేఖరుల ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిఐ జీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కన్నకొడుకులు భార్యలతో కలిసి తల్లికి కనీసం అన్నం పెట్టకుండ వేధిస్తూ, చస్తే శని వదులుతుందని అవమానకరంగా తిట్టడంతో తీవ్ర మనస్థాపానికి చెంది అందరూ చూస్తుండగానే భవనంపైకి ఎక్కి దూకి మృతి చెందిందని తెలిపారు. వార్డు కౌన్సిలర్ షేక్ గౌస్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీనారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఫోర్జరీతో పొలం కాజేసిన ఐదుగురికి జైలు
గుంటూరు (లీగల్), మే 31: దొంగ సంతకాలతో ఒకరికి చెందిన పొలాన్ని కాజేసిన కేసుల్లో ఐదుగురు సూత్రధారులకు మూడేళ్ల జైలుశిక్ష, పది వేల రూపాయల జరిమానా విధిస్తూ గుంటూరు 6వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఎస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.... విజయవాడ మాచవరానికి చెందిన చింతమనేని భాస్కరరావు వృత్తిరీత్యా కాంట్రాక్టర్. 1959, 1960 సంవత్సరాల్లో కొప్పురావూరు గ్రామం లో రెండు ఎకరాల భూమి కొ నుగోలు చేశారు. 2008 సంవత్సరంలో స్థల పరిశీలన కోసం ఇసిలు తీయించగా తమ పేర్లతోనే ఫొటోలు మార్చి వేరేవారికి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుసుకుని పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 9 మంది నిందితులను చార్జిషీటులో పేర్కొనగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన కాయం సుధాకర్‌రెడ్డి, వెనిగండ్లకు చెందిన దొప్పలపూడి సుం దరరావు, నంద్యాలకు చెందిన నాలి గోవిందరాజులు అదే ప్రాంతానికి చెం దిన ఎగ్గోని సూర్యమోహన్, గుంటూ రు లాలాపేటకు చెందిన డాక్యుమెంట్ రైటర్ ఏనుగుల శ్రీనివాసరావులపై నేరం రుజువు కావడంతో వారికి జైలుశిక్ష జరిమానా విధిస్తూ న్యాయాధికారి ప్రవీణ్‌కుమార్ తీర్పుచెప్పారు. ఎపిపి ఎస్‌ఎస్‌ఎస్ కుమార్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
నకిలీ సిరప్ తయారీదారుకు
ఏడాది జైలు...
నకిలీ జి సిప్ సిరప్ తయారు చేసి అమ్ముతున్న నేరానికి పెదకాకానికి చెందిన అరవింద ఫుడ్స్ అండ్ డ్రగ్స్ యజమాని గుంటూరు వెంకటేష్‌కు ఏడాది జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తీర్పుచెప్పారు. గుంటూరు డ్రగ్స్ ఇన్స్‌పెక్టర్ ఈ కంపెనీపై దాడిచేసి 2007 సంవత్సరంలో ఫిర్యాదు చేశారు.
కట్నం వేధింపుల కేసులో
ముగ్గురికి జైలు...
అదనపు కట్నం కోసం వేధిస్తున్న స్థానిక పాత గుంటూరుకు చెందిన కుర్రా శ్రీనివాసరావు, అతని తల్లిదండ్రులు ధనలక్ష్మి, వెంకయ్యలకు తలో ఆర్నెళ్ల జైలు శిక్ష, 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ ప్రవీణ్‌కుమార్ తీర్పుచెప్పారు. శ్రీనివాసరావుకు 2009 ఏప్రిల్ 9న వాసవితో వివాహమైంది. అప్పట్లో రెండు లక్షల రూపాయల నగదు, బంగారం ముట్టచెప్పినప్పటికీ, మరో లక్ష అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధిస్తుండటంతో పాత గుంటూరు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
కర్తవ్య పరాయణులకు దిక్సూచి అంజనీసుతుడే
* హనుమజ్జయంతి మహోత్సవాల్లో విశాఖ శారదాపీఠాధిపతి
గుంటూరు (కల్చరల్), మే 31: ఏ రంగంలోని వారికైనా తమ కార్యాన్ని సిద్ధింప చేసుకోవాలంటే వారికి ముందుగా గుర్తొచ్చేది అంజనీసుతుడేనని, ఆ స్వామిని నిరంతరం సేవిస్తే భక్తుల మనోభీష్టాలు అతి సులభంగా నెరవేరతాయని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి పేర్కొన్నారు. నగరంలోని పాత గుంటూరులో కొలువైయున్న విశాఖ శారదాపీఠ దత్తత శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం వైభవోపేతంగా జరిగిన హనుమజ్జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, హనుమత్ దీక్షాదారులనుద్దేశించి స్వరూపానందేంద్ర ఆశీపూర్వక అనుగ్రహ భాషణం చేశారు. సకల దుష్ట, గ్రహ పీడ నివారణ చేసి, అన్నింటా జయం చేకూర్చేవాడు ఆంజనేయుడేనన్నారు. పాత గుంటూరులోని శ్రీ వీరాంజనేయ స్వామి దివ్య స్వరూపంతో విరాజిల్లుతున్నాడని, అందుకే తాము ఈ దేవస్థానాన్ని తమ పీఠానికి అనుబంధం చేసుకున్నామన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే స్వామికళ్యాణ కారకుడన్నారు. ఆలయాలు ఎలా నిర్వహించాలో వీరాంజనేయ స్వామి దేవస్థాన పాలకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ వీరాంజనేయ స్వామి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కర్పూరనీరాజనాలర్పించారు. పాలకవర్గ సభ్యులు, భక్తులను స్వయంగా ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. 72వ హనుమజ్జయంతి మహోత్సవాలను దేవస్థాన అధ్యక్షుడు కొప్పురావూరి బాబురావు, కార్యదర్శి కాసుల సాంబశివరావు, కోశాధికారి గ్రంధి కోటేశ్వరరావు, పాలకమండలి సభ్యులు భక్తుల సహకారంతో శోభాయమానంగానిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా లోక కళ్యాణార్ధం నిర్వహిస్తున్న హనుమత్ రుద్రహవనం హోమానికి స్వామీజీ పూర్ణాహుతి గావించారు. హనుమజ్జయంతి మహోత్సవాలను మంగళవారం నగరంలోని వివిధ డివిజన్లలో గల 16 ఆంజనేయ స్వామి ఆలయాల్లో కనుల పండువగా జరిగాయి. ముఖ్యంగా కొత్తపేటలోని దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో సహస్ర ఘటాభిషేకం జరిగింది. వేలాది మంది భక్తులు, హనుమత్ దీక్షాదారులు పాల్గొన్నారు. గుజ్జనగుండ్ల దేవస్థానంలో చందనాభిషేకం, సంపత్‌నగర్‌లోని అభయ కోదండ రాముని సన్నిధిలో పవనసుతుడికి వివిధ రకాల అర్చనలు, ఆర్ అగ్రహారం, మారతీ నగర్ మారుతీక్షేత్రం, శ్యామలా నగర్‌లోని గాయత్రీ గణేష్ సంతోషిమాత ఆలయం, కొరిటెపాడులోని ఆంజనేయ స్వామి సన్నిధితో పాటు నగరం నలుమూలలా ఉన్న వీరాంజనేయ స్వామి దేవస్థానాల్లో హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ముగిసిన గుడ్‌షెపర్డ్ స్కూల్ క్రీడా శిబిరం
వినుకొండ, మే 31: స్థానిక గుడ్ షెపర్డ్ స్కూల్లో మే ఒకటో తేదీ నుండి 31వ తేదీ వరకు జరిగిన సమ్మర్ క్రీడా క్యాంప్ మంగళవారంతో ముగిసింది. గుంటూరు జిల్లా స్పోర్డ్స్ అధారిటీ బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మర్ క్యాంప్‌లో నెలరోజుల పాటు వాలీబాల్, ఖోఖో క్రీడారంగాల్లో 40మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కాకుమాను రాజేష్ వ్యాయామోపాధ్యాయులు వాలీబాల్‌లో, కె లక్ష్మణ్ ఖోఖోలో క్రీడాకారులకు కోచ్‌లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఇన్నారెడ్డి క్రీడాకారులకు సవతి సౌకర్యాలను కల్పించారు. అదే విధంగా క్రీడాకారులకు దుస్తులను అందచేశారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా తమ విద్యా సంస్థలో క్రీడాకారులకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామని, ఉచితంగా వసతి సౌకర్యాలు కల్పిస్తామని డైరెక్టర్ ఇన్నారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ క్రీడాకారులకు ఉచిత సౌకర్యం కల్పించడంతో పాటు క్రీడా దుస్తులు ఇవ్వడం అభినందనీయమని ఇన్నారెడ్డి అభినందించారు.
వైఖరి మారకుంటే రాజకీయ పతనం తప్పదు
మంగళగిరి, మే 31: మాదిగల పట్ల చంద్రబాబు వైఖరి మారకుంటే 2019 ఎన్నికల్లో ఆయన రాజకీయ పతనానికి మాదిగలు నాంది పలుకుతారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాల రావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక క్రీస్తుసంఘం చర్చి ప్రాంగణంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య అధ్యక్షత వహించారు. మాణిక్యారావు మా ట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు కృష్ణమాదిగను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కృష్ణమాదిగ పర్యటన అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయ న్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ కార్యాచరణ బుధవారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం నాగయ్య, అధికార ప్రతినిధి నరేంద్ర, ఈశ్వరయ్య, సుధాకర్, వెంకటేశ్వరరావు, కలకోటి జాన్‌బాబు, నూతక్కి జోసెఫ్, నాగరాజు, నతానియేలు, రవి, కోటేశ్వరరావు, దాసు తదితరులు పాల్గొన్నారు.
ఎఎన్‌యులో చైనీస్ లాంగ్వేజ్ సెంటర్
* వర్సిటీతో సంస్థ ఎంఒయు
గుంటూరు, మే 31: తమిళనాడు వెల్లూరులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైనా హాన్‌బ్యాన్ సహకారంతో చైనీస్ లాంగ్వేజ్ సెంటర్‌ను ఆసక్తి కల్గిన భారతీయ విద్యార్థులకు బోధిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనల మేరకు లాంగ్వేజ్ సెంటర్‌ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసేందుకు విఐటి చాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథం, ఎఎన్‌యు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎజె రాజేంద్రప్రసాద్ ఎంఒయుపై సంతకాలు చేశారు. త్వరలో విశ్వవిద్యాలయంలో హాన్‌బ్యాన్ చైనీస్ లాంగ్వేజ్ కోర్సులను విఐటి, ఎఎన్‌యు సహకారంతో ప్రవేశపెట్టనున్నారు. జూన్ మొదటి వారంలో చైన్ లాంగ్వేజ్ నిపుణులు ఎఎన్‌యును సందర్శించి కోర్సును ప్రారంభించేందుకు ప్రాథమిక అవగాహనకు వచ్చారు. కార్యక్రమంలో విఐటి ప్రతినిధులు డాక్టర్ ఎం శివాజీ, శివకుమార్, రెక్టార్, రిజిస్ట్రార్, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
వెంకన్న ఆలయంలో ధ్వజావరోహణ
మంగళగిరి, మే 31: శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఘాట్‌రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ పద్మావతీ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణం చేశారు. కైంకర్యపరులుగా కృష్ణమూర్తి, సుజాత దంపతులు, వరప్రసాద్, వెంకట శివలక్ష్మీకాంత దంపతులు వ్యవహరించారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. బుధవారం పుష్పయాగోత్సవం జరుగుతుందని తెలిపారు.
వైభవంగా హనుమజ్జయంతి
పొన్నూరు, మే 31: అతిపెద్ద ఏకశిలామూర్తిగా జగద్విఖ్యాతిగాంచి స్థానిక సహస్ర లింగేశ్వరస్వామి ఆలయంలో కొలువైయున్న వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామికి లక్ష తమలపాకులు, లక్ష మల్లెల పూజ జరిపారు. స్థానిక ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్, చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత, సాక్షి భావన్నారాయణ స్వామి దేవాలయ అనువంశిక ధర్మకర్త రాజా వాసిరెడ్డి భానుభూపాల్ వంశీయుడైన స్వరూప్‌రెడ్డి, ఇఒ రాధాకృష్ణ, పాలకమండలి సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రికి సువర్చలా సమేత వీరాంజనేయ స్వామి దివ్య కళ్యాణోత్సవంలో 108 మంది దంపతులు పాల్గొన్నారు.
జూట్‌మిల్లు సమస్యను పరిష్కరించాలి
* మిర్చియార్డు సెక్యూరిటీ గార్డులను విధుల్లోకి తీసుకోవాలి
* సిఐటియు నగర 8వ మహాసభ తీర్మానం
గుంటూరు, మే 31: నగరంలో పెద్ద పరిశ్రమగా పేర్గాంచిన శ్రీ భజరంగ్ జూట్‌మిల్లును యాజమాన్యం అక్రమంగా లాకౌట్ ప్రకటించి సంవత్సరం గడుస్తున్నా రాష్ట్రప్రభుత్వం యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా సమస్యలను తక్షణం పరిష్కరించాలని, మిర్చియార్డులో గత 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను అక్రమంగా తొలగించారని వారిని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు నగర 8వ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మహాసభ కె నళినీకాంత్, టి రాధ, షేక్ మస్తాన్‌వలి అధ్యక్షతన మంగళవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ ముఖ్య అతిథిగా ఉపన్యసిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తున్నాయన్నారు. కార్మిక చట్టాల్లో కార్మిక వ్యతిరేక సవరణలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వం షాపులలో పనిచేసే కార్మికులను బానిసలుగా మార్చేవిధంగా జీవో తెచ్చిందన్నారు. ముందుగా మహాసభ ప్రారంభ సూచికగా సిఐటియు పతాకాన్ని నగర ఉపాధ్యక్షుడు ఎన్ భావన్నారాయణ ఆవిష్కరించారు. నాయకులు పర్సా సత్యనారాయణ చిత్రపటానికి వై నేతాజీ పూలమాల వేసి నివాళులర్పించారు. గత రెండేళ్ల కాలంలో మృతిచెందిన కార్మిక నాయకులకు, కార్మికులకు మహాసభ ప్రతినిధులు రెండు నిముషాల పాటు వౌనం పాటించి సంతాపం వ్యక్తంచేశారు. అనంతరం 28 మందితో సిఐటియు నగర నూతన కమిటీ ఎన్నిక కాబడింది. నూతన అధ్యక్షులుగా కె శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కె నళినీకాంత్, 14 మందతో కార్యదర్శివర్గాన్ని, మరో 14 మందితో కమిటీని, నూతన కౌన్సిల్‌ను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.