గుంటూరు

టిడిపిది అబద్ధాల ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 6: దేశంలో, ప్రపంచంలో నిత్యం అబద్ధాలతో పాలిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రతి ఒక్కరికీ టక్కున గుర్తొచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. సోమవారం అరండల్‌పేటలోని వైసిపి నగర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ఈ దృష్ట్యా ఈనెల 8వ తేదీన తమ అధినేత జగన్మోహనరెడ్డి పిలుపుమేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి చంద్రబాబుపై ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలి సంతకాలను అపహాస్యం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రకెక్కారని ఎద్దేవాచేశారు. నిరుద్యోగ భృతి, పుట్టిన ఆడపిల్లకు 50 వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని, రూ. 2లకే 20 లీటర్ల మంచినీరు, ఎన్‌టిఆర్ క్యాంటిన్‌లు తదితర పథకాలన్నీ నీరుగారిపోతున్నాయన్నారు. ప్రత్యేకహోదాపై రాష్ట్రంలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై సైతం చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడటం లేదన్నారు. కేవలం జగన్మోహనరెడ్డిపై ఆరోపణలు, వ్యాఖ్యలు చేయడం తప్ప మంత్రులు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, నాయకులు ఎలికా శ్రీకాంత్ యాదవ్, గనిక ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 450 పరిశ్రమలకు
4.55 లక్షల కోట్ల పెట్టుబడులు
* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
నరసరావుపేట, జూన్ 6: రాష్ట్రంలో 450 పరిశ్రమలకు 4.55 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం స్థానిక భువనచంద్ర టౌన్‌హాల్లో నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా అధ్యక్షత వహించారు. పరిశ్రమలు స్థాపించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే అన్ని అనుమతులు లభిస్తాయని స్పష్టం చేశారు. రాయలుసీమలో శ్రీసిటీ ప్రారంభమైందని అన్నారు. కాకినాడ, విశాఖపట్నం, చెన్నై క్యారిడార్ ఏర్పాటుకు చంద్రబాబునాయుడు వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారని తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్ ప్రాజెక్టులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, టూరిజంలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వీటివల్ల ఆర్థిక వనరులతో పాటు ఉద్యోగ వసతికూడా కలుగుతుందని చెప్పారు. కార్మికుల కోసం ఐదులక్షల రూపాయల బీమాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకుని సీసీరోడ్లు, మరుగుదొడ్లు, శ్మసానాలు, గృహనిర్మాణం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా రెసిడెన్సియల్ స్కూళ్ళను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, బీసీ, కాపు, బ్రాహ్మణ కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలను బడ్జెట్‌లో కేటాయింపు చేసి, వెనుక బడిన వర్గాలకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని తెలిపారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ పరిశ్రమలు, సేవారంగం రాష్ట్రానికి వెన్నుముకవంటివి అని అన్నారు. వ్యాపారాలకు, పరిశ్రమలకు భారతదేశంలో నవ్యాంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతంగా ప్రపంచ బ్యాంక్ చెబుతుందని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఆదాయంతో పాటు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రైతులు పద్ధతి ప్రకారం వ్యవసాయం చేస్తే లాభాలు వస్తాయని అన్నారు. వ్యవసాయంతో పాటు పాడి, కోడి పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే ఆర్థికంగా బలం చేకూరుతుందన్నారు. కష్టపడే తత్త్వం అందరికీ రావాలని కోరారు. నవ్యాంధ్రాలో మానవ వనరులు ఎక్కువని, వాటిని ఉపయోగించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కాంతీలాల్‌దండే, నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణకపర్ధి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జానీమూన్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ మీరావలి, ఆర్డీవో రవీందర్, ఎంపీడీవో బాలూనాయక్, మున్సిపల్ కమిషనర్ భానూప్రతాప్, ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకర్, మొండితోక రామారావు, మార్కెట్ యార్డు చైర్మన్లు కడియాల రమేష్, మెట్టు వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అద్దంకి సంగీతరావుకు లక్ష రూపాయల చెక్కును హోంమంత్రి చినరాజప్ప అందచేశారు. కార్మిక సంక్షేమం నుండి డి నాగజ్యోతికి మూడు లక్షల రూపాయలు, ఎస్సీ కార్పొరేషన్ నుండి ఏడుగురికి ఒక్కొక్కరికి లక్షల రూపాయల చెక్కులను అందచేశారు. పశుసంవర్ధక శాఖ నుండి రైతులకు దాణా, మందుల కిట్లును అందచేశారు.
జెఎన్‌టీయూకే అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు జీవో నెంబర్ 22 విడుదల: స్పీకర్ కోడెల...
నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామం వద్ద జెఎన్‌టీయూకే అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు జీవో నెంబర్ 22ను సోమవారం విడుదల చేశారని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈ కళాశాల ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులకు స్పీకర్ కోడెల హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆరు సంవత్సరాల కిందట ప్రారంభమైన ఈ జెఎన్‌టీయూకే ప్రతిపాదనలు ప్రస్తుతం నాలుగురోజుల్లో జీవో విడుదలవ్వడం హర్హనీయమన్నారు. పేపర్‌లెస్ ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం పరిపాలన దక్షతకు నిదర్శనమని కొనియాడారు.
అధికారులు, ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రజలు కాదా?
అధికారులు, ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రజలు కాదాఅని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పత్రికల్లో కొందరు ఉద్యోగులు రాజధానికి వస్తామని, కొందరు రావడం కుదరదని అనడంపై స్పీకర్ కోడెల మండిపడ్డారు. ప్రభుత్వానికి అధికార యంత్రాంగం లేకపోతే బండినడవదని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఫిట్‌మెంట్, వైద్యసదుపాయం, 60 ఏళ్ళపరిమితిని అందచేసినప్పటికీ ఉద్యోగులు ఆ సహాయాన్ని దృష్టిలో పెట్టుకోవడం లేదని అన్నారు. తాను బాధతో మాట్లాడుతున్నానని, ఉద్యోగం చేసే చోటే అధికారులు ఉండాలని అన్నారు. అధికారులు ఆంక్షలు మాని ప్రభుత్వానికి సేవలు అందించాలని కోరారు. ఎన్ని వసతులు ఉన్నా శాంతి భద్రతలు లేకపోతే ప్రజలు, పరిశ్రమలు సంతోషంగా ఉండవని అన్నారు.

ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ అవగాహనే లక్ష్యం
* వీడియో కాన్ఫరెన్స్‌లో మహా సంకల్పంపై ముఖ్యమంత్రి చంద్రబాబు
గుంటూరు, జూన్ 6: రాష్ట్రంలో చేపట్టనున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించడమే మహాసంకల్పం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం మాట్లాడారు. ఈనెల 2వ తేదీ మొదలు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జరిగిన నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఈనెల 8వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల స్థాయిలో మహా సంకల్పం సభను విజయవంతంగా నిర్వహించాలన్నారు. వ్యవసాయం, భూగర్భ జలాలపెంపు, విద్య, వైద్యం, అక్షరాస్యత పెంపు వంటి అంశాలపై గత ఐదు రోజుల పాటు జరిగిన చర్చలను ఆధారంగా చేసుకుని ఒక సమగ్ర నివేదికను రూపొందించుకుని మహాసంకల్ప సభలలో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు ఆదాయం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో మండలాల్లో సగం వ్యత్యాసం ఉందన్నారు. అన్ని మండలాల్లో సమాంతర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బంధీగా అమలు జరపాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత ఐదు రోజులుగా చేపట్టిన చర్యల కారణంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల దృక్పధం ఏర్పడిందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై (మిగతా 6 లో)
సమీక్షించుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, కలెక్టర్ కాంతీలాల్ దండే, సెర్ఫ్ సలహాదారు రామలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జూట్ మిల్లు నుండి ముడిసరకు తరలిస్తున్న
లారీలను అడ్డుకున్న కార్మికులు
గుంటూరు, జూన్ 6: భజరంగ్ జూట్‌మిల్లు నుంచి అక్రమంగా తరలిస్తున్న ముడిసరుకు లారీలను మిల్లు పరిరక్షణ సమితి సభ్యులు, కార్మికులు అడ్డుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకే మిల్లు వద్దకు చేరుకుని కార్మికులు ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో లారీలను బయటకు రానిచ్చేది లేదని అవసరమైన ప్రాణాలైన అర్పిస్తామని కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు రోజులుగా మిల్లు నుంచి ముడిసరుకును, యంత్ర సామగ్రిని తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుండటం, కార్మికులు అడ్డుకోవడం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. జూట్‌మిల్లు అక్రమ లాకౌట్ వ్యవహారం తేలే వరకు యాజమాన్యం ఆటలు సాగనీయమంటూ కార్మికులు హెచ్చరికలు జారీచేశారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మిల్లు యాజమాన్యం తీరుపై పలు దఫాలుగా ఫిర్యాదు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని లారీలతో యంత్ర సామగ్రిని తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జూట్‌మిల్లు సమస్యపై ప్రభుత్వం స్పందించకుంటే కార్మికులతో కలిసి ఆమరణ దీక్షకు దిగుతామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయకులు పానుగంటి చైతన్య, రాయి నాగేశ్వరరావు, యేరువ నర్సిరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

దేశం గర్వించదగ్గ కమ్యూనిస్టు నేత చండ్ర: ముప్పాళ్ల
గుంటూరు (కొత్తపేట), జూన్ 6: స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత చండ్ర రాజేశ్వరరావు దేశం గర్వించదగ్గ నాయకుడని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో చండ్ర రాజేశ్వరరావు 102వ జయంతి సభ సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగింది. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వర్గదోపిడీకి వ్యతిరేకంగా, కుల నిర్మూలన కోసం నిరంతరం రాజేశ్వరరావు శ్రమించారని కొనియాడారు. జమిందారీ, జాగీరుదారి వ్యవస్థల రద్దు కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 26 సంవత్సరాల పాటు పనిచేయడమే కాకుండా జాతీయ స్థాయిలో అనేక పోరాటాలు నిర్వహించారని కొనియాడారు. దేశంలో అధికారం చేపడుతున్న ఏ పార్టీలైనా పేద వర్గాలను విస్మరించి కోటీశ్వరులకు కొమ్ముకాస్తున్నారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ రానున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సిపిఐ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగురి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు ఆశయ సాధన కోసం, సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నూతలపాటి చిన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గడప గడపకు సిపిఐ కార్యక్రమాన్ని ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు.

గోళ్లముడిని ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలి: రావెల
గుంటూరు (పట్నంబజారు), జూన్ 6: ప్రభుత్వ ఉద్యోగిగా విధులు సమర్ధవంతంగా నిర్వర్తిస్తూనే ప్రజా సమస్యలపై పోరాడిన దివంగత ఎన్జీవో నేత గోళ్లమూడి ప్రకాశరావును ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో గోళ్లమూడి ప్రకాశరావు ప్రథమ వర్ధంతి సభ ఇద్వా వ్యవస్థాపక అధ్యక్షుడు గోళ్లమూడి రాజసుందరబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి రావెల మాట్లాడుతూ ప్రకాశరావు ఎస్సీ, ఎస్టీ, బిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజా సమస్యలపై స్పందించే వారన్నారు. ఉద్యోగులు తమ విధులతో పాటు సామాజిక సమస్యలపై కూడా స్పందించాలన్నారు. అనంతరం వంద మంది పేద మహిళలకు మంత్రి రావెల దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో ప్రకాశరావు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీర్మానించగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కె నాగబాబు, జిల్లా ట్రెజరీశాఖ డిడి కె సురేంద్రబాబు, ఎసి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ వెస్లీ, ట్రజరీ శాఖ ఉద్యోగు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి నాగరాజు, ఎన్జీవో సంఘ జిల్లా కార్యదర్శి మూర్తి, అటవీశాఖ ఉద్యోగుల సంఘ నాయకులు జోసఫ్ సన్ని, ప్రభుత్వ ఉర్ధూ బాలికల పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జర్మనీ పర్యటన విజయవంతంగా పూర్తిచేసుకుని రాష్ట్రానికి పెట్టుబడుల రాక కోసం కృషిచేసిన మంత్రి రావెలను ఇద్వా, ఐడియా కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.

కళాకారుడు నీలయ్యకు సన్మానం
అచ్చంపేట, జూన్ 6: నవ నిర్మాణ దీక్షలో భాగంగా పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై అవగాహన సమావేశం సోమవారం ఎండిఒ కార్యాలయంలో ఎంపిపి ఆర్ పిచ్చమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి జె వెంకటరమణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని బెల్లంకొండ అచ్చంపేటలలో పరిశ్రమల స్థాపనకు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఎస్‌ఎఫ్‌సి జిల్లా పరిశ్రమల కేంద్రం నుండి రుణాలను రాయితీపై నిరుద్యోగులకు అందిస్తోందన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కళాకారుడు బొజ్జా నీలయ్యను అధికారులు, మండల కళాకారుల ఐక్యవేదిక సభ్యులు పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పివి రామారావు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎస్ వెంకయ్య, క్రోసూరు ఎఎంసి ఉపాధ్యక్షులు ఆశీర్వాదం, తహశీల్దార్ సుజాత, ఎండిఒ డిజి నాయక్, కళాకారులు పాల్గొన్నారు.

పైపులైన్ గుంతలో పడి బాలిక మృతి
అచ్చంపేట, జూన్ 6: లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పైపులైన్‌కు తీసిన గుంతలో పడి ఆరేళ్ల బాలిక సోమవారం సాయంత్రం మృతి చెందింది. గ్రామంలో విషాదం నింపిన ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి. వాగు అవతల నివాసముండే దండికోట నరసింహాస్వామి, అంజలీ వెంకటాయపాలెం డొంకరోడ్డులో వున్న తమ పొలంలో పుల్లలు ఏరటానికి వెళ్లారు. తమ కుమార్తె నాగలక్ష్మి తమతో వస్తానని మారం చేయటంతో వీరివెంట ఆ బాలికను కూడా తీసుకొనివెళ్లారు. అయితే వీరి పొలం వద్ద పెదపాలెం వైపువెళ్ళే చింతలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పైపులైన్ కోసం అఫ్ ఆన్ వాల్ కని గుంత తీశారు. ఈ క్రమంలో నాగలక్ష్మి ఆడుకుంటూ వెళ్లి అఫ్ ఆన్ వాల్ గుంతలో పడింది. కురుస్తున్న వర్షాలకు గుంతలో నీరు చేరి ఉండటంతో చిన్నారికి ఊపిరాడక మృతి చెందింది. ఇది గమనించని తల్లిదండ్రులు పాప కోసం వెతుకుతుండగా పైపులైన్ గుంతలో విగతజీవిగా కనిపించింది. నరసింహాస్వామి, అంజలీ దం పతు లకు ఆడ, మగ సంతానం కా గా మృతి చెం దిన నాగలక్ష్మి మొదటి సంతానం. మృతిరాలి ఇల్లు బంధువుల రోదనలతో మారుమోగుతోంది.

అంగన్‌వాడీ నూతన
భవనాలకు నిధులు
నూజెండ్ల,జూన్ 6: మండలానికి అంగన్‌వాడీ నూతన భవనాలకు నిధులు మంజూరైనట్లు ఇన్‌చార్జి ఎంపిడివో జిలాని బాషా సోమవారం తెలిపారు. భవనానికి రూ.7.50 లక్షల చొప్పున 22 భవనాలకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్పారు.

పకడ్బందీగా రంజాన్‌కు ఏర్పాట్లు
గుంటూరు, జూన్ 6: రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఉన్న మసీదులు, ఈద్గాల వద్ద ప్రభుత్వపరంగా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో రంజాన్ మాసం సందర్భంగా జిల్లాలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, చర్యలపై డిఆర్‌ఒ నాగబాబు ముస్లిం మతపెద్దలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసీదులు, ఈద్గాల వద్ద నీరు, విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, ట్రాఫిక్, శాంతి భద్రతలు, కంట్రోల్‌రూమ్ ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తెల్లవారు ఝామున మూడు గంటల నుండి 6 గంటల వరకు నీటి సరఫరాకు ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట వాటర్‌ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మసీదులు, ప్రధాన కూడళ్లలో రాత్రివేళ గస్తీ ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి మునిసిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఆర్‌డిఒ శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి, మైనార్టీ సంక్షేమ అధికారి తదితరులు పాల్గొన్నారు.