గుంటూరు

భూ సేకరణ చట్టాలను రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 11: అభివృద్ధి పేరిట ప్రజలను ఆదివాసీలను భూముల నుండి, అడవి నుండి గెంటివేసే భూ సేకరణ చట్టాలను పాలకులు రద్దుచేయాలని జనశక్తి సంపాదకుడు డాక్టర్ పి జస్వంతరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర మహాసభలు రెండవ రోజు స్థానిక ఎన్జీవో కల్యాణ మండపంలో జరిగాయి. శనివారం అభివృద్ధి పేరిట భూమి నుండి, అడవినుండి గెంటివేయబడుతున్న రైతుకూలీలు, పెరిగిపోతున్న వలసలు అనే అంశంపై జస్వంతరావు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, బాక్సైట్ తవ్వకాలు, పరిశ్రమల ఏర్పాటు పేరిట వందలాది గ్రామాల నుండి రైతులు, ఆదివాసీలను నిర్వాసితులను చేయడాన్ని ఖండించారు. రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయాధారిత జనపనార, చెరకు, పత్తి పరిశ్రమలు పెద్దసంఖ్యలో మూతపడటంతో కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. జనపనార, చెరకు, పత్తి వ్యవసాయాధారిత పరిశ్రమలకు చేయూతనిచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతాంగ సంక్షోభానికి ఉత్పత్తి పెరగకపోవడమే కారణమని, పాలకులు అందుకోసం ఆధునిక యంత్రాలను బిందు సేద్యం చేయాలని చెప్పడం సరికాదన్నారు. సంఘ రాష్ట్ర కోశాధికారి వై సోని మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాదుల రథ చక్రాలను కట్టివేస్తున్న పాలకుల తీరును ఎండగట్టారు. కేంద్రంలో మోదీ, తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, కెసిఆర్‌లు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామనిచెప్పి ఆ వాగ్దానాలను తుంగలో తోక్కారన్నారు. బాక్సైట్ తవ్వకాల కోసం మానవ రహిత అడవులుగా మలచడం కోసం, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల పేరిట అదివాసీలను గెంటి వేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సెజ్‌లకు వ్యతిరేకంగా పోరాడిన బాబు నేడు అందుకు వ్యతిరేకంగా ప్రవరిస్తున్నారని విమర్శించారు. తొలుత రైతు ఉద్యమ నాయకుడు డాక్టర్ బిడి శర్మ, రైతు కూలీ ఉద్యమ నాయకులు మానం రామారావు, వనచర్ల సుబ్బారావు, ప్రజాకవి, రచయిత ఛాయ్‌రాజ్, ప్రజాకళాకారుడు కొండూరు రామారావుల మృతికి సభ సంతాపం తెలియజేసింది. ఈ సభలో ఎఎఫ్‌టియు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు పి సిద్దన్న, స్ర్తి విముక్తి సంఘటన రాష్ట్ర కార్యదర్శి ఎం లక్ష్మి, ఓపిడిఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, ఎన్‌వైకెఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కె బాషా, పిజిఎస్‌హెచ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కె బాజి, జనసాహితి రాష్ట్ర కార్యదర్శి దివికుమార్ తదితరులు పాల్గొన్నారు.

కొత్త రవాణా పార్శిల్ ఆదాయంపై దృష్టి పెట్టాలి
గుంటూరు (కొత్తపేట), జూన్ 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే రవాణా పార్శిల్ ఏర్పాటు చేయడం జరిగిందని, కమర్షియల్ సిబ్బంది కొత్తగా ప్రవేశపెట్టిన రవాణా పార్శిల్ ఆదాయంపై దృష్టి సారించాలని రీజనల్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. శనివారం ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లోని తన కార్యాలయంలో రీజియన్ పరిధిలో గల 13 డిపోల్లోని కమర్షియల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం శ్రీహరి మాట్లాడుతూ కమర్షియల్ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వివిధ రకాలైన వాణిజ్యవర్గాలను కలిసి సంస్థలో ఇటీవలే ప్రవేశపెట్టిన సరుకు రవాణా పార్శిల్ విధానాలను వివరించాలన్నారు. అదేవిధంగా రైతులను కలుసుకుని ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను తెలియజేసి వారి సరుకు ఎగుమతి దిగుమతులకు ఆయా రూట్లలో రైతులు కోరితే స్టేజీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రజారవాణాతో పాటు పార్శిల్ రవాణాను ప్రతిరోజూ 3.50 లక్షల ఆదాయం చేకూరే విధంగా రీజనల్ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వాణిశ్రీ, ఎటిఎం కమర్షియల్ మధు, షెడ్యూలు సిఐ బెనర్జీ, కమర్షియల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగాలి
గుంటూరు (కొత్తపేట), జూన్ 11: గిరిజనులు విభేదాలు వీడి ఐక్యంగా ముందుకు సాగాలని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ సెక్రటరి దేవర వాసు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో షెడ్యూల్ ట్రైబ్స్ అవేర్‌నెస్ అండ్ డెవలప్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (స్టద్వా) సమావేశం సంఘ జిల్లా అధ్యక్షుడు మొగిలి మధుసూదనరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దేవర వాసు మాట్లాడుతూ గిరిజనులు తమ సమస్యల పరిష్కారానికి సంఘటితమవ్వాలన్నారు. ఉద్యోగావకాశాల కోసం కొందరు నకిలీ గిరిజన కుల సర్ట్ఫికెట్లతో గిరిజనుల ఉపాధికి గండి కొడుతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. స్టద్వా గిరిజనుల సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. సంఘ అధ్యక్షులుగా మొగిలి మధుసూధనరావు, ఉపాధ్యక్షులుగా బొగిలి శ్రీకాంత్‌మిత్రా, ఉప ప్రధాన కార్యదర్శి జివై ప్రసాద్, కోశాధికారిగా గోదావరి చంద్రశేఖర్, గౌరవాధ్యక్షులుగా పాలపర్తి శ్రీనివాసరావుతో పాటు పలువురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిఎఫ్‌ఒ జె హరిబాబు, విశ్రాంత సబ్ కలెక్టర్ ఎం రాఘవరావు, ఇఎస్‌ఐ జాయింట్ డైరెక్టర్ జగన్నాధం పద్మావతి, సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మేచర్ల కొండలరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా గాలిగోపుర నిర్మాణ పనులు
అమరావతి, జూన్ 11: స్థానిక అమరేశ్వరాలయానికి దక్షిణం వైపు ఏర్పాటుచేస్తున్న మహా రాజగోపురం రాతిపీఠం పనుల వరకు పూర్తయ్యాయని ఆలయ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం గాలిగోపురానికి ఏర్పాటు చేయనున్న రాతి రాజదర్వాజాలకు పూజలు చేసి భారీ క్రేన్ల సహాయంతో గాలిగోపురానికి అమర్చారు. కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణమవుతున్న ఈ గాలిగోపురాన్ని 75 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నామని రాతిపీఠం 30 అడుగులు, మిగతా వర్క్ బ్రిక్స్‌తో చేయడం జరుగుతుందని ఆలయ అధికారి తెలిపారు. ఈ నెలాఖరులోగా 50 శాతానికి పైగా గాలిగోపుర నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు.

ఘాట్‌రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం

మంగళగిరి, జూన్ 11: మంగళాద్రి పర్వతంపై స్వయంభువైన పానకాల స్వామి ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్ధం ఘాట్‌రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజతో శ్రీకారం చుట్టారు. ఘాట్‌రోడ్డు మార్గంలో ఆలయ ఉపప్రధాన అర్చకులు నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు జరిపి పనులు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు, ఆర్ అండ్ బి ఈఈ మహేశ్వరరెడ్డి, డీఈఈ భవానీశంకర్, ఏఈ మధుబాబు, ఆలయ ధర్మకర్తలు మోరంపూడి నాగేశ్వరరావు, ఆలేటి నాగలక్ష్మి, ఏవి సాంబశివరావు, వెనిగళ్ల ఉమాకాంతం, రావుల శ్రీనివాస్, ఊట్ల శ్రీమన్నారాయణ, పంచుమర్తి ప్రసాద్, మాజేటి సూర్యవేణు గోపాలకృష్ణ, ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు తదితరులు పూజలో పాల్గొని టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించారు. 2 కోట్ల 31 లక్షల రూపాయల వ్యయంతో సుమారు కిలోమీటరు పొడవున ఘాట్‌రోడ్డును విస్తరించి అభివృద్ధి చేస్తామని, 60 ఇంటు 20 మీటర్ల విస్తీర్ణంలో సుమారు 60 వాహనాలు కొండపైన పార్కింగ్ చేసుకునే విధంగా అభివృద్ధి చేస్తామని ఆర్ అండ్ బి ఈఈ మహేశ్వరరెడ్డి తెలిపారు. జెసిబితో పనులను ప్రారంభించారు. కృష్ణా పుష్కరాల నాటికి పనులు పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.

‘బల ప్రయోగాలతో ఉద్యమాలను అణచివేయలేరు’
అచ్చంపేట, జూన్ 11: బల ప్రయోగాలతో ఉద్యమాలను అణచి వేయాలని చూస్తే మరింత ఉద్ధృత రూపం దాలుస్తాయని పిసిసి ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు అన్నారు. ఆయన శనివారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్‌చేయడాన్ని ఖండించారు. సంప్రదింపులతో సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఇలాంటి చర్యలతో సమస్యను మరింత జఠిలం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీతో పాటు లా అండ్ ఆర్డర్ అదుపులో లేవన్నారు. శాంతియుత నిరసనలు, పత్రికా స్వేచ్ఛను ఈ ప్రభుత్వం హరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. మొదటగా ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేసి ఉంటే తుని సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. తుని ఘటనపై సిబి సిఐడి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సదావర్తి భూముల అమ్మకాలపై పెద్ద ఎత్తున కుంభకోణాలకు ఈ ప్రభుత్వం తెరలేపిందన్నారు. వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములను 22 కోట్లకు కట్టబెట్టి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. దేవాదాయశాఖలో ఇంతపెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం జరగడం ఇదే ప్రథమమని ప్రభుత్వం ఈ భూములపై తిరిగి విచారణ జరిపించాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు చిలకా చంద్రయ్య, టి ఆంజనేయులు, ఎస్‌కె అజుమ్, ఎస్ పెద్దశ్రీను, ఎస్‌కె మస్తాన్‌వలి, ఎస్‌కె మల్లి, ఇన్నారెడ్డి, పి వెంకట్రావ్, చెన్నకేశవులు తదితరులున్నారు.

న్యాయపోరాటంతో గూడు నిలుపుకుందాం
తాడేపల్లి, జూన్ 11: ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కోర్టుల్లో న్యాయపోరాటం చేసి, గూడు నిలుపుకుందామని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజధాని వాసులకు భరోసా ఇచ్చారు. శనివారం రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పెనుమాకవాసులతో సమావేశమయ్యారు. రాజధాని ప్రాంతంతో పాటు ఇతర గ్రామాల్లో సైతం ప్రజలకు నిలువనీడ లేకుండా చేయటానికి ప్రయత్నిస్తూ పేదల ఇళ్ళు కూల్చుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.1950 నుండి ఇప్పటి వరకూ పంచాయితీలకు పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్న పేదల ఇళ్ళు కూల్చుతూ, కొత్త వారికి ఇళ్లు లేకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తిప్పికొట్టాలన్నారు. రాజదాని ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా పేదలు నిర్మించుకోకుండా కుయుక్తులు పన్నుతున్నారని, రాజధానిలో పేదలుండటం తెలుగుదేశం ఫ్రభుత్వానికి ఇష్టంలేనట్లు తేటతెల్లమవుతుందన్నారు. ప్రత్యామ్యాయ మార్గాలున్నప్పటికీ ప్రభుత్వం మూర్ఖంగా ఇళ్ళు కూల్చుతూ రహదారుల విస్తరణ చేపడుతోందని, భవిష్యత్‌లో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధిచెబుతారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దామేశ్వరరెడ్డి, బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, మేకా శివారెడ్డి, అన్నూరి దేవి, కత్తిక రాఘవరావు, బాబు, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయండి
సత్తెనపల్లి, జూన్ 11: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని నియోజకవర్గ యువనాయకుడు డాక్టర్ కోడెల శివరామ్ అన్నారు. స్థానిక స్పీకర్ కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో కూడా మొక్కలు నాటి పచ్చదనం వెల్లివిరిసేలా ప్రతి నాయకుడు కృషి చేయాలని కోరారు. అనంతరం అన్నీ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకొని వాటిపై సూచనలిచ్చారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, శాశ్వత భవనాలు, స్వర్గపురి పనులు, స్వచ్ఛ్భారత్, సిసి రోడ్లు, తదితర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మండల పార్టీ అధ్యక్షులు కోమటినేని శ్రీనివాస్, రాజుపాలెం మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ నర్రా బాబురావు తదితరులు పాల్గొన్నారు.

గ్రానైట్ లారీ పట్టవేత
పెదనందిపాడు, జూన్ 11: ప్రకాశం జిల్లా మార్టూరు నుండి మహారాష్ట్ర తరలివెళ్తున్న గ్రానైట్ పలకల లారీ శనివారం పట్టుబడింది. వే బిల్లులు, రవాణాశాఖ అనుమతులు లేకపోవడంతో మైనింగ్ శాఖ, కమర్షియల్ టాక్స్ అధికారులు లారీని వెంబడించి పెదనందిపాడు ప్రాంతంలో పట్టుకున్నారు. ఈ లారీని స్థానిక పోలీసుస్టేషన్‌లో అప్పగించారు.