గుంటూరు

జూట్‌మిల్లు స్థల రిజిస్ట్రేషన్ రద్దుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 9: భజరంగ్ జూట్‌మిల్లు సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఏడాది గడిచిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జూట్‌మిల్లు సమస్యల పరిష్కారంపై అధికారులు, పరిరక్షణ సమితి నాయకులతో మంత్రి ప్రత్తిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ రెండు వేల మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడితే అధికారుల స్పందన అంతంత మాత్రంగా ఉండటం దురదృష్టకరమన్నారు. జూట్‌మిల్లును అక్రమంగా లాకౌట్‌చేసి, మిల్లుకు సంబంధించిన ఐదు ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లుకు సంబంధించిన మరో రెండు ఎకరాల్లో నిర్మాణాల కోసం ఇచ్చిన ప్లాన్ లోపభూయిష్టంగా ఉందని అన్నారు. కార్పొరేషన్ అధికారులు ఇష్టానుసారం ప్లాన్లు మంజూరు చేయడం కారణంగా ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టే అవకాశముందన్నారు. తక్షణం ప్లాన్‌ను కూడా రద్దుచేయాలని ఆదేశించారు. జూట్‌మిల్లు ససమ్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా డిఆర్‌ఒ నాగబాబు నేతృత్వంలో ఏడుగురు అధికారులతో కూడిన కమిటీని నియమిస్తున్నామని పుల్లారావు తెలిపారు. ఈనెల 16వ తేదీన తిరిగి సమావేశం నిర్వహించే నాటికి ఈ విషయమై పూర్తి సమాచారంతో నివేదిక అందించాలని, సమస్య పరిష్కారంలో పురోగతి కనిపించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని జూట్‌మిల్లు కార్మికులు రోజుల తరబడి ఆందోళన నిర్వహిస్తున్నా అటు నగరపాలక సంస్థ, ఇటు కార్మికశాఖ అధికారులు ఏ మాత్రం స్పందించక పోవడం దారుణమన్నారు. పిల్లా పాపలతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడితే స్పందించాల్సిన తీరు ఇదేనా అంటూ ఆయాశాఖల అధికారులపై మండిపడ్డారు. కనీసం ఆయా అంశాలపై మినిట్స్ బుక్ కూడా నిర్వహించక పోవడం మీ పనితీరుకు అద్దం పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏదేమైనా సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పలు సమావేశాలు జరిగినప్పటికీ సమస్యను పరిష్కరించే విషయంలో పురోగతి శూన్యమన్నారు. కనీసం మిల్లును తెరిపించాలన్న ప్రయత్నం జరగకపోవడం దురదృష్టకరమని తెలిపారు. యాజమాన్యం తమకు నష్టం వచ్చిందని, అందుకే మిల్లు లాకౌట్ చేశామని చెప్తున్నా అది వాస్తవ విరుద్ధమన్నారు. ఎంత నష్టం వచ్చిందనే వివరాలు కార్మికశాఖ అధికారుల వద్ద లేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, సిపిఎం నాయకులు భావన్నారాయణ, బోనబోయిన శ్రీనివాసయాదవ్, రాజా మాస్టారు, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, మాల్యాద్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

షటిల్ పోటీలు ప్రారంభం

గుంటూరు (స్పోర్ట్స్), జూలై 9: జిల్లా బ్యాడ్మింటన్ సంఘ ఆధ్వర్యంలో స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో 45వ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. కార్యక్రమంలో షటిల్ సంఘ కార్యదర్శి టి సంపత్‌కుమార్ మాట్లాడుతూ మాట్లాడుతూ అండర్-13, 15, 17, 19 వయస్సు బాల బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, విజేతలను రాష్ట్ర పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. తొలుత జిల్లా బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షుడు రాయపాటి రంగారావు క్రీడాకారులనుద్దేశించి జిల్లా స్థాయిలో ప్రతిభకనబర్చి రాష్ట్ర పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్ సంఘ సభ్యులు వెంకటేశ్వరరావు, బాలాజీ, సురేష్, కెవి రాజు తదితరులు పాల్గొన్నారు.

రూ. 1000 కోట్లతో గురుకుల పాఠశాలలు

కాకుమాను, జూలై 9: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యంగా అమలు చేస్తూ రాష్ట్భ్రావృద్ధికై శ్రమించడమే, కాక సుందర రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు అకుంఠిత దీక్షతో, విక్రమార్కుడిలా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందరం అండగా నిలబడాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను నెలకొల్పి విద్యా వనరులను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. శనివారం మండల కేంద్రమైన కాకుమానులో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన గురుకుల పాఠవాలల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికై వెయ్యి కోట్ల రూపాయలతో నియోజకవర్గాల స్థాయిలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం స్తానికంగా రెండు సిసి రోడ్లను ప్రారంభించారు. ఎంపిపి నక్కల శైలజ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, తహశీల్దార్ మల్లికార్జునరావు, డెప్యూటీ డిఇఒ ఎన్ రఘుకుమార్, వివిధ మండల శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రేమోన్మాది చేష్టలకు బాలిక బలి

సత్తెనపల్లి, జూలై 9: ప్రేమోన్మాది చేష్టలు భరించలేక అభంశుభం తెలియని బాలిక బలవన్మరణం చెందింది. ఈ దుర్ఘటన సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ళ మండలం మాదలలో శనివారం జరిగింది. ఎస్‌ఐ వై అచ్చయ్య సమాచారం మేరకు వారిది పేద కుటుంబం. తండ్రి దొడ్డా కోటేశ్వరరావు సంవత్సరం క్రితం మరణించాడు. అదే వృత్తిని కొనసాగిస్తూ పూసలు, గాజులు అమ్ముకుంటూ చిక్కు వెంట్రుకలు సేకరించుకుంటూ జీవనం సాగిస్తోంది తల్లి దొడ్డా మహాలక్ష్మి. అదే గ్రామానికి చెందిన యువకుడు దాసరి మహేష్ మరో ఇద్దరు స్నేహితులతో కలసి తనను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని మహాలక్ష్మి కుమార్తె దొడ్డా కళ్యాణి (15)ని వేధింపులకు గురిచేస్తుండడంతో బాలిక జీవితంపై విరక్తి చెంది గ్రామంలో తాను ఉంటున్న ఇంటిలోనే తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఉరివేసుకుంది. కళ్యాణి 8వ తరగతి వరకు చదువుకుంది. తండ్రి మరణంతో చదువు మానుకుని తల్లికి చేదోడువాదోడుగా ఇంటి వద్దే ఉంటోందని ఎస్‌ఐ వివరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ అచ్చయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.