గుంటూరు

మోదీని ఏపీ ప్రజలు క్షమించరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి నేడు మాట మార్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆంధ్రప్రదేశ్ ప్ర త్యేకహోదా సాధన సమితి రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా సా ధన సమితి ఆధ్వర్యంలో స్థానిక శంకర్‌విలాస్ సెంటర్ నుండి లాడ్జిసెంటర్ వరకు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎపికి పదేళ్లపాటు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు మాట తప్పి వౌనం పాటిస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలకు రాయితీ రావాలన్నా ప్రత్యేకహోదా అవసరమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో పాటు రాష్ట్రప్రజల జీవితాలతో హోదా ముడిపడి ఉందన్నారు. హోదాపై మంగళవారం చేపట్టే ధర్నాలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు ప్రత్యేకహోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తుకోసం వెంపర్లాడకుండా రాష్ట్రప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేకుంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదముందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకహోదా సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పివి మల్లిఖార్జునరావు, సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి తాడికొండ నరసింహారావు, సిపిఐ నాయకులు కోట మాల్యాద్రి, పులి సాంబశివరావు, నూతలపాటి చిన్న, కేశాని కోటేశ్వరరావు, పిచ్చయ్య, భైరాపట్నం రామకృష్ణ, ఆరేటి రామారావు, ఎస్ సంగీతరావు, మహంకాళి సుబ్బారావు, సిహెచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సర్వేను వేగవంతం చేయాలి
* వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఆగస్టు 1: రాష్ట్రంలో చేపట్టిన ప్రజా సాధికార సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, సేకరించిన సమాచారాన్ని అప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కార్యదర్శులు, కలెక్టర్లు తదితర అధికారులతో మాట్లాడారు. రాష్ట్ర జనాభా 4.95 కోట్లు కాగా గత నెల 8న ప్రారంభించిన సర్వే కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 60 లక్షల మందికి సర్వే జరిగినట్లు రికార్డుల పరంగా తెలుస్తోందన్నారు. కార్యక్ర మం మరింత వేగవంతంగా జరగాల్సిన అవసరం ఉందని, అవసరాన్ని బట్టి ఎక్కువ మంది ఎన్యూమరేటర్లను తీసుకోవాలన్నారు. గత నెల 27న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ రోజు లక్షా 60 వేల మంది వివరాలను సర్వేలో సేకరించినట్లు చెప్పారు. అయితే ఆరోజున జారీచేసిన ఆదేశాలను అనుసరించి 28న 2,22,000 మంది, 29న 1,96,000, 30న 2,50,000 లక్షల మంది, 31న 1,36,000 మంది వివరాలను సేకరించారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజల చేరువకు వెళ్లాలనే సదాశయంతోనే సర్వే చేపట్టినట్లు చెప్పారు. సర్వే కోసం కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలను ఒకటి, రెండు రోజుల ముందుగా కుటుంబ సభ్యులకు తెలియజేస్తే వారు వాటిని సర్వే బృందం వెళ్లేసరికి సిద్ధం చేసుకుంటారని సూచించారు. అప్పుడు రోజుకు 14 కుటుంబాలకు జరపాల్సిన సర్వే మరిన్ని కుటుంబాల వివరాలను సేకరించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులందరూ గమనించి గ్రామస్థాయిలో తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌ఛార్జి సంయుక్త కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జలరవాణాకు అనుకూలంగా వంతెనల నిర్మాణం
* ఇరిగేషన్ ఇఇ వెంకటరత్నం వెల్లడి
తెనాలి, ఆగస్టు 1: కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల ద్వారా భవిష్యత్‌లో జలరవాణా జరుపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వంతెనల నిర్మాణాలకు భారీ గడ్డర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇరిగేషన్ ఇఇ వెంకటరత్నం పేర్కొన్నారు. సోమవారం తెనాలి పట్టణ పరిధిలోని కబేలా ప్రాంతంలోని వంతెనపై గడ్డర్లను అతిపెద్దక్రేన్‌ను ఉపయోగించి అమర్చారు. ఈపనులను తలకించేందుకు ప్రజలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించుకున్నారు. ఈసందర్భంగా ఇఇ వెంకటరత్నం మాట్లాడుతూ కృష్ణాపశ్చిమ డెల్టా ఆధునీకరణలో భాగంగా తెనాలి పట్టణ పరిధిలో మూడు వంతెనలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా జల రవాణాకు అవకాశం కలిగిన కాలువలపై వంతెన నిర్మాణాలకు భారీ గడ్డర్లు ఏర్పాటుచేసి వాటిపై కాంక్రీట్ వేయటం జరుగుతుందన్నారు. దీని వల్ల భవిష్యత్తులో జలరవాణా జరిగితే బ్రిడ్జ్‌ను అవకాశం ఉన్నంత ఎత్తుకు సులువుగా పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈక్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ భారీగడ్డర్లతో వంతెన నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. ఒకవైపు ప్రజలకు కాలువలు దాటేందుకు, మరోవైపు జలరవాణాకు వీలుగా వంతెన నిర్మాణాలు చేపట్టటంవల్ల ఖర్చు రెండు విధానాలకు దాదాపుగా సమంగా ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులు ఉన్నందువల్ల ఈపద్ధతిని అవలంబిస్తున్నట్లు తెలిపారు. బయటి ప్రాంతం, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకుకూడా జలరవాణా ఉపయోగపడే విధంగా వంతెనల నిర్మాణాలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిఇ శ్రీరామమూర్తి, రామకృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు.
చిగురిస్తున్న ఖరీఫ్ ఆశలు
* జిల్లాలో ముమ్మరంగా వరిసాగు * వర్షాలతో ఉద్యానవన పంటలకు ఊపిరి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఆగస్టు 1: జిల్లాలో రైతులకు ఖరీఫ్‌పై ఆశలు చిగురిస్తున్నాయి.. ఏటా ఈ సీజన్‌లో ముమ్మరంగా నాట్లుపడేవి. అయితే ఆశ, నిరాశల మధ్య వ్యథతో సేద్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నర లక్షల హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 24 వేల హెక్టార్లలో సాగు మొదలైందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాంతంలో వరిసాగును ముమ్మరం చేశారు. ఎగువన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు మేలు చేస్తాయని భావిస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి నీరు విడుదల కావడంతో రైతన్న ఒకింత ఊరట చెందుతున్నాడు. గత కొద్దిరోజుల వరకు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించారు. ప్రభుత్వం పట్టిసీమ ద్వారా కృష్ణా పశ్చిమ కాల్వలకు కూడా నీటిని విడుదల చేయటంతో ఆశలు చిగురిస్తున్నాయి. పెట్టుబడులు అధికమైన నేపథ్యంలో నాట్లకు స్వస్తిచెప్పి సాగు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇతర రాష్ట్రాల్లో పత్తి పైరుకు వైరస్ సోకినందున ఈ ఏడాది పత్తి విస్తీర్ణాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాలో మాత్రం ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 90 లక్షల ఎకరాలకు పైగా పత్తిపైర్లు వేసినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా గత రెండురోజులుగా వివిధ ప్రాంతాల్లో నమోదయిన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో 57 మండలాలకు గాను గత నెల 31వ తేదీన 22 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. మిగిలిన మండలాల్లో దుగ్గిరాల, అమరావతి ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. సోమవారం చెరుకుపల్లి, నగరం, తుళ్లూరు, మేడికొండూరు, భట్టిప్రోలు, రేపల్లెలో పది నుంచి 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షాల వల్ల మెట్టప్రాంతాల్లో ఉద్యానవన పంటలకు మేలు కలుగుతుందని రైతులు చెప్తున్నారు. తెనాలి డివిజన్ లంక గ్రామాలతోపాటు రాజధాని తుళ్లూరు, అమరావతి, ఇతర కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో కంద, అరటి, బీర, దోస ఇతర కూరగాయల పంటలతో పాటు పసుపు పైర్లు జీవం పోసుసుకుంటాయని ఆశిస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ఖరీఫ్ సీజన్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. సాగర్ నుంచి వచ్చే నీటిని మంచినీటి అవసరాలకే విడుదల చేయటంతో అదును కోసం రైతులు నిరీక్షిస్తున్నారు.

రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలి: మోదుగుల
గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 1: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కోరారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా సో మవారం గుంటూరు మిర్చియార్డులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. మొక్కలు పెంపకం ఆవశ్యకతపై విద్యార్థులకు ప్రాథమికస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, యార్డు కార్యదర్శి వజ్జా రామకృష్ణ, పెదకూరపాడు జెడ్పీటీసీ షరీఫ్, బాషా, తుమ్మల నాగేశ్వరరావు, యార్డు సిబ్బంది, డివిజన్ పార్టీ అధ్యక్షుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంక్షేమ హాస్టళ్ల మూసివేత యోచనను
విరమించుకోవాలి
గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 1: రాష్ట్రప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల మూసివేత యోచనను విరమించుకోవాలని, మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు కోరారు. సోమవారం నగరంలోని స్టాల్‌గర్ల్స్ ఎస్టీ హాస్టల్‌లో నవ్యాంధ్ర విద్యార్థి జెఎసి, ఎపి గిరిజన విద్యార్థి సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన జీపుజాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలన్నారు. హాస్టళ్ల నిర్వహణకు సొంత భవనాలు కేటాయించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు మూసివేస్తే పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఖాళీగా ఉన్న వార్డెన్, వాచ్‌మెన్, కమాటి పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు ఎ అయ్యస్వామి, గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె పాండు నాయక్, సయ్యద్ గౌస్, కుర్రా శ్రీనివాస్, హరి, రాజేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హోదా ఇవ్వాలని మోదీ తలిస్తే ఏ చట్టంతో పనిలేదు
గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 1: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలిస్తే ఏ చట్టం అవసరంలేదని, ఏ సభలోనూ చర్చించాల్సిన పనిలేదని అవగాహన సంస్థ సభ్యుల సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రత్యేకహోదా ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ సోమవారం అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యాపకులు కె జయకుమార్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆంధ్ర ప్రయోజన పరిరక్షణ సమితి కార్యదర్శి పిఎస్ మూర్తి మాట్లాడుతూ నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీ చట్టంలో లేదని చెబుతున్న కేంద్రం ఆ ఆటంకాన్ని తొలగించుకోవడానికి చట్టాన్ని సవరించవచ్చని, అందుకు సహకరించటానికి అన్ని ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇదంతా తెలిసే బిజెపి ప్రభుత్వం నాటకాలాడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని మర్చిపోతుందన్నారు. జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి వేదయ్య మాట్లాడుతూ ప్రత్యేకహోదా మూలంగా పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారని, ప్రత్యేకహోదా బలమైన సెంటిమెంట్‌గా మారిందన్నారు. హోదా కోసం ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడకపోయి ఉండవచ్చుగానీ, హోదాను వ్యతిరేకించే వారి భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో రాజ్యసభ సాక్షిగా జరిగిన నాటకాన్ని చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్టీల మోసపూరిత వైఖరిస్పష్టంగా కన్పించిందన్నారు. సభలో రచయిత్రి సుజాత, ఎ హరి, సింగరయ్య, రవిబాబు తదితరులు కూడా ప్రసంగించారు.
రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
అమరావతి, ఆగస్టు 1: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక పెదమద్దూరు సెంటర్‌లో రాత్రికి రాత్రే ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మండల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు షేక్ హష్మి ఆందోళన వ్యక్తంచేశారు. గుంటూరు, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో కృష్ణా పుష్కరాల సందర్భంగా రోడ్లు వెడల్పు పేరుతో రాత్రికి రాత్రే దేవాలయాలు, మసీదులు, చర్చిలను పలువురు జాతీయ నాయకుల విగ్రహాలను కూల్చివేశారని, కాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో మెయిన్‌రోడ్డులో గుంటతీసి రాత్రికి రాత్రే ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం వారి నైజాన్ని చాటుతుందన్నారు. గ్రామంలో రోడ్డుపక్కనున్న మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను తొలగించారని, వాటిని గురించి పట్టించుకోకుండా ఎన్‌టిఆర్ విగ్రహ ఏర్పాటు ఏమిటని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన వెంట యువజన విభాగం కార్యదర్శి మేకల లక్ష్మణ్, మండల పార్టీ కార్యదర్శి నాయుడు సాంబశివరావు, సలీం, ఇమ్రాన్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
5లోగా పుష్కర పనులు పూర్తిచేయాలి
అమరావతి, ఆగస్టు 1: కృష్ణా పుష్కర పనులన్నీ 5వ తేదీలోగా పూర్తిచేయాలని ఆయాశాఖల అధికారులతో గుంటూరు రేంజ్ ఐజి సంజయ్‌కుమార్ కోరారు. సోమవారం సాయంత్రం ఆయన స్థానికంగా నిర్మాణం జరుగుతున్న ధ్యానబుద్ధ ప్రాజెక్టు, అమరేశ్వరఘాట్లను పరిశీలించారు. అలాగే ఘాట్లకు వచ్చే ప్రధాన రహదారులను పరిశీలించి ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు. ఈ పర్యటనలో ఆయన వెంట డిఎస్‌పిలు మధుసూదనరావు, దుర్గాప్రసాద్, రమణారావు, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

జీతాలిప్పించండి సారూ....
బెల్లంకొండ, ఆగస్టు 1: గడిచిన 16 నెలలుగా జీతాల్లేక కుటుంబాలు గడవటమే కష్టంగా మారిందని జీతాలు ఇప్పించి ఆదుకోవాలని బెల్లంకొండ రక్షిత మంచినీటి చెరువు ఒప్పంద ఉద్యోగులు సోమవారం పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. వీరి అవస్థలు విన్న ఎమ్మెల్యే స్థానిక డిపిఒతో ఫ్లోన్‌లో మాట్లాడి వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఇలావుండగా ఒప్పంద ఉద్యోగుల తమ జీతాలను స్థానిక పంచాయతీలకు అప్పగించవద్దని కోరారు. పంచాయతీల నుండి 14వ ఫైనాన్స్ ద్వారా 20 శాతం నిధులను ఒప్పంద ఉద్యోగుల జీతాల కింద ఖర్చుచేయాల్సి ఉండగా, చప్పుడు కాకుండా ఇప్పటికే ఆయా సర్పంచులు మొత్తం గ్రాంట్ మార్చుకున్నట్లు తెలిసిందని బెల్లంకొండ రక్షిత మంచినీటి పథకం సొసైటీ అధ్యక్షుడు చిన ఏడుకొండలు కోరారు. ఇకనైనా మా జీతాలను మాకు సక్రమంగా అందించేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు.