గుంటూరు

కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 29: నోట్ల రద్దుపై కేంద్రం వెసులుబాటు కల్పిస్తున్నా సామాన్య, మధ్యతరగతి ప్రజల కష్టాలు తీరటంలేదు.. బతుకుబండిని నడిపే పచ్చనోటు కోసం బ్యాంకుల వద్ద గంటల కొద్దీ బారులుతీరాల్సిన అగత్యం నెలకొంది.. పాత,కొత్త డినామినేషన్లతో బ్యాంకు సిబ్బంది విధుల్లో జాప్యంతో ఖాతాదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.. దీనికితోడు పలుకుబడి కలిగిన వారికి దొడ్డిదారిన నోట్లు అందిస్తుండడంతో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎటిఎంలు, బ్యాంకుల వద్ద గత 20రోజులుగా అవే పరిస్థితులు సాక్షాత్కరిస్తున్నాయి. గుంటూరు నగరంతో పాటు జిల్లాలో పలుచోట్ల మంగళవారం ఖాతాదారులు ఆందోళనకు దిగారు. అమరావతి, ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు శాఖల వద్ద ఆందోళనకు దిగడంతో పాటు అమరావతిలో బ్యాంకు అద్దాలు పగులకొట్టి మరీ నిరసన చాటుకున్నారు. ఏటిఎంల వద్ద సహనంతో బారులు తీరుతున్నా చివరకు డబ్బులులేవని బోర్డు తగిలించేసి సిబ్బంది చేతులు దులుపుకోవడంతో ఖాతాదారులు మండిపడుతున్నారు. గుంటూరు నగరంలోని నగరంపాలెం స్టేషన్ వద్ద ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర శాఖల వద్ద మండుటెండలో డబ్బుల కోసం క్యూలో నిలవటం నిత్యకృత్యంగా మారింది. ఉదయం 10.30 లేదా రాత్రి 9.30 గంటలకు ఎటిఎంలో డబ్బులు పడిన వెంటనే కొందరు ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుని ఉరకలు, పరుగులు తీస్తున్నారు. బ్యాంకు లావాదేవీలలో కూడా మితిమీరిన జాప్యం జరుగుతోంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు కాకపోవడంతో ఖాతాదారుల ఇబ్బందులకు గురవుతున్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించుకోవాలని చెప్తున్న అధికారులు అందుకు తగిన కార్డులు సామాన్యుల వద్దలేవనే వాస్తవాన్ని గ్రహించ లేకపోతున్నారు. నిత్యావసరాలకు ఆన్‌లైన్‌లో నగదు రహిత లావాదేవీలు ఎలా నిర్వహిస్తామో అధికారులు వివరించాలని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పల్నాటివీరుల ఉత్సవాల్లో రాయబారం
కారంపూడి, నవంబర్ 29: పల్నాటి వీరుల ఉత్సవాల్లో రాయబారం ఘట్టం మంగళవారం జరిగింది. వివిధ జిల్లాల నుండి వచ్చిన వీరాచారవంతులు కొణతములతో పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. వీర్లదేవాలయం, వీర్ల అంకమ్మ దేవాలయం, చెన్నకేశవస్వామి దేవాలయంలో వీరాచారవంతులు తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. విద్యావంతులు పల్నాటివీరుల చరిత్రను ఆలపించారు.ఈ కార్యక్రమంలో పీఠాధిపతి తరుణ్‌చెన్నకేశవ అయ్యవారు, పీఠం నిర్వాహకులు బొగ్గరం విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

దళిత కాలనీలలో మూడేళ్లలో వౌలిక సదుపాయాలు
* మంత్రి రావెల
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, నవంబర్ 29: దళిత, గిరిజన కాలనీలలో వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయి వౌలిక సదుపాయాలు కల్పిస్తామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుతీరుపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి రావెల ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సబ్‌ప్లాన్ నిధులు రెండువేల కోట్లను పట్టణాలు కాలనీలను కలుపుతూ ప్రధాన రహదార్లకు అనుసంధానంగా రోడ్ల నిర్మాణానికి కేటాయించామన్నారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం 12వేల కోట్లు కేటాయించి పారదర్శకంగా పనులు చేపట్టిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, ఇతర వర్గాలకు కల్పిస్తున్న సదుపాయాల అంతరాలను అంచనావేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. పంచాయతీరాజ్, మునిసిపల్ విభాగాల పనుల్లో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జియోట్యాగింగ్ విధానాన్ని అవలంబించాలని సూచించారు. పనుల్లో నాణ్యతను నిర్థారించేందుకు ప్రభుత్వం త్వరలో నూతన మెకానిజాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఉప ప్రణాళిక నిధులు 40 శాతం దళితులు ఉన్న కాలనీలకే కేటాయించినందున అంతకు తక్కువగా దళితులు ఉన్న కాలనీలను గుర్తించి సాధారణ నిధులతో అభివృద్ధి చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు, రోడ్లులేని 1570 ఎస్సీ గ్రామాలను గుర్తించామని, 17 వందల కిలోమీటర్ల రహదార్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. నాలుగువేలకు పైగా ఎస్టీ గ్రామాలు ఉండగా వాటికి 7022 కిలోమీటర్ల మేర రోడ్లు వేయాల్సి ఉందన్నారు. ఎస్సీ గ్రామాల్లో 512 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి 73 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. నిరుద్యోగ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు నాక్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ యువత కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో రాష్ట్రంలోని పురపాలక, పంచాయతీరాజ్‌శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మోదీ అనాలోచిత నిర్ణయం దేశ మనుగడకే ప్రమాదం
గుంటూరు, నవంబర్ 29: నల్లకుబేరుల జాబితా తమ వద్ద ఉందని చెప్తున్న కేంద్రప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుండా పెద్దనోట్లను రద్దుచేయడం కొండను తవ్వి ఎలుకలు పట్టిన చందంగా ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. మంగళవారం అరండల్‌పేటలోని నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశ మనుగడకే ప్రమాదకరమన్నారు. పెద్ద నోట్ల రద్దువెనుక పెద్ద కుట్ర దాగివుందని రాజ్యసభ, పార్లమెంటులో ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు ప్రధాని సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. గంటకో ఆలోచన, రోజుకో నిబంధన, ప్రాంతానికో ప్రకటనతో ప్రజలు అభద్రతాభావంతో జీవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అప్పిరెడ్డి అసహనం వ్యక్తంచేశారు. సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, నాయకులు షేక్ జాని, బి వెంకటేశ్వరరెడ్డి, నందిగం సురేష్, రబ్బాని తదితరులు పాల్గొన్నారు.

పోలీసు బందోబస్తు నడుమ
బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు
అమరావతి, నవంబర్ 29: పెద్దనోట్లైన 500, 1000 రూపాయలను ప్రభుత్వం రద్దుచేసి 20 రోజులు దాటినా ఖాతాదారుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. మంగళవారం స్థానిక ఎస్‌బిఐ బ్రాంచి వద్ద సుమారు 500 మందికి పైగా ఖాతాదారులు బారులుతీరారు. అలాగే ఉదయం 10.30 గంటల సమయంలో ఆంధ్రాబ్యాంకు వద్ద పెద్ద ఎత్తున ఖాతాదారులు గుమికూడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనికి తోడు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఖాతాదారులు ఆగ్రహంతో అద్దాలు పగలగొట్టి బ్యాంకులోకి చొచ్చుకెళ్లారు. బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో అమరావతి ఎస్‌ఐ కె వెంకటప్రసాద్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఖాతాదారులను బయటకు నెట్టివేసి విత్‌డ్రాయల్ ఫారాలు, బ్యాంక్ పాస్‌పుస్తకాలు, చెక్కులను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకుని సీరియల్ ప్రకారం బ్యాంకులోకి వెళ్లి నగదు లావాదేవీలు చేసే విధంగా కృషి చేశారు. సుమారు 2 గంటల పాటు ఎస్‌ఐ నగదు కౌంటర్ల వద్దనే ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖాతాదారులను శాంతింప జేశారు. ఈ సందర్భంగా ఆంధ్రాబ్యాంకు మేనేజర్ ఆర్‌ఎస్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ తమ వద్ద నగదు నిల్వలు స్వల్పంగా ఉన్నాయని, ఆశించిన మేరకు డబ్బులు రాకపోవడంతో తాము 4 వేల రూపాయల కంటే నగదు చెల్లింపులు చేయలేక పోతున్నామన్నారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏదేమైనా ఖాతాదారుల కష్టాలు తీరకపోవడం, నగదు లావాదేవీలు రోజురోజుకూ తగ్గిపోవడంతో, ఎటిఎంలను మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి నగదు నిల్వలు పెంచి అందరికీ అవసరమైన కరెన్సీని అందుబాటులో ఉంచాలని ప్రజానీకం కోరుతున్నారు. ఆంధ్రాబ్యాంకులో జరిగిన స్వల్ప ఉద్రిక్తత, అద్దాలు పగలగొట్టడంపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ వెంకట ప్రసాద్ తెలిపారు.

జిల్లా క్రాస్ కంట్రీ జట్టు
గుంటూరు (స్పోర్ట్స్), నవంబర్ 29: ఇటీవల స్థానిక బిఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా క్రాస్ కంట్రీ జట్ల ఎంపికలో ప్రతిభను కనబర్చిన క్రీడాకారులను అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జి శేషయ్య ప్రకటించారు. ఎంపికైన క్రీడాకారులు శ్రీకాకుళంలో డిసెంబర్ 4న జరగనున్న రాష్ట్ర క్రాస్ కంట్రీ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు తమ వయసు ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక బిఆర్ స్టేడియంలో సంఘ కార్యదర్శి జి శేషయ్యను సంప్రదించాలని సూచించారు. ఆ జట్టులో పురుషుల విభాగంలో బి లక్ష్మీనారాయణ, కె శరత్, చంద్రసాయికుమార్, సాంబిరెడ్డి, అండర్-20 బాలుర విభాగంలో పి రవి, ఎన్ నరసింహారావు, అండర్-18 బాలుర విభాగంలో ఎ కరిముల్లా, ఎం రాజేంద్ర, బాలికల్లో ఎ మాలతి, అండర్-16 బాలుర విభాగంలో ఆర్ హనుమంతప్రసాద్, ఎం వాసుదేవ బలరాం, డి కుమారస్వామి, బాలికల్లో పి రేష్మా, కె శిరీష, ఎ సీతారావమ్మ ఎంపికయ్యారు.

ఖాతాదారులంటే అంత అలుసా
* ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌పై మండిపడ్డ ప్రజలు
ప్రత్తిపాడు, నవంబర్ 29: మా సహనాన్ని పరీక్షించొద్దు... ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలబడి ఉంటున్నాం... ఖాతాదారులంటే మీకు అంత అలుసుగా ఉంది... మాకేమో ఖాతాకు 4 వేల రూపాయలు తీసుకోండి అంటున్నారు, మధ్యాహ్నానికల్లా నగదు లేదని బోర్డు పెట్టేస్తున్నారు, మేమెలా బతికేది అంటూ ఆంధ్రాబ్యాంకు ప్రత్తిపాడు శాఖ మేనేజర్‌పై ఖాతాదారులు, ప్రజలు మండిపడ్డ సంఘటన మంగళవారం ప్రత్తిపాడులో జరిగింది. మాకు నగదు ఇవ్వమని అడిగితే రకరకాల కారణాలు చెబుతున్నారు, ఇచ్చేవారికేమో వేలకు వేలు చాటుగా ఇస్తున్నారు అని నిలదీస్తే ‘ఎవరు వేయమన్నారు మిమ్మల్ని ఖాతాల్లో’ అంటూ మమ్మల్నే ఎదురు ప్రశ్నలేస్తున్నారంటూ ఖాతాదారులు బ్యాంకు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా అయితే మేము మీ బ్యాంకు నుండి ఖాతాలను క్లోజ్ చేసేస్తామని హెచ్చరించారు. జరిగిన సంఘటనపై మేనేజర్ శ్రీనివాసరావు స్పందిస్తూ ఖాతాదారులంటే మాకు గౌరవమేనని, తగినంత నగదు రాకనే ఈ ఇబ్బందని బదులిచ్చారు.

డోర్ టు డోర్ సర్వేను వేగవంతం చేయాలి
గుంటూరు (కార్పొరేషన్), నవంబర్ 29: నూతన ఓట్లు, అడ్రసుల మార్పులు, కరెక్షన్‌కు సంబంధించి చేస్తున్న డోర్ టు డోర్ సర్వేను వేగవంతం చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణకపర్థి తెలిపారు. మంగళవారం తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి బూత్‌స్థాయి అధికారుల డోర్ టు డోర్ ఎన్నికల సర్వేకు సంబంధించి సూపర్‌వైజర్లు, ఏఇఆర్‌ఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్‌స్థాయి అధికారులు డోర్ టు డోర్ సర్వేలో ప్రజల వద్ద నుండి ఎన్ని దరఖాస్తులను సేకరించినది సమీక్షించి డిసెంబర్ 14 నాటికి కార్యక్రమాన్ని పూర్తిచేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో ఓటుహక్కుకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల వద్ద నుండి త్వరితగతిన సేకరించి ఎన్నికల విభాగం వారికి బిఎల్‌ఓ రిమార్కులతో అప్పగించాలని, అలాగే బిఎల్‌ఓల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకొని వారికి అవసరమైన సలహాలను అందజేయాలన్నారు. అలాగే ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితాను, సిఇఓ వారి వెబ్‌సైట్ ద్వారా ఓటుహక్కును తనిఖీ చేసుకొని సంబంధిత బూత్‌స్థాయి అధికారికి గాని, నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గాని దరఖాస్తులను అందజేయాలన్నారు. సమావేశంలో డెప్యూటీ కమిషనర్ యేసుదాసు, డిటిలు బాలకృష్ణ, యశోద, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ పద్మనాభరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
3న అమరావతిలో రాష్టస్థ్రాయి టెన్నిస్ వాలీబాల్ పోటీలు
అమరావతి, నవంబర్ 29: స్థానిక శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్‌లో డిసెంబర్ 3వ తేదీ శనివారం రాష్టస్థ్రాయి టెన్నిస్ వాలీబాల్ పోటీలు ఎస్‌ఆర్‌కె హైస్కూల్ క్రీడామైదానంలో జరుగుతాయని, శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కొల్లి లక్ష్మీనారాయణ తెలిపారు. అండర్-17, అండర్-19 విభాగాల తరపున సుమారు 150 మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. హైస్కూల్ కరస్పాండెంట్ మల్లెల శ్రీనాధ్‌చౌదరి క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైస్కూల్ కమిటీ ఉపాధ్యక్షుడు పారేపల్లి వెంకట సత్యనారాయణ క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేస్తారని తెలిపారు. అమరావతి నుంచి అండర్-17 జట్టులో ఏడుగురు విద్యార్థులు అండర్-19 విభాగంలో పల్లోటి జూనియర్ కళాశాల నుంచి ముగ్గురు విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. అలాగే ఈనెల 26,27,28 తేదీల్లో కర్నూలులో జరిగిన అండర్-17 రాష్టస్థ్రాయి ఫ్లోర్‌బాల్ పోటీల్లో గెలుపొందిన సిహెచ్ వరప్రసాద్, సిహెచ్ మనీష్‌లను కళాశాల పాలకవర్గ కమిటీ కరస్పాండెంట్ మల్లెల శ్రీనాధ్‌చౌదరి అభినందించారు. సిహెచ్ వరప్రసాద్ జనవరిలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని, ప్రయాణ ఖర్చుల నిమిత్తం 2 వేల రూపాయల నగదును, కరస్పాండెంట్ శ్రీనివాసచౌదరి అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఇటి అనూరాధ, ఇంగ్లీషు మీడియం హెచ్‌ఎం కె సదాశివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సౌత్‌జోన్ బాస్కెట్ బాల్ పోటీలకు ఎసి కళాశాల క్రీడాకారులు
గుంటూరు (స్పోర్ట్స్), నవంబర్ 29: ఈనెల 23 నుండి 29వ తేదీ వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల బాస్కెట్ బాల్ పోటీల్లో స్థానిక ఎసి కళాశాల జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కళాశాల విద్యార్థులు పి ఆనందకుమార్, షేక్ మసూద్, రత్నకుమార్, ఎఎకె కిషోర్‌లు సౌత్‌జోన్ జట్టుకు ఎంపికై డిసెంబర్‌లో మద్రాసులో జరగనున్న సౌత్‌జోన్ విశ్వవిద్యాలయ క్రీడల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆంధ్రాక్రైస్తవ కళాశాలలో జరిగిన ఉల్ఫ్‌డే ఉత్సవాల విజేత జట్టు క్రీడాకారులకు, సౌత్‌జోన్‌కు ఎంపికైన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి ముత్యం, అసోసియేట్ ప్రిన్సిపాల్ ఎంవిఎస్ విజయరాజు, వ్యాయామ అధ్యాపకులు జెఎ ప్రీతమ్ ప్రకాష్, కె విజయలక్ష్మి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
కోకాకోలా ఎన్నికల్లో సింహం ప్యానల్ విజయం
మంగళగిరి, నవంబర్ 29: మండల పరిధిలోని ఆత్మకూరులో గల హిందుస్థాన్ కోకాకోలా కంపెనీ ఎంప్లారుూస్ యూనియన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. కార్మికశాఖ అధికారి కాశీ విశ్వనాథం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సింహం గుర్తు ప్యానల్ ఘనవిజయం సాధించింది. మొత్తం 219 ఓట్లకు గాను 218 పోలయ్యాయి. వాటిలో ఒక ఓటు చెల్లలేదు. సింహం ప్యానల్‌కు 118 ఓట్లు, ఉదయించే సూర్యుడు గుర్తు ప్యానల్‌కు 99 ఓట్లు లభించాయి. సింహం గుర్తు ప్యానల్ అధ్యక్షునిగా లేళ్ల అప్పిరెడ్డి, ఉపాధ్యక్షునిగా డి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా ఎంఎస్ పాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా రమేష్, మన్మధరావు, కోశాధికారిగా ఎస్‌వి సుబ్బారావు, మరో ఏడుగురు సభ్యులు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా మున్నంగి గోపిరెడ్డిని ఎన్నుకున్నారు. వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్, వై శ్రీనివాసరావు, కరుణాకర్, అంకమ్మరావు తదితరులు గెలుపొందిన సభ్యులను అభినందించారు.
మాలల మనోభావాలను దెబ్బతీస్తే సహించం
గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 29: మాలల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు వ్యాఖ్యానించినా సహించబోమని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహానాడు ఆధ్వర్యంలో స్థానిక లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ వర్గీకరణ చెల్లదని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుచెప్పినా చట్టాలు, కోర్టులు, ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం లేదని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలు వర్గీకరణ చేస్తామని మాదిగ సోదరులను రెచ్చగొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం కొన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించాలన్నా, మరికొన్ని కులాలను రిజర్వేషన్ జాబితాలో చేర్చాలన్నా పార్లమెంటులో సవరణ చేయవచ్చని ఉందే తప్ప, కులాలను వర్గీకరించమని ఎక్కడా లేదన్నారు. జరగని వర్గీకరణ అంశాన్ని వేదికగా చేసుకుని అన్నదమ్ములైన మాల, మాదిగల మధ్య చిచ్చుపెడుతున్న వారి కుట్రలను మాదిగ సోదరులు గమనించాలని హితవుపలికారు. అనంతరం దత్తాత్రేయ, వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుర్రం రామారావు, ఎం రవికుమార్, కూచిపూడి చంద్రశేఖర్, దాసరి రాములు, నల్లపు నీలాంబరం, బత్తుల అనిల్‌బాబు, బండ్లమూడి స్టాలిన్‌బాబు, కె వినయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలే మేలు
మంగళగిరి, నవంబర్ 29: నగదు రహిత లావాదేవీలే మేలని, అవినీతిని రూపుమాపవచ్చని వ్యాపారులు నగదు రహిత లావాదేవీలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్లు ఎస్ రాంబాబు, ఎస్ వెంకయ్య అన్నారు. మంగళగిరి సర్కిల్ వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యాన మంగళవారం నగదు రహిత లావాదేవీలపై వినియోగదారులకు నిర్వహించిన అవగాహనా సదస్సులో వారు ప్రసంగించారు. స్థానిక మండల పరిషత్ ప్రాంగణంలోని ఇండోర్‌స్టేడియంలో జరిగిన సదస్సుకు స్థానిక వాణిజ్య పన్నుల శాఖ అధికారిణి జిఎల్ సత్యవేణి అధ్యక్షత వహించారు. అసిస్టెంట్ కమిషనర్లు రాంబాబు, వెంకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోందని, భవిష్యత్తులో ప్రజలు మొబైల్ బ్యాంకింగ్‌వైపు మొగ్గు చూపాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తామని, అన్ని ఇతర కార్యకలాపాలకు కూడా నగదు రహితంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని, స్వైపింగ్ మిషన్ల కోసం వాణిజ్య పన్నుల శాఖకు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా అందజేస్తామని, వచ్చే నెలాఖరు వరకు స్వైపింగ్ మిషన్ లావాదేవీలపై ఎలాంటి అదనపు చార్జీలు కూడా ఉండబోవని అసిస్టెంట్ కమిషనర్లు పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు ప్రజలు, వ్యాపారవర్గాలు మొగ్గుచూపాలని అన్నారు. స్వైపింగ్ మిషన్ పనిచేసే విధానాన్ని నగదు రహిత లావాదేవీలు నిర్వహించే విధానాన్ని వివరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు, ఆడిటర్లు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఖాతాదారులు, వ్యాపారులు పాల్గొన్నారు.