గుంటూరు

పల్నాడు గ్రామాల దత్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 4: జిల్లాలో వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి మహర్దశపట్టింది. ఆయా గ్రామాల్లో వౌళిక సదుపాయాల కల్పన కోసం, అత్యంత వెనుకబడిన నియోజకవర్గాలైన మాచర్ల, గురజాల, వినుకొండలపై దృష్టిసారించారు. ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ ఢిల్లీలోని కార్పొరేట్ కంపెనీల చైర్మన్లను ఎంపి రాయపాటి పలుమార్లు కలిసి సమస్యలను విన్నవించారు. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలంలోని ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) 52.86 లక్షల రూపాయల నిధులను(మిగతా 6 లో)
కేటాయించింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో జెసి కృత్తికాశుక్లా, ఎంపి రాయపాటి సాంబశివరావుల సమక్షంలో హెచ్‌పిసిఎల్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎం వేణుగోపాల్, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల సమక్షంలో నిధుల వ్యయంకు సంబంధించిన ఎంఒయుపై సంతకాలు చేశారు. హెచ్‌పిసిఎల్ నిధులకు అదనంగా ఎన్‌ఆర్‌ఇజిఎస్ నుండి మరో 52.86 లక్షల రూపాయలను కేటాయించనున్నారు. మొత్తం 1.05 కోట్లతో గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీల్లో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైన్ల నిర్మాణం జరపనున్నారు. ఇప్పటివరకు 10 కోట్ల రూపాయలు వివిధ కంపెనీల నుండి మంజూరు కాగా మరికొన్ని కంపెనీల నుండి 30 కోట్ల రూపాయలు మంజూరు దశలో ఉన్నాయని రాయపాటి తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలం, ధర్మవరం గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సస్ సద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్‌ఎజివై) కింద 7 కోట్ల రూపాయలతో గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అమరావతి మండలంలోని ఉంగుటూరు, జిల్లాలోని ఈపూరు మండలంలోని ఇనిమెళ్ల, కారంపూడి మండలంలోని వేమకంపల్లి గ్రామాల అభివృద్ధికి కోటి 20 లక్షల రూపాయలు కేటాయించిందని, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 2 కోట్ల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణాన్ని, బిహెచ్‌ఇఎల్ సంస్థ 26 లక్షల రూపాయలతో 5 గ్రామాల్లో ఆర్వోప్లాంట్ల నిర్మాణం జరిపినట్లు తెలిపారు. అలాగే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ గురజాల మండలంలోని చర్లగుడిపాడు, దాచేపల్లి మండలంలోని పెదగార్లపాడు గ్రామాల్లో 30 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టిందని రాయపాటి వివరించారు.

మానవుడు అహంకారం వీడినప్పుడే..

ప్రత్తిపాడు, మార్చి 4: గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి ఉన్నత స్థానాలను ఎదిగిన వారు సాధ్యమైనంత వరకు సాయం అందించి, గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని విశ్వగురుపీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ పిలుపునిచ్చారు. విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని 4వ రోజైన శనివారం విశ్వనగర్ ఆవరణలోని యజ్ఞశాలలో మహన్యాసపూర్వక, ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వగురుపీఠంలో భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేస్తూ పురిటిగడ్డను, కన్నతల్లిని మరవకుండా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. మానవుడు అహంకారం వీడినప్పుడే అభివృద్ధి చెందుతాడని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. ప్రకృతిలో మనం జోక్యం చేసుకోవడం వల్లే ఉపద్రవాలు సంభవిస్తున్నాయని, అందువల్ల ప్రకృతి, పంచభూతాల మధ్య సమతుల్యత సాధించేందుకు కలిసి పనిచేయాలన్నారు. మొదట మనల్ని మనం సంస్కరించుకుంటూ కుటుంబాన్ని సంస్కరిస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. విశ్వమానవ సమైక్యతా కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. తొలుత మాతా శిశు వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని విశ్వంజీ మహరాజ్ సందర్శించి వైద్య శిబిరానికి హాజరైన రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో విశ్వమానవ సమైక్యతాసంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, కామేశ్వరీ దంపతులు, ఇన్‌కమ్‌ట్యాక్స్ ఎప్‌లేట్ ట్రిబ్యునల్ మెంబర్ బి రామకోటయ్య, ఎసిబి ప్రిన్సిపల్ లీగల్ అడ్వయిజర్ రమణప్రసాద్, శుకబ్రహ్మాశ్రమంకు చెందిన కె ఈశ్వర్, డాక్టర్ కె సూర్యప్రకాష్, ఎం రాజరాజేశ్వరి, దత్తాత్రేయశాస్ర్తీ, దయానంద్ తదితరులు విశ్వకుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అష్టలక్ష్మీ దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
గుంటూరు (కల్చరల్), మార్చి 4: జగద్గురు శంకరాచార్య పరంపర శ్రీ హంపీ విరూపాక్ష పీఠానికి అనుబంధమైన అరండల్‌పేటలోని శ్రీ అష్టలక్ష్మీసమేత లక్ష్మీనారాయణ స్వామి మందిరంలో 11 రోజుల పాటు జరిగే 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ప్రభాతవేళలో మంగళప్రదంగా ప్రారంభమైనాయి. హంపీ విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీస్వామి వారి ఆశీఃపూర్వక ఆదేశానుసారం ఈ ఉత్సవాలను ఈనెల 15వ తేదీ బుధవారం వరకు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మర్రిపాటి ప్రసాద్ తెలిపారు.
ప్రసన్నాంజనేయస్వామికి విశేష స్నపన తిరుమంజనం
గుంటూరు (కల్చరల్), మార్చి 4: కంచికామకోటి పీఠానికి దత్తత చేయబడిన నగరంలోని మారుతినగర్ శ్రీ మారతి దేవాలయంలో 30వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 7 గంటలకు గోపూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా బాలపూజ, అనంతరం నిత్య జప హోమాలను రుత్విక్కులు యధావిధిగా నిర్వహించారు. ఆలయ మూలమూర్తిగా శోభిల్లుతున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామికి వేలాది నాగవల్లీ దళాలతో అర్చన, సింధూర అభిషేకం చేశారు. అనంతరం సువర్చలాసమేత పవన సుతునికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను స్నపన తిరుమంజనం పేరిట అర్చక బృందం నిర్వహించింది.

రోజా నాలుకను ప్రజలే తెగ్గోస్తారు...

గుంటూరు (కొత్తపేట), మార్చి 4: మహిళాలోకం సిగ్గుతో తలదించుకునేలా ప్రతిపక్ష నాయకురాలు రోజా ప్రవర్తన ఉందని, ఆమె తన భాషను, భావాలను అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే నాలుకను తెగ్గోస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళలకు హారతులిస్తుంటే ఓర్పు, సహనం కోల్పోయి కేవలం ప్రచారార్భాటాల కోసం నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలకు సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్థి హక్కు కల్పించారని, వారిని విద్యావంతులను చేయాలన్న సదుద్దేశంతో మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా వ్యవస్థను ప్రవేశపెట్టి మహిళలను ఆదుకోవడం జరిగిందని, ఇటీవల నిర్వహించిన మహిళా పార్లమెంటు సదస్సు నారీలోకానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మహిళలు మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం సర్వ సాధారణమని, మహిళల విజయచిహ్నంగా వారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ పురుషులే మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. స్ర్తిల గొప్పతనం గురించి పురుషులు మాట్లాడుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని, 33 శాతం రిజర్వేషన్ కూడా అమలైతే మహిళలు పురుషులతో సమానంగా నిలుస్తారన్నారు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ మాట్లాడుతూ మహిళలకు సముచితస్థానం కల్పించింది తెలుగుదేశమేనన్నారు. సమావేశంలో రాష్ట్ర తెలుగు మహిళా ప్రోగ్రామ్ సెక్రటరి ములకా సత్యవాణిరెడ్డి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు కేశనశెట్టి రమాశాంతదేవి, పానకాల వెంకట మహాలక్ష్మి, నల్లపనేని విజయలక్ష్మి, తోటా సీతామహాలక్ష్మి, మలినేని రుక్మిణి, వందనాదేవి తదితరులు పాల్గొన్నారు.

నృసింహాలయంలో ధ్వజారోహణ

మంగళగిరి, మార్చి 4: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ధ్వజారోహణము వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన ఘట్టపిది. రుత్విగ్వరణ, అంకురారోపణాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కల్యాణోత్సవానికి భక్తజనులను, దేవతలను ఆహ్వానించేందుకై భక్తాగ్రేస్వరుడైన గరుత్మంతుని ధ్వజముపై ప్రతిష్టిస్తారు. స్వామివారి సేవలకు భక్తజన సేవలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కలుగచేసేందుకు దేవతలందర్నీ వారివారి విధుల్లో నియమిస్తారు. అష్టనాగాధిపతి ఐన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదమును గరుడముద్దల పేరిట సంతానము లేని దంపతులకు ప్రసాదముగా అందజేశారు. అనేకమంది సంతానంలేని దంపతులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి గరుడముద్దలను స్వీకరించారు.

ఈ ఉత్సవాన్ని దర్శించిన భక్తుల యోగక్షేమాలు స్వామివారే స్వయంగా చూస్తారని ప్రతీతి. అలయ ఉపప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు, నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మహిళల కోలాట ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంది. ధ్వజారోహణము ఉత్సవానికి కైంకర్య పరులుగా మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వ్యవహరించారు. ఆదివారం హనుమంత వాహన ఉత్సవం జరుగుతుందని ఇఓ తెలిపారు.

బండలాగుడు పోటీల్లో మంగళగిరి ఎడ్లకు బహుమతి
గురజాల, మార్చి 4: మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామంలో వెంకటేశ్వరస్వామి తిరునాళ్ళను పురస్కరించుకుని రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన శనివారం నాలుగు పళ్ళ సైజు విభాగంలో ఏడు జతలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో మంగళగిరికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత నిర్ణీత గడువులో 3568 అడుగుల దూరం బండను లాగి ప్రథమ బహుమతిని గెలుచుకోగా, మాచవరం మండలానికి చెందిన మురళీ ఎడ్లజత 3500 అడుగుల దూరం బండ లాగి ద్వితీయ బహుమతిని, అచ్చెంపేటకు చెందిన రజితారెడ్డి ఎడ్ల జత 3250 అడుగుల దూరం బండను లాగి మూడో బహుమతిని, ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలానికి చెందిన గణేష్‌రెడ్డి ఎడ్లజత 3058 అడుగుల దూరం బండను లాగి నాలుగో బహుమతిని, దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి చెందిన రాజశేఖరరెడ్డి ఎడ్ల జత 2788 అడుగుల దూరం బండను లాగి ఐదోబహుమతిని గెల్చుకున్నాయి.

అసెంబ్లీ ముంగిట పచ్చదనాల కనువిందు

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 4: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలిసారిగా జరుగుతున్న శాసనసభ సమావేశాల నేపథ్యంలో వెలగపూడి ట్రాన్సిట్ ప్రభుత్వ భవనాల సముదాయం ఆరుబయట అందాలు కనువిందు చేస్తున్నాయి. మదిని పులకింపజేసే సుందరమైన గ్రీనరీలు, ల్యాండ్ స్కేవ్, పంచరంగులతో అలరించే క్రోటన్ మొక్కలు అసెంబ్లీ ఆవరణలో అడుగిన వారిని ఆకర్షిస్తున్నాయి. ఈ నెల 6 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని భవనం నలుదిక్కులా గ్రీనరీని అభివృద్ధి పర్చిన సిఆర్‌డిఏ అధికారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదనపు కమిషనర్ డాక్టర్ ఎ మల్లికార్జున సూచనలతో అదనపు డైరెక్టర్ ఎ శ్రీనివాసులు నేతృత్వంలో హార్టికల్చర్ ఆఫీసర్ ఎ చెన్నయ్య, అసిస్టెంట్ ప్లానర్ ప్రమన్‌కుమార్, ఎన్విరాన్‌మెంటలిస్ట్ సాయి విశ్వనాథ్, హార్టీకల్చర్ సూపర్‌వైజర్లు రాజ్‌కుమార్, అసిరి నాయుడు, ఈశ్వర్, శ్రీనివాసులు, రాష్ట్ర అర్బన్ గార్డెనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ (మిగతా 6 లో)
కార్పొరేషన్ అధికార సిబ్బంది ఇందుకోసం అహర్నిశలు శ్రమించారు. వేసవి కాలంలోకి అడుగిడుతున్న ప్రస్తుత తరుణంలో అసెంబ్లీ సమావేశాలంటేనే వాడివేడిగా సాగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. వేడి వాతావరణాన్నంతటినీ ఒక్క చూపులోనే చల్లబర్చేలా గ్రీనరీతో అలంకరించారు. దేశవిదేశాల నుంచి తీసుకొచ్చిన మొక్కలను చూసి ఆనందించని వారుండరనే చెప్పాలి. పట్టుమని పదిరోజుల్లోనే సుందీరకరణ పనులను పూర్తిచేసిన ఘనత సిఆర్‌డిఏ అధికారులకే దక్కుతుంది. అర ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన లాన్ అందాలు హార్టీకల్చర్ అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. నిత్యం పచ్చగా ఉండి మృదువుగా చూడముచ్చటగా ఉండే పచ్చికబయలు వీక్షకులకు ఆనందం కలిగిస్తోంది. అసెంబ్లీ, శాసనమండలి భవనాల సముదాయానికి పచ్చల తోరణం తొడిగిన సిఆర్‌డిఏ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు అభినందించారు.

ముస్లింలు అన్నిరంగాల్లో
అభివృద్ధి చెందాలి
* మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట, మార్చి 4: ముస్లిం వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం చిలకలూరిపేట పట్టణంలోని నెహ్రూనగర్‌వద్ద నూతనంగా నిర్మించిన స్వర్గీయ సాలిబుడే శ్రీ చిలకలూరిపేట ముస్లిం షాదీఖానాను మంత్రి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల (మిగతా 6 లో)
అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. చిలకలూరిపేటలో ఉన్న ముస్లిం వర్గాలకు తాను ఎమ్మెల్యేగా ఉన్ననాటి నుండి నేటి వరకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. 135 మంది ముస్లిం పెద్దలు కలిసి ఈ షాదీఖానాను నిర్మించడం గొప్ప విషయమన్నారు. షాదీఖానా అధ్యక్షుడుగా ఉన్న సాలిబుడే ప్రమాదవశాత్తు మరణించినందుకు ఆయన పేరు పెట్టడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి, ముస్లిం షాదీఖానా సభ్యులు బషీర్, షేక్ కరిముల్లా, షేక్ జమాల్‌బాషా, మహ్మద్ ఈసుఫ్ అలీ, సుభాని, మటన్‌బాషు, మల్లెల రాజేష్‌నాయుడు, తేళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

అబలలపై పెరుగుతున్న అత్యాచారాలు
* చైతన్యం కోసం గ్రామాల్లో కౌనె్సలింగ్
* మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి
నరసరావుపేట, మార్చి 4 : ప్రతి గ్రామంలో మహిళల్లో చైతన్యం తీసుకురావడం కోసం కౌనె్సలింగ్ ఏర్పాటు చేయనున్నట్లు మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. శనివారం స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రిలో తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన మహిళను పరామర్శించేందుకు వచ్చిన ఆమె విలేఖరులతో మాట్లాడారు. మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని, నరసరావుపేట పట్టణంలోని వెంగళరెడ్డి కాలనీలో డిగ్రీ చదువుకునే విద్యార్థినిపై కన్నతండ్రే కసాయిగా మారి, అత్యాచారానికి ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువతి జరిగిన సంఘటనకు హతాశురాలై పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని అన్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. అత్యాచారం చేసిన తండ్రికి బెయిల్ రాకుండా చూడాలని, ఇందుకు న్యాయవాదులు కూడా సహకరించాలని కోరారు. ఇటీవల చిలకలూరిపేటలో ఎనిమిదేళ్ళ బాలికపై కేబుల్ ఆపరేటర్ అత్యాచారం చేశాడని, తుళ్ళూరులో ఆస్థి కోసం సొంత చెల్లెల్ని సోదరుడు హత్య చేశాడని తెలిపారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని రాజకుమారి అన్నారు. ఆమె వెంట సిడిపివో స్వర్ణలక్ష్మి, డాక్టర్ మోహన్‌శేషు, డాక్టర్ షరీఫ్ తదితరులు ఉన్నారు.

మైనార్టీలకు ప్రభుత్వం అండ
* స్పీకర్ డాక్టర్ కోడెల
సత్తెనపల్లి, మార్చి 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి అండగా వుంటుందని, వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. శనివారం పట్టణంలోని షాధిఖాన దగ్గర జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రసంగించారు. ముందుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్ వౌజనల నెలవారీ గౌరవ వేతనాలను స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేతులమీదుగా పంపిణీ చేశారు. అనంతరం స్పీకర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారి ఆలోచనలకు వారి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నిరంతరం ముందుకు నడుస్తుందని అన్నారు. మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మార్కెట్ యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, ఎంపిపి బొర్రా కోటేశ్వరరావు, నాయకులు పెద్ద కరిముల్లా, మొక్కపాటి రామచంద్రరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పెద్దింటి వెంకటేశ్వర్లు, కౌత్రపు శ్రీనివాసరావు, ర్యాంబోబుడె తదితరులు పాల్గొన్నారు.