గుంటూరు

ఆదిశంకరులకు సముచిత స్థానంతోనే అమరావతికి ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 20: సామాన్యుడైనా, అసామాన్యుడైనా సర్వేస్వరుడి దృష్టిలో ఎల్లప్పుడూ సమానమేనని, ఆచరణాత్మకంగా నిరూపించి తమ దేశసంచార యాత్రలు, ప్రబోధాల ద్వారా యావత్తు మానవాళిని జాగృతం చేసిన జగద్గురు పరమపూజ్య శ్రీ ఆదిశంకారాచార్యులకు సముచితస్థానం కల్పించినప్పుడే అమరావతికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి స్పష్టంచేశారు. శుక్రవారం నగరంలో జరిగిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే కాకుండా బ్రాడీపేటలో శ్రీ శంకరమందిరం-ఋగ్యజు స్మార్త పాఠశాల ప్రాంగణంలో జరిగిన శంకరజయంతి మహోత్సవంలో స్వయంగా పాల్గొన్న స్వామీజీ అసంఖ్యాకంగా తరలివచ్చి భక్తులనుద్దేశించి తమ మనోభావాలను వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో విగ్రహాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తూనే ఉన్నారని, మానవుడ్ని మహనీయుడుగా, మానవత్వ సమానత్వ స్వరూపుడుగా తీర్చిదిద్దడంలో జగద్గురు పాత్ర పోషించిన కారణజన్ములు శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని, వారికి సముచిత స్థానాన్ని ఏ మాత్రం ఆయన కల్పించలేక పోతున్నారన్నారు. ఇది ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి అని ఆయన విమర్శించారు. తమకు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేదని, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే ఎవరికైనా తాము అండదండలు, ఆధ్యాత్మికపరంగా అందజేస్తామని స్వామీజీ వివరించారు. శంకరభగవత్పాదుల వలనే మన భారతదేశం, ఇనే్నళ్లుగా ధర్మభూమిగా వర్ధిల్లుతోందని ఆదిశంకరులు లేనిదే ఈ పవిత్ర భారతదేశం లేనేలేదని స్వామీజీ గట్టిగా నొక్కిచెప్పారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు హైందవ ధర్మానికి కలిగినప్పటికీ శంకరుల ఆద్వైతామృతవర్షం అపారంగా వర్షించబట్టే ఈ ఆటుపోట్లని ఎదుర్కొని కూడా ఇన్ని వసంతాలుగా ధర్మం సముద్ధరణ గావించబడుతోందన్నారు. ఆధ్యాత్మిక లోక జగద్గురువుగా, మహోన్నత శక్తిపీఠాల వ్యవస్థాపకులుగా ఈ దేశ ధర్మానికి కేంద్రబిందువైన శ్రీ ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే స్థలాన్ని కేటాయించాలని గతంలో తాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చామని, అయితే ఆయన ఏ మాత్రం ఈ విషయంపై దృష్టి పెట్టలేదన్నారు. ప్రభుత్వం స్పందించినా, స్పందించకపోయినా తాము అమరావతి ముఖద్వారమైన గుంటూరు నగరంలో 60 అడుగుల భారీ శ్రీ ఆదిశంకరాచార్యుల సుందర విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిశంకరాచార్య జయంతిని సెలవుదినంగా ప్రకటించి, జగద్గురువుకు నీరాజనాలర్పించాలని సభావేదికపై నుండి స్వామీజీ కోరారు. పలువురు ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు.

వేదమూర్తులను సత్కరించడంమన సంస్కృతి
వేదం జీవననాదమైన మన భారతదేశంలో యుగాలుగా వేద విద్వత్కోవిదులను సత్కరించడం, వారిని ఎల్లవేళలా సమాదరించడం ఉదాత్తమైన మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగమై విరాజిల్లుతోందని విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి తమ అనుగ్రహ భాషణలో ఉద్బోధించారు. శుక్రవారం నగరంలోని బ్రాడీపేట శ్రీ శంకరమందిరం-ఋగ్యజు స్మార్త పాఠశాల ప్రాంగణంలో జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా గురువందనం మధ్య వేడుకగా జరిగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులనుద్దేశించి స్వామీజీ తమ అభిభాషణ కొనసాగిస్తూ అద్వైతామృతాన్ని జగత్తుపై అపారంగా వర్షింపజేసిన మహనీయుడు, ఒక్కమాటలో చెప్పాలంటే అపర శంకరులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులేనన్నారు. వేదాలు, ఉపనిషత్తులు సర్వవాంగ్మయాలు, దైవదత్తమైన అనేక అంశాలు ఈనాడు అవిచ్ఛిన్నంగా ఈ పవిత్ర యజ్ఞ్భూమిలో పరిఢవిల్లుతున్నాయంటే దానికి ప్రధాన కారకులు శ్రీ ఆదిశంకరాచార్యులేనని స్వామీజీ గట్టిగా నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు సుప్రసిద్ధ వేద పండితులను స్వామీజీ విశాఖ శారదాపీఠం పక్షాన ఘనంగా సత్కరించారు. మహామహోపాధ్యాయ, విద్యారణ్య పండితులు, వయోవృద్ధులు బ్రహ్మశ్రీ విష్ణ్భుట్ల శ్రీరామమూర్తిని, ఆగమశాస్త్ర ప్రవీణ, సహస్రాధిక ప్రతిష్ఠాపనాచార్య బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకటప్పయ్య శాస్ర్తీలను చతుర్వేద ఘనస్వస్తి నడుమ స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి బంగారు అంగుళీకాలను బహూకరించి అనంతరం పట్టువస్త్రాలతో సత్కరించి, వేద పండితుల పట్ల తమకు గల అపారమైన గౌరవ ఆదరాభిమానాలను సభాముఖంగా చాటుకున్నారు. అంతకుముందు స్వామీజీ తమ పరివారంతో సహా విశాఖ నుంచి శంకరమందిరానికి చేరుకోగానే మందిర కార్యదర్శి బొడ్డుపల్లి దత్తాత్రేయశర్మ, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం కార్యదర్శి కోనేరు సతీష్, ప్రముఖ హోమియోవైద్యుడు డాక్టర్ ఓవి రమణ తదితరులు ఎదురేగి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ అంతరాలయంలోకి వెళ్లి శారదాపరమేశ్వరికి, పాలరాతి శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేసి మంగళ నీరాజనాలు అర్పించారు. సభలో శారదాపీఠ ధర్మాధికారి బ్రహ్మశ్రీ జి కామేశ్వరశర్మ, ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ కృష్ణశర్మ, కెటిఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె తిరుపతిరెడ్డి, దాత మర్రెడ్డి రామకృష్ణారెడ్డి దంపతులు, బ్రాహ్మణ సేవాసమితి కార్యదర్శి తుళ్లూరు ప్రకాష్, బృందావన వెంకన్న ఆలయ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, సంయుక్త కార్యదర్శి లంకా విజయబాబు, సభ్యుడు నాగేశ్వరరావు, గోరంట్ల వెంకన్న ఆలయ పాలకవర్గ ప్రధాన కార్యదర్శి మేడా సాంబశివరావు, దర్శనపు శ్రీనివాస్, సోషలిస్టు నాయకుడు మోదుగుల పాపిరెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.