గుంటూరు

ఆసుపత్రుల్లో మందుల కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 5: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే నేపథ్యంలో నర్సులుగా సేవలందిస్తున్న వారు రోగుల పట్ల మానవత్వంతో సామరస్యంగా వ్యవహరించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సూచించారు. శనివారం స్థానిక అమరావతి రోడ్డులోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో రూ. 20 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాలకు, 20 పడకల వసతిగృహానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 7.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీనియర్ రెసిడెంట్స్ వసతిగృహానికి, 10 కోట్లతో నిర్మించనున్న సర్వీసు బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. కోటి 25 లక్షలతో నిర్మించిన అనుసంధాన కారిడార్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో కామినేని మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో నర్సులు అందించే సేవ పవిత్రమైందన్నారు. రోగులతో సత్సంబంధాలు కలిగి, వారికి ప్రభుత్వాసుపత్రుల పట్ల నమ్మకం కలిగేలా ప్రవర్తించాలన్నారు. 24 గంటలూ రోగులను కాపాడే నర్సులు సేవకు మారుపేరుగా నిలుస్తారన్నారు. సేవలు అందించే విషయంలో నర్సుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అవసరమైన మందుల విషయంలో ఎటువంటి కొరత లేదన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్టవ్య్రాప్తంగా 28 మంది మాత్రమే ఆరోగ్య, ఆహార తనిఖీ అధికారులు ఉన్నారని, మరిన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలు తినే ఆహారంలో ఎటువంటి కల్తీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు నూతన రాజధాని అమరావతిలో అధునాతన ఆసుపత్రులు రానున్నాయని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ ప్రజలకు అధునాతన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం, భరోసా కలిగేలా వైద్యాధికారులు, సిబ్బంది పనిచేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ రోగులకు వైద్య సేవలు అందించడంలో నర్సులకే కీలకపాత్ర అని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కూనం మాలకొండయ్య, బోనబోయిన శ్రీనివాసయాదవ్, యలమంచలి రాజారవు, డాక్టర్ రాజు నాయుడు, సుబ్బారావు, నర్సింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

పోలీసు రిక్రూట్‌మెంట్‌కు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 5: పోలీసు రిక్రూట్‌మెంట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాల వద్దకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ నుండి పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడపటంతో పాటు హెల్ప్‌డెస్క్‌లను ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ ఫ్లాట్‌ఫారంపై ఏర్పాటు చేశామని, అభ్యర్థులు వినియోగించాలని సూచించారు. అభ్యర్థులకు మరింత సమాచారం అందించేందుకు 9959229869 నెంబర్‌ను అందుబాటులో ఉంచామన్నారు.

కల్తీ కారం వ్యాపారులపై కఠిన చర్యలు

* మన్నవ సుబ్బారావు
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 5: కల్తీ కారం వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయించి, కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం గుంటూరు మిర్చియార్డులో కారం మిల్లుల అసోసియేషన్, యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు మిర్చికి మంచి గుర్తింపు ఉందని, ఆ ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని గుర్తుచేశారు. కల్తీ సరుకు నిల్వచేసిన స్టోరేజీలపై కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడబోమన్నారు. కల్తీ వ్యవహారంలో అధికారుల పాత్ర ఉంటే ఎంతటి వారైనా చర్యలు తప్పవని స్పష్టంచేశారు. లైసెన్సుదారులు తమ మిల్లుల ప్రదేశాన్ని తెలియజేయడం లేదన్నారు. నిబంధనల ప్రకారం కల్తీకి పాల్పడరాదని, హానికరమైన సరుకును తయారు చేయరాదని, లైసెన్సు లేకుండా కారం మిల్లులు నడపరాదన్నారు. కారం వ్యాపారులు తమ పద్ధతులు మార్చుకోకుండా అక్రమమార్గంలోనే నడిస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో యార్డు కార్యదర్శి ఎం దివాకర్, సిబ్బంది తిరుమలరావు, శ్రీకాంత్, కారం మిల్లుల అసోసియేషన్ సభ్యులు కొండలరావు, అనిల్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుల సబ్సిడీ దరఖాస్తులు గాలికి...
* తీరు మార్చుకోని వ్యవసాయాధికారులు
పెదనందిపాడు, నవంబర్ 5: వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం మండల పరిధిలోని రైతులకు ప్రాణసంకటంగా మారింది. 33 శాతం సబ్సిడీపై ప్రభుత్వ పరంగా సరఫరా చేసే శనగ విత్తనాల కోసం రైతులు మండల పరిధిలో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏ గ్రామంలో అధికారులు వస్తారో ఎవరికీ అంతుపట్టని పరిస్థితిలో పంచాయతీల వద్ద పడిగాపులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ఈ క్రమంలో మండల పరిధిలోని వరగాని గ్రామ పంచాయతీ వద్ద విత్తనాల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నామంటూ వ్యవసాయశాఖ అధికారులు శనివారం ప్రకటనలిచ్చారు. దీంతో పదుల సంఖ్యలో రైతులు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకు రైతుల నిరీక్షణ అనంతరం ఎఒ గౌతమ్‌ప్రసన్న, ఎఇఒ వేణు తదితరులు రైతుల నుండి దరఖాస్తులు తీసుకున్నారు. అదే సమయంలో ఎడిఎ ఎన్ వెంకటేశ్వర్లు గుంటూరు నుండి వచ్చి రైతులను ఇబ్బంది పెట్టొద్దు, రాత్రి 7 గంటల వరకైనా దరఖాస్తులను పూర్తిగా తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చి వెనుదిరిగారు. అదే క్రమంలో రైతులు కూడా దరఖాస్తులు అందజేసి వెనుదిరిగిన అనంతరం ఆన్‌లైన్ పనిచేయడం లేదంటూ ఎఒ బృందం దరఖాస్తులను గాలికొదిలేసి వెళ్లిపోయారు. దీంతో కిటికీ నుండి సాయంత్రం 4 గంటల సమయంలో దరఖాస్తులు బజారులోకి వచ్చి పడటంతో రైతులు ఖంగుతిన్నారు. పంచాయతీ గదిలోకి వెళ్లిచూడగా ఎక్కడి దరఖాస్తులు అక్కడే చిందరవందరగా గాలికి రెపరెపలాడుతుండటంతో ఎవరి దరఖాస్తులు వారు ఏరుకోవడం మొదలుపెట్టారు. దాదాపు 250కు పైగా దరఖాస్తులు వదిలేసి వెళ్లడం వ్యవసాయ శాఖ పనితీరుకు అద్దంపట్టింది. శనగ విత్తనాలు పంపిణీ చేస్తారో, చేయరో ఎవరికీ అంతుపట్టనప్పటికీ దరఖాస్తులు తీసుకోవడంలో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. ఎడిఎ ఆదేశాలను సైతం ధిక్కరించిన కిందిస్థాయి అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన విత్తనాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రైతుల అభ్యున్నతే టిడిపి ధ్యేయం
క్రోసూరు, నవంబర్ 5: మండలంలోని అందుకూరు గ్రామంలో శనివారం జనచైతన్య యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్, జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అతిథులుగా హాజరయ్యారు. తొలుత బొడ్డురాయి సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. 50 లక్షలతో కూడిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ సబ్సిడీపై విత్తనాలు, తైవాన్ స్ప్రేయర్లు ఇతర వ్యవసాయ పరికరాలు కావాల్సిన వారు వెంటనే వ్యవసాయశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. రుణమాఫీ తెలుగుదేశం వల్లే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ సైదా, డిసి చైర్మన్ కూరపాటి సైదా, ఎంపిపి వల్లాల సుభాషిణి, ఎండిఒ శోభారాణి, ఎంఇఒ వెంకటేశ్వర్లు, చిలకా పెదబాబు, నలజాల కోటేశ్వరరావు, మార్కెట్‌యార్డు చైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేకహోదా
* పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి
క్రోసూరు, నవంబర్ 5: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని మాజీ మంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. మండల కేంద్రం క్రోసూరులోని కటకంవారి కళ్యాణ మండపంలో నియోజకవర్గస్థాయి విస్తృత స్థాయి సమావేశం పార్టీ నేత పక్కాల సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి జనచైతన్య యాత్రల పేరుతో చైతన్యం లేకుండా పేదవాడి నోటి కాడి ఎంగిలి మెతుకులు కూడా లాక్కుని తింటున్నారని, రుణాల మాఫీ పేరుతో రైతుల ఆత్మహత్యలకు తెలుగుదేశం పార్టీయే ప్రధాన కారణమైందని, డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేస్తామని చెప్పి చివరకు 10 వేలు కూడా ఖాతాలో చూపించలేదని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అవసరం ఎంతైనా ఉందని, గ్రామ గ్రామాల, ఇంటింటా సభ్యత్వ నమోదు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ టిటిడి బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ షరీఫ్, మల్లాది జాలయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ లక్ష్మిని త్వరలో అరెస్ట్ చేస్తాం

* ఐజి సంజయ్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, నవంబర్ 5: వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యకు కారకులంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని గుంటూరు రేంజ్ ఐజి సంజయ్ వెల్లడించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్బన్ ఎస్‌పి సెలవులో ఉండటంతో రూరల్ ఎస్‌పి నేతృత్వంలోనే 5 ప్రత్యేక బృందాలు రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. లక్ష్మిని అరెస్ట్ చేయడంలో పోలీసుల వైఫల్యం చెందారంటూ వస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. తమపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేవని, తాము నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నామన్నారు.

విద్యార్థులను క్రీడలవైపూ ప్రోత్సహించాలి: ఆర్కే
మంగళగిరి, నవంబర్ 5: విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోను రాణించే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సూచించారు. మండల పరిధిలోని నిడమర్రు జడ్‌పి హైస్కూల్‌ను శనివారం ఆయన సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సుమారు 3 గంటలపాటు గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే ప్రతి తరగతి గదికీ వెళ్లి పాఠశాలలో విద్య, క్రీడలూ, ఉపాధ్యాయుల గురించి, పాఠశాలకు కావాల్సిన వసతి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎంతో అదృష్ట వంతులని, స్నేహితులతో పాటు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను మరువలేరని ఆర్కే అన్నారు. అనంతరం పాఠశాలల్లో మొక్కలను పెంచేందుకు వివిధ రకాల విత్తనాలను చల్లారు. నవంబర్ 14వ తేదీ నాటికి పాఠశాలలో పలు వసతులు కల్పిస్తామన్నారు. ఎంపిపి పి రత్నకుమారి, సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపిటిసి సభ్యులు కె నాగరత్నం, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ బాజి, మునగాల మల్లేశ్వరరావు, సాగర్‌రెడ్డి, లలిత, ప్రధానోపాధ్యాయుడు ఎం లక్ష్మీనారాయణ, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి
* ఎమ్మెల్యే శ్రీ్ధర్
పెదకూరపాడు, నవంబర్ 5: గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ పేర్కొన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా శనివారం మండల పరిధిలోని పరస, 75 తాళ్లూరు గ్రామాల్లో ప్రజలతో యాత్రా కార్యక్రమాలు జరిగాయి. మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అర్తిమళ్ల రమేష్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుతగా పరస గ్రామంలో హిందూ శ్మశాన వాటికలు, సిసి రోడ్లకు శంకుస్థాపనలు నిర్వహించారు. స్థానిక మహిళలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల ఎస్సీ రుణం కింద ఇచ్చిన ఆటోను ఎమ్మెల్యే నడిపారు. 75 తాళ్లూరులో 3 శ్మశాన వాటికలు, 3 సిసి రోడ్లను అర్తిమళ్ల రమేష్, తెలుగు మహిళా కన్వీనర్ లీలావతి, ఎమ్మెల్యే తదితరులు భూమి పూజలు చేశారు. పిహెచ్‌సి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ్ధర్ ప్రసంగిస్తూ నూతనంగా ఏర్పాటైన కమిటీ చైర్మన్ కొల్లి వెంకటరెడ్డి (దత్తు) ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలకు ఆసుపత్రి ద్వారా నిబద్ధతతో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేస్తున్న ఎమ్మెల్యే శ్రీ్ధర్‌కు హారతులు పట్టారు. నూతనంగా ఎంపికైన చైర్మన్ వెంకటరెడ్డిని మండల కన్వీనర్ అర్తిమళ్ల రమేష్, ఎమ్మెల్యే తదితరులు సత్కరించారు. కార్యక్రమంలో ఎండిఒ కావూరి గీతారాణి, ఎంపిపి శివమ్మ, రామగోపాలరావు, గల్లా బాబు, యార్డు డైరెక్టర్ ఏటుకూరి బ్రహ్మయ్య, భాష్యం ఆంజేయులు, చెరుకూరి పుల్లయ్య, పోలురాజు, కాల్వ అప్పారావు, డిసి చైర్మన్ అప్పారావు, ఏటుకూరి వెంకటరత్నం, చెరుకూరి శంకర్, సాయిరెడ్డి, యార్డు డైరెక్టర్ ఆంజనేయరెడ్డి, వేమారెడ్డి, ప్రసాద్, కొల్లి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో స్వస్తవాహినికి శ్రీకారం
* నెలలో వారం రోజులు గ్రామాల సందర్శన
* ప్రభుత్వాసుపత్రుల్లో 28 శాతం పెరిగిన ఓపి సేవలు
* వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, నవంబర్ 5: రాష్ట్రంలో త్వరలో స్వస్తవాహిని కార్యక్రమాన్ని అమలు చేస్తామని, తద్వారా వైద్య, నర్సింగ్ విద్యార్థులు నెలలో వారం రోజుల పాటు గ్రామాలను సందర్శించి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్గిస్తారని వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం స్థానిక అమరావతి రోడ్డులోని జ్వరాల ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ గతంలో కంటే నేడు ప్రభుత్వాసుపత్రుల్లో 28 శాతం ఓపి, 79 శాతం మేర కాన్పులు పెరిగాయని చెప్పారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వౌలిక సదుపాయాల కల్పనతో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నియామకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. దోమలపై దండయాత్ర - పరిశరాల పరిశుభ్రతను సమర్థంవంతంగా అమలు చేయడం వల్ల డెంగ్యూ, మలేరియా జ్వరాలను నియంత్రించామన్నారు. డెంగ్యూ నిర్ధారణకు రాష్టవ్య్రాప్తంగా 52 వేల రక్తపరీక్షలు నిర్వహించగా, 98 శాతం వైరల్ ఫీవర్‌గా నిర్ధారణ కాగా, 2 శాతం మాత్రమే డెంగ్యూగా నిర్ధారణైందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు వైద్యశాలల్లో, ల్యాబ్‌లలో ఎక్కడైనా డెంగ్యూగా నిర్ధారణ జరిగితే వెంటనే ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ వైద్యశాలలకు తెలియపర్చాలని ఆదేశాలు జారీచేశామన్నారు. డెంగ్యూ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో 10 బెడ్స్‌ను కేటాయించామన్నారు. రాష్టవ్య్రాప్తంగా అనంతపురం జిల్లాలో మాత్రమే 4 డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కూనం మాలకొండయ్య, ఎపి మెడికల్ కౌన్సిల్ చైర్మన్ యలమంచలి రాజారావు తదితరులు పాల్గొన్నారు.

అక్రమాలను నిలదీస్తే సస్పెండ్ చేస్తారా
పొన్నూరు, నవంబర్ 5: స్థానిక మున్సిపాలిటీలో అధికార తెలుగుదేశం పాలకులు కొనసాగిస్తున్న అవినీతి, అక్రమాలు, దోపిడీ చర్యలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష వైసిపి కౌన్సిలర్లపై సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని నియోజకవర్గ వైసిపి కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ నిశితంగా విమర్శించారు. పట్టణంలోని 1వ వార్డులో గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శనివారం సాయంత్రం ఇక్కడకు విచ్చేసిన రావి వైసిపి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి బి రాజారావు నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఓ ప్రైవేటు సంస్థ పట్టణంలో కేబుల్ వ్యాపారం ఏర్పాటు చేసుకునేందుకు అయిన ఖర్చులకు ప్రభుత్వ సొమ్మును వినియోగింపజేసేందుకు పాలకవర్గం చేసిన యత్నాన్ని ప్రతిపక్ష వైసిపి సభ్యులు నిలదీస్తే వారిపై ఆగ్రహం వ్యక్తంచేయడం అణగదొక్కే చర్య అన్నారు. అవినీతిని ప్రశ్నించిన కౌన్సిలర్లను మహిళల్లా ప్రవర్తించాలని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్ వ్యాఖ్యానించడం ఆయన రాజకీయ దిగజారుడు తనాన్ని వెల్లడిస్తుందన్నారు. శాసనసభ్యుడి అప్రజాస్వామిక, దోపిడీ చర్యలను ఇకపై సహించబోమని, న్యాయ పోరాటం చేస్తామని రావి పేర్కొన్నారు. విలేఖర్ల సమావేశంలో వైసిపి నేతలు బి వేణుప్రసాద్, ఆకుల వెంకటేశ్వరరావు, వాహిదుల్లా, మొల్లా కరీమ్, గోపిశెట్టి నాగేశ్వరరావు, షఫైతుల్లా, కౌన్సిలర్లు షర్మిల, మూకిరి అనిలకుమారి, ఎం కమలమ్మ, నయింబాషా, శివనాగరాజు, మాణిక్యరావు, విజయకుమార్, సలీమాబేగం, గౌసియా తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని 1వ వార్డులో గడప గడపకు యాత్ర కొనసాగించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా బిజెపి నాయకుడు యామని శ్రీహరి శనివారం సాయంత్రం రావి వెంకటరమణ నేతృత్వంలో వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా శ్రీహరిని రావి బృందం శాలువాలతో ఆహ్వానించారు.