రాష్ట్రీయం

ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లకు తీపి కబురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 28: ఎపిఎస్‌ఆర్‌టిసిలో డబుల్ డ్యూటీలు చేసినందుకు డ్రైవర్లు, కండక్టర్లకు తక్షణమే ఇచ్చే నగదు చెల్లింపులను (స్పాట్ పేమెంట్) రూ.250ల నుండి రూ.350లకు, రూ.200ల నుండి రూ.300లకు పెంచినట్లు మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంస్థ కోసం ఎంతో నిబద్ధతతో అహర్నిశలు శ్రమిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లను ప్రోత్సహిస్తూ నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఐసెట్ కన్వీనర్‌గా రామ్మోహనరావు
విశాఖపట్నం, డిసెంబర్ 28: రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్-2016 కన్వీనర్‌గా కె రామ్మోహనరావు నియమితులయ్యారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి మంజూరు చేసిన ఉత్తర్వులను వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం రామ్మోహనరావు మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రామ్మోహనరావు గతంలో ఎయు రిజిస్ట్రార్‌గా, నాక్ కమిటీ సభ్యునిగా, రీసెర్చ్ ఫొరం కన్వీనర్‌గా వివిధ పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఐసెట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఎయు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రమూర్తి వచ్చే ఏడాది జూలైలో పదవీ విరమణ చేయనున్నారు.
ఏసిబికి చిక్కిన ఎక్సైజ్ సిబ్బంది
శ్రీకాకుళం, డిసెంబర్ 28: మద్యం దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసుకుని వస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లు శ్రీకాకుళం జిల్లాలో ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్పీ రంగరాజు సోమవారం తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పలాస పట్టణంలో ఒక్కో మద్యం దుకాణం నుండి 3 నుంచి 5 వేల రూపాయలు, ఒక్కో బారు నుండి 6 నుంచి 8 వేల రూపాయలు ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు వసూలు చేసి జిల్లా కేంద్రానికి వస్తున్నట్టు సమాచారం అందటంతో ఎసిబి అధికారులు శ్రీకాకుళం సమీపంలో పెద్దపాడు వద్ద కాపు కాశారు. అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఎక్సైజ్ అధికారుల వాహనం అక్కడికి రాగానే ఎసిబి అధికారులు దానిని ఆపి అందులో ఉన్న ఎస్‌ఐ సోమయాజులు శేషగిరిరావు, హెడ్ కానిస్టేబుళ్లు రామారావు, రాజశేఖర బాబు, కానిస్టేబుళ్ళు చిరంజీవులు, ధర్మరాజు, శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకొని సోదాలు చేయగా 85 వేల రూపాయలు లభించాయి.
కడప జైలు నుంచి ఖైదీల పరారీ
కడప, డిసెంబర్ 28: కడప సెంట్రల్ జైలులో అధికారుల కళ్లుగప్పి నలుగురు జీవిత ఖైదీలు పరారయ్యారు. సోమవారం జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన జైలు అధికారులు వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న దేవ, రవి, హనుమంతు, రామచంద్రలు ఒక నిచ్చెన సాయంతో జైలునుంచి పరారయ్యారు. అటెండన్స్ సమయంలో విషయం తెలుసుకున్న జైలుసిబ్బంది సూపరింటెండెంట్ గోవిందరాజులుకు విషయం తెలియజేయడంతో ఆయన వెంటనే గాలింపు బృందాలను రంగంలోకి దించారు. ఇటీవల కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్సనిమిత్తం చేరి ఒక ఖైదీ పరారయ్యాడు. అతడు ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. తాజా ఘటనతో కడప జైలు అధికారుల్లో ఆందోళన మొదలైంది. కడప సెంట్రల్ జైలులో సుమారు వందమందికిపైగా కరుడుగట్టిన నేరగాళ్లు ఉన్నారు.
విశాఖలో నేదునూరి సంగీత భాండాగారం
విశాఖపట్నం, డిసెంబర్ 28: సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి జ్ఞాపకార్థం విశాఖలోని రాజీవ్ స్మృతి భవన్‌లో సంగీత భాండాగారాన్ని ఏర్పాటు చేసినట్టు మాజీ ఎంపి, లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. సోమవారం విశాఖలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఒక సంగీత విద్వాంసుని పేరిట సంగీత భాండాగారం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమన్నారు. మద్రాసు మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాల్లో గత 54 ఏళ్లుగా నేదునూరి ఆలపించిన 31,400 కీర్తనలను అమెరికాకు చెందిన ఎల్ రాఘవన్ రికార్డు చేసి తమకు అందజేశారని ఆయన చెప్పారు. నేదునూరి 5000 గంటలు ఆలపించిన ఈ కీర్తనలలో ఏది కావాలంటే అది వినేందుకు వీలుగా స్మృతి భవన్‌లో 18 కంప్యూటర్లను ఏర్పాటు చేశామన్నారు. మద్రాసు మ్యూజిక్ అకాడమి కార్యదర్శి పప్పు వేణుగోపాల్, ఎల్ రాఘవన్‌లు వీటిని ఉచితంగా తమకు అందజేశారని చెప్పారు. నేదునూరి కాంస్య విగ్రహాన్ని కూడా ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేశామన్నారు. నేదునూరి సంగీత భాండాగారానికి మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఆయన ప్రారంభోత్సవం చేస్తారని వివరించారు.