రాష్ట్రీయం

గ్రేటర్‌పైనే గులాబి గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరుకే శంకుస్థాపనలు.. అసలు ఉద్దేశం ప్రచారమే
రేసులో వెనుకబడిన టిడిపి, బిజెపి, కాంగ్రెస్

హైదరాబాద్, డిసెంబర్ 24: ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఇంకా ప్రకటించలేదు. కానీ అధికార పక్షం మాత్రం నగరంలో ప్రచారంలో దూసుకు వెళుతోంది. పైకి అధికార కార్యక్రమాలు, శంకుస్థాపనలు అయినా అసలు లక్ష్యం మాత్రం గ్రేటర్ ఎన్నికల ప్రచారమే. నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీలు విస్తృతంగా శంకుస్థాపనలు చేస్తున్నారు. ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు శంకుస్థాపనలతోపాటు కాలనీల వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా కాలనీల్లోకి వెళ్లి కాలనీ అభివృద్ధి కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అక్కడి సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో చర్చించడం, రాబోయే రోజుల్లో విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టేది ప్రకటిస్తున్నారు. కాలనీల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కాలనీలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పాత నగరంలోనూ గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పర్యటిస్తున్నారు. ఇటీవల పాత నగరంలో ఆర్‌టిఏ కార్యాలయాన్ని ప్రారంభించి ఉర్దూలోనే ఉపన్యాసం ఇచ్చి కెటిఆర్ పాతనగరం వాసులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించారు. 18నెలల్లో ఎంతో అభివృద్ధి చేశాం, ఐదేళ్లు అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తాం అంటూ ఎన్నికల ప్రచారం తరహాలోనే ఉపన్యాసాలు సాగుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధానంగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి, బిజెపి, ఎంఐఎం పార్టీలు పోటీ పడతాయి. పాత నగరంలో ఎంఐఎంకు ఎదురులేదు. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ పాతనగరాన్ని ఎంఐఎంకు వదిలేసి మిగిలిన నియోజకవర్గాలపైనే దృష్టిసారించాయి. టిఆర్‌ఎస్ ఈసారి పాతనగరంలోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.
సంక్రాంతి సెలవుల సందర్భంగా ఎన్నికలు జరుగుతాయని తొలుత ప్రచారం జరిగింది. అయితే అలాంటి సూచనలు కనిపించడం లేదు. జనవరి 30 నాటికి ఎన్నికల తతంగం పూర్తి అవుతుందని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో కెసిఆర్ ప్రకటించారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది అంతు చిక్కకుండా ఉంది. డిసెంబర్ 30 వరకు మండలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తరువాతే ప్రభుత్వం నగరానికి సంబంధించి ఆస్తి పన్ను రాయితీ వంటి కొన్ని నజరానాలు ప్రకటించి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. సంక్రాంతికి ఎన్నికలు అంటే అప్పటికి రెండు వారాల వ్యవధి మాత్రమే ఉంటుంది. అది సాధ్యం కాదు కాబట్టి జనవరి చివర్లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోగా టిఆర్‌ఎస్ మాత్రం ఒక విడత నగరంలో ప్రచారం పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది.