గుంటూరు

డయల్ యువర్ ఆర్‌ఎంకు సమస్యల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), అక్టోబర్ 29: ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లోని ఆర్‌ఎం చాంబర్‌లో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి సమస్యలు వెల్లువెత్తాయి. వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసిన ప్రజలు, దివ్యాంగులు బస్సు పాస్‌లను ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, కాకుమానుకు బస్సు ఏర్పాటు చేయాలని, ఒంగోలు నుండి హైదరాబాద్‌కు వెళ్లే సర్వీసులకు రొంపిచర్ల వద్ద స్టేజ్ ఏర్పాటు చేయాలని, తెనాలి - ఎర్రగొండపాలెం సర్వీసును పునరుద్ధరించాలని కోరారు. రేపల్లె వయా కొల్లూరు, వేమూరు మీదుగా గుంటూరుకు బస్సు ఏర్పాటు చేయాలని, మాచర్ల-పిడుగురాళ్ల మధ్య తిరిగే ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్లు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపడం లేదని ఫిర్యాదు చేశారు. పిడుగురాళ్ల నుండి నరసరావుపేట రైల్వేస్టేషన్ ట్రైన్ లింకు సర్వీసులను ఏర్పాటు చేయాలని తదితర సమస్యలు, ఫిర్యాదులు, విజ్ఞప్తులు అందగా త్వరలోనే సమస్యలను పరిష్కరించడంతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి బదులిచ్చారు. అనంతరం అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజంట్లతో సమావేశమై శుభకార్యాలు, వివాహాల సమయంలో అద్దె ప్రాతిపదికన బస్సులను బుకింగ్ చేయాలని తద్వారా సంస్థ ఆదాయం పెరుగుతుందన్నారు. పంచారామాలకు ఏర్పాటు చేసిన బస్సులపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎటిఎంలు, షెడ్యూలు సిఐ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ర ప్రభుత్వాల
గారడీలతో ఆంధ్ర ప్రజలకు నష్టం
గుంటూరు (పట్నంబజారు), అక్టోబర్ 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గారడీలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని, విభజనతో నష్టపోయిన రాష్ట్రంపై నాడు మోదీ ఒక దెబ్బ వేస్తే, నేడు జైట్లీ మరో దెబ్బ కొట్టి వెళ్లారని అవగాహన సంస్థ సభ్యుల సమావేశం ఖండించింది. శనివారం ఉదయం 10 గంటలకు అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో నిరాశ మిగిల్చిన జైట్లీ అన్న అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న సంస్థ సభ్యులు జైట్లీ వల్లె వేసిన కాకి లెక్కలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమావేశంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఆర్‌వి సింగరయ్య మాట్లాడుతూ ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిడికెడు మట్టి, చెంబు నీళ్లు తెచ్చి మన ముఖాన కొట్టి వెళ్లగా శుక్రవారం జైట్లీ కొన్ని కాకి లెక్కలు రాష్ట్ర ప్రజలపై చల్లి ఢిల్లీ వెళ్లిపోయారని విమర్శించారు. రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడు ఎ హరి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత వరకు రాష్ట్రానికి ఇవ్వని సాయం ఆంధ్రప్రదేశ్‌కి చేశామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. విద్యావేత్త చంద్రయ్య మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సాయం నిధులకు చట్టబద్ధత ప్రకటిస్తారని అందరూ ఆశించారన్నారు. అయితే గత ఏడాది నుండి కేంద్ర ప్రభుత్వం వల్లె వేస్తున్న కాకి లెక్కలనే మరోసారి జైట్లీ చెప్పారన్నారు.

రోశయ్య ఒక చరిత్ర... దిక్సూచి
* శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు
వేమూరు, అక్టోబర్ 29: మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య జీవితం ఒక చరిత్ర అని, రాజకీయ నిఘంటువు, దిక్సూచి అని శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శనివారం సాయంత్రం వేమూరులోని శివాలయం సమీపంలో ఎన్‌టిఆర్ పురవేదిక వద్ద ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో రోశయ్యకు పౌర సన్మానం పండగ వాతావరణంలో జరిగింది. ముఖ్య అతిథి స్పీకర్ కోడెల మాట్లాడుతూ రాజకీయంలో అపర చాణిక్యుడు, భీష్ముడు అయిన రోశయ్య రాజకీయాల్లోకి వచ్చే వారికి దిక్సూచి అని, వార్డు మెంబర్ స్థాయి నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా చేపట్టిన పదవులన్నింటినీ వనె్న తెచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. 16సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత భారతదేశ చరిత్రలోనే రోశయ్యకు దక్కుతుందన్నారు. అలాంటి రోశయ్య వేమూరులో పుట్టడం ఈ గ్రామ, ప్రాంత వాసులకు సంతోషించదగ్గ విషయమన్నారు. మరో ముఖ్య అతిథి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ 34 సంవత్సరాల నుండి రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్న రోశయ్యతో రాజకీయ అనుభవాలు, అనుబంధాన్ని ఈ సందర్భంగా నెమరవేసుకున్నారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, బాపట్ల ఎంపి శ్రీరాం మాల్యాద్రి, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, జిడిసిసిబి చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, కృష్ణా పశ్చిమ డెల్లా చైర్మన్ మైనేని మురళీకృష్ణ, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జొన్నలగడ్డ విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు, వేమూరు ఎంపిపి చవ్వాకుల రాఘవరావు, వేమూరు సర్పంచ్ ఎం వానీరాజ్‌కుమార్, నన్నపనేని సుధాకర్, తెనాలి ఆర్‌డిఒ నరసింహులు నాయుడు, తహశీల్దార్ కోటిరెడ్డి, ఎండిఒ కొత్తపల్లి నరసింహారావు, వేమూరు సొసైటీ అధ్యక్షుడు గాజుల కృష్ణమూర్తి, పెరవలి సొసైటీ ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు రోశయ్యను మంచి వక్తగానూ, రాష్టప్రతి లక్షణాలు కల్గిన వ్యక్తిగానూ అభివర్ణించారు. తొలుత సర్వమత ప్రార్థనలు, ఆశీర్వచనాలు అందించి స్పీకర్ కోడెల చేతుల మీదుగా దుశ్శాలువాలు, వెండి కిరీటంతో రోశయ్యను ఘనంగా సన్మానించారు.
10 నుండి అమరావతిలో వారసత్వ పరంపర ఉత్సవాలు
అమరావతి, అక్టోబర్ 29: ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న, వారసత్వ నగరమైన అమరావతిలో నవంబర్ 10 నుండి 22 వరకు జాతీయ వారసత్వ పరంపర ఉత్సవాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ తెలిపారు. శనివారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాచీన హస్తకళలు అంతరించిపోకుండా వచ్చే తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడంతో పాటు వాటిని రక్షించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన హస్త కళాకారులు తయారు చేసిన వస్తువులను, తయారు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. దాదాపు 70 మంది హస్తకళాకారులు, చేనేత కళాకారులు ఈ ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొని వారి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచుతారన్నారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు హస్త కళలు, ప్రాచీన వస్తువులపై అవగాహన కలిగించి వారికి మన సంప్రదాయాలను తెలియజేస్తామన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అమరావతిలో గల హెరిటేజ్ కల్చరల్ సెంటర్‌లో నవంబర్ 14 బాలల దినోత్సవం నాడు ఉదయం 10 గంటలకు వారసత్వ విషయాలను బోధించడానికి మ్యూజియంలో స్కూల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన హస్త కళల అభివృద్ధి సంస్థ ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ వట్టికూటి హర్షవర్ధన్, అమరావతి వారసత్వనగర సలహాదారు గల్లా అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
14న అమరావతిలో మహా రుద్రాభిషేకం
నవంబర్ 14వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతిలోని ధ్యాన బుద్ధ ప్రాజెక్టు వద్ద లోక కళ్యాణార్థం మహా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ్ధర్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు పరమ శివునికి ప్రీతికరమైన విశేష పూజా ద్రవ్యాలతో పాటు పుణ్యనదీ జలాలతో శంఖ, ఢమరుక నాదాలతో, ఫస రసాలతో భస్మాభిషేకం జరుగుతుందని, సుమారు లక్ష మందికి పైగా భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నూతన రాజధాని నగర నిర్మాణం నిరాటంకంగా సాగాలని, ప్రజలందరూ సుఖశాంతులు, పాడి పంటలతో వర్థిల్లాలని కాంక్షిస్తూ మహా రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మహా రుద్రాభిషేకానికి సంబంధించిన గోడ పత్రికలను ఎమ్మెల్యేతో పాటు పలువురు నిర్వాహకులు ఆవిష్కరించారు.
ఆగమేఘాలపై అభివృద్ధి పనులు
గుంటూరు (కొత్తపేట), అక్టోబర్ 29: అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరుగులు తీయిస్తున్నారని రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. రాష్ట్ర టిడిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రానికి రూపురేఖలు తెచ్చేందుకు పరిపాలన భవనంతో పాటు 7 ప్రధాన రహదార్లకు శంకుస్థాపన చేయటం శుభ పరిణామమన్నారు. దీంతో పాటు గుంటూరు భూగర్భ డ్రైనేజి పథకాన్ని 545 కోట్లతో చేపడుతున్నారని, భవిష్యత్తులో గుంటూరు ముఖచిత్రం మారుతుందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని 360 కోట్లతో నిర్మించడంతో పాటు 7 ప్రధాన రహదార్లను జాతీయ రహదారితో అనుసంధానం చేయటం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణకు సిఎం మార్గదర్శకులయ్యారని తెలిపారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైతులకు పన్ను రాయితీలపై సానుకూల సంకేతాలు అందించడం హర్షణీయమన్నారు. రాజధానిలో 308 ప్రాథమిక పాఠశాలలు, 81 ఉన్నత పాఠశాలలు, 21 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. భూములివ్వని రైతుల నుంచి కూడా సమన్వయంతో సేకరణ జరపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. వైసిపి నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని టాపింగ్ చేయాలంటే చట్టం ఉంటుందని, అది కూడా కేంద్ర పరిధిలో ఉంటుందనేది వైసిపి నేతలు గ్రహించాలన్నారు. రాష్ట్రంతో పాటు జిల్లా అభివృద్ధికి సిఎం చేస్తున్న కృషి అనిర్వచనీయమన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్భ్రావృద్ధి, పేదల సంక్షేమం టిడిపి ధ్యేయం
మంగళగిరి, అక్టోబర్ 29: రాష్ట్భ్రావృద్ధి, పేద ప్రజల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయం ఎంఎస్‌ఎస్ భవన్‌లో శనివారం సాయంత్రం ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన అనుభవంతో అవిశ్రాంతంగా శ్రమిస్తూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతున్నారని, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన వివరించి వాటిని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లి అమలుచేయాలని, నవంబర్‌లో జరిగే పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేయాలని, కార్యకర్తల సంక్షేమాన్ని కూడా చూస్తున్న పార్టీ టిడిపియేనని ఆంజనేయులు అన్నారు. పార్టీ నాయకులు దండమూడి మనోజ్‌కుమార్, చావలి ఉల్లయ్య, కె శ్రీ్ధర్, ఈ పెంచలయ్య, బొక్కా నరసింహారావు, వంగా సాంబిరెడ్డి, ఆషాబాల, గాదె పిచ్చిరెడ్డి, వల్లూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. వేదికపై ఆంజనేయులును చిరంజీవి ఘనంగా సత్కరించారు.
నేరాల అదుపునకు పటిష్ఠ చర్యలు
చేబ్రోలు, అక్టోబర్ 29: అమరావతి రాజధాని నిర్మాణం నేపథ్యంలో నేరాలు అదుపు చేసేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. మండల పరిధిలోని నారా కోడూరు మెయిన్ సెంటర్‌లో శనివారం నూతనంగా నిర్మించిన పోలీసు చెక్‌పోస్టును ఆయన ప్రారంభించారు. చేబ్రోలు పోలీస్టేషన్ ఆవరణలో వనం - మనం కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన ఇంకుడుగుంతలో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో సివిల్ పంచాయతీలు, కౌంటర్ కేసులు పెట్టటం ఎక్కువగా జరుగుతున్నాయని, నారా కోడూరులోని వైన్స్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లుగా మారాయని, మండలంలో పేకాట, నేల టపాకాయల తయారీ జోరుగా సాగుతోందని విలేఖర్లు ఎస్పీ త్రిపాఠి దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఎస్పీ త్రిపాఠి వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు సౌత్ డిఎస్పీ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేకాట, నేల టపాకాయల తయారీ వంటి నేరాలు అదుపు చేయటం మీకు చేతకాకపోతే ప్రత్యేక నిఘా బృందాన్ని రంగంలోకి దింపుతానని సిఐ రవికుమార్‌ను హెచ్చరించారు. పలు కేసులలో నిందితులను పట్టుకోడంలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఎస్‌పి త్రిపాఠి నగదు రివార్డులు అందజేశారు. వట్టిచెరుకూరు మండల పరిధిలోని ముట్లూరులో ఇటీవల జరిగిన ఒక భారీ చోరీలో దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్‌ఐ అశోక్, చేబ్రోలు మసీదు సెంటర్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితులను పట్టుకోడంలో ప్రతిభ కనబర్చిన ఎస్‌ఐ ఆరోగ్యరాజు, ఎఎస్‌ఐ ఆరాద్యుల కోటేశ్వరరావుతో పాటు మరికొంతమంది పోలీసు సిబ్బందికి నగదు రివార్డులను ఎస్‌పి అందజేశారు. ఎస్‌పి త్రిపాఠి వెంట ఎఎస్‌పి బిపి తిరుపాల్ ఉన్నారు.
ఉద్ధృతమవుతున్న మెడికోల ఆందోళన
* మద్దతు పలికిన ఎమ్మెల్యే ముస్త్ఫా, విద్యార్థి సంఘాలు
* ప్రొఫెసర్ లక్ష్మి అరెస్ట్‌కు ఆదేశాలిచ్చాం : మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు, అక్టోబర్ 29: జిజిహెచ్ గైనకాలజీ విద్యార్థిని, వైద్యురాలు బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన ప్రొఫెసర్ ఎవివి లక్ష్మిని తక్షణం అరెస్ట్ చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న మెడికోల ఆందోళన రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. విధులను బహిష్కరించి వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. నగరంలో ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్, ఎస్‌పి కార్యాలయం, జిజిహెచ్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు, మానవ హారాలు నిర్వహిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. శనివారం అత్యవసర వైద్య సేవలను సైతం బహిష్కరించిన వైద్య విద్యార్థులు ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మెడికోలు ఆసుపత్రి పరిపాలనా కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా మెడికో విద్యార్థులతో కలిసి బైఠాయింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యార్థిని మృతికి కారకురాలైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. తక్షణం ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేయాలని ఎస్‌పిని ఆదేశించామన్నారు. సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విధులను బహిష్కరించడం మంచిది కాదని, ఆందోళన విరమించి రోగులకు వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఆందోళనపై మంత్రి కామినేని సీరియస్
అత్యవసర వైద్య సేవలను నిలిపివేసిన మెడికోలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఆందోళన చేయకుండా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ రాజునాయుడును ఆదేశించారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.
నేత్రపర్వంగా ప్రారంభమైన నరక చతుర్దశి, దీపావళి వేడుకలు
గుంటూరు (కల్చరల్), అక్టోబర్ 29: లోక కంటకులైన రాక్షసులను సంహరించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే తన అవతార లక్ష్యమని ప్రకటించిన సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అర్చించుకుంటూ రెండు రోజులపాటు జరిగే దీపావళి వేడుకలు నగరంలో శనివారం వేడుకగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా నగరంలోని వివిధ డివిజన్లలో శనివారం తెల్లవారుజాము నుంచి విశేష కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా నరకాసుర వధ వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటూ పలుచోట్ల పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు. బాల బాలికలు, చిన్నారులు, విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్ అగ్రహారం, సంపత్‌నగర్‌లో గల శ్రీ రామనామ క్షేత్రంలో నరక చతుర్దశిని పురస్కరించుకుని ప్రత్యేకంగా నరకాసురుని దిష్టిబొమ్మను తయారుచేసి శ్రీ సీతారామ విద్యాలయ విద్యార్థులు ఆ దిష్టిబొమ్మను కృష్ణ నామ స్మరణల మధ్య దగ్ధం చేశారు. బాలబాలికలు రాధాకృష్ణ, గోపికల వేషాలు ధరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ, సత్యభామ నామాలతో రామనామ క్షేత్ర ప్రాంగణం మార్మోగింది. కోలాటాలాడుతూ పోటీలు పడి నృత్యాలు చేశారు. అంతకుముందు నరకాసురుడ్ని వధించి, సర్వ లోకాలకు జయాన్ని, శుభాన్ని కలిగించిన శ్రీ కృష్ణ భగవానుడిని కీర్తిస్తూ క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ముఖ మండపం నుండి ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి క్షేత్ర ప్రాంగణంలో భక్తులు వెంటరాగా ఊరేగించారు. భోగసేవ జరిపారు. క్షేత్ర కార్యదర్శి రాగం రామపిచ్చయ్య, ఉభయ దాతలు, కమిటీ సభ్యుడు రామకృష్ణప్రభు, శ్రీ సీతారామ విద్యాలయ నిర్వాహకురాలు ఆర్‌వి లీలాసుందరి తదితరులు ప్రసంగిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని, దీప్తిని కలుగజేయాలనే లక్ష్యంతో పండగలను విద్యార్థుల సమక్షంలో నిర్వహిస్తున్నామన్నారు.