లోకాభిరామం

గురువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువులు అన్న మాటకు చీకటిని పారద్రోలుతాడని, మరొకటని నానా కష్టాలూ పడి నిర్వచనాలు చెపుతూ ఉంటారు. గురువులు అనే మాటకు దేశికులు అనే మరొక రూపం కూడా ఉంది. ఆ మాటకు అర్థం చెప్పుకుంటే, మరింత లోతుకు పోవచ్చు. మొత్తానికి దారి చూపించేవారు గురువులు అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. అమ్మానాన్న అసలు గురువులు. వాళ్ల వల్ల మనకు మన పేరుతో మొదలు మరెన్నో సంగతులు తెలుస్తాయి. ఆ తరువాత విద్యా గురువులు వస్తారు. విద్య అంటే అక్షరాలు, అంకెలు అన్న భావన మనలో బలిసిపోయింది. కానీ, బతకడానికి అవసరమయ్యే అన్ని తెలివితేటలూ చదువు కిందే లెక్క. ఇవి నేర్పించిన వాళ్లందరూ గురువులే.
రష్యాలో సుహోమ్లిన్‌స్కీ అని ఒక మామూలు బడిపంతులుగారు. ఆయన ఒక పుస్తకం రాశారు. అలాగని ఆయన రచయిత కాదు. పంతులుగా తాను ఏమి చేసిందీ ఆ పుస్తకంలో రాసిపెట్టాడాయన. పుస్తకం శీర్షిక ‘పిల్లలకే నా జీవితం అంకితం’. మన చుట్టుపట్ల ఈయనలాంటి పంతుళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లంతా పుస్తకాలు రాయలేదు. తమకు చేతనయిన మంచి పనులు మాత్రం చేస్తున్నారు. ఇంతకూ ఈ రష్యన్ పంతులుగారు ఏం చేశారు?
ఆయనను ఒక చిన్న పల్లెలో ఉద్యోగానికి వేశారు. అక్కడ ఎవరూ బడికి రావడంలేదు. సంగతి తెలుసుకుందామని ఆయన ఊరంతా కలియదిరిగాడు. బడికి రావలసిన పిల్లలు చాలామందే ఆ ఊళ్లో ఉన్నారు. అయితే వాళ్లంతా ఈసురోమంటూ అనారోగ్యంగా ఉన్నట్టు ఆయనకు కనిపించింది. తలిదండ్రులతో ఆయన మాట్లాడాడు. బడిలోకి వెళ్లినందుకు లాభం లేదని వాళ్లందరూ అనుకుంటున్నారని అర్థం చేసుకున్నాడు. కొంతమంది తలిదండ్రులను ఒప్పించి పిల్లల గుంపు తయారుచేసుకున్నాడు. వాళ్లను వెంటబెట్టుకుని ఊరి వెంట, అడవి వెంట తిరగసాగాడు. శ్రమ కారణంగా పిల్లలకు ఆకలి మొదలయింది. వాళ్లు బాగా తినసాగారు. ఆరోగ్యాలు పెరిగాయి. ఆట పాటలు నేర్చారు. అప్పుడో ఇప్పుడో చదువుకుంటున్నారు కూడా! తలిదండ్రులకు తమ పిల్లల తీరు మారినట్టు అర్థమయింది. సుహోమ్లిన్‌స్కీ మీద అందరికీ గౌరవం పెరిగింది. కథను సూక్ష్మంగా ముగిస్తే, ఆయనకు ప్రపంచమంతటా పేరు వచ్చింది.
మీరుగాని, నేను గాని ఒక్కసారి కళ్లు మూసుకుని మనకు బడిలో మొదలు, చదువు ముగిసేదాకా తెలిసిన, చదువు చెప్పిన గురువులను గుర్తు చేసుకుంటే, ఎవరు గుర్తుకు వస్తారు? ఒక్క క్షణం మీరీ ప్రయత్నం చేసి చూడండి. బాగా చదువుకుని, పండితులయి, బాగా చదువు చెప్పిన వారికన్నా, అందరితో కలిసిపోయి హాయిగా మాట్లాడుతూ మనలను మరో రకంగా ప్రభావితం చేసిన గురువులు ముందు గుర్తుకు వస్తారు. నాకు చటుక్కున మా హనుమంతరావుగారు మనోఫలకం మీద కనిపించారు. ఆయన మాకు చెప్పిన పాఠం కనీసం సబ్జెక్టు నాకు గుర్తులేదు. ఆయన మాత్రం గుర్తున్నారు. మా పల్లెటూరి బడిలో ఆయన పై ఊరి నుంచి వచ్చి, పని చేశారు. నిత్యం సైకిలు మీద రాగలిగిన దూరంలో ఆయన ఊరు లేదనుకుంటాను. ఊరి కమ్యూనిటీ హాలు పక్కన ఉన్న ఒక చిన్న గదిలో ఆయన కాపురం ఉండేవారు. మేము బడి ముగిసిన తరువాత ఆయన దగ్గరకు చేరేవాళ్లం. అక్కడ మాకు మరో రకంగా చదువు కొనసాగేది. ఆయన ఏం చెప్పారో నాకు జ్ఞాపకం లేదు. ఆయన చెప్పింది అప్పట్లోనే నాకు నచ్చిందని - మాకందరికీ అది బతుకులో భాగమయిందని మాత్రం గట్టిగా చెప్పగలను. అదుగో, మంచి గురువంటే ఆయనే!
తరువాత అప్పరస శ్యామసుందరరావుగారు నాకు గుర్తుకు వస్తారు. పల్లె వదిలి పాలమూరులో ప్రాక్టీసింగ్ స్కూల్లో చదువుతుండగా ఆయన హెడ్‌మాస్టర్‌గా వచ్చారు. నిజానికి ఒక్కనాడు కూడా ఆయన నేను చదువుతున్న క్లాసుకు పాఠం చెప్పినట్టు గుర్తు లేదు. కానీ, ఆయన బడిలో కార్యక్రమాలను నడిపించిన తీరు, మాట్లాడిన తీరు మొదలయినవన్నీ మమ్మల్ని అందర్నీ ప్రభావితులను చేశాయి. రావుగారు తరువాత ఎమ్మెల్సీగా పని చేశారు. అదేమోగాని, నాకు ఒక్క సంగతి గుర్తుంది. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో నాకు ఉపన్యాసంలోను, వ్యాస రచనలోనూ మొదటి బహుమతులు వచ్చాయి. ఆ సైన్స్‌ఫేర్ పక్కనే ఉన్న అమ్మాయిల బడిలో జరిగింది. బహుమతి ప్రదానం కూడా అక్కడే జరిగింది. ఆ సందర్భాన్ని మా బడిలో వాళ్లెవరూ చూడలేదు. మరుసటినాడు ప్రార్థన జరిగిన తరువాత, రావుగారు నన్ను అందరి ముందు నిలబెట్టి మరొకసారి ఆ బహుమతులను నాకు అందించి, నా గురించి నాలుగు మాటలు ఏవో అన్నట్టున్నారు. ఏమన్నారో నాకు గుర్తు లేదు. నా కళ్లలో నీళ్లు రావడం మాత్రం నాకు గుర్తుంది. ప్రోత్సాహం అంటే బహుశా అలాగుంటుంది. రావుగారు ఈ మధ్యనే పోయారు. అంతకు ముందు వారి అభిమానాన్ని మరీ అనుభవించే అవకాశం నాకు దొరికింది. గురువులంటే ఆ రకంగా గుర్తుంటారు. ఎక్కడో సంబంధం లేని చోట సంబంధం లేని విషయం గురించి సమావేశం జరిగితే, అక్కడికి ఆయన నన్ను పిలిపించి అందరికీ పరిచయం చేసి ఆదరించారు. అందువల్ల ఆయనకు అంగుళం కూడా లాభం లేదు. కేవలం అభిమానం ప్రదర్శించడానికి అది ఆయన ఎంచుకున్న మార్గం. నాకు ఆయన నిజంగా గురువుగా అంటే, మరీ ఎత్తయిన మానవుడుగా గుర్తుండడంలో ఆశ్చర్యం ఏముంటుంది?
ఇక మా వెనే్నటి వెంకటరత్నం మాస్టారు గురించి నేను ఏకంగా ఒక పుస్తకం రాయగలను. అసలు రాత అన్నది ఆయన ముందే మొదలయింది. అప్పటివరకూ రాస్తున్నదంతా అందరూ రాసే పద్ధతి. వెంకటరత్నంగారు రాసిన సైన్స్ టెక్స్ట్ పుస్తకాలు అప్పట్లో నాలుగవ తరగతి మొదలు పదో తరగతి దాకా రాష్టమ్రంతటా చదువుకున్నారు. పదవ తరగతి పుస్తకంలో ఫిజిక్స్‌ను గురువుగారు రాశారు. కెమిస్ట్రీ భాగాన్ని సుబ్బారావుగారనే మరొక మాస్టారు రాశారు. వీళ్లిద్దరూ ఎప్పుడూ నాకు నేరుగా పాఠం చెప్పినవారు కాదు. మా బడిలోనే పనిచేసేవారు. అంతమాత్రమే. అయితే, వెంకటరత్నంగారు నాన్నకు, మా బంధువులందరికీ చాలా మిత్రులుగా కొనసాగేవారు. మావాళ్లలో చాలామంది ఉపాధ్యాయులుగా ఉండడం అందుకు కారణం. రత్నం మాస్టారు మా వాళ్ల పొలాల పక్కనే కొంత పొలం కూడా కొని వ్యవసాయం చేసినట్టు గుర్తు. ఆయన గ్రంథ రచనకు నేను వ్రాయసకాడుగా పని చేశాను. అందుకొరకు నేను ఏకంగా వాళ్ల ఇంట్లో పిల్లలతోబాటు ఒకడుగా ఉండిపోయాను. బడి ఇద్దరికీ మామూలే. నేను త్వరగా ఇంటికి వస్తాను. ఆ రోజు రాయవలసిన అంశం గురించి ఇంగ్లీషు సోర్స్ పుస్తకాలలో నుంచి రెఫరెన్స్‌లను వెతికి కాగితం ముక్కలు పెట్టి ఉంచుతాను. గురువుగారు వచ్చి వాటిని ముందు పెట్టుకుని చెప్పడం మొదలుపెడతారు. నేను అదంతా రాయాలి. రాశాను కూడా. ఆ తరువాత ఎడిటింగ్‌లు, తగిన తతంగం జరిగింది. పుస్తకం సాఫు ప్రతి రాసే పని కూడా నా వంతే అయింది. మరొక అన్నయ్య అందులో భాగం పంచుకున్నాడు. మేము కష్టపడి తయారుచేసిన ఆ పుస్తకం ఎంపికయింది. చాలా రోజులపాటు అదే ప్రభుత్వ పాఠ్య పుస్తకంగా కొనసాగింది.
అప్పట్లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ అని ఒక సంస్థ ఉండేది. వాళ్లు వివిధ విషయాలను గురించి దక్షిణ భారత భాషలన్నింటిలోనూ పుస్తకాలు రాయించేవారు. మా మాస్టారుకు ‘్భమి కథ’ అన్న పుస్తకం అనువాదం చేయడానికి ఇచ్చారు. గురువుగారు ఫిజిక్స్ చదువుకున్నవారు. ఆ సబ్జెక్ట్ చాలా బాగా చెపుతారన్న పేరు ఉన్నవారు. ఈ భూమి కథ మాత్రం ఆయనకు నూరు శాతం తలకెక్కినట్టు లేదని నాకు తరువాత అర్థమయింది. మొత్తానికి మాటలు ఆయనవి, కాగితం మీద అక్షరాలు నావిగా అనువాదం పూర్తి చేశాం. పుస్తకం అచ్చయింది. దాని మీద సమీక్ష కూడా వచ్చింది. పుస్తకంలో లోపాలు ఆ సమీక్షలో నాకు కనిపించాయి. అప్పుడే గ్రంథ రచనలోని కష్టనిష్ఠూరాల గురించి మొదటి పాఠాలు మొదలయినట్టు నా అనుమానం.
పుస్తకం గురించి గురువుగారితో మాట్లాడినట్టే గుర్తుంది. ఆయన హాయిగా గలగలా నవ్వి ఊరుకున్నాడనీ గుర్తుంది. వెంకటరత్నం సారు అనే రత్నం మాస్టారుకన్నా సరదాగా బతికేవారు నాకీ ప్రపంచంలో కనిపించలేదు. మంచి మనుషులంటూ ఉంటే అట్లాగుంటారని నాకెందుకో అనిపిస్తుంది. పొద్దునే్న నేను వెళ్లేసరికి ఆయన ఇంకా నిద్ర లేవలేదు. నాన్నతోలాగే నాకు ఆయన దగ్గర కూడా అంతులేని చనువు. దోస్త్ అనే పద్ధతిలో నాకు ఈ పెద్దలు కూడా మిత్రులుగానే కనిపించేవారు. నేను వచ్చాను, తమరేమో ఇంకా పడుకున్నారు అనే పద్ధతిలో గోల చేసి పిలిచాను. ఆయన దుప్పటి కట్టుకుని బయటికి వచ్చారు. నేను గలగలా నవ్వి చేయితో చూపించి మరింతగా నవ్వాను. ఆయన నాకంటే గట్టిగా నవ్వారు. ఆ దృశ్యం నేను మర్చిపోలేను.
గురువుగారిని గుర్తు చేసుకుంటే, ముందుగా గురుపత్ని తరువాత వాళ్ల చిన్నబ్బాయి నా మనసులో మెదిలారు. చిన్నబ్బాయికి ఒకనాడు మనసులో పురుగు మెదిలింది. వాడు నాకు లక్ష్మీకాంతం కావాలి అని గోల మొదలుపెట్టాడు. మా జట్టులో లక్ష్మీకాంతం అని ఒక మిత్రుడు ఉండేవాడు. వాడి సంగతి చెపితే, వీడు కాదంటాడు. అదేమిటని వర్ణించి చెప్పమని అడగడం నా వంతయింది. చివరికి వాడికి కావలసింది ‘అయస్కాంతం’ అని మాకు అర్థమయింది.

కె.బి. గోపాలం