అంతర్జాతీయం

హెచ్-1బిపై కొత్త గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 8: అమెరికాలో హెచ్-1బి వీసాల గురించి భారతీయుల్లో మరో కొత్త గుబులు మొదలయింది. హెచ్-1బి వీసాలపై అమెరికా వచ్చిన విదేశీయుల జీవిత భాగస్వాములు కూడా అక్కడ పని చేయడానికి 2015లో అప్పటి బరాక్ ఒబామా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ‘సేవ్ జాబ్స్ యుఎస్‌ఏ’ అనే సంస్థ వాషింగ్టన్ డిసి అపీళ్ల కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఒబామా ప్రభుత్వం నిర్ణయాన్ని జిల్లా కోర్టు సమర్థించిన తర్వాత ఈ సంస్థతో పాటుగా అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని వాదిస్తున్న పలు సంస్థలు అపీళ్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కాగా, అపీళ్ళ కోర్టులో పిటిషన్ విచారణను 60 రోజుల పాటు వాయిదా వేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు కోర్టును కోరింది. కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా విచారణను 60 రోజుల పాటు నిలిపివేయాలని కోరుతూ అమెరికా న్యాయ శాఖ గత ఫిబ్రవరి 1న కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవడానికి తమకు వ్యవధి కావాలని ఆ పిటిషన్‌లో న్యాయ శాఖ కోరింది. దీంతో హెచ్-1బి వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోనని విదేశాలనుంచి వలస వచ్చిన వారు ముఖ్యంగా భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ హెచ్-1బి వీసాలపై వచ్చిన వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కాగా, వేలాది మంది హెచ్-1బి వీసాహోల్డర్ల తరఫున ఈ కేసులో జోక్యం చేసుకోనున్నట్లు ‘ఇమిగ్రేషన్ వాయిస్’ అనే సంస్థ ప్రకటించింది. అమెరికా పౌరులయిన వలసదారులు, వారి కుటుంబాలు, పిల్లల హక్కులను రక్షించుకోవడానికి తమకు ఇది తప్ప మరో మార్గం లేదని ‘ఇమిగ్రేషన్ వాయిస్’ సహ వ్యవస్థాపకుడు అమన్ కపూర్ అంటున్నారు. హెచ్-1బి వీసాలపై అమెరికా వెళ్లే వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. హెచ్ 4-ఇఏడి వర్క్ పర్మిట్‌పై చాలా సంవత్సరాలుగా ఉద్యోగాలు,వ్యాపారాలు చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అమెరికా ప్రభుత్వపు ఇటీవలి ప్రకటనలు చూసినట్లయితే 60 రోజుల తర్వాత న్యాయ మంత్రిత్వ శాఖ హెచ్-1బి వీసాదారులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందేమోననే అనుమానాలు కలుగుతున్నాయని అమన్ కపూర్ అంటున్నారు. ఎన్నో ఏళ్ల పాటు పోరాడి సాధించుకున్న ఈ హక్కును ఇప్పుడు కోల్పోతామనే భయం వలసదారుల్లో కలుగుతోందని ఆయన అంటున్నారు. ఒక వేళ ట్రంప్ ప్రభుత్వం గనుక హెచ్-1బి వీసాదారులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న పక్షంలో వేలాది మంది వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులతో పాటుగా ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా అమెరికాలో పని చేసే పరిస్థితే ఉండదని అనేక ఏళ్లుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొంటున్న పలువురు అంటున్నారు.