అక్షర

హరిత రక్షణలో అరుదైన త్యాగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చమందారాలు
-కవితలు
-దాసరి నాగభూషణం
వెల-లేదు
ప్రతులకు: రచయిత- 8096511200

అటవీ రక్షణ కోసం తమ రక్తం ధారపోసి నేలమీది పచ్చదనాన్ని కాపాడిన అమర వీరులే ఈ ‘పచ్చమందారాలు’. సూర్యుడి, చంద్రుడి ద్విపాత్రాభినయం చేస్తూ హరిత వనాలకు అడ్డుగా తమజీవితాల్ని బెట్టి దుండగుల చేతిలో అశువులు కోల్పోయిన అటవీ శాఖ ఉద్యోగుల స్మృతిలో ఏటా అక్షర నివాళి అర్పించిన దాసరి నాగభూషణం పచ్చమందారాలుగా వాటిని సంపుటీకరించారు. నవంబర్ 10ని అటవీ అమరవీరుల దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1991లో ఈ రోజునే గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో పందిళ్లపల్లి శ్రీనివాస్ అనే ఉన్నతస్థాయి అధికారి అతి కిరాతకంగా హత్య చేయబడ్డాడు. ఆరోజును వీరి స్మారక దినంగా జరుపుకోవడం ఆనవాయితీ అయింది.
కవి చిత్రకారుడు అయిన దాసరి నాగభూషణం అటవీ శాఖలో కన్సర్వేటర్ స్థాయి అధికారి. ‘ప్రతి సంవత్సరం తడి ఆరని అటవీ అమరవీరుల వీరోచిత చర్యలను స్మరించుకున్నప్పుడల్లా నా అంతరంగంలో చెలరేగిన భావోద్వేగాలకు అక్షర రూపాలే గత తొమ్మిది సంవత్సరాలుగా రాసిన ఈ పదకవితలు’ అని తన మాటగా వీటిని పరిచయం చేశాడు.
హైదరాబాద్ జూపార్కులో వున్న అటవీ అమర వీరుల స్మారక స్థూపం వద్ద అటవీ ఉధ్యోగుల గౌరవ వందనం సమర్పిస్తున్నట్టు వేసిన ముఖ చిత్ర రచన కూడా దాసరి నాగభూషణం కుంచె సృష్టియే.
అటవీ త్యాగశీలుర గొప్పతనాన్ని కీర్తిస్తూ వారి కుటుంబ సభ్యుల వేదనను సైతం తమ కవితల్లో తలుచుకున్నాడు.
‘వారి/ఆశయాల చుక్కల్ని పేర్చి/రంగుల ముగ్గుల్ని తీర్చి/వారి వారసుల కన్నుల్లో/వెలుగుల జ్యోతుల్ని నింపుతూ/నీరాజనాల నివాళులిద్దాం’ అనడం అటవీ శాఖ బాధ్యతలను గుర్తుచేస్తుంది.
‘మట్టి తల్లి ఒడిలో కలిసిపోయిన మాణిక్యాలు వారు/చిగురిస్తున్న ప్రతి మోడులో కనిపించే చిరస్మరణీయులు వారు’ అనే పంక్తుల్లో కవి రచనా పటిమ ప్రస్ఫుటమవుతుంది.
రంగుల్లో అందంగా తీర్చిదిద్దిన పదహారు పేజీల ఈ చిరుపుస్తకం నాగభూషణం కవితా శక్తికి, చిత్రకళా అనురక్తికి సాక్షిగా నిలుస్తుంది.

-బి.నర్సన్