భక్తి కథలు

హరివంశం - 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మహాముని ప్రీతుడై హిరణ్యకశిపుడికి ఆ విద్యను ఉపదేశించాడు. అయితే చంద్రుడు వచ్చి కలగజేసుకుంటే ఈ విద్య, దీని మాయా ప్రభావం పని చెయ్యవు అని ఆ మహర్షి హిరణ్యకశిపుడికి చెప్పాడు. అంతేకాకుండా ఈ మాయా విద్య హిరణ్యకశిపుడి సంతతి వారందరినీ రక్షిస్తుందని కూడా చెప్పాడు.
ఇప్పుడా విద్యనే మయాసురుడు దేవతలపై ప్రయోగించాడు. దీనితో ఇంద్రుడు హతాశుడై, బెగ్గడిల్లి వరుణుణ్ణి ఆశ్రయించాడు. వరుణుడు సముద్ర పతి కదా! అందువల్ల ఔర్వాగ్నిని అతడు అదుపు చేయగలడేమోనని ఆశించాడు ఇంద్రుడు. వరుణడప్పుడు, చంద్రుణ్ణి వచ్చి ఈ మాయా ప్రయోగానికి ప్రతీకారం చేయవలసిందిగా ప్రార్థించేట్లు ఇంద్రుడికి సలహా చెప్పాడు. ఇంద్రుడు చంద్రుణ్ణి వేడుకోగా చంద్రుడు భూమ్యాకాశాలమధ్య దిక్కులు తెలియకుండా, మిన్నూ మన్నూ కానరాకుండా ఛేదించటానికి అవకాశం లేని దట్టమైన మంచు కురిపించాడు.
రాక్షసులందరూ కకావికలై మూర్ఛల పాలైనారు. అదే అదనుగా వరుణుడు తన పాశాయుధాన్ని ప్రయోగించి రాక్షసులను నానా విధాల హింసించాడు. అయినా మయాసురుడు ఆశాభంగం పొందకుండా దేవతలపై ‘పార్వతి’ అనే మాయను ప్రయోగించాడు. ఈ మాయావిద్యను సృష్టించిన క్రౌంచుడు, మాయాసురుడి తనయుడే. ఇది ఎటు చూసినా పర్వతాలను సృష్టించే మాయ. అందువల్లనే దీనికి ‘పార్వతి’ అనే పేరు కలిగింది.
ఈ మాయా ప్రయోగంవల్ల సర్వదిక్కులలోనూ భయంకరమైన పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల శిఖరాలను చూస్తే ఎవరికైనా గుండెలు గుభేలుమంటాయి. గండశైల సంభాదితమైన ఆ పర్వత శిఖరాలపై ప్రళయకాల వాతూల సంచలితమై మహావృక్షాలు ఊగిపోతూ ఉంటాయి. ఆ శిఖర గుహలలోంచి క్రోధ ఘూర్ణితమైన సింహాలు, పెద్దపులులు వచ్చి మీద పడుతున్నట్టు దృశ్యాలు సాక్షాత్కరిస్తాయి. ఆ చెట్లు సమూలంగా ఎగిరి వచ్చి తమపై పడుతున్నట్లు భయం పుట్టిస్తాయి. సింహాలూ, పులులూ వచ్చి విహ్వలింపజేసి కరుస్తున్నట్లు గగ్గోలు కలిగిస్తాయి. ఈ మాయా ప్రయోగంతో చంద్రుడి, వరుణుడి ఆటోపం అణగిపోయింది. దేవతలు మళ్లీ దిక్కుదెసా తోచని వారైనారు. అందరూ వికలాంగులైనారు.
వాళ్ళ వాహనాలన్నీ నుగ్గునుగ్గైనాయి. అస్త్ర శస్త్రాలు తునాతునకలైపొయినాయి. ఒక్క విష్ణుదేవుడు తప్ప అందరూ పరాభవం పాలైనారు. అలసి సొలసి నానా బాధలనుభవించారు. అపుడు మహావిష్ణువు అగ్నిదేవుణ్ణీ, వాయుదేవుణ్ణీ పిలిపించి మీ అతుల పరాక్రమాన్ని విజృంభింపజేయండి అని కోరాడు. ఇక వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడై మయాసురుడు ప్రయోగించిన మాయను అంతమొందించారు. కకావికలం చేశారు. కాల్చారు. కూల్చారు. ప్రేల్చారు.
పర్వతాలన్నీ పొడి పొడి అయిపోయినాయి. మహావృక్షాలన్నీ భస్మమైనాయి. మాయా జీవజాలమంతా కూలిపోయింది. కాలిపోయింది. మయాసురుడు నిర్విణ్ణుడైనాడు. అతడి బలమంతా క్షీణించింది. అతడు పారిపోయినాడు. అతడి సైన్యాధిపతులంతా తోక ముడిచారు. యుద్ధం ముగిసింది. యథాపూర్వం లోకాలన్నిటా ధర్మం ప్రతిష్ఠాపితమైంది. ధర్మదేవత నాలుగు పాదాలతో విహరించింది. తాపసులకు ఎటువంటి విఘ్నాలూ లేకుండా పోయినాయి. వర్ణాశ్రమాచారాలు యథాపూర్వకంగా కొనసాగాయి.
అయితే రాక్షసుల పరాజయం, పరాభవం కాలనేమి అనే మహోదగ్ర రాక్షసాధిపతి సహించలేకపోయినాడు. రౌద్రమంతా మూర్త్భీవించినట్లైంది ఆ మహారక్కసుడి వాలకం.

-- ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు