భక్తి కథలు

హరివంశం - 79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి వాళ్ళు ఎన్ని ఆటంకాలు కలిగించినా మేము ఇక్కడ ఉండం. ఆయన మా పట్ల చూపే ప్రేమ, బుజ్జగింపులు, లాలింపులు, నవ్వులు, వేడుకలు, మేము ఎట్లా మరచిపోగలం!అని ఆక్రందించారు గోపికలు. ఆ రథం కంటి చూపు కానినంత మేరా చేష్టలుడిగి చూస్తూనే ఉండిపోయినారు.
అక్రూరుడప్పుడు మధురకు దారి తీసే రధ్యలో రథాన్ని వేగంగా నడిపించాడు. అప్పుడు మధ్యాహ్నమైంది. అప్పుడు రథాశ్వాలకు అలుపు తీరాలని, అక్కడి పచ్చి మేసి నీరుతాగి అవి ఉత్సాహం పొందాలని కాళింది నదిలోని శుభ్రమైన మడుగు దగ్గర తన రథం ఆపాడు. ఆ మడుగు ఒడ్డుననే ఒక కదంబ వృక్షం చల్లని నీడుస్తున్నది. ఆ కడిమి నీడలో రథాన్ని ఆపి ‘వాసుదేవా? ఈ పుణ్య నదిలో స్నానం చేసి, సంధ్యావందనాదికం నిర్వర్తించుకొని ఇప్పుడేవస్తాను. మీరు సుఖంగా ఇందులో ఉండండి ఈ కాసేపు అని చెప్పి అక్రూరుడు కాళింది మడుగువైపుకు వెళ్లాడు.
మళ్లీ ఈ పుణ్య నదీ స్నానం చేసే అవకాశం ఎప్పటికైనా లభిస్తుందా అని భగవత్ స్తోత్రతత్పరుడై ఆ నదిలో తనివితీర స్నానం చేస్తూ పరమ సంతోష చిత్తంతో ఒక మునక వేశాడు. అప్పుడు అక్రూరుడికి మహాద్భుతమైన ఒక దృశ్యం సాక్షాత్కరించింది. తాను రసాతలానికి చేరాడు. అక్కడ సహస్ర ఫణామండలి రత్న మణి మాణిక్య రోచులతో ఆదిశేషుడిపై శ్రీకృష్ణుడు ఆయనకు కనిపించాడు. ఆదిశేషుడు బలరామావతారంలో దృశ్యమానమైనాడు. అప్పుడు అక్రూరుడు మంత్ర పుష్పం పఠించాడు.
భగవత స్తోత్రాలతో ఆరాధించాడు. నీల నీరద శుభాంగుణ్ణి, కమలలోచనుణ్ణి ఆ విధంగా దర్శించటంతో హర్ష వివశ పులకిత గాత్రుడైనాడు అక్రూరుడు. మానసికపుష్పార్చన చేశాడు. షోడోశోపచారాలు సమర్పించాడు. శ్రీకృష్ణుడి చిరునవ్వు వెనె్నలలు తనను సంప్రీతుణ్ణి చేయగా తన పుట్టుక ధన్యమైనదన్న భావనతో యమున ఒడ్డుకు చేరి రథం వైపు చూశాడాయన. అప్పుడు ఆ అన్నదమ్ములిద్దరు అమితోత్సుకులై ఒకరినొకరు చూసుకుంటున్న దృశ్యం ఆయనకు పొడగట్టింది. తాను చేసిన పుష్పార్చన ఆ అన్నదమ్ముల పాద తలంలో అక్రూరుడు చూశాడు. ఇంత మహాద్భుతం తనకు అనుగ్రహించాడీ పరమ పురుషుడు, భక్త వరదుడు అని అక్రూరుడు పరవశుడై మళ్లీ నదిలోకి దిగి అఘమర్షణ జపం చేస్తూ కొంచెంసేపు నీటిలోనే నిమగ్నుడైనాడు. మళ్లీ ఆయనకు యమునా నదీ జలాలలో ఆదిశేషుడి సింహాసన స్వరూపడిగాను, దానిమీద అధివహించినట్లు కృష్ణుడూ ఇంకొకసారి సాక్షాత్కరించారు. ఇదేమిటి? ఇప్పుడే కదా నేను ఒడ్డుకు వచ్చి కృష్ణ, బలరాములను చూశాను.
ఈ నదీ జలంలోకి వీళ్లెట్లా వచ్చారు! అని అక్రూరుడు పరమ విస్మితుడైనాడు. సంభ్రమం చెందాడు. ఒడ్డుకు వచ్చి మళ్లీ రథాన్ని సమీపించాడు. యథాపూర్వం ఒకరిపట్ల ఒకరు చిరునవ్వులు చిందిస్తున్న కృష్ణ బలరాములు అక్కడ సుఖాసీనులై కనిపించారు అక్రూరుడికి.
అప్పుడు కృష్ణుడు అక్రూరుడిపట్ల ఆదర దరహాసావలోకనంతో ‘ఏమిటి ఇంత ఆలస్యం! ఏమేమి వింతలు కనపడ్డాయేమిటి యమునా జలాలలో. నీ వదనంలో అత్యంతాశ్చర్య సంభ్రాంతి కనపడుతున్నది’ అని అడిగాడు. అప్పుడు అక్రూరుడు పారవశ్య విభ్రమంతో మాటలు వెలువడలేదు. అపుడు అక్రూరుడు ఆనంద బాష్ప సంకలిత రుద్ధ కంఠుడై ‘దేవా! నీకు తెలియని వింతలేముంటాయి? నీవే గొప్ప ఆశ్చర్య ప్రభావ సంపన్నుడవు? నీకు తెలియని చోద్యాలు కూడా ఉంటాయా? నీవు రథం మీదనే అధివసించి నాకు యమునా జలాలలో కూడా నీ దర్శనం అనుగ్రహించావు.

ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు