క్రైమ్ కథ

దొంగ - పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీస్ కారు ఆరెగాన్ - కేలిఫోర్నియా సరిహద్దుల్లో ఉండగా యూనిఫాంలోని కార్డ్ పెట్రోల్ మీటర్లోని ముల్లుని గమనించాడు. అది ఇ(ఎంప్టీ)లోని దాదాపు ఎర్ర గీతకి ఆనుకుని ఉంది.
పక్కన కూర్చున్న టైలర్ వంక చూసి కార్డ్ చెప్పాడు.
‘పెట్రోల్ టేంక్ ఖాళీ’
‘నా పనీ అంతే. ఆహారం కూడా అంతే’ టైలర్ నవ్వి చెప్పాడు.
వెనక సీట్లో బ్రెన్నర్, ఫేలన్ కూర్చుని ఉన్నారు. వాళ్ల ఇద్దరి చేతులకి కలిపి రెండు బేడీలు వేయబడ్డాయి. వారి కళ్లు నిశితంగా చూస్తున్నాయి. చాలాసేపటి నించి తగిన అవకాశం కోసం వారు ఎదురు చూస్తున్నారు.
అకస్మాత్తుగా టైలర్ కారు డ్రైవ్ చేసే కార్డ్ చేతి మీద తట్టి చెప్పాడు.
‘అక్కడ చూడు’
కార్డ్ సుమారు వంద గజాల దూరంలో కుడివైపు ఉన్న తెల్లటి బిల్డింగ్‌ని, ఎర్రటి పెట్రోల్ పంపులని చూశాడు.
ఇనప స్తంభానికి కట్టిన ‘ఎడ్స్ సర్వీస్ - 24 గంటలు’ అనే వెలిసిపోయిన ఎర్ర బోర్డ్‌ని కూడా చూశాడు. అతను హైవేలోని ఎగ్జిట్ రేంప్ లోంచి కారుని ఆ పంపుల వైపు పోనించాడు. ఇంజన్ ఆపి కార్డ్ దిగబోతూంటే టైలర్ ఆపి చెప్పాడు.
‘గుర్తు లేదా? ఇది ఆరెగాన్. పెట్రోల్ మనమే పోసుకోకూడదు. అది రాష్ట్ర నిబంధన’
‘అవునవును’
ఆ బిల్డింగ్‌లోని ఆఫీస్ గదిలోంచి పల్చటి తెల్లటి జుట్టుగల ఓ వృద్ధుడు కారు దగ్గరికి వచ్చాడు.
‘అన్‌లెడెడ్ పెట్రోల్. టేంక్ ఫుల్ చేయి’ కార్డ్ కోరాడు.
‘అలాగే సర్’ ఆయన పోలీస్ యూనిఫాంలోని కార్డ్‌ని చూసి చెప్పాడు.
ఆయన నీలం కళ్లు వెనక సీట్లోని ఇద్దరు బందీలని చూసాయి.
‘మీరు నేరస్థులని రవాణా చేస్తున్నారా?’ ఆయన అడిగాడు.
టైలర్ అవునన్నట్లుగా నవ్వుతూ తల ఊపాడు.
‘నేను యుఎస్ మార్షల్‌ని. ఇతను నా గార్డ్. ఫెడరల్ కోర్ట్‌లో ప్రవేశపెట్టడానికి ఈ ఇద్దరు ఖైదీలని మేం శాన్‌ఫ్రేన్సిస్కోకి తీసుకెళ్తున్నాం’ కార్డ్ చెప్పాడు.
వెనక సీట్లోంచి ఫేలన్ ఆ ముసలతన్ని చూస్తూ చెప్పాడు.
‘నేను చెప్పేది వింటావా?...’
‘నోర్ముయ్ ఫేలన్’ టైలర్ తల వెనక్కి తిప్పి చురుగ్గా చూస్తూ చెప్పాడు.
‘టాయిలెట్లు ఎటున్నాయి?’ ఫేలన్ అడిగాడు.
‘నువ్వు అక్కడికి వెళ్లడం లేదు. నోరు మూసుకుని కూర్చో’ టైలర్ మళ్లీ అసహనంగా అరిచాడు.
ఫేలన్ ముసలతనితో ఏదో చెప్పబోయి మనసు మార్చుకున్నట్లుగా ఆగిపోయాడు.
ఆ ముసలాయన పెట్రోల్ పంప్ నించి గొట్టం తీసుకుని ఆ కారు పెట్రోల్ టేంక్ కేప్‌ని తీసి పెట్రోల్‌ని నింపసాగాడు. తర్వాత ఓ బట్టతో వచ్చి ఆ కారు ముందు అద్దాన్ని శుభ్రంగా తుడుస్తూ కార్లోని నలుగురినీ నిశితంగా చూశాడు. కార్డ్ ఆవలిస్తూ కళ్లు మూసుకుంటే, టైలర్ రియర్ వ్యూ మిర్రర్‌లోంచి ఫేలన్ని గమనిస్తున్నాడు. కారు టేంక్‌లోని పెట్రోల్ పడటం ఆగిపోయిన గుర్తుగా క్లిక్‌మన్న శబ్దం వినపడగానే ఆ ముసలాయన వెనక్కి వెళ్లి గొట్టాన్ని యధాస్థానంలో ఉంచి పెట్రోల్ టేంక్ మూతని బిగించాడు. తర్వాత డ్రైవర్ సీట్ వైపు వచ్చి వంగి అడిగాడు.
‘ఆయిల్ చెక్ చేయనా?’
‘వద్దు. అది బానే ఉంది’ కార్డ్ జవాబు చెప్పాడు.
‘పనె్నండు డాలర్ల పదకొండు సెంట్లు. క్రెడిట్ కార్డ్ ఇస్తారా?’ ముసలాయన అడిగాడు.
కార్డ్ తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘కేష్’
జేబులోంచి పర్స్ తీసి పది, ఐదు డాలర్ల నోట్లని ముసలాయనకి ఇచ్చి చెప్పాడు.
‘చిల్లర ఉంచుకో’
‘రసీదు కావాలా?’ ఆయన అడిగాడు.
‘అవసరం లేదు. మేము తొందర్లో ఉన్నాం’ కార్డ్ చెప్పాడు.
‘అంత తొందర్లో లేం. తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?’ టైలర్ అడిగాడు.
‘గేరేజ్‌లో సేండ్‌విచ్ మెషీన్ ఉంది’
‘గేరేజ్ ఎక్కడ ఉంది?’
‘అవతలి వైపు. నేను చూపిస్తాను’
‘ఏమీ లేకపోవడం కన్నా ఇది మంచిది. నీకేం సేండ్‌విచ్ కావాలి?’ టైలర్ కార్డ్‌ని అడిగాడు.
‘ఏదైనా నాకు ఓకే. కాని త్వరగా రా’ కార్డ్ చెప్పాడు.
‘నాకు రై బ్రెడ్, హేం సేండ్‌విచ్ కావాలి’ ఫేలన్ వెనక సీట్లోంచి కోరాడు.
‘నిన్ను నోరు మూసుకోమని చెప్పినట్లున్నాను?’ టైలర్ అరిచాడు.
‘అంటే బ్రెన్నర్‌కి, నాకు తినడానికి ఏం ఇవ్వరా?’ అతను అడిగాడు.
‘ఊహు’
‘టైలర్! వెళ్లి మనకి సేండ్‌విచెస్ తీసుకురా. మనం చాలా దూరం వెళ్లాలి’ కార్డ్ తొందర చేశాడు.
టైలర్ కారు దిగి ఆ ముసలాయన వెంట ఆ బిల్డింగ్ పక్క నించి వెనక్కి నడిచాడు. వాళ్లు కనుమరుగయ్యాక కార్డ్ వెనక్కి తిరిగి ఫేలన్ని చూసి గట్టిగా అరిచాడు.
‘నోరు మూసుకుని కూర్చోలేవా?’
‘నేను కూడా నిన్ను అదే అడగాలని అనుకుంటున్నాను’ ఫేలన్ చెప్పాడు.
‘వాదన వద్దు ఫేలన్’ ఫేలన్ పక్కన కూర్చున్న బ్రెన్నర్ సూచించాడు.
కొద్ది నిమిషాల్లో ఆ ముసలతను ఒక్కడే చేతిలో గ్రీస్ మరకలున్న బట్టతో వచ్చాడు.
‘నా గార్డ్ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు. మేం తొందరలో ఉన్నామని మీ ఇద్దరికీ తెలీదా?’ కార్డ్ కోపంగా అడిగాడు.
‘నాకు తెలుసది’
ఆ ముసలాయన తన చేతిలోని బట్టని కింద పడేశాడు. దాని వెనక ఆయన చేతిలోని పాయింట్ 404 మేగ్నమ్ తన నుదుటికి గురి పెట్టి ఉండటం చూసి కార్డ్ నిశే్చష్టుడయ్యాడు.
‘అంగుళం కదిలినా నువ్వు చచ్చినట్లే’ డ్రైవర్ కిటికీ దగ్గర ఒంగొని కఠినంగా చూస్తూ చెప్పాడు.
ఫేలన్, బ్రెన్నర్ ఆసక్తిగా ముందుకు వంగి జరిగేది చూడసాగారు. కార్డ్ విగ్రహంలా కదలకుండా ఆ మేగ్నం వంక చూస్తూండిపోయాడు.
‘మీ బేడీల తాళం చెవులు ఎక్కడ ఉన్నాయి?’ ముసలాయన ఫేలన్ని అడిగాడు.
‘ఇగ్నీషన్ కీ రింగ్‌లో. కార్డ్ హోల్‌స్టర్లో రివాల్వర్ ఉంది జాగ్రత్త’ ఫేలన్ చెప్పాడు.
‘దాన్ని తీసే ప్రయత్నం చేస్తే తక్షణం వీడు మైనస్ తలతో ఉంటాడు. ఇది మేగ్నం’ ముసలాయన కార్డ్ మీద నించి దృష్టిని మరల్చకుండా చెప్పాడు.
తలుపు తెరచి వెనక్కి అడుగు వేసి చెప్పాడు.
‘నెమ్మదిగా చేతులు నెత్తి మీద ఉంచుకుని కిందకి దిగు. ఎదురు తిరుగుతావనే అనుమానం వస్తే కాల్చేస్తానని మర్చిపోకు. ముసలి వాడ్ని కాబట్టి నీకు ఎదురు తిరిగే అవకాశం ఇవ్వను’
కార్డ్ మేగ్నం వంకే భయంగా చూస్తూ, రెండు చేతులని రెండు చెవుల దగ్గర ఉంచుకుని నెమ్మదిగా ఆయన చెప్పినట్లే దిగాడు.
‘వెనక్కి తిరిగి కారుకి నీ ఛాతీని ఆనించి ఉంచు. కాళ్లు బాగా పక్కలకి చాపు. చేతులు వెనక్కి కట్టుకో. నీకా పొజిషన్ తెలుసు’
అతనా పని చేశాక ఆ ముసలాయన కార్డ్ వీపుకి మేగ్నం గొట్టాన్ని నొక్కి పెట్టి అతని బెల్ట్ హోల్‌స్టర్లోంచి పాయింట్ 38 రివాల్వర్‌ని తీసుకున్నాడు.
‘కొన్ని అడుగులు ముందుకి వెయ్యి. వెనక్కి తిరిగి చూడకు. పరిగెత్తకు’ ఆజ్ఞాపించాడు.
కార్డ్ ఆ ముసలాయన చెప్పినట్లే కొన్ని అడుగులు పక్కకి నడిచి ఆగాడు. అతని వెనక ముసలాయన కార్లోంచి ఇగ్నీషన్ కీ రింగ్‌ని తీసుకుని ఫేలన్‌కి ఇచ్చాడు. అతను ముందు తనవి, తర్వాత బ్రెన్నర్ చేతులకి వేసిన బేడీల తాళం తీసి విప్పతీశాడు. ఆ ఇద్దరూ కిందకి దిగాక ముసలాయన పాయింట్ 38ని ఫేలన్‌కి ఇచ్చాడు.
‘ఇంకొకడు బిల్డింగ్ వెనక ఉన్నాడు. అతను సేండ్‌విచ్ యంత్రం దగ్గర ఉండగా నేను ఆఫీస్ గదిలోకి వెళ్లి మేగ్నంని తీసుకుని దాంతో అతని తల వెనక కొట్టాను. అతను నేలకూలాక అతని రివాల్వర్ని తీసుకున్నాను.’
ఆయన ఆ రివాల్వర్ని బ్రెన్నర్‌కి ఇచ్చాడు.
‘వెళ్లి టైలర్ సంగతి చూడు’ ఫేలన్ ఆజ్ఞాపించాడు.
వెంటనే బ్రెన్నర్ తల ఊపి బిల్డింగ్ వెనక్కి పరిగెత్తాడు. ఫేలన్ బేడీలని ముసలాయనకి ఇచ్చాడు. ఆయన కార్డ్ చేతులకి బేడీలు వేశాడు. తర్వాత ఫేలన్ కార్డ్ జేబులు వెదికి తన పర్స్‌ని తీసుకుని జేబులో ఉంచుకున్నాడు.
‘నువ్వు ఇప్పుడు వెనక్కి తిరగచ్చు కార్డ్’ చెప్పాడు.
బ్రెన్నర్ తల వెనక ముసలాయన కొట్టిన చోట స్వల్పంగా గాయమైన టైలర్‌తో వచ్చాడు. అతని చేతులకి కూడా వెనక బేడీలు ఉన్నాయి.
కార్డ్, టైలర్లని వెనక సీట్లో కూర్చోపెట్టాక ఫేలన్ ముసలాయన భుజాన్ని కృతజ్ఞతగా పట్టుకుని చెప్పాడు.
‘మీకేం బదులు చేయగలం? మీరు మా ప్రాణాలని కాపాడారు’
‘అది నిజం. మేం వాషింగ్టన్ నించి వచ్చేప్పుడు వాళ్లు మమ్మల్ని కాల్చి మా శవాలని చెట్లలో పడేయాలని మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్లు అది తప్పక చేసి ఉండేవారు’
‘ఏం జరిగింది?’ ముసలాయన అడిగాడు.
‘మేం కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నాం. మేం ఈ ఉదయం కాఫీ కోసం ఆగాం. వాళ్లకి కూడా కాఫీ ఇచ్చి తాగడానికి బేడీలు విప్పాం. కార్డ్ వేడి కాఫీలని మా మొహాల మీద కొట్టి మా రివాల్వర్లని లాక్కున్నాడు.’
‘వీళ్లు దొంగలని మీకు ఎలా తెలిసింది? మీకు చెప్పడానికి వాళ్లు మాకు అవకాశం ఇవ్వలేదు. చెప్తే మిమ్మల్ని కూడా చంపి వెళ్తామని ముందే హెచ్చరించడంతో మీ ప్రాణాలు కాపాడాలని చెప్పలేదు’ బ్రెన్నర్ అడిగాడు.
ఆ ముసలాయన తన మేగ్నంని వర్క్ జాకెట్ జేబులో ఉంచుకుని చెప్పాడు.
‘చాలా విషయాల వల్ల తెలుసుకోగలిగాను. ఒక్కోటి అర్థరహితంగా కనిపించినా అవన్నీ కలిపి ఆలోచిస్తే నాకు జరిగింది అర్థమైంది. కొందరు ఫెడరల్ మార్షల్స్ ఖైదీలని తీసుకెళ్తూ ఇక్కడ ఆగుతూండటం పాతికేళ్లుగా చూస్తున్నాను. కార్డ్ తొందరపడటం నాకు చిత్రంగా అనిపించింది. మీ మణికట్లకి రవాణా చేయబడే ఖైదీలు ధరించే ప్లాస్టిక్ ఐడెంటిటీ బేండ్‌లు లేవు. నేను ఇంతదాకా అవి లేని ఏ ఫెడరల్ ఖైదీని చూడలేదు’
‘వాళ్లవి వాళ్లు పగలకొట్టడంతో పనికి రాకుండా పోయాయి’ బ్రెన్నర్ చెప్పాడు.
‘ఇంకోటి మిమ్మల్ని టాయ్‌లెట్‌కి వెళ్లనివ్వలేదు. తినడానికి కూడా ఏమీ ఇవ్వలేదు. సాధారణంగా మార్షల్స్ ఖైదీలని టాయ్‌లెట్‌కి వెళ్తారా?’ అని అడుగుతారు తప్ప అందుకు అభ్యంతరం పెట్టరు. పెట్రోల్ విషయంలో కూడా నాకు చిత్రంగా అనిపించింది. ఇంతదాకా ఏ మార్షల్ నగదుతో పెట్రోల్ బిల్‌ని చెల్లించలేదు. క్రెడిట్ కార్డ్‌నే వాడతారు. నగదుతో చెల్లిస్తే రీ ఇంబర్స్‌మెంట్ ఉండదని చాలామంది చెప్పారు. అలాగే ఏ మార్షల్ కూడా అంత టిప్ ఇవ్వరు. పైగా రసీదు వద్దనడంతో నా అనుమానం నిజం అని తెలుసుకున్నాను. యూనిఫారాలు వాళ్లకి వదులుగా ఉన్నాయి. మీ చర్మం ఎండలో తిరిగే వారి చర్మంలా ఉంటే, వాళ్ల చర్మం మాత్రం ఎండపొడ సోకని చర్మం కాబట్టి వాళ్లు జైల్లో చాలాకాలంగా ఉన్నారని, మీరు లేరని అర్థమైంది. కాబట్టి ఏం జరిగిందో గ్రహించాను.’
‘బ్రెన్నర్‌ది, నాది ఒకే అభిప్రాయం. ముసలితనంలో కూడా మీ మెదడు చురుగ్గా పని చేస్తోంది. అంతే కాకుండా చాలామంది పోలీస్ డిటెక్టివ్‌ల లోలా మీలో పరిశోధనా శక్తి ఉంది’ ఫెల్లన్ మెచ్చుకున్నాడు.
ఖైదీలు వెనక సీట్లో తలలు వంచుకుని ఉండగా వారి కారు ముందుకి సాగింది.
*
(జాక్ ఫాక్స్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి