క్రైమ్ కథ

ప్రయాణంలో ( విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికోలోని మలుపులు తిరిగే ఆ రోడ్లో ఆమె కారుని డ్రైవ్ చేస్తూంటే, అతను పక్క సీట్లో కునికిపాట్లు పడుతున్నాడు. అకస్మాత్తుగా ఆమె బ్రేక్ వేయడంతో అతను సీట్లోంచి ముందుకి కదిలి డేష్ బోర్డు మీద పడ్డాడు. అతను రోడ్డుకి అడ్డంగా పక్కన పొదల్లోకి పరిగెత్తిన ఆ జంతువుని చూశాడు. ఆమె వెంటనే చిన్నగా అరిచి అతన్ని అడిగింది.
‘ఆ కుక్కని చూశావా? దాని నోట్లో ఉన్నది ఏమిటి?’
‘మనిషి తల. అది ఎవరిదో? కారు పోనీ’
‘గార్డన్! ఆ మాట ఎలా అనగలిగావు?’ ఆమె పెద్దగా అడిగింది.
‘ఇలాంటి సందర్భంలో ఇంకేం చేయాలో నాకు తెలీదు’
‘వెళ్లి చూడు’
‘ఏన్! ఈ ప్రాంతానికి ‘లిటిల్ హెల్’ అనే పేరు ఊరికే పెట్టలేదు. ఇక్కడ నరసంచారమే ఉండదు’
‘కాని ఇక్కడ ఎవరో నివసించేవారు ఆ తల అందుకు రుజువు’
‘ఓ మనిషి ఉంటే ఇంకో మనిషి కూడా ఉంటాడు. అదే నా భయం’ గార్డన్ చెప్పాడు.
‘అంటే?’ ఏన్ అడిగింది.
‘ఆ తలని వేరు చేసిన వ్యక్తి చుట్టుపక్కల నక్కి ఉండచ్చు’
ఆమె కారుని ముందుకి పోనిస్తే కుదుపుకి గార్డన్ మళ్లీ ముందుకి కదిలాడు.
‘ఈ అద్దె కార్లన్నీ ఇంతే. క్లచ్‌ని తొక్కకు. ఇది ఆటోమేటిక్‌గా గేర్లు షిఫ్ట్ అయే కారు’
‘నేను కారు తోలేప్పుడు మాట్లాడద్దన్నానా?’ ఆమె విసురుగా చెప్పింది.
కారు ముందు భాగంలోని ఫెండర్‌కి ఓ ఎండిన ముళ్లపొద అతుక్కోవడంతో అది కీచుమంటూ శబ్దం చేసింది. కారు వేగంగా వెళ్తూంటే అటు, ఇటు ముళ్ల పొదల మీద హెడ్‌లైట్ల వెలుగు పడసాగింది. రోడ్డు మీది ఎండుటాకుల మీదకి కారు చక్రాలు ఎక్కినప్పుడల్లా అవి గలగల శబ్దం చేస్తున్నాయి.
‘కారు టైర్ అక్కడ పంచరవకుండా ఉంటే ఈపాటికి హోటల్‌కి చేరేవాళ్లం. ఈ మలుపుల్లో నేను చక్కగా డ్రైవ్ చేయాలంటే నువ్వు మాట్లాడకుండా ఉండాలి. లేదా క్షేమంగా చేరుకోలేం’ ఏన్ చెప్పింది.
‘మలుపుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఉంచితే బావుండేది’
‘ఇన్ని మలుపులు ఉంటే ఎన్నని పెడతారు? ఈ దేశం బడ్జెట్ మొత్తం అందుకే ఖర్చవుతుంది’
వెనక నించి అకస్మాత్తుగా లోహం నేలకి రాసుకుంటున్న శబ్దం వినిపించింది.
‘ఏమిటది?’ ఏన్ అడిగింది.
‘టెయిల్ పైప్’
ఆ శబ్దం ఆగిపోయింది.
‘అది పడిపోయింది. అది ముఖ్యభాగం కాదు. కారు నడుస్తుంది’ చెప్పాడు.
‘నన్ను డ్రయివ్ చేయనీవా?’
ఎదురుగా ఓ చెట్టుకొమ్మ రోడ్డు మీదకి విస్తరించుకుని కనిపించింది. అరంగుళం తేడాతో కారుపైభాగం దాన్ని తాకకుండా వెళ్లింది. అతను కారు ఏరియల్ వంగిందని గ్రహించాడు.
‘నెమ్మదిగా వెళ్లు. మనల్ని ఎవరూ తరమడం లేదు’
కారు కొద్దిగా వేగం తగ్గింది.
‘గుడ్ హెవెన్స్! మనిషి తల! ఓ కుక్క ఓ మనిషి తలని తీసుకెళ్తూంటే చూసి కూడా మనం ఏం చేయలేదు. మనం చాలా తప్పు చేశాం’
‘వెనక్కి వెళ్తావా?’ గార్డన్ అడిగాడు.
‘వెళ్దామా?’
‘కారుని వెనక్కి తిప్పేంత రోడ్ కాదిది’
‘సాకుల విషయంలో నువ్వు గొప్పవాడివి’ ఏన్ చెప్పింది.
అతను పైప్‌ని వెలిగించాడు. గత రెండు వందల మైళ్ల దూరంలో అది నాలుగోసారి అతను పొగాకు పైప్‌ని వెలిగించడం. కారులో పొగాకు వాసన అలుముకుంది.
‘నువ్వు సాకు అను. ఏదైనా అను. స్థానిక ప్రజలు అనాగరికులు. వారి మధ్య పోట్లాటని కత్తులతో పరిష్కరించుకుంటారు. స్థానిక అధికారులే ఇలాంటి వాటిలో కల్పించుకోవాలి’
‘అధికారులకి ఆ తల గురించి తెలీదు’
‘సరే. మనం వెనక్కి వెళ్దామనే అనుకుందాం. ఆ తలని తీసుకుని ఏం చేద్దాం? బీచ్ దాకా దాన్ని తీసుకెళ్దామా? హోటల్ రిసెప్షనిస్ట్‌కి ఇచ్చి దారిలో దొరికింది అని చెప్దామా? మనం సెలవులు పూర్తయ్యేదాకా అధికారులు మనల్ని సతాయిస్తారు. లేదా ఇంకా ఎక్కువకాలం’
‘నేను తల గురించి ఆలోచించడం లేదు. మొండెం గురించి ఆలోచిస్తున్నాను’
‘వాడికి ఆ తలని తిరిగి అమర్చలేం కదా?’
‘మొగ కాదు గార్డన్’
‘తలంతా దుమ్ము కొట్టుకుపోయింది. మొగో ఆడో ఎలా కనుక్కోగలవు?’
‘దానికి పొడుగాటి జుట్టు ఉంది’
‘ఈ రోజుల్లో అది లింగాన్ని సూచించలేదు’
‘చెవికి రింగుని చూశాను. జేడ్‌లోకి రాగి తీగని గుచ్చింది’
‘నువ్వు ఎక్కువ ఊహిస్తున్నావు ఏన్’
‘నేను ఏం చూశానో నాకు తెలుసు. ఆమె తెల్ల యువతి’

‘ఆమె చెంప మీద ఎన్ని పింపుల్స్ ఉన్నాయి?’
‘నాకు జోక్స్ వినే మూడ్ లేదు గార్డన్’
‘నాకూ చెప్పే మూడ్ లేదు. మనం వెనక్కి వెళ్తున్నామా? లేదు. ఎందుకంటే కారుని వెనక్కి తిప్పలేం. ఆ ప్రదేశాన్ని గుర్తించలేం కూడా. ఆ తర్వాత మనం వంద మలుపుల్ని తిరుగుతూంటాం. అన్నీ ఒకే రకంవి. మన కారులో సరిపడే పెట్రోల్ ఉందని కూడా నేను అనుకోను. ఈ కారుకి ఎంత మైలేజి వస్తుందో మనకి తెలీదు. కాబట్టి మనం వెనక్కి మళ్లడంలేదు. మనం హోటల్‌కి వెళ్లాక ఎవరైనా మాయం అయ్యారా అని రహస్యంగా విచారిద్దాం. ఒకవేళ అదే జరిగితే తల గురించి అప్పుడు చెబ్దాం. సరేనా?’
‘ఒకవేళ అది ఇందాకే జరిగి ఉంటే? అప్పుడు ఆమె మాయం అయిందని బయట పడటానికి కొంత సమయం పడుతుంది’
‘హోటల్‌కి వెళ్లాక ఈ విషయం మీద నన్ను హోటల్ వాళ్లతో మాట్లాడనీ. నువ్వు మాట్లాడక’
‘నాకు వారి భాష రాదు. కాబట్టి ఏం మాట్లాడగలను?’
‘నీకు ఇల్లు, స్కూలు, చర్చి, కుటుంబం తప్ప లోక వ్యవహారాలు తెలియవు’
కారుకి ఎడమ వైపు నించి కొత్త శబ్దం వినిపించసాగింది. ఆ శబ్దాన్ని కాసేపు విన్నాక అది ఫెండర్ వౌంటింగ్ అని, కారు ఆగిపోయే ప్రమాదం ఉందని గ్రహించాడు. లేదా ఈ రోడ్ మీద చిక్కుబడతారు. కారులో వేడిగా, ఉక్కగా ఉంది. దుమ్ము వల్ల కిటికీ అద్దాలని తెరవలేదు. ఐనా ఆ దుమ్ము లోపలికి ఎలాగో వస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు హోటల్‌లో గదికి వెళ్లి వేడినీటి స్నానం చేసి మంచం మీద పడుకుందామా అని గార్డన్‌కి ఉంది.
కారు ఎగిరిపడింది.
‘గార్టన్!’ అరిచింది.
‘ఈసారేమిటి?’ ఆమె కళ్లు విశాలం అయ్యాయని అతను గమనించి అడిగాడు.
‘అక్కడ పొదలోంచి బయటికి వచ్చిన ఓ పాదం నాకు కనిపించింది’
అతని గుండె కొట్టుకునే వేగం పెరిగింది.
‘ఎక్కడ?’ అడిగాడు.
‘ఇందాక ఎగిరిపడ్డ చోట’
‘మరి ఆపలేదే?’
‘ఏమో?’
‘బహుశా నీకు ఏ చెట్టు వేరో కనిపించి ఉంటుంది’
‘నేను పాదానే్న చూశాను’
‘ఎందుకీ అనవసర చర్చ? కారు ఆపి వెనక్కి పోనీ’ విసుగ్గా చెప్పాడు.
‘కారుని వెనక్కి తిప్పలేను’
‘నన్ను తిప్పమంటావా?’
‘ఉహు. మనం ఎంత త్వరగా ఈ రోడ్‌లోంచి బయటపడదామా అని ఉంది. మళ్లీ వెనక్కి వెళ్లడం నాకు ఇష్టంలేదు’
‘మరి ఎందుకు చెప్తావు?’ అనే ప్రశ్నని మనసులోనే అణచేశాడు. చీకటి పడక గదిలోకి వెళ్లడానికి భయపడే చిన్నపిల్లలా ఉందామె మనస్థితి అనుకున్నాడు. తను కూడా శాంతిగా లేడని అతనికి తెలుసు. కొన్ని మలుపుల దగ్గర అతనికి, పక్కనే మొండెంతో చేతిలో రక్తం ఓడే కత్తితో రోడ్డు మధ్య నిలబడ్డ అజ్‌టెక్ ప్రీస్ట్ కనిపిస్తాడనే ఊహ కలిగింది. కారు ఎత్తుకి ఎక్కుతూంటే అది అనేక రకాల శబ్దాలు చేసింది. మళ్లీ కిందకి దిగేప్పుడు అవి తగ్గాయి. పెట్రోల్ మీటర్ వంక చూశాడు. ఎనిమిదో వంతు మాత్రమే ఉందని ముల్లుని బట్టి గ్రహించాడు. కాని ఆ ముల్లు సరిగ్గా పని చేస్తోందా?
‘నువ్వు చెప్పింది బహుశా నిజం అయి ఉండచ్చు. అది చెట్టు వేరు అయి ఉండచ్చు’ ఏన్ చెప్పింది.
‘తల?’
‘కొబ్బరి బోండాం లేదా గుమ్మడికాయ’
కొద్ది క్షణాల తర్వాత మళ్లీ చెప్పింది.
‘ఇక్కడ గుమ్మడికాయ చెట్లు లేవు’
‘కొబ్బరి చెట్లు కూడా’ గార్డన్ చెప్పాడు.
‘లారీల్లో తీసుకెళ్తూంటే కింద పడిపోయి ఉండచ్చు’
‘జుట్టు ఎక్కడ నించి వచ్చింది?’ అడిగాడు.
‘కొబ్బరికాయలకి జుట్టు ఉంటుంది. బొండాం కాదు. కాయే’
‘జేడ్ రింగులు?’
‘గార్డన్! ఆపింక. మన సెలవులంతా ఆ విషయం చర్చిస్తూ గడుపుదామా?’ ఏన్ అసహనంగా చెప్పింది.
తన భార్యకి దారిలో మోచేతులు కనిపించకూడదని గార్డన్ దేవుణ్ని ప్రార్థించాడు. ఒంగిన చెట్టుకొమ్మని కారు దాటేదాకా దాన్ని చూసిన గార్డన్ అరిచాడు.
‘ఏన్! కారు ఆపు’
బదులుగా ఆమె వేగం పెంచింది. ఆమె వంక చూస్తే అటు, ఇటు చూడకుండా రోడ్డు మీదనే దృష్టిని కేంద్రీకరించి కనిపించింది.
‘ఏన్! ఆపు. మనం వెనక్కి వెళ్లాలి’ ఆమె మోచేతిని స్పృశిస్తూ చెప్పాడు.
‘నో’
‘ఏన్! అది కచ్చితంగా మనిషి చెయ్యి. నువ్వు కూడా చూసావా?’
‘చూశాను’ బలహీనంగా చెప్పింది.
‘మరి?’
‘ఇందాక నువ్వు చెప్పింది సబబైంది. మనం దీన్లో జోక్యం చేసుకోకూడదు’
‘నేను అప్పుడు అలా అనుకోవడం తప్పు. మనకి ఇష్టం లేకపోయినా సరే, ఇప్పటికే మనం ఇందులో జోక్యం చేసుకున్నాం. ఈ రోడ్డు మీద ఓ రాత్రి ఎన్ని కార్లు వెళ్తాయి? ఒకటి, రెండు మించవు. టైర్‌ని మార్చిన వారికి మనం ఈ రోడ్‌లో ప్రయాణించామని తెలుసు. మన వెనక వచ్చే కారులోని వాళ్లు ఆ చేతిని తీసుకుంటే? మనం వాళ్లకన్నా ముందే ఈ రోడ్‌లో ప్రయాణించామని పోలీసులకి తెలుసు. రోడ్డు మీద అంత స్పష్టంగా కనిపించే చేతిని చూసి ఎందుకు ఆపి దాన్ని తీసుకోలేదు? అని వాళ్లు మనల్ని ప్రశ్నిస్తారు. ఎందుకు రిపోర్ట్ చేయలేదు అని అడిగితే వాళ్లు నమ్మదగ్గ మన సమాధానం ఏమిటి?’ గార్డన్ తన క్లాసు విద్యార్థులకి పాఠం చెప్తున్న ధోరణిలో భార్యతో ఆ మాటలు చెప్పాడు.
‘మీరు వెళ్లి దాన్ని పొదల్లోకి తన్ని రావచ్చు’

‘అప్పుడు మనం ఓ నేరాన్ని కప్పిపుచ్చిన వారం అవుతాం’
‘ఐతే? అది ఎవరికి తెలుస్తుంది?’
‘మనకి తెలుసు’
‘నా మనస్సాక్షి నన్ను బాధించదు’
‘ఇది మనస్సాక్షికి చెందిన విషయం కాదు. బాధ్యతకి చెందిన విషయం’ గార్డన్ చెప్పాడు.
‘అది మన బాధ్యత కాదు’
‘మనదే అని నా నమ్మకం’
‘నేను ఒప్పుకోను. ఇది మన దేశం కాదు. వీళ్లు మన ప్రజలుకారు. వీరి భాషని కూడా మనం మాట్లాడం’
గార్డన్ కారులోని దీపం బటన్‌ని నొక్కాడు. ఆమె గాభరాగా అడిగింది.
‘గార్డన్! ఏం చేస్తున్నావు?’
అతను గ్లోవ్ బాక్స్‌ని తెరిచి టార్చిలైట్‌ని తీశాడు. తలుపు తెరిచి బయటికి దిగి, తన కళ్లు చీకటికి అలవాటుపడే దాకా ఆగాడు. పైన నక్షత్రాలు వెలుగుతున్నా, వాటి కాంతి ఆ చీకటిని ఛేదించలేకపోతోంది. అతను కారు వెనక్కి వెళ్లి నిలబడి శబ్దాన్ని విన్నాడు. ఎక్కడా ఏ శబ్దం వినిపించడంలేదు. కీచురాళ్ల ధ్వని కూడా. హంతకుడు చీకట్లో ఎక్కడైనా పొంచి తనని గమనిస్తున్నాడా? అతను కారు డిక్కీ తెరిచి అందులోంచి ఓ బలమైన రెంచ్‌ని తీసి భార్య కిటికీ వైపు నడిచాడు. ఆమె అద్దం దింపాక దాన్ని ఇస్తూ చెప్పాడు.
‘ఎందుకైనా మంచిది. దీన్ని నీ దగ్గర ఉంచుకో’
‘వెళ్దాం గార్డన్!’ అప్పటికే ఆమె మొహం పాలిపోయింది.
‘అద్దం ఎత్తి లోపల తలుపులు లాక్ చెయ్యి. ఇప్పుడే వస్తాను’
అతని బూట్ల చప్పుడు రోడ్డు మీద వినిపించసాగింది. తన కారుకి దూరం అవుతున్నాననే భయం ఓ మూల ఉంది. కాని కారు తలుపులని ఎవరూ బయట నించి తెరవలేరు అనుకున్నాడు. చాలా దూరం నడిచాననుకున్నాడు. ఆ చేతిని దాటేసాడా? భయపడే తన భార్య దగ్గరికి వెనక్కి వెళ్తే?’
ఆ చేయి టార్చిలైట్ కాంతిలో మెరుస్తూ కనిపించింది. ఆ చేతిగోళ్ల కింద హంతకుడి టిష్యూలు, రక్తం ఉండి ఉంటుందా? పోరాడి ఉంటాడా? అది పోలీసులు ఆలోచించాల్సింది అనుకున్నాడు. దాని దగ్గరికి వెళ్లి వొంగుని అందుకోబోతూ ఛటుక్కున ఆగాడు. చెవులు రిక్కించాడు.
ఏమిటా శబ్దం? క్రమక్రమంగా ఏదో శబ్దం తనకి దగ్గరవుతోందని గార్డన్ గుర్తించాడు. వెనక్కి కారు దగ్గరికి పరిగెత్తితే అనే ఆలోచన కలిగింది. రోడ్డుకి కొద్ది దూరంలో కారు ముందు వైపు నించి ఆ శబ్దం వస్తోంది. హెడ్‌లైట్ వెలుగు కనపడ్డాక అది ఓ వాహనం ఇంజన్ శబ్దంగా గుర్తించాడు. తమ కారు దానికి అడ్డంగా ఉంది. చేతిని వదిలి కారు దగ్గరికి పరిగెత్తాలా? లేక దాన్ని తీసుకుని వెళ్ళాలా? తక్షణం తన టార్చ్‌లైట్‌ని ఆఫ్ చేశాడు. తనతో తెచ్చిన పాతబట్టని ఆ చేతి మీద వేసి మృదువుగా దాన్ని తీసుకున్నాడు. కారు వైపు వేగంగా జాగింగ్ చేయసాగాడు. ఆ చెయ్యి బాగా బరువుగా అనిపించింది. ఐతే తను అంతకు మునుపు ఎన్నడూ తెగిన మనిషి చేతిని పట్టుకోలేదు. కాబట్టి దాన్ని బరువు ఎంతో తనకి తెలీదు. ఇంతే ఉండచ్చు.
ఆ వాహనం హెడ్‌లైట్లు ఇప్పుడు కారు మీద పడి డ్రయివింగ్ సీట్లోని ఏన్ ఆకారం కనిపిస్తోంది. పరిగెత్తి తలుపు తెరుచుకుని అరిచాడు.
‘జరుగు’
ఆమె పక్క సీట్లోకి జరిగాక గార్డన్ డ్రయివింగ్ సీట్లో కూర్చుని ఇంజన్‌ని స్టార్ట్ చేస్తూ అరిచాడు.
‘దేనికి ఆఫ్ చేసావు?’
‘దానంతట అదే ఆగిపోయింది’
‘గార్డన్ మూడుసార్లు ఇగ్నీషన్ కీని తిప్పినా స్టార్ట్ కాలేదు. కర్‌కర్‌మనే శబ్దాలు వినిపించాయి. చివరికి అది స్టార్ట్ అయింది. ఐతే ముందు నించి వచ్చే వాహనం హెడ్‌లైట్లని డిమ్ చేయకపోవడంతో ఆ కాంతి అతని కళ్లకి ఏం కనిపించకుండా చేస్తోంది.
‘రోడ్డుకి అడ్డంగా ఆపారు’ ఏన్ కీచుగా అరిచింది.
కారుని వెనక్కి పోనించాలనుకుని రివర్స్ గేర్ వేసి తలని వెనక్కి తిప్పి చూశాడు. అతనికి ఏం కనిపించకపోవడానికి ఓ కారణం ఇంకా కళ్లు సరిగ్గా చూడలేకపోవడం. ఇంకో కారణం వెనక లైట్లు వెలగకపోవడం. కారుని పోనిస్తే రోడ్డు దిగచ్చు. కింద లోయ.
అది ఎర్రరంగు పెద్ద లారీ అని గ్రహించాడు. దాని మీద రాసిన ‘ఎల్ టొరో డెల్ కెమినో’ అనే పదాలని చూశాడు. రోడ్డు ఆంబోతు అని అర్థం. అందులోంచి దిగిన ఆకారం చాలా లావుగా, ఆరడుగుల పైనే ఎత్తుగా ఉంది. గ్రీజ్ మరకలు అంటిన ఖాకీ పేంట్, రంగు తెలీని షర్ట్. అతని మెడకి ఎర్రటి మఫ్లర్ చుట్టి ఉంది. అతను గార్డన్ దగ్గరికి వస్తూంటే తను చూసిన కౌబోయ్ సినిమాలోని మెక్సికన్ గజదొంగ గుర్తుకువచ్చాడు. ఏన్ భయంగా తన భర్త మోచేతి చుట్టూ తన చేతిని పెనవేసింది.
‘ఆ రెంచ్‌ని నాకు ఇవ్వు’ ఆజ్ఞాపించాడు.
‘అతని బెల్ట్‌కి రివాల్వర్ ఉంది. చూశారా?’
‘నువ్వు మాట్లాడక’ ఏన్‌కి సూచించి అద్దం దింపాడు.
బయట వంగున్న వ్యక్తి తల అద్దానికి అతుక్కున్నట్లుగా దగ్గరగా ఉంది. అతను నవ్వుతో ఏదో మాట్లాడాడు.
‘అర్థం అయిందా?’ ఏన్ అడిగింది.
‘లేదు. స్థానిక మాండలీకం’
‘అర్థం కాలేదు. అమెరికానో’ గార్డన్ చెప్పాడు.
‘ఓ! అమెరికానో?’
అతను వెనక్కి అడుగు వేసి చేత్తో సౌంజ్ఞ చేశాడు.
‘వెళ్లమంటున్నాడా?’
‘లేదు. ఆగమంటున్నాడు’
అతను లారీ దగ్గరికి వెళ్ళి ఏదో బయటికి తీసి దాంతో మళ్లీ కారు ముందు నిలబడ్డాడు. దాన్ని చూడగానే ఏన్ చిన్న కేక పెట్టింది. గార్డన్‌కి అది పీడకలైతే బావుండును అనిపించింది.
అది మొండెం! ఆ స్ర్తి పొట్టకి బొడ్డు లేదు. తొడల మధ్య ప్రాంతంలో నున్నటి ప్లాస్టిక్ మెరుస్తూ కనిపించింది.
‘గార్డన్.. అది షాపుల్లో దుస్తులకి కట్టడానికి షోకేస్‌లో ఉంచే బొమ్మ కదా?’ ఏన్ ఆశ్చర్యంగా అడిగింది.
హెడ్‌లైట్స్ వెలుగులో ఆ డ్రయివర్ ఆ బొమ్మకి ఉన్న భాగాలు దారిలో పడిపోయాయని చూసారా అని సౌంజ్ఞలు చేస్తూంటే గార్డన్‌కి ఏడవాలో, నవ్వాలో తెలీలేదు.
‘కుక్క తీసుకెళ్లింది. కుక్క.. పెర్రో.. పెర్రో’ స్పానిష్ భాషలో చెప్పాడు.
అతనికి అర్థం కాకపోవడంతో మొరిగాడు.
‘ఆ.. పెర్రో! గ్రేసియస్. గ్రేసియస్’
నవ్వి సెల్యూట్ చేసి వెనక్కి పరిగెత్తి మళ్లీ లారీని ఎక్కాడు. గార్డన్‌ని వెళ్లమన్నట్లుగా చేతిని ఊపి మళ్లీ సెల్యూట్ చేశాడు. ఆ లారీ పక్కనించి గార్డన్ కారుని ముందుకి పోనించాడు.
ఐదారు నిమిషాలదాకా భార్యాభర్తల్లో ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు రోడ్డులో మలుపులు లేకుండా ముందుకి సాగుతోంది. దుమ్ము లేవడంలేదు. దూరంగా వెనె్నల్లో సముద్రం కనిపిస్తోంది. కుడివైపు హోటల్ లైట్లు కనిపించాయి. ఏన్ గొంతులోంచి ఏదో శబ్దం విని తలతిప్పి చూసి అగాడు.
‘అది ఏడుపా? నవ్వా?’
‘రెండూ’
‘నీకు నేన సిల్లీగా కనిపిస్తున్నానా?’
‘లేదు. ప్రమాదంలో కూడా నువ్వు ఎంతో ధైర్యంగా ప్రవర్తించావు. ఆగమని నువ్వు చెప్పింది కరెక్టే. ఒకవేళ మనం ఆపకుండా ముందుకి సాగి ఉంటే మనం జీవితాంతం తప్పు చేసామని బాధపడేవాళ్లం. ఆపకుండా ఎన్ని భయంకర ఆలోచనలు చేసాం! అన్ని మరణాలు హత్యలే అని, అందరు విదేశస్థులూ హంతకులే అని... నాకు ఒకటి అర్థం కాలేదు’
‘ఏమిటది?’
‘ఆ బొమ్మ చేతిని అతనికి ఎందుకు నువ్వు తిరిగి ఇవ్వలేదు?’
‘విదేశస్థుల గురించి మనం ఇంకోటి ఆలోచిస్తాం. వాళ్లు తెలివిహీనులని. ఓ శవాన్ని తీసుకోడానికి డమీ బొమ్మని చూపిస్తారని మనం ఊహించలేం’
ఏన్ చెయ్యి అతని చేతిని వెంటనే బిగుసుకుంది.
‘అంటే?’ భయంగా చూస్తూ అడిగింది.
‘అది నిజం చెయ్యి’ గార్డెన్ చెప్పాడు.

(ఛర్లెస్ డబ్ల్యు రున్‌యోన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి