క్రైమ్ కథ

దెయ్యపు ప్రేమ (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లౌడ్ క్రిస్పిన్‌కి మాత్రమే తన భార్య పట్టపగలు హత్య చేయబడిందని తెలుసు. ఐతే ఎవరూ ఆ హత్యని చూడలేదు. హంతకుడైన క్రిస్పిన్ అందరికీ అది ప్రమాదవశాత్తూ జరిగిన మరణం అని చెప్పాడు.
ఆ సరస్సు మధ్య నించి తన మోటర్ బోట్‌ని ఒడ్డుకి చేరుస్తూ, గట్టిగా అరుస్తూ చేతులు ఊపాడు. తన భార్య నీళ్లల్లో పడిందని రోదిస్తూ చుట్టుపక్కల వారికి చెప్పాడు. తక్షణం అన్ని పడవల్లో మనుషులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వేగంగా చేరుకున్నారు. అక్కడ నీళ్లల్లో ఈదే కుక్క వారికి కనిపించింది.
‘అది నా భార్య పెంపుడు కుక్క మోమో. అది నీళ్లల్లో పడితే దాన్ని కాపాడటానికి నా భార్య నీళ్లల్లోకి దూకింది’ క్రిస్పిన్ ఆవేదనగా చెప్పాడు.
ఒకరు మోమోని కాపాడి పడవలోకి తెచ్చారు. చాలామంది నీళ్లల్లోకి దూకి ఈదుతూ ఆమె కోసం వెదికారు. కాని కుక్క కనపడ్డట్లుగా అతని భార్య కనపడలేదు. ఇరవై నిమిషాల తర్వాత అలసిపోయిన వాళ్లు జీవించిన, లేదా మరణించిన క్రిస్పిన్ భార్య దేహం కనపడటం కష్టం అని నిర్ణయించుకున్నారు. క్రిస్పిన్ కళ్ల వెంట నీళ్లు సహజంగానే కారసాగాయి.
ఆ తర్వాత ఆమె దేహాన్ని కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసుల మీద పడింది. షెరీఫ్ ఆమె శవాన్ని వెదికి నీళ్లల్లోంచి వెలికితీసే ప్రయత్నం ఆరంభించాడు.
‘అసలేం జరిగింది?’ ఆ పని పురమాయించాక క్రిస్పిన్‌ని అడిగాడు.
‘ప్రతీ వేసవిలో అనేకసార్లు మేము సెలవలు గడపడానికి ఈ సరస్సుకి వస్తూంటాం. ఓ మోటార్ బోటుని అద్దెకి తీసుకుని సరస్సులో ప్రయాణిస్తూంటాం. నా భార్య అల్వినాకి నీరంటే భయం లేదు. కాని ఈత బాగా రాదు. ఆమెకి మోమో అంటే ఇష్టం. ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తుంది. అల్వినా అరుపులు విని నేను డెక్ మీదకి పరిగెత్తుకు వచ్చి చూస్తే నీళ్లల్లోంచి మొరిగే మోమో కనిపించింది. నాకు ఈత రాదు. మా ఆవిడ తక్షణం నీళ్లల్లోకి దూకేసింది. ఆ తర్వాత మళ్లీ కనపడలేదు’ క్రిస్పిన్ చెప్పాడు.
‘ఒక్కోసారి ఈత సరిగ్గా రాని వారు చల్లటి నీళ్లల్లో దిగితే చలికి కొంకర్లు పోయి ఈత కొట్టలేక మరణిస్తారు. అలా జరిగి ఉండచ్చు’ షెరీఫ్ చెప్పాడు.
అతనికి అసలు హత్య అన్న ఆలోచనే రాలేదు.
* * *
తన భార్యని వదిలించుకోగలిగినా క్రిస్పిన్ తన భార్యకి ఇష్టమైన మోమోని మాత్రం వదిలించుకోలేక పోయాడు. ఇంటికి వచ్చాక అది అల్వినా కోసం వెదికి ఏడవసాగింది. క్రిస్పిన్ దాన్ని కాలితో తన్ని చెప్పాడు.
‘అల్వినా పోయింది. కాని నువ్వు మిగిలావు’
అది దూరంగా పరిగెత్తుకెళ్లి నిలబడి అర్థం కానట్లుగా నిశ్శబ్దంగా చూస్తూండిపోయింది.
‘కొద్ది రోజులు నేను నిన్ను భరించక తప్పదు. అల్వినా పోయిన కొద్ది రోజులకే మళ్లీ నువ్వు పోతే అందరికీ నా మీద అనుమానం రావచ్చు. ఐనా నువ్వంటే నేను కృతజ్ఞతగా ఉండాలి. నీ కారణంగానే అల్వినా నీళ్లల్లోకి దూకిందని అంతా నమ్ముతున్నారు. నువ్వు బాగా ఈదగలవు కాబట్టి నిన్ను మరోసారి సరస్సులోకి విసరను. నువ్వు తినే హేంబర్గ్‌లో ఏదైనా కొద్దిగా కలిపితే నువ్వు మన తోటలో ఎరువుగా మారతావు’
అతను చెప్పే మాటలు అర్థంకాని మోమో నిశ్శబ్దంగా తోకాడిస్తూ చూస్తూండిపోయింది.
‘హలో క్రిస్పిన్’ ఓ కంఠం అకస్మాత్తుగా వినిపించింది. ఆ కంఠం సుపరిచితమైంది. అల్వినాది!
మొదట తను భ్రమ పడ్డానని అనుకున్నాను. తల తిప్పి తోకాడిస్తూ కుక్క చూసే వైపు చూశాడు.
అక్కడ అల్వినా నిలబడి కనిపించింది! తడి బట్టలతో, ఒంటి నిండా నాచుతో. ఈత దుస్తుల్లో లేదు. అంతకు మునుపు ఎన్నడూ వేసుకోని కొత్త దుస్తుల్లో, పౌడర్ రాసుకుని లిప్‌స్టిక్‌తో ఉంది!! ఆమె బంగారు రంగు జుట్టు, నీలం రంగు కళ్లు మెరుస్తున్నాయి.
‘క్రిస్పిన్! నేను హలో చెప్పాను. నువ్వు బదులు చెప్పలేదే?’ నవ్వుతూ అడిగింది.
తను కల కంటున్నానని క్రిస్పిన్ భావించాడు.
‘నువ్వు అయోమయంలో పడినట్లు ఉన్నావు. ఎందుకంటే నువ్వు మళ్లీ నన్ను చూస్తానని అనుకుని ఉండవు’
‘నువ్వు బతికే ఉన్నావా?’ అడిగాడు.
‘లేదు క్రిస్పిన్. నేను దెయ్యాన్ని’
వెంటనే క్రిస్పిన్ మోమో వంక చూశాడు. కుక్కలు దెయ్యాలని చూడగలవని, వాటిని చూసి పారిపోతాయని చిన్నప్పుడు నానమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది. కాని అది తోకని ఆడిస్తూ అల్వినా వంక ఆనందంగా చూస్తోంది.
‘నువ్వు నిజంగా దెయ్యానివా?’ నమ్మలేనట్లుగా అడిగాడు.
‘అవును. బతికున్న దెయ్యాన్ని కాను. చచ్చాక దెయ్యాన్ని అయ్యాను... నేను బతికుండగా నన్ను మనసులో దెయ్యం అని తిట్టుకునే వాడివిగా? పైగా నువ్వు నన్ను చంపేసావని గుర్తు లేదా?’ నవ్వింది.
‘అది ప్రమాదవశాత్తు జరిగింది’ యాంత్రికంగా అబద్ధం చెప్పాడు.
‘అది హత్య. నువ్వు నన్ను నీళ్లల్లోకి తోసి నా తలని నీళ్లల్లో ముంచి గట్టిగా పట్టుకున్నావు. నేను మరణించాక నన్ను వదిలేశావు’
‘ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేను నిన్ను చంపలేదు అల్వినా’ భయంగా చెప్పాడు.
‘డార్లింగ్! అది హత్య అని నాకు తెలుసు. నేను ఎక్కడ నించి వచ్చానో అక్కడి వారందరికీ కూడా ఇది తెలుసు. హత్య చేయబడ్డ వారే దెయ్యాలుగా మారతారు. ఇది నీకు తెలీదా?’
‘తెలీదు’
అల్వినా పకపకా నవ్వింది. ఆమె జీవించి ఉండగా నవ్వే లాంటి నవ్వే అది.
‘ఇది నీకు తెలిస్తే బహుశ నన్ను హత్య చేసేవాడివి కావేమో’
‘నిన్ను చూస్తే నాకు భయం వేస్తోంది. ననే్నమైనా చెయ్యడానికి వచ్చావా?’ క్రిస్పిన్ భయంగా అడిగాడు.
ఆమె వచ్చి అతని పక్కన కూర్చుంది. ఎప్పటిలా మంచం కిర్రుమనలేదు. ఆమె బరువు లేకుండా తేలిగ్గా ఉందని గ్రహించాడు.
‘నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావు?’ ధైర్యం తెచ్చుకుని అడిగాడు.
‘నిన్ను భయపెట్టడానికి రాలేదు. హత్య చేయబడ్డ వారికి మళ్లీ భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చాను తప్ప నిన్ను భయపెట్టటానికి రాలేదు. నిన్ను చూడాలని అనిపించి వచ్చాను. మనం అకస్మాత్తుగా విడిపోయాం. నీతో సావకాశంగా మాట్లాడే అవకాశం నాకు లేకపోయింది’
‘ఏం మాట్లాడాలి?’
‘ఉదాహరణకి మోమో. నన్ను ద్వేషించేందుకు నీకు కారణాలు ఉన్నాయి కాని ఈ అమాయక ప్రాణి మీద కూడా నీకు ద్వేషం దేనికి?’
ఇందాక తను మోమోతో మాట్లాడింది అల్వినా విన్నదని గ్రహించి అతను కొద్దిగా సిగ్గుపడ్డాడు.
‘నువ్వు లేకుండా మోమో ఆనందంగా ఉండలేదు’ చెప్పాడు.
‘నువ్వు ఆ ప్రయత్నం చేస్తే ఎందుకు ఉండదు? నీకు మొదటి నించీ మోమో అంటే ఇష్టం లేదు. అది నీ తప్పు కాని మోమో తప్పు కాదు. కుక్కలతో స్నేహం చేసుకోవడం చాలా తేలిక. ఇప్పుడు అది అనాథ. నువ్వు దాన్ని బాగా చూసుకుంటావని మాట ఇవ్వు క్రిస్పిన్’ అల్వినా కోరింది.
‘అలాగే. మాట ఇస్తున్నాను’
‘్థంక్ యు క్రిస్పిన్’
అల్వినా దెయ్యపు కళ్లు అతని వంక ప్రేమగా చూస్తూంటే ఇద్దరూ కొద్దిసేపు వౌనంగా కూర్చున్నారు.
‘నీకేం కావాలని వచ్చావు? కుక్క విషయంలో ఓ అంగీకారానికి వచ్చాం. నువ్వు తృప్తి చెందితే ఇక...’
స్నేహపూర్వక దెయ్యాలన్నా అతనికి భయమే. ఏ దెయ్యమైనా ప్రమాదకరమైందే అని అతని భావన.
‘మోమో విషయంలో ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. నువ్వు దాన్ని చక్కగా చూసుకుంటానన్నావు’
‘నువ్వు మరణించినందుకు అయాం సారీ’
‘బాధపడకు. నువ్వు విచారించడానికి కారణం లేదు. అర్హత ఉన్నదే నాకు లభించింది’ అల్వినా చెప్పింది.
‘నువ్వు అది నమ్మే చెప్తున్నావా?’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘అవును. నేను హత్య చేయబడటానికి కారణం మంచి భార్యని కాకపోవడమే’
‘కాని నేనా మాట ఎన్నడూ నీతో అనలేదు’
‘ఐనా అది నిజమే కదా? నేను జీవించి ఉండగా నాకు అది తెలీదు. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. నేను స్వార్థపరురాలిని. పొగరుబోతుని. నీతో తరచు పోట్లాట పెట్టుకునేదాన్ని. నేను కోరింది నువ్వు చెయ్యకపోతే గొడవ చేసేదాన్ని. అన్నిటికీ మించి నేను నిన్ను సరిగ్గా ప్రేమించలేదు. నా జాబితాని నువ్వు ఒప్పుకుంటావా?’
‘అవుననుకుంటాను’
‘మరి నువ్వు నన్ను చంపడంలో న్యాయం ఉందంటాను. అవునా?’
‘అల్వినా!’
‘అందువల్ల నువ్వు నన్ను చంపడం సబబని నాకు తెలుసు. ఐనా నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను’
అతను ఆమె వంక నమ్మలేనట్లుగా చూశాడు. అతని మనసులో చిన్న కదలిక. ఆమె అంటే భయం కొద్దిగా తగ్గింది. కళ్లు చెమర్చాయి.
ఆమె మాయమై పోయింది. మోమో ఆ గోడ నించి ఈ గోడ దాకా పరిగెత్తి తిరుగుతూ చూస్తూ ఏడవసాగింది.
* * *
‘నా అపార్ట్‌మెంట్‌లోకి ఆ కుక్కని తీసుకుని రాకు’ తలుపుకి అడ్డంగా నిలబడ్డ ఎల్సీ అరిచింది.
‘కాని డార్లింగ్. ఇది నా భార్య కుక్క. పరాయిది కాదు’ క్రిస్పిన్ చెప్పాడు.
‘అది నాకు తెలుసు. నాకు కుక్కలంటే ఇష్టం లేదు. నీ భార్యంటే అస్సలు ఇష్టం లేదు’ ఎల్సీ కోపంగా చెప్పింది.
‘కాని కుక్కని ఇంటి దగ్గర ఒంటరిగా వదల్లేను. దీని బాగోగులని ఇప్పుడు నేనే చూడాలి’
‘దీన్ని కూడా నువ్వు వదిలించుకోవచ్చుగా?’ ఎల్సీ ఇంకాస్త కోపంగా అరిచింది.
‘కాని నేను మాట ఇచ్చాను’
‘ఎవరికి?’
‘నా భార్యకి.. మనసులో. ఆమె మరణించాక మాట ఇచ్చాను. ఇక మన మధ్య ఆమె జోక్యం ఉండదు. స్వేచ్ఛగా మనిద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించచ్చు’
‘ఇద్దరం కాదు. ముగ్గురం. నువ్వు, నేను, నీ కుక్క’ ఆమె సరిదిద్దింది.
‘కాని ఇదివరకటి కంటే మన పరిస్థితి చక్కబడింది కదా? నన్ను లోపలకి రానీ’
ఆమె కొద్దిసేపు సందేహించి అతని వైపు తీక్షణంగా చూస్తూ పక్కకి జరిగింది. బెల్ట్ కట్టిన మోమోతో లోపలకి వచ్చి తలుపు మూశాడు. మోమో దానికి ఇష్టం లేనప్పుడు చేసే శబ్దాలని చేసింది.
క్రిస్పిన్ వెళ్లి ఎల్సీ పక్కన సోఫాలో ఆమెని ఆనుకుని కూర్చున్నాడు. ఆమె తక్షణం దూరంగా జరుగుతూ విసురుగా చెప్పింది.
‘ఇక్కడికి రావడానికి నీకు ఇప్పటికి తీరిక చిక్కిందా?’
‘డార్లింగ్! నేను భార్య పోయిన వాడిని. నీ దగ్గరకి వెంటనే వస్తే అంతా ఏమనుకుంటారు?’
‘మరీ మూడు నెలలా?’
‘నేను అతి జాగ్రత్తగా ఉండి ఉంటాను’ క్రిస్పిన్ చెప్పాడు.
‘బాగా అతి జాగ్రత్తగా’
‘నన్ను క్షమించు డార్లింగ్. జాగ్రత్త, నిన్ను చూడాలనే కోరికల మధ్య ఇన్నాళ్లూ సతమతం అయ్యాను’
‘కానీ నీ జాగ్రత్తే గెలిచింది’ ఎల్సీ కోపంగా చెప్పింది.
‘సరే. అది ఇప్పుడు ఐపోయింది. ఈ మూడు నెలలు మనం పోగొట్టుకుంది పొందుదాం’ క్రిస్పిన్ మళ్లీ ఆమె వైపు జరిగాడు.
‘నాకు మూడ్ లేదు’ ఎల్సీ దూరంగా జరుగుతూ చెప్పింది.
‘ఎల్సీ! నీ కోసం నేను ఏం త్యాగం చేశానో తెలీదు. చిన్న విషయానికి నువ్వు నన్ను క్షమించలేవా?’
‘నిన్ను దేనికీ క్షమించను. నాకు దూరంగా మూడు నెలలు ఉండగలిగావంటే నాకు నీ ప్రేమ మీద అనుమానం కలుగుతోంది’
అకస్మాత్తుగా మోమో మొరిగింది. క్రిస్పిన్ దాని వంక చూశాడు. దాని కళ్లు విశాలమయ్యాయి. తోకాడిస్తోంది. అది చూసిన వైపు చూస్తే తన ఎదురుగా కుర్చీలో కూర్చున్న అల్వినా కనిపించింది.
‘క్రిస్పిన్! నువ్వు నన్ను హత్య చేసింది ఈమె కోసమేనా?’ అడిగింది.
‘అల్వినా. నువ్వు ఇక్కడ...!?’
‘నువ్వు నన్ను నీ భార్య పేరుతో పిలిచావా?’ ఎల్సీ కోపంగా అడిగింది.
‘నిన్ను కాదు’ తడబడ్డాడు.
‘మరి ఎవరిని?’
‘క్రిస్పిన్ డార్లింగ్! ఆమెకి నేను కనపడను. కాబట్టి ఇక్కడ లేని మనిషితో నువ్వు మాట్లాడుతున్నావని, నీకు పిచ్చెక్కిందని ఆమె అనుకోకూడదు. నేను నిశ్శబ్దంగా ఉంటాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ పనిలో ఉండు’ అల్వినా దయగా చెప్పింది.
‘క్రిస్పిన్. అకస్మాత్తుగా నీకు ఏమైంది?’ ఎల్సీ అడిగింది.
‘ఏం లేదు. నేను కొద్దిగా అప్‌సెట్ అయ్యాను’
‘ఆమె నాకన్నా అందంగా ఉంది క్రిస్పిన్. నాలాంటిది కాదు. ఎక్కువ ఉత్తేజాన్ని ఇచ్చేదిలా ఉంది’ అల్వినా మళ్లీ చెప్పింది.
‘ఎల్సీ! నాకు ఒంట్లో బాలేదు. ఇంటికి వెళ్తాను’ లేచి చెప్పాడు.
‘ఇంటికా? మూడు నెలల తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి పావుగంట కూడా కాలేదు. అప్పుడే వెళ్తావా?’ ఎల్సీ ఆశ్చర్యంగా అడిగింది.
అల్వినా పెద్దగా నిట్టూర్చి చెప్పింది.
‘ఆమె తను కోరింది పొంది తీరాలనుకునే తరహా తప్ప నాలాంటిది కాదు. మగాళ్లకి అలాంటి ఆడవాళ్లు నచ్చుతారని నాకు తెలీదు. లేదా నేనూ అలాగే మసలుకునేదాన్ని’
‘క్రిస్పిన్! నువ్వు వెళ్లకు. లేదా మన మధ్య బంధం తెగిపోయినట్లే’ ఎల్సీ అతని చేతిని పట్టుకుని ఆపుతూ చెప్పింది.
‘కాని నీకు నా మీద కోపంగా ఉంది’
‘నిజమే. నువ్వు నన్ను క్షమాపణ వేడేదాకా నేను కోపంగానే ఉంటాను’
‘సరే. నన్ను మన్నించు. నా క్షమాపణలు... నన్ను క్షమించావా?’
‘అందుకు కొంత సమయం పడుతుంది. మూడు నెలలు నేను నీ కోసం ఎదురుచూస్తూ ఇక్కడ ఒంటరిగా గడిపాను. ఆ కోపం ఒక్క క్షమాపణతో పోదు’
‘ఆమె అంటే నీకు అంత ఆసక్తి కలగడానికి కారణం ఇలాంటి ప్రవర్తనేనా?’ అల్వినా తన భర్తని ప్రశ్నించింది.
‘కాదు. అందువల్ల కాదు’ క్రిస్పిన్ అరిచాడు.
‘క్రిస్పిన్! నా మీద అరవకు. అంతేకాక నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడంలేదు. మూడు నెలలుగా రాకుండా ఇప్పుడు వచ్చి, సరైన వివరణ ఇవ్వకుండా, పైగా అర్థంలేని మాటలు మాట్లాడుతున్నావు’ ఎల్సీ అరిచింది.
‘డార్లింగ్...’
‘నన్ను మభ్యపెట్టకు’
‘నీకు బహుమతులు కావాలా ఎల్సీ? ఏం కావాలో చెప్తే తెస్తాను. అంతే తప్ప నా మీద కోపం వద్దు. ఈ మూడు నెలలు నేను ఎలా గడిపానో నీకు అర్థం కాదు. అసలు నీ కోసమే...’
‘నువ్వు చేసిన దాంట్లో నా ప్రమేయం లేదు. అందులో నన్ను ఇరికించకు’ ఎల్సీ అరిచింది.
‘కాని నువ్వు కూడా ఇందులో ఉన్నావు’
‘లేదు. నేను లేను. అది నీ ఆలోచన. నువ్వొక్కడివే దాన్ని అమలు చేసావు’
‘కాని డార్లింగ్. దానికి నీ మద్దతు ఉంది. నన్నా పని చేయమని ప్రోత్సహించావు’
‘క్రిస్పిన్! నువ్వు ఇక్కడికి వచ్చింది నీలా నేను కూడా దోషిని అని చెప్పడానికైతే నువ్వు వెళ్లచ్చు’ ఆమె తన పడక గదిలోకి వెళ్లి చప్పుడయ్యేలా తలుపుని వేసుకుంది.
క్రిస్పిన్ ఆమె ప్రవర్తనకి నిర్ఘాంతపోయి చూస్తూంటే మోమో ఆనందంగా మొరిగింది.
‘పాపం! ఆమెలో కూడా అపరాధ భావన ఉంది. అందుకనే అప్‌సెట్ అయింది. సాధారణంగా ఆమె ఇలా ప్రవర్తించదు అనిపిస్తోంది. నువ్వు ఆమెతో నేను నినే్న కాక ఆమెని కూడా క్షమించానని చెప్పు’
క్రిస్పిన్ సోఫాలో కూలబడి చెప్పాడు.
‘్థంక్స్ అల్వినా! నువ్వు గొప్ప దయా స్వభావం కలదానివి’
‘ఆమె గురించి ఇప్పుడు నేను చూసింది ఆమె స్వభావమై ఉండకపోవచ్చు’ అల్వినా చెప్పింది.
‘కాదు. ఆమెకి తల పొగరు. పోట్లాడే స్వభావం. అత్యంత స్వార్థపరురాలు’ క్రిస్పిన్ చెప్పాడు.
‘కాని డార్లింగ్. నాలో నువ్వు లోపాలుగా చూసినవి ఇవే. జీవించి ఉండగా నాకీ విషయాలు తెలిస్తే బావుండేది. దెయ్యాలు తమని హత్య చేసిన వారికే కనపడగలవు. మాట్లాడగలవు. ఎల్సీ హత్యలో తోడ్పడలేదు. లేదా నీ గురించి నాకు తెలిసిందంతా ఆమెకి మంచిగా చెప్పేదాన్ని. అందువల్ల ఆమె ప్రవర్తనలో మార్పు రావచ్చు. మీ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు?’
‘పెళ్లా?’ ఆ పదం అతన్ని ఉలిక్కిపడేలా చేసింది.
‘నువ్వు ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు కదా? అందుకేగా నన్ను చంపింది?’
‘అవును. ఆమె మా పెళ్లికి తొందర చేసింది. నువ్వు నన్ను మా పెళ్లికి ప్రోత్సహిస్తున్నావా?’
‘డార్లింగ్! నువ్వు అందుకోసమేగా హత్య దాకా వెళ్లింది. దాని ఫలితాన్ని పొంది తీరాలి. నువ్వు ఎల్సీని కోరుకుంటే ఆమె నీకు చెందాలి. ఎందుకంటే నీ మీద నాకు ఇంకా ప్రేమ ఉంది’
‘అల్వినా! నువ్వు సహృదయురాలివి’
‘అదేం కాదు. అందరిలా నాలోనూ స్వార్థం ఉంది. క్రిస్పిన్! నాకు నీతో కలిసి ఉండటానికి ఇంకో అవకాశం రావాలని ఉంది. నాకు ఇంకో దేహం లభ్యమై, లేదా అలాంటిదేదైనా జరిగి నీ దగ్గరికి మళ్లీ తిరిగి వస్తే నిన్ను మునుపటికన్నా ఎక్కువ ఆనందంగా ఉంచగలుగుతాను’
ఆ మాటలు అతన్ని ఇబ్బంది పెట్టాయి. తనేమైనా చెప్పాలి లేదా చెయ్యాలి అనుకున్నాడు. కాని అదేమిటో తెలీలేదు.
‘డార్లింగ్! నేను ఇంకొద్దిసేపు ఉంటే ఏడ్చేటట్లు ఉన్నాను.
గుడ్‌బై’ చెప్పి అల్వినా మాయం అయింది.
మోమో ఏడవసాగింది. క్రిస్పిన్ మనస్థితి కూడా అలాగే ఉంది.
* * *
ఎల్సీ దగ్గరికి నాలుగోసారి వెళ్లి ఇంకా ఆమె కోపాన్ని తగ్గించలేక క్రిస్పిన్ ఇంటికి తిరిగి వెళ్లేసరికి అల్వినా అతని కోసం ఎదురుచూస్తోంది.
తను బయటకి వచ్చేసరికి ఎల్సీ కోపంతో మండిపడుతోంది. కాని ఇంటికి వచ్చేసరికి పాత సోఫాలో కాళ్లు ముడుచుకుని కూర్చున్న అల్వినా నవ్వుతూ స్వాగతం చెప్పింది.
రెండు వారాల తర్వాత మళ్లీ ఆమెని చూడటంతో క్రిస్పిన్‌కి ఆనందం కలిగింది.
‘ఎల్సీ ఎలా ఉంది డార్లింగ్? నేను మీ వ్యవహారంలో జోక్యం చేసుకోదలచుకోలేదు. కాని నీ బాగోగులు నాకు కావాలి’
‘ఆమె ఇంకా మోమోని భరించలేకపోతోంది’
నిజం అన్నట్లుగా మోమో మొరిగింది.
‘నేను ఎన్నిసార్లు వెళ్లినా మూడు నెలలు ఆమెని కాంటాక్ట్ చేయలేదన్న కోపాన్ని విడువలేదు’
‘డార్లింగ్! నేను ఎంత అవివేకంగా ఉండేదాన్నో ఇప్పుడు ఆమె అలా ఉంది కదా? నువ్వు ఇంకాస్త మంచి అమ్మాయి కోసం ప్రయత్నిస్తే మంచిది కదా? నువ్వు నన్ను చంపినట్లుగా ఎల్సీని హత్య చేయలేవు. చేస్తే తర్వాత ఆమె పాఠాన్ని నేర్చుకుంటుంది. కాని అందువల్ల ఏం ప్రయోజనం? మరణించినవారు, జీవించి ఉన్న వారు కలిసి కాపురం చేయలేరు కదా?’
క్రిస్పిన్ ఆమె ఎదురుగా ఉయ్యాల మీద కూర్చున్నాడు. అతను మోమోని నిమురుతూ చెప్పాడు.
‘నీకోటి తెలుసా అల్వినా? ఓ దెయ్యంతో సన్నిహితంగా ఉండే అవకాశం ఉంటే అప్పుడు మళ్ళీ ఎల్సీ నాకు అవసరం ఉండదు. దెయ్యంగా మారాక నువ్వు సరైన భార్యగా కూడా మారావు’
‘నువ్వు చాలా మధురంగా మాట్లాడావు. కాని మనిద్దరి మధ్యా చక్కటి అవగాహన ఏర్పడేసరికి ఆలస్యమై పోయింది. నిన్ను కలిసే ఇంకో దారి దొరికితే బావుండునని ఉంది. ఇంకో శరీరం గురించి అడిగితే అది సాధ్యపడదని అన్నారు’
‘నిజమే. నిన్ను కలిసే ఓ మార్గం దొరికితే బావుండును అల్వినా’ క్రిస్పిన్ చెప్పాడు.
కొద్దిసేపటికి అతని మొహం వికసించింది. వెంటనే చెప్పాడు.
‘నాకో చక్కటి ఆలోచన వచ్చింది. నువ్వు నన్ను కలవలేకపోయినా నేను నిన్ను కలవగలను’
‘క్రిస్పిన్!’
‘అవును. నాది చురుకైన తక్షణ నిర్ణయం’
‘ఎల్సీ మాటేమిటి?’
‘నా గురించి ఒకటి, రెండు రోజులు మించి బాధపడదు’
‘కాని నీకు ఇంకా ఎంతో జీవితం ఉంది’
‘ఇక బతకడం దేనికి? నిన్ను పోగొట్టుకున్నాక అంతా పోయినట్లే’
‘క్రిస్పిన్ డార్లింగ్! నాకు ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది. కాని మనిద్దరి మధ్యా ఓ సరిహద్దు ఉంది’
‘దాన్ని నువ్వు దాటలేకపోతే నేను దాటుతాను’
‘నిజంగానా?’
‘నిజమే. మందుల పెట్టెలో అందుకు ఏదైనా ఉండే ఉంటుంది’
అతను లేచి మందుల పెట్టెని తీసి చూసి చెప్పాడు.
‘దొరికింది’
‘మోమోకి కూడా ఏదైనా చూడు’
‘తప్పకుండా. నీ నించి నేను ఎలా దూరం కాలేనో నువ్వు అలా మోమో నించి దూరం కాలేవు అని నాకు తెలుసు. నన్ను సెంటిమెంటల్ అనుకో. ఆ సరస్సు దగ్గరికి వెంటనే వెళ్లి ఆ పని చేస్తాను’ క్రిస్పిన్ స్థిరంగా చెప్పాడు.
* * *
అవతలి వైపు వారిద్దరూ కలుసుకున్నారు. మోమో క్రిస్పిన్ చేతిలోంచి అల్వినా చేతిలోకి వెళ్లి ఆనందంగా మొరిగింది. అల్వినా దాన్ని ముద్దు పెట్టుకుంది.
‘ఆ కుక్కది అదృష్టం. ననె్నప్పుడు ముద్దు పెట్టుకుంటావు?’ క్రిస్పిన్ అడిగాడు.
ఆమె జవాబు చెప్పలేదు.
‘ఇదేం ప్రదేశం? ఆహ్లాదంగా ఉంది’ అడిగాడు.
యూనిఫాంలోని ఇద్దరు అతని దగ్గరికి వచ్చారు.
‘క్రిస్పిన్?’ ఒకరు అడిగారు.
‘నేనే’ జవాబు చెప్పాడు.
‘మాతో రండి మిస్టర్ క్రిస్పిన్’
‘ఈమె నా భార్య. నేను ఆమెతో కలిసి ఉండటానికే వచ్చాను’
వెంటనే అల్వినా అతనికి వివరించింది.
‘క్రిస్పిన్ డార్లింగ్! మోమోకి, నాకు నువ్వు మాతోనే ఉండటం ఇష్టం. కాని ఇక్కడ కొన్ని పాత నియమాలని కొనసాగిస్తున్నారు. నువ్వు హంతకుడివి కాబట్టి ఇక్కడ ఉండకూడదు. ఇంకో చోటికి వెళ్లాలి. దాని పేరు నరకం’
తర్వాత అల్వినా మోమోని ముద్దు పెట్టుకోసాగింది.

(సి.బి.గిల్‌ఫోర్డ్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి