క్రైమ్ కథ

మృదుస్వభావి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెమినరీ (క్రిస్టియన్ మత కాలేజీ) ఆవరణలోని తోటలో కెవిన్ ఆనందంగా గులాబీ మొక్కల ఎండు కొమ్మలని కత్తిరిస్తూండగా అతని చెల్లెలు రోజ్ మరణించిందన్న సమాచారం అందింది. అది ఆత్మహత్య కాబట్టి ఆ మరణం కెవిన్‌ని మరీ బాధించింది. అతనికి చెల్లెలి నించి అందిన పార్సిల్‌లోని ఆమె డైరీ చదివాక అతని బాధ రెట్టింపైంది. ఆ డైరీలోని చేతిరాత, దాంతోపాటు వచ్చిన ఉత్తరంలోని చేతిరాత రోజ్‌దే. విషాన్ని నోట్లోకి తీసుకున్న చెయ్యే వాటిని రాసింది అనుకున్నాడు.
కెవిన్ ఆ పెద్ద ఉత్తరాన్ని అనేకసార్లు చదివాడు. ఆత్మహత్యకి మునుపు ఆమె దాన్ని రాసి డైరీతోపాటు కెవిన్‌కి పంపింది.
రోజ్ రంగస్థల నటి. వారి తల్లి మరణానంతరం కెవిన్ సెమినరీలో చేరాడు. ఆమె నటిగా మారిందని తెలిసి వద్దని, అది అనైతిక రంగం అని చెల్లెల్ని వారించాడు. కాని యవ్వనంలో ఉన్న రోజ్ తన అందాన్ని అందరూ చూసి మెచ్చుకోవాలని అన్న బోధనని పెడచెవిని పెట్టి లైట్ల ముందుకి వెళ్లింది.
నిజానికి రోజ్ డేన్సర్ తప్ప నటి కాదు. రోరీ నడిపే నైట్ క్లబ్‌లో ఆమె నాట్యం చేసేది. తాగి ఉన్న కస్టమర్స్ ముందు ఆడవాళ్లు నీలం రంగు కాంతిలో తమ దుస్తులని లయబద్ధంగా విప్పటమే ఆ నృత్యం. ఆ తర్వాత డబ్బిచ్చిన కొందరు కస్టమర్స్‌ని వారు వినోదపరిచేవారు.
రోజ్ నైట్ క్లబ్ యజమాని రోరీతో ప్రేమలో పడింది. కెవిన్‌కి రోరీ ఎలాంటివాడో బాగా తెలుసు. వాళ్లిద్దరూ ఒకే వీధిలోని ఇళ్లల్లో పెరిగారు. చిన్నప్పటి నించే రోరీ రౌడీ. కెవిన్‌ని అనేకసార్లు చావబాదాడు. కెవిన్ వంకర ముక్కుకి కారణం చిన్నప్పుడు రోరీ కొట్టిన దెబ్బే. స్కూల్ నించి ఇంటికి వెళ్లే కెవిన్ కోసం దారికాసి అతని ఎడమ చేతిని వెనక్కి మెలి తిప్పడంతో అది విరిగిపోయింది. అది అతుక్కున్నా చలికాలంలో ఇప్పటికీ నొప్పి తెలుస్తూంటుంది. ఎదురు తిరగలేక కాదు. హింసకి ప్రతిహింస చేయడం ఇష్టంలేక. కెవిన్‌కి చిన్నప్పటి నించీ శాంతి అంటే ఇష్టం. శాంతిని కోరే అతను ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించి ప్రీస్ట్ కోర్స్‌లో చేరాడు.
సెమినరీలో నివసించే కెవిన్‌కి ఎప్పుడైనా చదివే దినపత్రికలు, వినే రేడియో ద్వారా రోరీ గురించి తెలుస్తూనే ఉంది. అతన్ని అనేకసార్లు పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించారు. మార్టిలో అనే మాఫియా లీడర్ తరఫున రోరీ వ్యభిచార గృహాలని, డ్రగ్స్ అమ్మకాలని సాగించిన నేరాలకి ఓసారి జైలుకి కూడా పంపారు. అతను నడిపే నైట్ క్లబ్‌లోని అనైతిక చర్యల గురించి అనేకసార్లు దినపత్రికల్లో రాసారు.
ఆ ఉత్తరంలో రోజ్ నీలం రంగు దీపాల ముందు దుస్తులు విప్పడం, రోరీ కస్టమర్లని వినోదపరచడం గురించే కాక ఇంకా చాలా హీనమైన చర్యల గురించి రాసింది.
రోరీ భార్యలా కొంతకాలం జీవించాక అతనికి తనంటే మొహం మొత్తి బయటకి పంపడంతో డ్రగ్స్‌కి బానిస అయింది. డ్రగ్స్ కొనడానికి రోరీ సలహా మీద డేన్సర్‌గా మారి వేశ్యావృత్తిని కూడా చేపట్టింది. ఆమె మనసుకి తగిలిన గాయాలతో విషం మింగి మరణించింది.
రోరీతో కలిసి జీవించినప్పుడు ఆ డైరీలో పేర్లు, తారీఖులు, సమయాలకి చెందిన జాబితాని కూడా రోజ్ రాసింది. డ్రగ్స్ అమ్మకాలకి సంబంధించిన, ఇతర చట్టవిరుద్ధ చర్యల్లో మార్టిలో పేరు ఆ డైరీలో అనేకసార్లు కనిపించింది. రోరీ నేర జీవితాన్ని అంతమొందించడానికి ఆ డైరీ పనికి రావచ్చని పంపుతున్నానని కూడా రోజ్ రాసింది.
రోజ్ అంత్యక్రియలు అయ్యాక కెవిన్ సెమినరీ ఫాదర్ ఫ్రాన్సిస్ ముందుకి వెళ్లి తన చెల్లెలు ఉత్తరం, డైరీల్లోని విషయాలని చెప్పాడు. ఫాదర్ ఫ్రాన్సిస్‌కి కెవిన్ కుటుంబం చిన్నప్పటి నించీ తెలుసు.
‘నువ్వు వాటిని నీతో కలిసి చదువుకున్న డేనీకి ఇవ్వు. అతను నీ చెల్లెల్ని ప్రేమించాడు కదా? డేనీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్’
కెవిన్ తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘నేను డేనీని కలుస్తాను ఫాదర్. కాని రోరీ పాపాలకి మరణించేలా డేనీ చేయలేదు. రోరీ తప్పక చావాలి. అతను మరణించేలా చేయాల్సింది నేనే. అందుకనే నేను సెమినరీ వదిలి బయటి ప్రపంచంలోకి వెళ్లదలచుకున్నాను’ కెవిన్ చెప్పాడు.
ముసలి ఫ్రాన్సిస్ ఆ యువకుడి వంక నమ్మలేనట్లుగా చూశాడు.
‘పేదరికంలో జీవిస్తాను. జీసస్‌కి విధేయతగా ఉంటాను అని సెమినరీలో చేరబోయే ముందు చేసిన నా వాగ్దానాలని వెనక్కి తీసుకోవడం లేదు. ఐనా నేను బీదవాడినే. మీకు అర్థం కాని పద్ధతిలో నేను జీసస్‌కి విధేయత గానే ఉంటాను. ఆ విధేయతే రోరీ మరణించాలని నాకు చెప్తోంది’
‘ఇది విధేయత కాక డెవిల్ ఇచ్చే సలహా’ ఫాదర్ చెప్పాడు.
‘ఐతే జీసస్ కాక డెవిలే నన్ను ఆవహించి ఉంటుంది. రోరీ చావాలనే లక్ష్యాన్ని నేను నెరవేర్చకుండా ఉండలేను. కొందరు జీసస్ కూడా క్షమించలేనంత చెడ్డవాళ్లై ఉంటారు. రోరీ లాంటి వారికి సరిజోడు డెవిలే’
‘నువ్వు రోరీని హత్య చేయాలని అనుకోవడానికి కారణం నీ విచారమే. అది తగ్గే దాకా ఆగు’
‘రోరీ తప్పక చావాలి’ కెవిన్ పట్టుదలగా చెప్పాడు.
‘నీ సోదరులందరిలోకీ నువ్వు అత్యంత మృదు స్వభావివి. ఈ నీ మూడ్ త్వరలోనే మారుతుంది అని ఆశిస్తాను. నువ్వు ఎవర్నీ చంపలేవు అని పందెం. నువ్వు తిరిగి వస్తావనే నమ్మకం నాకు ఉంది. దేవుడి పని దేవుడికే వదులు’ ఫాదర్ చెప్పాడు.
‘ఇది దేవుడి పని కాదు ఫాదర్. మీరన్నట్లు ఇది డెవిల్ పని’
కెవిన్ ఆ ఉత్తరం, డైరీలతో మాత్రమే సెమినరీలోంచి బయటకి నడిచాడు.
* * *
చేతిలో పెన్నీ లేని కెవిన్ గిల్బర్టో బ్రదర్స్ షాప్‌కి వెళ్లాడు. చిన్నప్పుడు అతని తండ్రి మిత్రుడైన గిల్బర్టో షాప్ నించి సరుకుల్ని ఇళ్లకి డెలివరీ చేసేవాడు. గిల్బర్టో సోదరులు అతను సెమినరీని విడిచి బయటకి వచ్చాడంటే ముందు నమ్మలేదు. అతనికి ఉద్యోగం ఇవ్వడానికి సంతోషంగా అంగీకరించారు.
ఆ దుకాణం ఎదురుగా రెండో అంతస్థులోని ఓ చిన్న గదిని అద్దెకి తీసుకున్నాడు.
అతను జన జీవనంలోకి రావడానికి వారం పైనే పట్టింది. ఈలోగా రోరీని చంపడం ఎలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఉదయం ఎనిమిది నించి సాయంత్రం ఐదు దాకా ఆ దుకాణంలో పని చేయసాగాడు. ఒకోసారి రాత్రి భోజన సమయం దాకా కూడా పని చేసి, చిన్న రెస్ట్‌రెంట్‌లోని కౌంటర్లో హేష్‌బ్రౌన్స్‌ని కొనుక్కుని తినేవాడు. తనేం తింటున్నాడో పట్టించుకునేవాడు కాదు. దాంతో తిన్నది చాలక అర్ధరాత్రి ఆకలితో లేచేవాడు.
ఓ రాత్రి మెర్కర్స్ స్ట్రీట్ పోలీసుస్టేషన్‌లోని తన బాల్య మిత్రుడు డిటెక్టివ్ డేనీ దగ్గరికి వెళ్లాడు. ఎవరూ లేని డిటెక్టివ్ స్క్వేడ్ రూంలోకి ఇద్దరూ వెళ్లారు. ఆ ఊరి వీధుల్లో తాము కలిసి తిరిగిన రోజులు, తాము చదివిన సెయింట్ ఇగ్నాటియస్ స్కూల్ వెనక ఆట స్థలంలో ఆడిన ఆటలు గుర్తుకు తెచ్చుకున్నారు. చివరికి డేనీ తను చిన్నప్పుడు ప్రేమించిన రోజ్ గురించి, రోరీ గురించి మాట్లాడాడు.
‘రోరీ బారిన పడకుండా రోజ్‌ని ఆపాలని నేను విశ్వ ప్రయత్నం చేశాను. కాని కుదర్లేదు. నేను ఈ ఉద్యోగంలో చేరాక రోజ్ లాంటి వాళ్లు అక్కడ పని చేయకూడదని గ్రహించాను’
‘రోరీ డ్రగ్స్ అమ్మిన నేరాల గురించిన పేర్లు, ప్రదేశాలు, ఇతర చట్ట విరుద్ధ చర్యలు గల డైరీని నేను నీకు ఇస్తే నువ్వేం చేస్తావు?’
‘నీ దగ్గర ఆ సాక్ష్యం నిజంగా ఉంటే తగిన చర్యని వెంటనే తీసుకుంటాను. అందులో పేర్కొన్న అందరి ఇళ్ల మీద రెయిడ్ చేసి సాక్ష్యం దొరికితే వాళ్లని అరెస్ట్ చేస్తాను’
‘వాళ్లు అరెస్ట్ అయ్యాక ఏమవుతుంది?’
‘వాళ్ల మీద కోర్ట్‌లో విచారణ జరుగుతుంది. ఆ డైరీ గొప్ప సాక్ష్యం అవుతుంది’
‘అప్పుడు వాళ్లకి పడే శిక్ష ఏమిటి?’
‘పోలీసులు కేస్‌ని చక్కగా ప్రజెంట్ చేస్తే జడ్జ్ వారికి పదేళ్ల దాకా శిక్షని విధించచ్చు. కాని సాధారణంగా ఐదేళ్లే వేస్తూంటారు.’
‘అది సరిపోదు. రోరీది మన వయసే. అతను జైల్లోంచి బయటకి వచ్చాక రోజ్ లాంటి అనేక మంది అమాయక ఆడవాళ్లని నాశనం చేస్తాడు. హైస్కూల్ పిల్లలకి డ్రగ్స్ అమ్ముతూనే ఉంటాడు. రోరీ లాంటి వాళ్లకి పడాల్సింది మరణశిక్ష’
డేనీ ఉలిక్కిపడ్డాడు.
‘ఈగనైనా బాధించని మృదుస్వభావివైన నువ్వేనా ఆ మాట అనేది? నువ్వు చెప్పింది నిజమే. డ్రగ్స్ అమ్మితే మరణశిక్ష పడాలనే చట్టం వస్తే బావుండును’
కెవిన్ వెంటనే లేచి నిలబడి చెప్పాడు.
‘నిన్ను చూడటం ఆనందంగా ఉంది. నీ సమయం కేటాయించినందుకు థాంక్స్. రోరీ చావాలి అన్నది నా నిర్ణయం’
‘ఆగు. నువ్వు రోరీని నీ చేతుల్తో కాల్చి చంపుతానని చెప్తున్నావా? రోరీ లాంటి దుర్మార్గుడ్ని చంపడం చట్టం దృష్టిలో హత్యే’
‘అది నాకు తెలుసు. బహుశ నిన్ను మళ్లీ ఇంకోసారి కలుస్తాను డేనీ’
‘జాగ్రత్త కెవిన్. రోరీ లాంటి వ్యక్తులతో సెమినరీలో చదివే వాళ్లు పెట్టుకోకూడదు’ డేనీ హెచ్చరించాడు.
* * *
రోరీ నివసించే పెంట్ హౌస్ ముందున్న పార్క్‌లో కెవిన్ రెండు రోజులు పార్క్ బెంచి మీద కూర్చుని పావురాలకి గింజలు తినిపిస్తూ కాపలా కాసాడు. మూడో రాత్రి నల్లటి లిమజోన్ లోంచి దిగిన లోరీని చూశాడు. గతంలో కంటే లావయ్యాడు. అతను లోపలకి వెళ్లాడు.
మరో వారం రోజులపాటు కెవిన్ పావురాలకి గింజలు తినిపిస్తూనే ఉన్నాడు. ప్రతీ రాత్రి అతను పెంట్‌హౌస్‌లోకి వెళ్తూ కనిపించాడు. అవసరమైనప్పుడు రోరీని ఎక్కడ కలవాలో కెవిన్‌కి అర్థమైంది.
తర్వాత కెవిన్ డైరీలోని కొన్ని పేజీలని జెరాక్స్ తీయించాడు. ఆ కాపీలకి రోరీకి రాసిన ఉత్తరాన్ని జత చేసి పోస్ట్ చేసాడు.
డియర్ రోరీ,
రోజ్ డైరీ రాయబట్టి నీకీ ఉత్తరం రాస్తున్నాను. అందులో నీ పేరు, మార్టిలో పేరు అనేకసార్లు వచ్చాయని గ్రహించగలవు. ఈ డైరీని అధికారులకి ఇవ్వడం నా బాధ్యత. అందుకు ముందుగా నీతో ఓసారి మాట్లాడాలి. నువ్వు దీని గురించి నాతో మాట్లాడదలచుకుంటే ఈ కింద చెప్పినట్లు చెయ్యి.
కింది చిరునామాలోని రెండో అంతస్థులోని నా గదికి ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా మూడుంపావుకి ఒంటరిగా రా. నేను కిటికీలోంచి చూస్తూంటాను. నీతోపాటు ఎవరైనా వస్తే నీకు లోపలికి అనుమతి లేదు. అంతేకాక సరిగ్గా మూడుంపావుకి తప్ప ముందుగా కాని, తర్వాత కాని వచ్చినా నీకు అనుమతి లేదు.
నేను ఒంటరిగానే ఉంటాను. వెంట ఆయుధాలని తీసుకురాకు. నీకన్నా బలమైన వాడిని, పొడవైన వాడిని కాను. నినే్నమైనా చేద్దామని అనుకుంటే పోలీసులకి ఆ డైరీని ఇవ్వడాన్ని మించింది మరోటి లేదు కదా?
ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా మూడుంపావుకి నువ్వు రాకపోతే మూడున్నరకి ఆ డైరీ డేనీ చేతికి అందుతుంది. నువ్వు, మార్టిలో వెంటనే అరెస్ట్ అవుతారు. నువ్వు దాన్ని నివారించ కలిగీ నివారించలేదని మార్టిలోకి కూడా తెలుస్తుంది. అది నీకు మంచిది కాదు. - కెవిన్.
పోస్ట్ఫాస్‌లో ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసి తన గది తాళం చెవికి డూప్లికేట్‌ని చేయించాడు. తర్వాత మెర్సెర్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి డేనీని కలిశాడు.
‘డేనీ! నేనో పథకాన్ని ఆలోచించాను. రోరీని నువ్వు ఆదివారం మధ్యాహ్నం సరైన సాక్ష్యంతో అరెస్ట్ చేయచ్చు. ఆ రోజు సరిగ్గా మూడున్నరకి ఈ చిరునామాకి రా’
తన చిరునామా రాసిన కాగితాన్ని, డూప్లికేట్ తాళం చెవిని డేనీకి ఇచ్చి మళ్లీ చెప్పాడు.
‘పెద్ద తాళం చెవితో ఆ భవంతి ఫ్రంట్ డోర్‌ని తెరవచ్చు. రెండో అంతస్థులోని నా గది తలుపుని రెండో తాళం చెవితో తెరవచ్చు. సరిగ్గా మూడున్నరకి. ఓ నిమిషం ముందుకు కాదు. ఓ నిమిషం తర్వాత కాదు. నువ్వు వస్తే బహుశ నీకు ప్రమోషన్ లభించచ్చు’
‘రోరీ పాములా ప్రమాదకారి. నీ పథకం ఏమిటో చెప్పు. నేను సలహాలు ఇస్తాను’ డేనీ అడిగాడు.
‘నేను చెప్పినట్లు వినడమే నువ్వు చేయాల్సింది. లేదా దాన్ని మార్చుకుంటాను’ కెవిన్ శాంతంగా చెప్పాడు.
కెవిన్ మర్నాడు లంచ్ అవర్లో జాకోమో గన్ షాప్‌కి వెళ్లి ఓ రైఫిల్‌ని, ఓ గుళ్ల పెట్టెని కొన్నాడు.
‘రోరీ శిక్షని దేవుడికి, పోలీసులకి వదులు’ అతని కుటుంబం గురించి తెలిసిన జాకోమో సలహా ఇచ్చాడు.
ఆ ఉత్తరం పోస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత శుక్రవారంనాడు దుకాణం కిటికీలోంచి కెవిన్ తన ఇంటిని గమనించే ఇద్దర్ని చూశాడు. వాళ్లు తమతో స్కూల్లో చదివిన వాళ్లే. వాళ్లు ఆ దుకాణంలోకి వచ్చి అడిగారు.
‘నువ్వేనా కెవిన్?’
‘అవును’
‘ఆదివారం మధ్యాహ్నం మూడుంపావుకి నీ ఇంటికి వచ్చే అతనికి అతను కోరింది ఇవ్వు. మేము బయటే ఉంటాం’
ఒకడు తన రివాల్వర్‌ని, మరొకడు తళతళ మెరిసే కత్తిని చూపించారు.
‘వీటిని ఉపయోగించే అవకాశాన్ని రానీకు’
ఆదివారం తన గదిలో కుర్చీలో కూర్చున్న కెవిన్ కిటికీలోంచి ఆ గ్రామంలో రంగురంగుల దుస్తులని ధరించిన ఇటాలియన్ అమ్మాయిలు, ఇటాలియన్ ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్లడాన్ని చూశాడు. కెవిన్ చిన్నప్పుడు తన తండ్రి రైఫిల్‌ని శుభ్రం చేసేవాడు. అప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో తండ్రి నేర్పించింది ఇంకా గుర్తుంది. ఐతే తండ్రితో వేటకి వెళ్లి అమాయక జంతువులని చంపడానికి ఇష్టపడలేదు.
అతని ఎడమ చేతిలోరైఫిల్, కుడి చేతిలో బైబిల్ ఉన్నాయి. బైబిల్ చదువుతూ మధ్యమధ్యలో గోడ గడియారాన్ని, కిటికీలోంచి కిందకీ చూడసాగాడు.
మూడు పదికి నల్లటి లిమజోన్ ఆగడం చూశాడు. అందులోంచి ముగ్గురు దిగారు. ఒకరు రోరీ. మిగతా ఇద్దరూ శుక్రవారం తనని హెచ్చరించిన రౌడీలు. ఆ ఇద్దరూ రోరీతో బహుశ వెంట లోపలకి వస్తామని వాదించడం, వారిని వారించి చివరికి రోరీ ఒక్కడే తన ఇంటి వైపు నడవడం చూశాడు.

మల్లాది వెంకట కృష్ణమూరిసరిగ్గా మూడుంపావుకి అతను రెండో అంతస్థు కారిడార్‌లోకి రాగానే కెవిన్ గది నంబర్ కోసం చూశాడు. గది బజర్ మోగింది. కెవిన్ మీటని నొక్కగానే అతని గది తలుపు గడియం యాంత్రికంగా తెరచుకుంది. రోరీ తలుపుని కొద్దిగా తెరచి లోపలకి చూసి, కెవిన్ ఒక్కడే ఉన్నాడని గ్రహించాక లోపలకి వచ్చాడు. అతని అనుమానపు కళ్లు ఆ గదినంతా మరోసారి పరిశీలించాయి.
‘తలుపు మూసి కూర్చో’ బల్ల అవతల కుర్చీలో కూర్చున్న కెవిన్ చెప్పాడు.
అతను వేగంగా తన వైపు కోపంగా నడుస్తూంటే వౌనంగా రైఫిల్‌ని అందుకుని దాని గొట్టాన్ని రోరీకి గురి పెట్టాడు.
దాన్ని చూడగానే చటుక్కున ఆగిన రోరీ కుర్చీలో కూర్చుని అడిగాడు.
‘డైరీ ఏదీ?’
‘డైరీ ఇప్పుడు నా దగ్గర లేదు. ఓ చోట దాచాను. అది పోలీసుల చేతిలోకి వెళ్లకుండా ఉండటానికి నువ్వు ఓ పని చేయాలి. నీ మనుషులు కింద ఉన్నారని నాకు తెలుసు. కాని నువ్వు నన్ను కిడ్నాప్ చేయలేవు. కింద వీధి గుండా ఇటాలియన్ ఫెస్టివల్ రద్దీ ఉంది కాబట్టే నేను ఈ రోజుని ఎన్నుకున్నాను. వాళ్లు చూస్తూండగా బలవంతంగా నన్ను కారు దాకా తీసుకెళ్లలేవు’
‘ముందుగా నీకొకటి చెప్పాలి. నీ చెల్లెలు వేశ్య. జడ్జ్ కాని, జూరీ కాని ఓ వేశ్య రాసింది నమ్మరు. కాని అది నాకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మార్టిలో ఇబ్బందిని ఇష్టపడడు. అందులోంచి బయట పడటానికి కొంత చెల్లిస్తాడు. మిగతాది నేను ఇవ్వాలి. మార్టిలో ఇచ్చేట్లైతే తర్వాత నీ నించి తప్పక వసూలు చేసుకుంటాడని ముందే హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు చెప్పు. ‘నీకు ఎంత కావాలి?’ రోరీ కోపంగా ప్రశ్నించాడు.
కెవిన్ గడియారం వంక చూశాడు. 3.23. ఇంకా ఏడు నిమిషాలు ఉంది. పావుగంట బదులు పది నిమిషాలే తీసుకుని ఉంటే బావుండేదేమో అనిపించింది.
‘ఎంత దాకా ఇవ్వగలవు?’ అడిగాడు.
‘ఐదు వేల డాలర్లు’
‘అది చాలా తక్కువ. ఐనా నాకు డబ్బు మీద ఆశ లేదు రోరీ. నేను బీదరికంలో జీవిస్తానని జీసస్‌కి మాట ఇచ్చాను. జీసస్ మార్గంలోంచి నేను ఇంకా బయటకి రాలేదు’
3.25. ఇంకా ఐదు నిమిషాలు.
‘చెత్త మాట్లాడటం ఆపి విషయానికి రా. నాకు టైం లేదు’ రోరీ కోపంగా చెప్పాడు.
‘నువ్వు హంతకుడివి. రోజ్ ఆత్మహత్య చేసుకుంది. ఐనా నువ్వే హంతకుడివి అని రుజువు చేయాలని అనుకుంటున్నాను’
వెంటనే రోరీ మొహం ఎర్రబడింది. కోపంగా లేచి కెవిన్ వైపు ఓ అడుగు వేయగానే కెవిన్ కుర్చీలోంచి లేచి రైఫిల్‌ని గురిపెట్టి కఠినంగా చెప్పాడు.
‘ఆగు. ఆత్మరక్షణకి నిన్ను కాల్చడంలో తప్పు లేదు’
తక్షణం రోరీ ఆగిపోయాడు.
3.26.
‘నా దగ్గరికి రాకు రోరీ. రైఫిల్‌లో గుళ్ళున్నాయి. కుర్చీలో కూర్చో’
‘నువ్వు మోసగాడివి’ రోరీ అరిచాడు.
‘కాదు రోరీ. నీకు ఓ మనిషిని చంపే ధైర్యం లేదు. ఐనా నువ్వు హంతకుడివి అని పోలీసులకి రుజువు చేయగలను’
‘ఎలా?’ రోరీ అడిగాడు.
కెవిన్ కిటికీలోంచి రెండు క్షణాలు బయటకి చూసి మళ్లీ రోరీ వైపు తల తిప్పాడు. నల్ల లిమిజోన్ ఇంకా ఉంది. రోరీతో వచ్చిన ఒకడు కిటికీ వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు.
3.27.
మళ్లీ చూస్తే డేనీ నడిచి వస్తూ కనిపించాడు. చాలా నెమ్మదిగా నడుస్తున్నాడు.
‘ఒక్క నిమిషంలో నేను బయటకి వెళ్తున్నాను రోరీ. నేనా డైరీని, ఉత్తరాన్ని పోలీసులకి ఇస్తాను’
‘బెదిరింపు ఆపి నీ ధర ఎంతో అడుగు’
‘్ధరంటూ లేదు. నువ్వు నన్ను ఆపగలవా అన్నది ప్రశ్న’
‘ఎలా? ఏమిటి?’
‘నన్ను చంపి కాని ఈ గదిలోంచి వెళ్లకుండా ఆపలేవు’
‘విను. సమయం వృధా చేయకు. నేను చాలా ఇవ్వగలను. నువ్వు దాన్ని చర్చికి డొనేట్ చేయచ్చు’ రోరీ బతిమాలుతున్నట్లుగా చెప్పాడు.
చేతిలోని చిరునామా కాగితంతో డేనీ ఇంటి బయట నిలబడి కనిపించాడు. తర్వాత తలుపు తెరచుకుని లోపలికి వచ్చి మెట్లు ఎక్కసాగాడు. ఎవరో మెట్లెక్కుతున్న శబ్దం వినిపించగానే రైఫిల్‌ని రోరీకి గురి పెట్టి ఉంచి కెవిన్ నెమ్మదిగా లేచి తలుపు దగ్గరికి వెళ్లాడు.
‘ఏమిటీ డ్రామా?’ రోరీ అసహనంగా అరిచాడు.
కెవిన్ తన చేతిలోని రివాల్వర్‌ని రోరీ వైపు ‘పట్టుకో’ అని అరిచి విసిరాడు. అతను యాంత్రికంగా పట్టుకున్నాడు.
‘సేఫ్టీ కేచ్ తీసే ఉంది. నేను వెళ్తున్నాను. రోరీ! ఇది నీకు ఆఖరి అవకాశం. నన్ను చంపి ఆపు. లేదా పోలీసుల దగ్గరికి వెళ్తాను. చచ్చేలా కాల్చు. లేదా వాళ్లకి డైరీ ఎక్కడ ఉందో హాస్పిటల్‌లో చెప్తాను’
కెవిన్ గడియ తీశాడు.
రోరీ మొహం నిండా ఆశ్చర్యం. తక్షణం లేచి నిలబడ్డాడు. బయట కారిడార్‌లో నడుస్తున్న బూట్ల చప్పుడు.
‘గుడ్ బై రోరీ’ చెప్పి కెవిన్ తలుపుని తెరవబోయాడు.
రోరీ తక్షణం రైఫిల్ గొట్టాన్ని కెవిన్‌కి గురి పెట్టి కాల్చాడు. ఆ చిన్న గదిలో రైఫిల్ పేలిన శబ్దం నిండింది. కెవిన్ నేలకూలాడు. ఆ మృదు స్వభావి గడియారం అరవై సార్లు టిక్‌మనేంత సమయమే బతికి ఉన్నాడు. కాని ఆ సమయం అతనికి చాలు. తలుపు తెరచుకుని లోపలకి వచ్చిన డేనీ వైపు రోరీ మరోసారి కాల్చడాన్ని, ‘కాల్చకు కాల్చకు’ అని డేనీ రోరీని అర్థిస్తూండగా ఇంకో గుండు లేని రైఫిల్ క్లిక్ మనడాన్ని కెవిన్ విన్నాడు. చూశాడు.
‘కెవిన్‌ని కాల్చి చంపినందుకు నిన్ను ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోపెట్టకపోతే నా పేరు డెనీనే కాదు’ అవి కెవిన్ విన్న ఆఖరి మాటలు.
*

(డేవిడ్ అలెగ్జాండర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి