క్రైమ్ కథ

డబ్బు కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు మార్కన్ అండ్ డేవిస్ సర్కస్ కంపెనీలో మేనేజర్ కదా?’ బార్లోని ఆమె నన్ను ప్రశ్నించింది.
‘అవును. మీరు?’ అడిగాను.
‘నా పేరు అనవసరం. రేపు మీ సర్కస్ టెంట్లు ఎత్తేసి మీరంతా ఇంకో ఊరు వెళ్లిపోతున్నారు కదా?’
‘అవును’
ఆమె కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి తర్వాత అడిగింది.
‘డబ్బు కోసమేగా మీరు సర్కస్‌లో చేరి దేశమంతా తిరిగేది?’
‘అవును. ఏం?’
‘అదే డబ్బు కోసం మీరు నాకో పని చేసి పెడతారా?’ నా కళ్లల్లోకి చూస్తూ అడిగింది.
‘అదేం పని అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది’ చెప్పాను.
‘పది నిమిషాల పనికి పాతిక వేల డాలర్లు వస్తూంటే అప్పుడు కూడా అదేం పని అన్న దాని మీదే ఆధారపడి ఉంటుందా?’
నేను కొన్ని క్షణాలు వౌనంగా ఉన్నాక అడిగాను.
‘ఉండదు. ఏం చేయాలి?’
‘చంపాలి’
పాతికేళ్ల ఆ అందగత్తెలో అలాంటి దుర్మార్గం ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
‘ఎవర్ని? నీ భర్తనా?’
‘అవును’
‘దేనికి చంపడం? బదులుగా మీ ప్రియుడితో పారిపోవచ్చుగా?’
‘నాకు ప్రియుడు లేడు. డబ్బు కోసం. అతను మరణిస్తే అతని ఆస్థి మొత్తానికి నేనే వారసురాలిని అవుతాను’
‘ఎంత?’
‘ఇరవై లక్షల డాలర్లు’ ఆమె చెప్పింది.
నేను కొద్దిసేపు ఆలోచిస్తూండి పోయాను. తర్వాత అడిగాను.
‘ననే్న ఎందుకు ఎన్నుకున్నారు? ఇది పెద్ద ఊరు. స్థానికులు చాలామంది ఉన్నారుగా?’
‘మీకు, నా భర్తకి ఎలాంటి పరిచయం లేదు కాబట్టి మిమ్మల్ని అనుమానించరు. మీరు వెళ్లాక మళ్లీ నా జీవిత కాలంలో మీరు తిరిగి ఈ ఊరికి రాకపోవచ్చు. మీకూ, నాకూ మధ్య కూడా ఎలాంటి సంబంధం లేదు కాబట్టి పోలీసులు మనల్ని అనుమానించరు. జేబులో పాతిక వేల డాలర్లతో మీరీ ఊరు వదిలి వెళ్లిపోతారు’ ఆమె చెప్పింది.
‘మీ దగ్గర నిజంగా అంత డబ్బుందా?’ ప్రశ్నించాను.
ఆమె బార్లో చుట్టూ చూసి, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని రూఢీ చేసుకున్నాక హేండ్‌బేగ్‌ని తెరచి ఏభై డాలర్ల నోట్ల కట్టలని ఐదింటిని లెక్కపెట్టి చూపించింది. అది చూశాక నాలో ఉత్సాహం కలిగింది.
‘ఇక్కడ ఎవరైనా మనల్ని గమనించి ఉంటే?’ అడిగాను.
‘ఆ రిస్క్ నేను తీసుకుని తీరాలి. కాని మీరు పట్టుబడ్డప్పుడు కదా? నేను ఎన్నడూ ఈ బార్‌కి రాలేదు. నాకు తెలిసిన వారు ఎవరూ ఇక్కడ లేరు కూడా’
‘నేను ఇంతదాకా ఎవర్నీ చంపలేదు’
‘హత్య సెక్స్ లాంటిది. ముందు భయపడ్డా చివరికి చేసి తీరుతాడు. ఏ మనిషికైనా పాతిక వేలు గట్టి ప్రోత్సాహాన్ని ఇస్తుందని నా నమ్మకం. పదండి’
ఇద్దరం లేచి బయటకి వచ్చాం. ఆమె కార్లో మేము ఎక్కాక దాన్ని పోనిస్తూ చెప్పింది.
‘మా ఇంటిని బయటి నించి చూపిస్తాను. అక్కడికి దారిని గుర్తుంచుకోండి’
‘పథకం ఏమిటి?’ అడిగాను.
‘రేపు రాత్రి ఆరుంపావుకి మీరు మా ఇంట్లోకి ప్రవేశిస్తారు. తలుపు తాళం వేసి ఉండదు. తోస్తే తెరచుకుంటుంది. లోపల విలువైన వస్తువులు అన్నీ వెంట తీసుకెళ్లండి. సరిగ్గా ఆరున్నరకి తలుపు తెరచుకుని మా వారు లోపలికి వస్తారు. మీరు ఆయన్ని కాల్చి చంపి వెళ్లిపోండి. ఆ సమయంలో నాకు ఎలిబీ ఉంటుంది. గంట తర్వాత నేను తిరిగి వచ్చి పోలీసులకి ఫోన్ చేస్తాను. ఆ సరికి మీరు ఈ ఊరికి కనీసం ముప్పై మైళ్ల దూరంలో ఉంటారు’ వివరించింది.
‘మీ ఇంట్లో ఇంకెవరూ ఉండరా?’
‘ఉండరు. సరిగ్గా ఆరుకి నేను సూపర్ మార్కెట్‌కి వెళ్తాను. అక్కడ ఆరూ ముప్పై ఐదుకి ఏదో బద్దలు కొట్టి దాని ఖరీదు చెల్లిస్తాను. టైం, తారీఖు ఆ బిల్ మీద ఉంటుంది. అక్కడి సిబ్బందికి నేనా డబ్బు నిరాకరించడంతో గుర్తుంటాను. దొంగతనం జరిగే సమయంలో ఇంటికి మా వారు రావడంతో అతను చంపబడ్డారని పోలీసులు భావిస్తారు. ఎలాంటి ఆధారాలు దొరకవు. కాబట్టి బహుశ ఆ దొంగని ఎప్పటికీ పట్టుకోలేరు’ నవ్వుతూ చెప్పింది.
ఆమె కారుని ఓ ఇంటి బయట రోడ్‌కి అవతల ఆపి చెప్పింది.
‘అదే. నెంబర్ 710. అపార్ట్‌మెంట్ నంబర్ కె. మీరు రేపు మీ కారుని ఆరుంపావుకి ఇక్కడ ఆపచ్చు. లోపలకి వెళ్లి పని అయ్యాక వెళ్లిపోండి’
‘మీరు మొత్తం పథకాన్ని ఆలోచించారన్న మాట’
‘అవును’
హేండ్ బేగ్ తెరిచి నాకో గోధుమ రంగు కాగితం సంచీని ఇచ్చింది. అందులో పాయింట్ 32 రివాల్వర్ ఉంది.
‘పనయ్యాక ఏ వెయ్యి మైళ్ల దూరంలోనో దీన్ని ఓ నదిలో పారేయండి. ఐదు వేలు ఇప్పుడు, మిగతాది పనయ్యాక. ఆ ఇరవై వేలు మా ఇంట్లో ఎక్కడ ఉంచానో తర్వాత నేను ఫోన్ చేసి చెప్తాను’
‘మీరు ఫోన్ చేయకపోతే?’ అడిగాను.
‘మా వారి జేబులో ఇరవై వేలు ఉంటాయి’
‘ఎందుకు ఉంటాయి?’
‘ఆయన మిత్రుడు తను తీసుకున్న ఇరవై వేల అప్పుని ఆఫీస్ నించి ఆయన ఇంటికి రాబోయే ముందే తీరుస్తాడు కాబట్టి’
‘ఓ! అతను నీ ప్రియుడా?’
‘పథకం నాది. పాతిక వేలు అతనిది. మీరు ఇంకా సరే అనలేదు?’
‘సరే’ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి చెప్పాను.
‘అపాయం లేదు కాబట్టి పాతిక చాలా ఎక్కువ. పది వేలు కూడా ఎక్కువే. కాని నా మిత్రుడు పాతిక వేలకి సిద్ధం అయ్యాడు. మా వారి వయసుని చూసి ఆశ్చర్యపోకండి. మా పదహారో ఏట నా పెళ్లి జరిగింది. కారణం వీధి స్తంభాలు, పేవ్‌మెంట్లు లేని చిన్న ఊళ్లో, నాలుగు గదులు ఉన్న ఇంట్లో ఎనిమిది మందితో కలిసి పదహారేళ్లు పెరిగిన నేను సినిమా హాల్స్ ఉన్న ఊళ్లో జీవించాలి అనుకుని ఆయన్ని చేసుకున్నాను’
‘మీ మధ్య తేడా ఎంత?’
‘ఇరవై ఆరేళ్లు’
ఆమె తిరిగి నన్ను బార్ దగ్గర దింపుతానని చెప్పినా అవసరం లేదని దిగి అక్కడికి నడవసాగాను. దారిలో ఆలోచించుకోవచ్చని నడక.
* * *
మర్నాడు సాయంత్రం ఐదుకల్లా సర్కస్ టెంట్లని ఎత్తేశారు. అందర్నీ తర్వాతి కంప్‌కి పంపించేశాను. ఓ గంటసేపు బార్లో లైట్ బీర్‌తో కాలక్షేపం చేసి ఆ ఇంటికి చేరుకున్నాను. ఆ ఇంటికి కొద్ది దూరంలో కారుని పార్క్ చేసి, నడిచి సరిగ్గా ఆరూ ఇరవైకల్లా ఇంటి ముందుకి చేరుకుని తలుపుని నెట్టాను. ఆమె చెప్పినట్లుగా అది తెరచుకుంది. చుట్టూ చూశాను. ఎవరూ లేరు. లోపలకి వెళ్లి తలుపు మూసాను.
‘కమాన్. సరిగ్గా టైంకే వచ్చావు’ ఓ ముప్పై ఏళ్ల వ్యక్తి చిరునవ్వుతో చూస్తూ ఆహ్వానించాడు.
అతన్ని, అతని చేతిలోని రివాల్వర్‌ని చూసి నివ్వెరపోయాను.
‘నన్ను చంపడానికి వచ్చావు కదా?’
నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.
పడక గది తలుపు తెరచుకుని ఆమె బయటికి వచ్చింది. ఆమె చేతిలో కూడా ఓ రివాల్వర్ ఉంది.
‘ఏం జరుగుతోంది?’ నేను అయోమయంగా చూస్తూ ప్రశ్నించాను.
ఆమె నిశ్శబ్దంగా నా దగ్గరికి వచ్చి, నా జేబులు వెదికి తను ఇచ్చిన రివాల్వర్‌ని, పర్స్‌ని తీసుకుంది. పర్స్ తెరచి డబ్బు లెక్కపెట్టి అతనితో చెప్పింది.
‘మొత్తం ఉంది’
‘ఆగండి. అందులోని కొంత మొత్తం నాది’ గట్టిగా చెప్పాను.
‘ఇప్పుడు మొత్తం మాది. ఇంకా నీకు అర్థం కాలేదా?’ అతను అడిగాడు.
‘లేదు’
‘ఇది నా భార్య ఆడే చిన్న ఆట. తన ఖర్చులకి ఇలా సంపాదిస్తూంటుంది’
‘అంటే ఆమె చెప్పిందంతా...’
‘...అవును. కట్టుకథే. ఇలాంటి అనేక కథలని చెప్పి డబ్బుతో ఈ ఊరి నించి వెళ్లే అనేక మందిని మభ్యపెట్టి ఇక్కడికి రప్పిస్తుంది’
‘నేను పోలీసులకి ఫిర్యాదు చేస్తాను. నా మూడు వేల డాలర్ల కోసం మీరు నన్ను ఇక్కడ చంపుతారని అనుకోను’
‘ఈ ఊరి షెరీఫ్‌ని నేనే. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాకే చేయాలి. నిజానికి నిన్ను ఇక్కడ చంపి నువ్వు దొంగతనానికి మా ఇంటికి వచ్చావని చెప్పినా అంతా నమ్ముతారు. కాని మూడు వేలకి చంపడం అవివేకం’
కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత అడిగాను.
‘ఇప్పుడు ఏం జరగబోతోంది’
‘నువ్వు వెంటనే ఈ ఊరు వదిలి వెళ్లిపోతావు. నాకు మళ్లీ ఈ ఊళ్లో కనిపిస్తే ఏదో కేసు బనాయించి అరెస్ట్ చేస్తాను’ అతను కఠినంగా చెప్పాడు.
‘ఈ డబ్బుతో మనం ఫ్లోరిడాకి వెళ్లి సెలవులు గడిపి వద్దాం డార్లింగ్. చాలా రోజులుగా అనుకుంటున్నాను’ ఆమె మురిపెంగా అతనితో చెప్పింది.
‘అలాగే. ఇతని డబ్బుని మనం ఎలా ఖర్చు చేస్తామో ఇతనికి తెలుసుకునే హక్కు ఉంది’ అతను చెప్పాడు.
‘ఇక నువ్వు వెళ్లచ్చు. నీ పాత్ర ముగిసింది’ ఆమె నా వైపు ఖాళీ పర్స్‌ని విసిరి అరిచింది.
ఒంగి దాన్ని అందుకుని చెప్పాను.
‘నా డ్రైవింగ్ లైసెన్స్‌ని, క్రెడిట్ కార్డ్‌లని తిరిగి ఇచ్చినందుకు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకో దానికి కూడా’
వెనక్కి తిరిగాను.
‘ఇంకో ఏమిటి?’ ఆమె ప్రశ్నించింది.
‘గుర్తు లేదా?’ నేను తలుపు దగ్గరికి వెళ్లి దాన్ని తెరుస్తూంటే అతని కంఠం ఖంగున వినిపించింది.
‘ఆగు’
నేను వెనక్కి తిరిగాను.
‘నా భార్య ప్రశ్నకి జవాబు చెప్పి వెళ్లు’
నేను గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి చెప్పాను.
‘మీ భార్యకి సాహసాలంటే ఇష్టమని చెప్పింది’
‘అవును. ఐతే?’
‘సింహం బోనులో దాని పక్కన తన ప్రియుడితో రతిని కోరుకుంది. నేను వారిద్దరికీ ఆ ఏర్పాటు చేశాను’
వెంటనే అతని మొహం ఎర్రబడింది.
బయటకి వెళ్లి తలుపు మూసాను. నేను నా కారు దగ్గరికి వెళ్తూండగా లోపలి నించి రివాల్వర్ పేలిన శబ్దం రెండు సార్లు వినిపించింది.
నేను కారెక్కి స్టార్ట్ చేసి పోనించాను. *

బోర్డెన్ డీల్ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి