క్రైమ్ కథ

ఆట (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా నించి ఓ స్పోర్ట్స్ బృందం మా ఓడలో అమెరికాకి వస్తోంది. నేను మాత్రం ఆ ఓడలోని కొందరు హంగేరియన్స్‌లోని ఒకర్ని. డెక్‌లో ఎక్సర్‌సైజ్ చేసే రష్యన్ బృందంలోని నాడియాని చూశాను. బాలే డేన్సర్ అయిన ఆమె అందరికంటే అందగత్తె.
‘నువ్వు చూసేది నాడియానేనా? ఆమె రష్యన్’ రష్యన్ అన్న పదాన్ని వత్తి పలుకుతూ మరిస్కా చెప్పింది.
నేను జవాబు చెప్పలేదు. మరిస్కా వంద మీటర్ల పరుగు పందెంలో పోలెండ్, వెస్ట్ జర్మనీ, ఫ్రాన్స్‌లలో సెకండ్ వచ్చింది.
‘మనం జర్మనీలోనో, ఫ్రాన్స్‌లోనో లేదా ఇటలీలోనో రాజకీ పునరావాసాన్ని కోరాల్సింది’ చెప్పింది.
నేను తల అడ్డంగా ఊపి చెప్పాను.
‘లేదు మరిస్కా, మన గమ్యం అమెరికా. మన బృందం అక్కడికి చేరేలోగా ఓపిక పట్టాలి. ఇందువల్ల ఇంకో దేశం నించి అమెరికాకి వెళ్లడానికి విమానం ఖర్చు ఉండదు’
బోరిస్ మా వైపు రాగానే ఆ టాపిక్‌ని ఆపేశాం. రష్యన్ టీమ్‌కి లీడరైన అతన్ని ఎవరూ ఇష్టపడరు. మా ప్రయాణ ఏర్పాట్లు అతనే చేస్తాడు. అతను దుర్మార్గుడని విన్నాను. అతని ఫిర్యాదులు వల్లే క్రితం బృందంలోని ఓ హై జంపర్, ఎక్కువ దూరం పరుగెత్తే ఓ రన్నర్, ఓ టెన్నిస్ ప్లేయర్‌లు మాయమయ్యారని వదంతి. బహుశ వాళ్లు సైబీరియాకి పంపబడి ఉంటారు.
‘రేపు రాత్రి ఆల్ నేషన్స్ ఫ్రెండ్‌షిప్ పార్టీ జరుగుతోంది. దానికి మీరు హాజరవుతున్నారా?’ బోరిస్ మరిస్కాని ప్రశ్నించాడు.
‘సారీ! నాకు జలుబు చేసింది. అది రేపటికి పెరగచ్చు’ మరిస్కా జవాబు చెప్పింది.
‘నాకూ సైనస్ సమస్య. నలభై ఎనిమిది గంటల దాకా అది తగ్గదు’ అతను నా నించి సమాధానాన్ని ఆశించక పోయినా చెప్పాను.
బోరిస్ నవ్వుని చూస్తే షార్క్ చేప మొహం గుర్తొచ్చింది.
‘అన్ని దేశాల బృందాల లీడర్స్‌తో మాట్లాడాను. పార్టీకి హాజరవడానికి వీలుగా ఇలాంటి ఆరోగ్య సమస్యలకి మెడికల్ బృందం చికిత్స చేస్తోంది’ బోరిస్ మరిస్కాతో చెప్పాడు.
మరిస్కా జవాబు చెప్పలేదు. ఆమెని పై నించి కింది దాకా చూసి చెప్పాడు.
‘నాకు హంగేరియన్స్ అంటే ఇష్టం. నేను కొంతకాలం బుడాపెస్ట్‌లో ఉన్నాను’
‘టూరిస్ట్‌గానా?’ ప్రశ్నించాను.
‘కాదు’
రష్యన్స్ బృందం ఎక్సర్‌సైజ్ పూర్తయింది. బోరిస్ వెంటనే నాడియా వైపు నడిచాడు. అతను తన వైపు రావడం గమనించిన ఆమె దూరంగా వెళ్లింది.
నాడియా వైపు నేను వెళ్లి ఆమె చేతిని పట్టుకుని అడిగాను.
‘ఏమిటి సమస్య?’
‘నేను ఇంత దాకా బోరిస్‌ని దూరంగా ఉంచగలుగుతున్నాను. కాని రేపు అమెరికాకి వెళ్లేలోగా అది సాధ్యం కాకపోవచ్చు అనిపిస్తోంది’ బాధగా చెప్పింది.
‘అతనితో నాకు దూరంగా ఉండు అని చెప్పచ్చుగా?’ అడిగాను.
‘రష్యన్స్ జీవితం అంత తేలిక కాదు. మేము తిరిగి రష్యా చేరాక బోరిస్ మా అందరి మీదా రిపోర్ట్‌లని రాస్తాడు. నాకు వ్యతిరేకంగా రాస్తే నన్ను సైబీరియాకి పంపేస్తారు’
‘ఇప్పటికే అతను ముగ్గుర్ని పంపాడని విన్నాను’
గుంభనంగా నవ్వి చెప్పింది.
‘వారంతా ఆడవాళ్లే. బోరిస్ అడిగింది వాళ్లు ఇవ్వలేదు. ఆడవారిని ఓ మగాడు అడిగేదే బోరిస్ అడిగాడు’

‘అతనితో ఓ ఆట ఆడతాను. అదృష్టం ఉంటే నేను గెలవచ్చు. అప్పుడు నువ్వు అతని విషయంలో విజేతవి అవుతాడు’ చెప్పాను.
* * *
పార్టీలో నేను బోరిస్ టేబుల్ ముందు కూర్చున్నాను.
‘న్యూయార్క్‌లో నీకు తెలిసిన వాళ్లెవరైనా ఉన్నారా?’ అడిగాను.
బోరిస్ నా వంక అనుమానంగా చూస్తూ చెప్పాడు.
‘లేరు. నీకు?’
‘్ధనవంతుడైన ఓ కజిన్ ఉన్నాడు. రెండేళ్ల క్రితం అతను రాజకీయ శరణార్థిగా అమెరికాకి వలస వచ్చాడు’
బోరిస్ మనసులో ఒకటే ఇంకింది.
‘్ధనవంతుడైన శరణార్థా అతను? పారిపోయే మునుపు ఏ స్విస్ బేంక్ నించో డబ్బుని అమెరికాకి బదిలీ చేశాడా?’ అడిగాడు.
‘లేదు. చేతిలో పెన్నీ కూడా లేకుండా వెళ్లాడు’
‘మరి? రెండేళ్లల్లో అమెరికాలో ఇంత ధనవంతుడు అయ్యాడా?’
‘అవును. హోబోకోర్‌లో స్విమ్మింగ్ పూల్ గల ఇల్లు, ఎనిమిది గుర్రాలు, భార్య కాక రెండు లిమజిన్స్, ముగ్గురు ప్రియురాళ్లు కూడా ఉన్నారు’
‘ముగ్గురా? ఇదంతా ఎలా సాధ్యం అయింది?’ బోరిస్ ఆసక్తిగా అడిగాడు.
‘జాన్ స్మిత్ అనే ఏజెంట్ వల్ల. స్టీఫెన్ తన అనుభవాలని ఓ పుస్తకంగా రాశాడు. అది బాగా అమ్ముడై ధనవంతుడు అయ్యాడు. దాని సినిమా హక్కులకి కూడా బాగా డబ్బు వచ్చింది’
‘నాకు తెలిసి వేల మంది అమెరికాకి రాజకీయ శరణార్థులుగా వెళ్లారు. మరి వాళ్లంతా పుస్తకాలు రాసి ఎందుకు ధనవంతులు కాలేదు?’
‘వారిలా కాక స్టీఫెన్ హంగరీలో ఓ ముఖ్యమైన వ్యక్తి. అతని పుస్తకం పేరు తెలుసా? ‘నేను కెజిబి ఏజెంట్‌ని. హంగరీ దేశంలో అతను రష్యన్ గూఢచారి సంస్థ కెజిబికి ఏజెంట్‌గా పని చేశాడు. అమెరికన్స్‌కి కెజిబి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువ. ఇలాంటి వాటిలో ఇది రెండో పుస్తకం. ప్రతీ కెజిబి ఏజెంట్ అనుభవాలు ఇంకో ఏజెంట్ అనుభవాలతో పోలి ఉండవు కాబట్టి అవన్నీ బెస్ట్ సెల్లర్స్ అవుతూంటాయి’
‘ఈ జాన్ స్మిత్ ఎక్కడ ఉంటాడు?’ బోరిస్ నన్ను ఆసక్తిగా అడిగాడు.
‘చికాగోలోని స్టేట్ స్ట్రీట్‌లో. అతని పేరుతో ఫోన్ నెంబర్ డైరెక్టరీలో ఉండచ్చు’
నేను బోరిస్ ముందు నించి లేచేసరికి అతను ఈ లోకంలో లేని నా కజిన్ స్టీఫెన్ గురించి ఆలోచిస్తూండి ఉంటాడు.
* * *
ఆ రాత్రి సముద్రంలో చిక్కటి పొగమంచు అలముకుంది. దాంతో ఓడ వేగాన్ని బాగా తగ్గించి హారన్‌ని తరచు మోగిస్తూ పోనించసాగారు. న్యూయార్క్‌ని సమీపించడంతో చాలా ఓడలు మాకు తారసపడి ట్రాఫిక్ రద్దీగా ఉంది. ఆ రాత్రి నాడియా, మరిస్కా, నన్ను, బోరిస్‌ని ఓ టేబుల్ ముందు కూర్చోపెట్టారు. అతను తాగుతూ ఏదో ఆలోచించసాగాడు. అందరు రష్యన్స్‌లా బోరిస్ కూడా ఎక్కువ తాగుతాడు. రాత్రి పదికి బార్లో చెక్స్, స్లోవేకియన్స్ పోట్లాడుకుంటూంటే వారిని లిథువేలియన్స్ నవ్వుతూ చూశారు. బోరిస్ నాడియాతో చెప్పాడు.
‘మనం డెక్ మీద నడుద్దాం రా’
‘వద్దు. పొగమంచు నా గొంతుకి మంచిది కాదు’ ఆమె నిరాకరించింది.
‘నువ్వు గాయకురాలివి కావు. నీకు సైబీరియాలో పిల్లల టీచర్‌గా పని చేయాలని ఉందా?’
ఆ సమయంలో డేన్స్ మ్యూజిక్ ఆరంభం అవడంతో నేను ఆమె చేతిని పట్టుకుని డేన్స్ ఫ్లోర్ మీదికి లాక్కెళ్లాను.
‘నాడియా! నువ్వు బోరిస్ చెప్పినట్లు ప్రస్తుతానికి విను’ సూచించాను.
‘అందరిలోకి నువ్వే ఈ మాట చెప్పేది?’ నాడియా నివ్వెరపోతూ అడిగింది.
‘పొగమంచు డెక్ మీద నడక వరకే నేను చెప్పేది. అతను బాగా తాగి ఉన్నాడు. కాబట్టి ప్రమాదకారి కాదు. అసలు అతను నడవగలడా అని నా అనుమానం. అది ఫలిస్తే నాకో మంచి పథకం తట్టింది. ఇంక నువ్వు బోరిస్‌ని చూడవని నా నమ్మకం’
‘నీ పథకం ఏమిటి జానోస్?’ ఆమె ప్రశ్నించింది.
మేము డేన్స్ ఫ్లోర్ మీంచి బోరిస్ దగ్గరికి వెళ్లాము. అతను లేచి నాడియా చేతిని పట్టుకుని డెక్ వైపు నడిచాడు. అతను తడబడకుండా నడవడాన్ని చూసి నేను అనుకున్నంతగా అతనికి మత్తు ఎక్కలేదని అనిపించింది. నేను కొద్దిగా భయపడుతూ డెక్ మీదకి నడిచాను. వాళ్లు వెళ్లిన తలుపులోంచి బయటకు వచ్చాక వారు ఎటు వెళ్లారో నాకు తెలీలేదు. ఎడమ వైపా? కుడివైపా? నాకు ఎలాంటి శబ్దం వినపడలేదు. కుడి వైపు ఓ డజను అడుగులు వేశాక ఇద్దరు కనిపించారు. అతను చెక్ హై జంపర్. ఆమె రొమేనియన్ జిమ్నాస్ట్. వారిద్దరూ ఒకర్ని మరొకరు చుంబిస్తున్నారు.
‘ఎక్స్‌క్యూజ్‌మి. ఇటు ఎవరైనా వెళ్లడం మీరు చూశారా?’ అడిగాను.
‘లేదు’
నేను వెనక్కి తిరిగి ఎడమ దిక్కుకి నడుస్తూ, దారిలో అనేక వస్తువులని ఢీకొడుతూ జాగ్రత్తగా వింటూ నడవసాగాను. నాకు వినపడ్డప్పుడల్లా ఓడల హార్న్ శబ్దాలే. అవి వినపడనప్పుడు పూర్తి
నిశ్శబ్దం. నేను తప్పుగా ఇటు వైపు వచ్చానా, వెనక్కి తిరగాలా అనుకుంటూండగా సమీపంలోంచి ఓ పెద్ద అరుపు వినిపించింది.
గబగబా అటు వైపు నడిచాను. ఇరవై అడుగుల దూరంలో వాళ్లు కనిపించారు. పొగ మంచులో అతను నన్ను గమనించలేదు. వంగి బోరిస్ ఓ చేతిని, ఓ కాలుని పట్టుకుని గుండ్రంగా మూడుసార్లు తిప్పి వదిలేశాను. బోరిస్ పెద్దగా అరుస్తూ ఓడ రెయిలింగ్ మీంచి నీళ్లల్లోకి పడిపోయాడు.
‘ఇదేనా నీ తెలివైన పథకం?’ నాడియా నన్ను భయంగా ప్రశ్నించింది.
‘అవును. కాని ఇప్పుడు ఇక్కడ నువ్వు లేవని గుర్తుంచుకో. ఇందులో నీ జోక్యం లేదు’
‘అసలు ననె్నందుకు అనుమానిస్తారు?’ నాడియా అడిగింది.
‘బాల్‌రూంలోంచి అతనితో కలిసి నువ్వు బయటకి రావడం చాలామంద చూశారు. నువ్వు చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పొగమంచులో జరిగింది ఎవరూ చూడలేదు కాబట్టి బోరిస్ ఎలా మాయం అయ్యాడో ఎవరికీ తెలీదు’
‘అతను ప్రమాదవశాత్తు సముద్రంలోకి పడిపోవడం చూశానని చెప్తాను’
‘అది ఎవరూ నమ్మరు. పైగా ప్రమాదవశాత్తు మరణించడంతో కెజిబి ఏజెంట్లు నిన్ను అనుమానిస్తారు. ఐతే బోరిస్ మాయమైన సంగతి రేపు ఉదయం దాకా ఎవరికీ తెలీదు. ఆసరికి మన ఓడ న్యూయార్క్‌కి చేరుకుంటుంది. ఓ అడుగు ముందుకు వేస్తే స్వేచ్ఛాజీవులం అవుతాం’
‘నువ్వు పారిపోవాలలని అనుకుంటున్నావా?’ నాడియా ఆశ్చర్యంగా అడిగింది.
‘అవును. మేము చాలాకాలంగా ఇలాంటి అవకాశం కోసం చూస్తున్నాము’
‘మేము? ఇంకా ఎవరు?’
‘మరిస్కా, నేను. అమెరికా చాలా పెద్ద దేశం. వేగంగా పరిగెత్తే రన్నర్స్‌కి ఆశ్రయం ఇచ్చే దేశం అది’
‘అది నాకు అనుమానమే. కాని నాకు ఇంకో దారి లేదు. నేను రష్యాకి వెళ్లాక బోరిస్ మరణానికి ననే్న బాధ్యురాల్ని చేస్తారు’ నాడియా విచారంగా చెప్పింది.
* * *
మర్నాడు ఉదయం మా ఓడ న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఆగినప్పుడు వాతావరణం స్వచ్ఛంగా ఉంది. మేము ఓడ దిగుతూంటే ఓడ లౌడ్ స్పీకర్‌లో బోరిస్‌ని రిసెప్షన్ దగ్గరికి రమ్మని పిలిచే ప్రకటన వినిపించింది. అతని మీద ఓ వదంతి పుట్టింది. బోరిస్ బాగా తాగి ఓడలోని ఓ మూల నిద్ర పోతున్నాడన్నది అది. దాన్ని నేను, నాడియానే పుట్టించాం. మమ్మల్ని హోటల్‌కి తీసుకెళ్లారు.
ఆటల పోటీలో పాల్గొని అవి పూర్తయ్యాక రాజకీయ పునరావాసాన్ని కోరాలని ముందు అనుకున్నాం. కాని దాన్ని వాయిదా వేయడం ప్రమాదానికి దారి తీయచ్చని మరిస్కా హెచ్చరించింది. దాంతో మాకు దొరికిన మొదటి అవకాశంలోనే మేము సమీప పోలీసుస్టేషన్‌కి వెళ్లి రాజకీయ శరణార్థులుగా డిక్లేర్ చేశాం. నేను ఇందుకు ఎన్నడూ చింతించలేదు.
* * *
మూడు నెలల తర్వాత జరిగిన నా పెళ్లికి మా టీమ్‌లోని బేలా అనే మరో క్రీడాకారుడు కూడా హాజరయ్యాడు. అతను కూడా రాజకీయ శరణార్థిగా మారిపోయాడు. అతను నాతో కరచాలనం చేస్తూ అడిగాడు.
‘బోరిస్‌ని సముద్రంలో పడేసింది నువ్వేనన్న మాట’
వెంటనే నా మొహం కొద్దిగా పాలిపోయింది. ఆ సమాచారం బయటకి వస్తే నేను నాశనమై పోతాను. బాధితుడు రష్యనే ఐనా అమెరికాలో ఓ హంతకుడికి ఆవాసం ఇవ్వరు.
‘దాన్ని మీరు చూశారా?’ అడిగాను.
‘లేదు. కాని బోరిస్ ఇది మీ పనని చెప్తున్నాడు’
‘అంటే బోరిస్ వలాకోవ్ బతికే ఉన్నాడా?’ నిర్ఘాంతపోతూ అడిగాను.
బేలా నవ్వి చెప్పాడు.
‘నువ్వు అతన్ని బయటకి విసరగానే పక్కనే వెళ్ళే ఓ చిన్న ముడి సరుకు రవాణా ఓడలోని లైఫ్ బోట్ మీద కప్పిన కేన్వాస్ మీద పడ్డాడు. దాంతో అరగంట పైనే అతనికి స్పృహ లేదు’
నేను రిలీఫ్‌గా ఫీలయ్యాను.
‘తర్వాత?’ ఆసక్తిగా అడిగాను.
‘బోరిస్‌కి మెలకువ వచ్చాక తక్షణం ఆ ఓడ కెప్టెన్ దగ్గరికి వెళ్లి, తను అమెరికాలో రాజకీయ పునరావాసం కోరుతున్నానని, రాజకీయ శరణార్థిగా అమెరికాలోనే ఉండదలచుకున్నానని, తను కెజిబి ఏజెంట్‌నని, అది అమెరికాకి లాభమని, ఆ మేరకి వైర్‌లెస్‌లో చికాగోలో స్టేట్ రోడ్‌లోని జాన్‌స్మిత్‌కి సమాచారం పంపమని కోరాడు’
‘ఓ! బోరిస్ కూడా అమెరికాలోనే ఉన్నాడన్న మాట’
బేలా మళ్లీ నవ్వాడు.
‘లేడు. దురదృష్టవశాత్తు నువ్వు బోరిస్‌ని పడేసిన ఓడ రష్యన్ ఓడ! రష్యన్ మిత్రులు ఇదంతా నాకు చెప్పారు. ఇప్పుడు అతను సైబీరియాలో హార్డ్ లేబర్ శిక్షని అనుభవిస్తున్నాడు’ చెప్పాడు.
నాడియాతో నా పెళ్లి బాగా జరిగింది. నా చెల్లెలు మరిస్కా అందుకు చాలా ఆనందించింది.

(జాక్ రిట్చీ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి