హైదరాబాద్

గ్రేటర్ నాటిన మొక్కలు 26.23లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: భాగ్యనగరంలో మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం జిహెచ్‌ఎంసి ఈ నెల 11న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం వరకు ఈ కార్యక్రమం కింద జిహెచ్‌ఎంసి మొత్తం 26లక్షల 23వేల మొక్కలను నాటినట్లు కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన శుక్రవారం పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డితో కలిసి నగరంలోని పలు దేవాలయాల వద్ధ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 24న బోనాల జాతర జరగనున్న సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాంకాళీ దేవాలయం వద్ధ ఏర్పాట్లను సమీక్షించిన కమిషనర్ దేవాలయానికి వచ్చిన భక్తులకు మొక్కలను అందజేశారు. ఆ తర్వాత పాతబస్తీలో బోనాల జాతరకు సిద్దమవుతున్న లాల్‌దర్వాజలోని ఆలయ ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. దేవాలయానికి విచ్చేసిన భక్తులకు ఆయన తులి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా జరిగే బోనాల పండుగ సందర్భంగా నగరాన్ని హరితమయంగా చేయటానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఈ నెల 11వ తేదీన ఒక్కరోజే అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో నగరంలో దాదాపు 29లక్షల పై చిలుకు మొక్కలు నాటినట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసి ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 81 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యానికి గాను నేటి వరకు దాదాపు 26లక్షల 23వేల మొక్కలను నాటినట్లు వివరించారు. నగరంలోని ప్రతి పాఠశాల,కళాశాలల్లో జిహెచ్‌ఎంసి అధికారులు పర్యటించి విద్యార్థులచే పెద్ద ఎత్తున మొక్కలు నాటించటంలో నిమగ్నమయ్యారని తెలిపారు. మొక్కలు నాటడమే గాక, వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, మొక్కలు నాటుతున్న వారు కూడా పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్న విషయంలోనూ విద్యార్థులకు అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు. ఆ తర్వాత కమిషనర్ రాజేంద్రనగర్ సర్కిల్‌లోని ఎవఎం పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థినీ విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి రెండు మొక్కలను నాటడంతో పాటు వాటి పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, శుక్రవారం కూడా జిహెచ్‌ఎంసి పలు చోట్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ బంజారాహిల్స్‌లోని అన్వర్ ఉలూమ్ కాలేజీలో మొక్కలు నాటారు.