హైదరాబాద్

నేడే పాతబస్తీ బోనాలు.. సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చార్మినార్, జూలై 30: ఆషాడమాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాల జాతరలో భాగంగా ఆదివారం జరగనున్న పాతబస్తీ బోనాలకు సర్వం సిద్ధమైంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే సౌత్‌జోన్‌లోని దాదాపు అన్ని దేవాలయాల వద్ధ భక్తులకు వౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యాయి. నగరంలో భారీ విధ్వంసానికి కుట్ర చేసిన ఉగ్రవాదులు ఇటీవలే జాతీయ దర్యాప్తు సంస్థకు పట్టుబడిన నేపథ్యంలో బోనాలకు పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. అంతేగాక, అడుగడుగున నిఘాను ఏర్పాటు చేసి ఉత్సవాల్లో పాల్గొనే వారి ప్రతి ఒక్కరి కదలికలను గమనించేందుకు వీలుగా గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. నగరంలోని సికింద్రాబాద్ మినహా మిగిలిన దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా, ప్రశాంతంగా జరిగిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా పాతబస్తీలోని ప్రతిష్టాత్మకమైన పలు దేవాలయాల్లో కూడా బోనాలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. పాతబస్తీ బోనాలు, ఆ మరుసటి రోజు పలు ప్రాంతాల్లో రంగం, బలిగంట ఊరేగింపు వంటి కార్యక్రమాలనంతరం గోల్కొండలోని శ్రీ జగదాంబిక మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మరో రెండురోజుల్లో నగరంలో బోనాల జాతర ముగియనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ, పోతరాజు నాట్య వినాస్యాలు, విచిత్ర వేషధారణలతో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ బోనాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక, ఇరుగుపొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. వారి సౌకర్యార్థం ఆర్టీసి ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా చారిత్రాత్మకమైన లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని మహాంకాళీ అమ్మవారిని, అలాగే శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంతో పాటు చార్మినార్‌లోని ఓ మినార్‌లో వెలసిన శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు విచ్చేస్తున్నందున పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆర్‌ఏఎఫ్, సిఐఎస్‌ఎఫ్ బలగాలతో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేగాక, చారిత్రాత్మకమైన పలు దేవాలయాల ఆవరణలో పోలీసులు బోనాలు ఊరేగింపుగా వచ్చే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు.
ఎర్రమంజిల్ నల్లపోచమ్మ దేవాలయంలో..
ఎర్రమంజిల్‌లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో కూడా ఆదివారం బోనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు స్థానిక పంచాయితీ కమిటీ అధ్యక్షులు బందుగుల నర్సింగ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలకు స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి ముఖ్య అతిధిగా హజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం బోనాలతో పాటు మరుసటి రోజైన ఆగస్టు 1వ తేదీన ఫలహారం బండి ఊరేగింపు, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నర్సింగ్‌రావు తెలిపారు.
ముస్తాబైన దేవాలయాలు
నార్సింగి: నగరంలో పాతబస్తీ బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ బోనాల ఉత్సవాల్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని అమ్మవారి దేవాలయాలను కమిటీ నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాలు వెలిగిపోతున్నాయి. విద్యుత్ లైట్లుతో కమాన్లను కూడా అందంగా అలంకరించారు. నగరంలోని కార్వాన్, లంగర్‌హౌస్, జియాగూడ, గుడిమల్కాపూర్, గోల్కొండ, మెహిదీపట్నం, విజయనగర్ కాలనీ, మాసాబ్‌ట్యాంక్, మల్లేపల్లి, మంగళహాట్, ధూల్‌పేట్, గోషామహల్, పురానాపూల్ తదితర ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివిధ ఆలయాల కమిటీ నిర్వాహకులు తెలిపారు. చారిత్రత్మాకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం ఉమ్మడి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆదివారం బోనాలు ఉత్సవాలు ఉదయమే ప్రారంభమై రాత్రి వరకు ఘనంగా జరుగుతాయి. కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రతి సంవత్సరం మాదిరిగానే క్యూ లైన్ కోసం బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం అమ్మవారి తొట్టెలు పార్థివాడ చౌరస్తా (పురానాపూల్) నుంచి బయలుదేరి అక్కడి నుంచి హరదర్వాజ, టప్పాచబుత్రా మీదుగా కార్వాన్ దేవాలయం వద్దకు రాత్రికి చేరుకుంటుంది. అమ్మవారికి రాత్రి ఈ తొట్టెలను సమర్పిస్తారని పేర్కొన్నారు. నగరంలో ఎక్కడా లేనివిధంగా భారీఎత్తులో (40్ఫట్లు) తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తారు. బోనాలు తెచ్చిన మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈబోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ బోనాల ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు పాల్గొంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు ప్రజలను కోరారు. లంగర్‌హౌస్‌లో కూడా శ్రీ బుజిలీ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో భారీఎత్తున బోనాల ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాల కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. లంగర్‌హౌస్ బాపూఘాట్ శ్రీ గుంటు పోచమ్మ దేవాలయంలో కూడా పెద్దఎత్తున బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకుడు గోవింద్‌రాజ్ తెలిపారు.
బలిగంప, రంగం...
చారిత్రత్మాకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయంతో పాటు లంగర్‌హౌస్‌లోని శ్రీ బుజిలీ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో కూడా రంగం, బలిగంప కార్యక్రమం కొనసాగుతుంది. బలిగంప, రంగం సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయి. ఈ రంగం కార్యక్రమంలో పోతురాజుల నృత్యాలు కూడా ఉంటాయి. శ్రీ బుజిలీ మహంకాళీ దేవాలయం నుంచి బయలుదేరి నల్లపోచమ్మ దేవాలయం వద్ద గావు కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం బలిగంప కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొంటారు.
బోనాల ఉత్సవాల్ని పురస్కరించుకుని అమ్మవారికి ఫలహారపు బండ్లను కూడా భక్తులు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా అమ్మవారికి ప్రసాదం సమర్పించిన అనంతరం భక్తులకు పంచుతారు. ఈ ఫలహార బండ్లను కొందరు భక్తులు గొర్రెపొటేళ్లతో అమ్మవారి దేవాలయం వరకు తీసుకువస్తారు.
తొట్టెల నిమజ్ఞనం ఊరేగింపు...
కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం, లంగర్‌హౌస్‌లో శ్రీ బుజిలీ మహంకాళీ అమ్మవారికి సమర్పించిన భారీ తొట్టెలను సోమవారం రాత్రి మూసీనదిలో నిమజనం కోసం భారీ ఊరేగింపుతో తరలిస్తారు. అర్ధరాత్రి వరకు ఈ ఊరేగింపుకొనసాగుతుంది. ఈ ఊరేగింపులో డప్పు వాయిద్యాలతో పోతురాజుల నృత్యాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ భారీ తొట్టెల ఊరేగింపులో అడుగడుగునా స్వాగత వేదికలు కూడా ఏర్పాటు చేస్తారు. కార్వాన్ ప్రాంతంలోని ముస్లిం సోదరులు కూడా ప్రత్యేకమైన స్వాగత వేదికను ఏర్పాటు చేసి ఈ భారీ తొట్టెలకు స్వాగతం పలుకుతారు. ఈ తొట్టెల ఊరేగింపులో భారీగా భక్తులు పాల్గొంటారు.
చారిత్రత్మాకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాల కోసం భక్తులు వేలాది మంది వస్తుంటారని అందుకోసం భారీగానే పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు పశ్చిమ మండల డిసిపి ఎ.వెంకటేశ్వర్‌రావు తెలిపారు. కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం ప్రధాన రహదారిలో వాహనాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా భక్తులు ఎక్కువగా వస్తుంటారని దీంతో టప్పాఛబుత్రా చౌరస్తానుంచి రాంసింగ్‌పూరా వరకు రోడ్డుపై వాహనాలను అనుమతించేంది లేదని పేర్కొన్నారు. పురానాపూల్ నుంచి జియాగూడ మీదుగా రామ్‌సింగ్‌పురాకు వాహనాలను దారి మళ్లిస్తామని పేర్కొన్నారు. ఈ దారి మళ్లీంపు కార్యక్రమం అదివారంతోపాటు సోమవారం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ బోనాల ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని భక్తులకు డిసిపి పిలుపు నిచ్చారు.