హైదరాబాద్

నిరుద్యోగులను నిండా ముంచిన కేసిఆర్ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, ఆగస్టు 12: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్, టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు తెలుగుయువత, టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలీసులు ధర్నాకు తరలివచ్చిన ఆందోళనకారులను మెరుపువేగంతో అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేడియంలో అరెస్టుచేసిన వారిని బంధించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన సిఎం కెసిఆర్ మాట తప్పారని, నిరుద్యోగులను, ఉద్యోగులను నిండా ముంచారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన నిరుద్యోగులు విద్యార్థులను కెసిఆర్ ఘోరంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ తెలంగాణ ప్రజలకు కాకుండా కెసిఆర్ కుటుంబానికి మాత్రమే బంగారు పంట పండిస్తుందని అన్నారు. వారు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్షాలపై కక్షసాధింపు ధోరణి ప్రదర్శించడం కెసిఆర్ సర్కార్‌కు ఆనవాయితీగా మారిపోయిందని అన్నారు.
కేవలం ప్రకటనలు నోటిఫికేషన్‌లతోనే సరిపెడుతూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడుతున్నాయన్నారు. కేసిఆర్ నియంతృత్వ ధోరణికి స్వస్తిపలికి విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించిన ఏ ప్రభుత్వాలు చరిత్రలో మనుగడ సాగించలేకపోయాయని, కేవలం విద్యార్థులను నిరుద్యోగులనే కాకుండా అన్నివర్గాల ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్న కెసిఆర్ సర్కార్‌కు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి మోసం చేశారని, ఇప్పటివరకు చెప్పిన ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చిన పాపానపోలేదని వారు దుయ్యబట్టారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిని కెసిఆర్ కుటుంబ పాలకులు టార్గెట్‌లు చేసి వారిని అణచివేతకు గురిచేస్తున్నారన్నారు.
ఇలా చేసిన వారి చరిత్ర ఏమైందో వారికి తెలిసినప్పటికీ ఇదే పంథాను అవలంబించడం సరికాదని హితవుపలికారు. ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్ని అడ్డంకులు కల్పించినా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి న్యాయం జరిగే వరకు పోరాడుతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షులు రఘకిరణ్, శరత్‌చంద్ర, వేణుగోపాల్, రామకృష్ణ, ఓంప్రకాశ్, పుల్లారావు, మోహన్‌ముదిరాజ్, రాములు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.