హైదరాబాద్

క్రీడా వనంలో ‘సింధూ’రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: భారతీయుల ఆశాకిరణం బాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఒలింపిక్ ప్రస్థానం జిహెచ్‌ఎంసి నుంచే మొదలైంది. ఆమె షటిల్ బ్యాడ్మింటన్ ప్రస్తానానికి బాటలు బల్దియా నుంచే పడ్డాయి. 2005లో పదేళ్ల ప్రాయంలో అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని గురుగోబింద్ సింగ్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్‌లో చేరిన సింధు నేడు ప్రపంచ మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్న ఒలింపిక్‌లో ఎంతో చాకచక్యంగా ఆడుతూ తన సత్తాను చాటడం జిహెచ్‌ఎంసికే గర్వకారణం. రియోలో ఆమె ప్రదర్శనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నతనం నుంచే షటిల్ బ్యాడ్మింటన్‌లో సింధు తన సత్తాను చాటుతూ ప్రత్యర్థులను ఖంగు తిన్పించింది. అప్పట్లో జిహెచ్‌ఎంసి నిర్వహించిన అండర్ 12, అండర్ 15 టోర్నమెంట్‌లలో విజేతగా నిలిచి, అదే స్పూర్తితో నేడు అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది. మూడేళ్ల పాటు జిహెచ్‌ఎంసిలో ప్రాథమిక స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందిన తర్వాత సింధు బ్యాడ్మింటన్ అకాడమీలో చేరింది. అయినప్పటికీ జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి క్రీడాపోటీలు, వేసవి శిక్షణ శిబిరానికి విధిగా హాజరయ్యేదని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా గత ఏప్రిల్ మాసంలోనూ నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులను అందజేయటంతో పాటి జిహెచ్‌ఎంసి కమిషనర్ డా. బి.జనార్దన్ రెడ్డితో బ్యాడ్మింటన్ కూడా ఆడింది. దీంతో పాటు నగరంలో ఇటీవల భారీ ఎత్తున నిర్వహించిన హరితహారం కార్యక్రమం సందర్భంగా జిహెచ్‌ఎంసి అధికారులు కోరిన విధంగా నార్త్‌జోన్‌లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తనవంతు భాగస్వామ్యాన్ని చాటుకుంది సింధు.
జిహెచ్‌ఎంసికి ఎంతో గర్వకారణం : మేయర్
రియో 2016 క్రీడల్లో నగరానికి చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఫైనల్స్ చేరటం జిహెచ్‌ఎంసికి, జంటనగరవాసులందరికీ ఎంతో గర్వకారణం. ముఖ్యంగా ఆమె తన క్రీడా కెరీర్‌ను జిహెచ్‌ఎంసికి చెందిన గురుగోబింద్ సింగ్ స్టేడియం నుంచి ప్రారంభించటం హర్షించదగిన విషయం. ప్రస్తుతం కొనసాగుతున్న క్రీడా శిబిరాల్లో కూడా సింధు లాంటి క్రీడాకారులను తయారు చేస్తాం. అంతేగాక, కొత్త స్కూల్స్, కాలేజీల నిర్మాణానికి అనుమతులిచ్చే సమయంలో ఆట స్థలాల ఏర్పాటు విషయాన్ని తప్పకుండా పరిశీలించిన తర్వాతే అనుమతులివ్వాలని భావిస్తున్నాం.
క్రీడలకు మరింత ప్రాధాన్యం : కమిషనర్
జిహెచ్‌ఎంసి స్టేడియం నుంచి షటిల్ బ్యాడ్మింటన్ నేర్చుకుని నేడు దేశానికి గర్వకారణంగా మారిన సింధు లాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు క్రీడలకు మరింత ప్రాధాన్యమిస్తాం. నగరంలో మొత్తం 5వేల పాఠశాలలు, 15లక్షల పై చిలుకు ఉన్న విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు వారి అవసరాలకు తగిన విధంగా క్రీడామైదానాలు, స్టేడియంలను అందుబాటులోకి తెచ్చాం.
ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అవి క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. పాఠశాలల విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ స్టేడియంలలోకి వారిని నిర్ణీత గడువులో అనుమతిస్తున్నాం. మున్ముందు వి.వి. సింధు లాంటి క్రీడాకారులను మరింత అధిక సంఖ్యలో తీర్చిదిద్దటమే మా లక్ష్యం.