రంగారెడ్డి

మహానగరం జలమయం - జనజీవనం అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, ఆగస్టు 31: భారీ వర్షానికి నాచారం డివిజన్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి నాచారం, అంబేద్కర్‌నగర్, ఎర్రకుంట, గాంధినగర్ కాలనీ ఇళ్లలోకి వర్షపునీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎర్రకుంటలో నాలాలు కబ్జాలకు గురై కొద్దిపాటి వర్షానికి మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నాయని ఎరుకల బస్తీ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఎగువన కురుస్తున్న వర్షావనికి నాచారం ఎర్రకుంట చెరువు పోంగిపోర్లుతూ గాంధీనగర్, అంబేద్కర్‌నగర్, కార్తీకేయనగర్, విఎస్‌టినగర్, భవానీనగర్, రాఘవేంద్రనగర్, ఇందిరానగర్, బాబానగర్, దుర్గనగర్ కాలనీలు పూర్తిగా నీటిలో మునిగిపోయి నడవడం తీవ్ర ఇబ్బందిగా ఉందని ప్రజలు తెలిపారు.
పొంగిన నాచారం ప్రధాన నాలా
భారీ వర్షానికి నాచారం ప్రధాన రహదారి నాలా పొంగుతూ గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. కొద్దిపాటి వర్షానికి ప్రతిసారి నాచారం రహదారి నాలా పొంగుతూ వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని కార్పొరేటర్ ఎన్ని సార్లు చెప్పినా అధికారులు దృష్టి పెట్టలేదని తెలిపారు. నాచారం అంబేద్కర్ విగ్రహాం దగ్గర నీరు పొంగుతూ వీరారెడ్డినగర్, సిఎస్‌బ్రదర్స్ షోరూంలోకి భారీగా వర్షపు నీరు చేరిందని సాయిజేన్‌శేఖర్ తెలిపారు.
గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం
నాచారం ప్రధాన రహదారిపై నాలా పొంగడంతో గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వాహనం వర్షపు నీటిలో చిక్కుకోవడంతో రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. నాచారంలోని లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపించేలా ఉన్నాయని రాఘవేంద్రనగర్ కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రకుంట చెరువులో గుర్రపుడెక్క చేరి వర్షపునీరు సాఫీగా వెళ్లకుండా ఇళ్లలోకి చేరుతున్నాయని కాలనీ ప్రజలు తెలిపారు.
కుషాయిగూడలో భారీ వర్షం
కుషాయిగూడలో ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి జమ్మిగడ్డ, జైజవాన్‌నగర్, సోనియగాంధీనగర్, భవాణినగర్, చిన్నచర్లపల్లి, భరత్‌నగర్, పూకాట్‌నగర్, టీచర్స్ కాలనీ, కాప్రా, యాదవబస్తీ, బిజెఆర్ కాలనీలో వర్షపునీరు ఇళ్లలోకి చేరిపోయాయని కాలనీ ప్రజలు తెలిపారు. కాప్రా శానిటేషన్ అధికారులను డిప్యూటీ కమిషనర్ సరోజ ఎప్పుటికప్పుడు అప్రమత్తం చేస్తు కాలనీలో వర్షపునీరును తొలగించారు.
హైటెక్ సిటీలో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
గచ్చిబౌలి: భారీ వర్షం హైటెక్ సిటీ ప్రాంతాలను ముంచేసింది. బుధవారం ఉదయం నుంచే వర్షం ప్రారంభం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో ఎక్కడ గుంతలు వున్నాయో, ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయో తెలియక వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఉదయం నుండే వర్షం రావడంతో ఐటి ఉద్యోగులు కార్లలో కార్యాలయాలకు సిద్ధం కావడంతో హైటెక్ సిటీ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయాయి. లింగంపల్లి చౌరస్తా నుండి గచ్చిబౌలి ఐటి కారిడార్ వరకు, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వరకు, జూబ్లీహిల్స్ నుండి హైటెక్ సిటీ వరకు, కెపిహెచ్‌బి నుండి రహేజా ఐటి పార్కు వరకు, హఫీజ్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్లన్నీ వాహనాలతో నిండి పోవడంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో గుంతలు కనబడక గుంతల్లో దిగబడిపోయిన కార్లు ట్రాఫిక్‌కు మరింత అంతరాయం కలిగించాయి. మాదాపూర్‌లోని కాసాని జిఆర్ హోటల్ ముందు ఉన్న డ్రైన్ చెత్తచెదారాలతో నిండిపోవడంతో వర్షపునీరు రోడ్డుపై ప్రవహించడంతో ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్‌ఎంసి సిబ్బంది చెత్తను తొలగించి నీటిని మళ్లించారు. మాదాపూర్ నుంచి రహేజా ఐటి పార్కుకు సుమారు రెండు కిలోమీటర్లు ఉండగా ఈ దూరం చేరాలంటే దాదాపు రెండు గంటల సమయం పట్టిందంటే ఇక ట్రాఫిక్ ఏ తీరుగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారీ వర్షంలోనే విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది నిమగ్నమై వాహనదారుల ఇబ్బందులను కొంతమేర తగ్గించారు. ఫోటో రైటప్ :
బాలానగర్‌లో...
బాలానగర్: మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలొని బాలానగర్, ఫతేనగర్, ఫీరోజ్‌గూడ, ఒల్డ్ బోయిన్‌పల్లి, నర్సాపూర్ చౌరస్తా తదితర ప్రాంతాలలో వర్షానికి వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. భారీ వర్షానికి డ్రైనేజీలోకి, నాలాలలోకి వరద నీరు చేరడంతో ఉప్పొంగి వరద నీరంతా రోడ్లపై ఏరులై పారింది. దీంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో పాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో స్థానికులు నానా అవస్థలు పడ్డారు. ఉదయమే ఆఫీసులలకు, డ్యూటీలకు వెళ్లే ప్రజలు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ డివిజన్ పరిధిలోని ఇందిరాగాంధీపురంలోని బ్రిడ్జి వద్ద చేరిన వరద నీటిని పరిశీలించారు.
రాజేంద్రనగర్‌లో...
రాజేంద్రనగర్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం రాజేంద్రనగర్‌లో భారీ వర్షం కురిసింది. సర్కిల్ పరిధిలో భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై వర్షపునీరు చేరడంతో రోడ్లన్నీ కుంటలుగా మారాయి. వాహనచోదకులు నరకయాతన అనుభవించారు. వరదనీటిలో జలమయమైన ముందుకు వెళ్లక వెనుకకు రాలేక తీవ్ర అవస్థలు పడ్డారు. ఉదయం 6.30 గంటల నుంచి వర్షం మొదలై ఎడతెరిపి లేకుండా 11.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఉదయం పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
స్తంభించిన ట్రాఫిక్ ...
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉప్పర్‌పల్లి పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే రూప్ వే సమీపంలో భారీ వర్షపునీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నడుంలోతు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నీటిలో నిలిచిపోయి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వాహనాల ఇంజన్‌లోకి నీరు చేరడంతో వాహనచోదకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అరాంఘర్ చౌరస్తా రైల్వే అండర్‌పాస్, బుద్వేల్ అండర్ రైల్వేపాస్, శివరాంపల్లి రాందేవ్‌బాబా సమీపంలోని మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నాలాలు పొంగిపొర్లి రోడ్లు చెరువులను తలపించాయి. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు, డ్రైనేజీ నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లల్లో సామాగ్రి, దుస్తులు నీటిలో తడిసి ముద్ధయ్యాయి.
భారీ వర్షానికి రాజేంద్రనగర్ సర్కిల్ అతలాకుతలం అయి జనజీవనం స్తంభించి ప్రజలు నరకయాతన అనుభవించారు. ఏ బస్తీ, ఏ రోడ్డును చూసినా మోకాళ్లలోతు నీరు ప్రవహిస్తూ చెరువులను తలపించాయి. అధికారుల బృందం, ఆయాకార్పొరేటర్లు ఆయా బస్తీల్లో ఉదయం నుంచి వర్షంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. లోతట్టుప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అరాంఘర్, గగన్‌పహాడ్, ఉప్పర్‌పల్లి, రాంచరణ్ ఆయిల్ మిల్, లక్ష్మిగూడ, అత్తాపూర్, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, బుద్వేల్, శివరాంపల్లి, డైరీఫాం చౌరస్తా, హసన్‌నగర్ ఇంద్రానగర్, ఉప్పర్‌పల్లి తదితర బస్తీలలో విస్తృతంగా పర్యటించి ఎప్పటికప్పుడు వరదనీటిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. లక్ష్మిగూడలోని ఎర్రకుంట చెరువులోకి భారీగా వర్షపునీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల్లో బస్తీల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులు, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి వెంటనే చెరువును సందర్శించి చెరువు అలుగును జేసీబీతో పెకలించి వేయడంతో భారీగా వర్షపునీరు దిగువ ప్రాంతాలకు తరలించారు. బుల్‌బుల్‌కుంట చెరువు నిండిపోయి అలుగుపై నుంచి నీరు బయటకు రావడంతో రోడ్డు జలమయమైంది. అధికారులు అక్కడకు చేరుకొని నీరు వెళ్లే కాలువలలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలను తొలగించి నీటిని మళ్లించారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన వారిలో అధికారులు రాజేంద్రనగర్ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఈఈ లచ్చిరామ్, సిఐ సుధీర్‌కుమార్, డిఈలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
భారీ వర్షంతో ఉప్పల్...తిప్పల్...
ఉప్పల్: హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ పట్టణంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో ప్రధాన జాతీయ రహదార్లు జలమయమయ్యాయి. వరద నీరు మోకాళ్లలోతుకు చేరుకోవడంతో వచ్చిపోయే వాహనాలు ముందుకు వెళ్లలేక వెనుకకు కదల్లేక రహదార్లపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. నాగోల్ నుంచి హబ్సిగూడ, రామంతాపూర్ నుంచి ఉప్పల్ బస్‌డిపోవరకు కిలోమీటర్ల పొడవున ఐదుగంటల పాటు ట్రాఫిక్ స్తంభించడంతో వాహనచోదకులు, ప్రజలు అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాలలో వర్షంలో చిక్కుకున్న వాహనాలను బయటకు తీయలేక ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడ్డారు. హబ్సిగూడ జెన్‌ప్యాక్ వద్ద మెట్రో స్టేషన్ సమీపంలో, రామంతాపూర్ ప్రభుత్వ హోమియోపతి కళాశాల, నాగోల్ రహదారిలోని మెట్రో స్టేషన్ వద్ద, ఉప్పల్ ప్రధాన రహదారిలోని శేఖర్ హోజరీ వద్ద, నల్ల చెరువు వద్ద వరద నీరు చిక్కుకుని వాహనాలు బయటకు వెళ్లలేక ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకున్నాయి. పక్కన ఉన్న గల్లీలో నుంచి బయటపడదామన్నా అవకాశం లేకుండా ఇక్కడ కూడా వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఒకవైపు పై నుంచి కుండపోత వర్షం..మరొక వైపు ట్రాఫిక్ జామ్‌తో మధ్యలో చిక్కుకున్న వాహనాదారులు నరకం అనుభవించారు. అత్యవసర పనులకు వెళ్లే వారు మరీ ఇబ్బందులు పడ్డారు. వర్షం తీవ్రమవ్వడంతో విద్యాసంస్థలు సెలవు ప్రకటించడంతో తిరిగి ఇంటికి చేరుకోవడానికి విద్యార్థులు ట్రాఫిక్ నరకం నుంచి బయటపడటానికి ఇబ్బందులు పడ్డారు. జిహెచ్‌ఎంసి అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించి సహాయ చర్యలు వేగవంతంగా చేపట్టినా సకాలంలో ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులను బయటకు పంపించలేకపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత వర్షం ఆగిపోవడంతో వాహనాలు ట్రాఫిక్ నుంచి బయటకు కదలడంతో వాహనాదారులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ఇరుకైన జాతీయ రహదారిలో ఫుట్‌పాత్ కబ్జాల కారణంగా ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు మరింత తీవ్రమవుతోందని పలువురు వాపోతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు సకాలంలో చొరవ చూపకపోవడం శోచనీయం.
జీడిమెట్లలో...
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బుధవారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుండి ఎడతెరపి లేకుండా మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు వరకు వరదనీరు రోడ్లపైకి చేరింది. పలు బస్తీలలో ఇళ్లలోకి నీరు చేరింది. ముఖ్యంగా సుభాష్‌నగర్ నాలా సమీపంలోని లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. నాలాను వెడల్పు చేయకపోవడం, ఫెన్సింగ్‌ను వేయకపోవడం వలన ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందని మాజీ కార్పొరేటర్ ఆరోపించారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ డివిజన్‌లోని గణేశ్‌నగర్, వాణినగర్, మల్లిఖార్జున నగర్, చింతల్, శ్రీనివాస్‌నగర్ ప్రాంతాలలో వరదనీరు రోడ్లపై ప్రవహించింది. జగద్గిరిగుట్ట డివిజన్ అంజయ్యనగర్, మగ్దూమ్‌నగర్, షిరిఢీహిల్స్, శివానగర్, దేవమ్మబస్తీ, బీరప్పనగర్, లెనిన్‌నగర్, పొలాలబస్తీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నిజాంపేట్ గ్రామంలో...
నిజాంపేట్ గ్రామంలో తుర్కచెరువు ప్రమాద స్థాయికి చేరింది. కుండపోత వర్షానికి చెరువు పూర్తిస్థాయికి చేరుకుంది. చెరువుకట్ట సైతం తెగిపోయే స్థితికి చేరడంతో కట్టకింద ఉన్న బండారి లే అవుట్ కాలనీ వాసలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రమాదం సంభవిస్తుందో అన్న ఆందోళనతో గడుపుతున్నారు. అదేవిధంగా గ్రామంలో ఇష్టానుసారంగా పలుకాలనీలలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్‌లకు వరదనీరు వచ్చి చేరింది.