హైదరాబాద్

తనిఖీలే..తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: సమయం మధ్యాహ్నం మూడున్నర గంటలు...వివిధ పనులపై ట్యాంక్‌బండ్ సమీపంలోని ప్రధాన కార్యాలయం..ఏ విభాగానికి వెళ్లి సార్ ఉన్నాడా? అంటే అక్కడి సిబ్బంది నోటి నుంచి వచ్చే మాట సార్ ఇన్‌స్పెక్షన్‌లో ఉన్నారు..వస్తారా? అంటే ఏమో చెప్పలేమని సమాధానం...ఇది బల్దియా ప్రధాన కార్యాలయంలో గత కొద్దిరోజులుగా నెలకొన్న పరిస్థితి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు సందర్శన వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు ఇపుడు తనిఖీలపై తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల నగరంలో కురిసిన అతి భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లకు మరమ్మతులు, అవసరమైన చోట కొత్త రోడ్లను నిర్మించే పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నామని చెప్పుకుంటున్న అధికారులకు సెంట్రల్ జోన్‌లో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు కన్పించటం లేదు. అంతెందుకు కమిషనర్ మొదలుకుని అదనపు కమిషనర్లు, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ ప్రతిరోజు తమ నివాసాల నుంచి ప్రధాన కార్యాలయానికి రాకపోకలు సాగించే నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై అడుగడుగుకు ఓ గుంత ఉన్నా, నేటికీ పూడ్చలేదు. రూ. 75 కోట్లతో 180 కిలోమీటర్ల పొడువున నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణ పనులను కమిషనర్ జనార్దన్ రెడ్డి పగలు, రాత్రి వ్యత్యాసం లేకుండా తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే! పర్యటనలు ముగించుకుని రాగానే వరుసగా విభాగాల వారీగా సమీక్షలు నిర్వహించటంతో అధికారులు రొటీన్‌గా చూడాల్సిన ఫైళ్లు కుప్పలుగా పేరకుపోతున్నాయి. సోమవారం అర్థరాత్రి కూడా జూబ్లీహిల్స్ ఎల్వీప్రసాద్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులను తనిఖీ చేయటంతో పాటు మరుసటి రోజైన మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో కమిషనర్ ఇంజనీర్లతో కలిసి రోడ్ల పనులను పరిశీలించారు. కానీ వాస్తవానికి కూడా రోడ్ల నిర్వాహణ, నిర్మాణం అనేది ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పని అయినా, కమిషనర్ తనిఖీల్లో అన్ని శాఖల అధికారులు వెళ్లటంతో సందర్శకులకు అధికారులు అందుబాటులో ఉండటం లేదని కొందరు వాపోయారు.
నిర్మాణ పనుల్లోనూ వివక్ష?
నెలరోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాలకు మెయిన్ రోడ్లన్నీ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే! ఆ తర్వాత నాలుగైదు రోజుల తర్వాత నుంచి ప్రతిరోజు గుంతలను పూడ్చుతున్నామని కమిషనర్ ప్రకటించినా, ఒకటి రెండురోడ్లు మినహా ఎక్కడా కూడా గుంతలను పూడ్చినట్టు లేదు. పైగా బడాబాబులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎక్కువగా రాకపోకలు సాగించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలీ, సైబర్ సిటీ, బొటానికల్ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లోనే రోడ్ల పనులు ఎక్కువగా చేపడుతున్నారే తప్పా, ప్రతిరోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే లక్డీకాపూల్ జంక్షన్‌లో ఇంత వరకు రోడ్డుకు కనీస మరమ్మతు చేపట్టకపోవటం జిహెచ్‌ఎంసి అధికారుల వివక్షకు నిదర్శనమని వాహనదారులంటున్నారు. ఇందుకు లక్డీకాపూల్ మెయిన్ చౌరస్తా, అశోక హోటల్, రవీంద్రభారతి ముందు రోడ్డు, అసెంబ్లీమున్న బస్టాపుతో పాటు మెట్రో స్టేషన్లు నిర్మిస్తున్న పంజాగుట్ట, లక్డీకాపూల్, నాంపల్లి, ఎం.జె.మార్కెట్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న రోడ్ల దుస్థితే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

తెలంగాణకు లక్ష
ఉచిత గ్యాస్ కనెక్షన్లు
కులకచర్ల, అక్టోబర్ 18: కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి సుమారు లక్ష వరకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు విడుదల చేసినట్టు సమాచారం. ఈమేరకు ఆయా మండలాలకు సమాచారం కూడా అందడంతో ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు గ్యాస్ ఎజెన్సీల వారు సన్నాహలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉజ్వల్ యోజన పథకం కింద రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సుమారు లక్ష మేర ఈ గ్యాస్ కనెక్షన్లు లబ్ధిదారులను ఎంపికచేసి ఇవ్వనున్నారు. గతంలో ఎలాంటి గ్యాస్ కనెక్షన్ లేని వారు దీనికి అర్హులు. ప్రత్యేకంగా ఉజ్వల్ యోజన పథకం పేరిట ఈ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈమేరకు లబ్ధిదారుల ఎంపిక కోసం కసరత్తులు మొదలయ్యాయి.
ఉచితమంటే..
ఉజ్వల్ యోజన పథకం కింద ఎంపికయ్యే లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఇదెలాగంటే గ్యాస్ కనెక్షన్‌కు రూ. 3200లుగా ధర నిర్ణయించగా దీంట్లో 1600 ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మరో రూ. 1600 లబ్ధిదారుడు నేరుగా చెల్లించకుండా నిండు సిలిండరు పొందినపుడు ఇచ్చే రాయితీ డబ్బులను లబ్ధిదారుడు చెల్లించే వాటాలో జమచేస్తారు. రూ. 1600 పూర్తయ్యే వరకు ఇదే తరహాలో సిలిండర్ రాయితీపై వచ్చే డబ్బులను వినియోగదారుని వాటా ధనం కింద జమచేసుకుంటారు. దీంతో గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారునికి పూర్తి ఉచితంగా లభించట్లవుతుందని కేంద్రం భావించి ఈ పథకానికి రూపకల్పన చేసింది. త్వరలోనే ఈపథకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణాకు కేవలం లక్ష కనెక్షన్లులు రాగా, ఏపికి ఎక్కువ కనెక్షన్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ పథకం కింద ఇచ్చే కనెక్షన్‌తో పాటు ప్రధానమంత్రి ఛాయాచిత్రంతో కూడిన పుస్తకం కూడా అందివ్వనున్నారు.
కాగా గతంలో వివిధ పథకాల కింద విడుదల చేసిన గ్యాస్ కనెక్షనే్ల ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటికితోడు అదనంగా మరిన్ని కనెక్షన్లు రావడంతో ఇటు గ్యాస్ ఎజెన్సీల వారు తలపట్టుకుంటున్నారు. దాదాపు ప్రతి ఇంట్లో గ్యాస్ ఆధారిత కనెక్షన్లు ఉన్నాయి. అదనంగా మరిన్ని గ్యాస్ కనెక్షన్లు రావడంతో కనెక్షన్ లేని వారి వివరాలు కనుగొనే పనిలో గ్యాస్ ఏజన్సీలవారున్నారు. గ్యాస్‌కు సంబంధించి గతంలో నిండు సిలిండరు పొందాలంటే నానా తంటాలు పడడమే కాకుండా నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులుండేవి. కాని నేడు ఒకటి రెండు రోజుల్లోనే నిండు సిలిండరు సరఫరా కావడంతో అందరూ దీనిపై ఆధారపడి ఉంటున్నారు. దీనికి తోడు గ్యాస్ డీలర్లను కూడా ప్రజలకు మరింత అందుబాటులో ఉంచడంతో గ్యాస్ వినియోగదారుల వెతలు దాదాపు తీరినట్లే.