హైదరాబాద్

నరకానికి నకళ్లుగా విశ్వనగర రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, అక్టోబర్ 22: నరకానికి నకళ్లుగా నగర రోడ్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. మోకాటిలోతు గుంతలతో అడుగు తీసి అడుగుపెట్టలేని విధంగా ఉన్న రోడ్లపై ప్రయాణం సాహసయాత్రలను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. ఒకవైపు గుంతలమయంగా మారిన రోడ్లు, మరోవైపు వాహనాల రాకపోకలతో దుమ్మురేగుతున్న రోడ్లతో ద్విచక్రవాహదారుల కళ్లు, నోళ్లు నిండిపోతున్నాయి. దీంతో రోడ్లపైకి రావాలంటేనే ద్విచక్రవాహనదారులు జంకుతున్నారు. విశ్వనగరం హైదరాబాద్‌లో ప్రతినిత్యం సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్లు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ పాలకులు మాత్రం కేవలం 10శాతం రోడ్లు మాత్రమే చెడిపోయాయనడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వర్షాలు ఆగిపోయి రోజులు గడుస్తున్నా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు మొద్దునిద్రలో జోగుతున్నారు.
పాలకులు మాత్రం విదేశీయాత్రలతో బిజీగా ఉండడంతో ప్రజలు తమ దుస్థితికి తమనే నిందించుకుంటున్నారు. నగరం అంటే కేవలం సంపన్నులు నివసించే ప్రాంతాలు మాత్రమే కాదు సామాన్యులు సంచరించే ప్రాంతాలని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రజలు వేడుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన అధికార తెరాస ఆపై నగర ప్రజలను వారి దుస్థితికి వదిలివేశారన్న ఆరోపణలు సర్వత్రా వినపడుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఆలుగడ్డబావి నుంచి చిలకలగూడ చౌరస్తా వరకు అటు నుంచి రెతిఫైల్ బస్టాండ్ చౌరస్తా వరకు అమాత్యులు కారుల్లో కాకుండా ద్విచక్రవాహనంపై ఒక్కసారి ప్రయాణం చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వారికే అవగతమవుతుందని ప్రజలు కోరుతున్నారు. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు మంత్రుల్లో ఇద్దరు ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడంతోపాటు వారు ప్రతినిత్యం ఇదే ప్రాంతం నుంచి ప్రయాణం చేయాల్సి ఉన్నప్పటికీ అతి ప్రధానమైన ఈ రహదారిని యుద్ధప్రాతిపదికన రిపేరు చేయాలన్న ఆలోచన అటు పాలకులకు గాని ఇటు అధికారులకుగాని తట్టకపోవడం విడ్డూరంగా ఉందని లష్కర్ నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలుగడ్డబావి ప్రాంతంలో వర్షం ఆగిపోయి రోజులు గడుస్తున్నా నేటికీ ఈ ప్రాంతంలో కాలువలు రోడ్డుపై నుంచే పారుతున్నాయి. ప్రతి నిత్యం ఈ ప్రాంతంలో అధికారులు రోడ్లు మరమ్మతుల పేరుతో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఒకవైపు మెట్రోపనులు మరోవైపు పూర్తిగా ధ్వంసమైన రోడ్లతో లష్కర్‌లో ప్రయాణం నరకప్రాయంగా మారిపోయింది.
నగరంలో అతి ప్రధానమైన రోడ్లు గుంతలమయంగా మారి దుమ్మురేగుతూ బయటికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా పాలకులు స్పందించి నరకానికి నకళ్లుగా మారిన విశ్వనగర రోడ్ల దుస్థితి మార్చాల్సిన అవసరం ఉందని ప్రజలు వేడుకుంటున్నారు. అడిగిన వారికి అడగని వారికి సైతం కోట్ల రూపాయల నజరానాను ప్రకటిస్తున్న సిఎం కెసిఆర్ నగరంలో ఒక్కసారి ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తే సమస్యలు తక్షణమే పరిష్కారమవుతాయని ప్రజలు ఆశపడుతున్నారు.