హైదరాబాద్

ఇష్టారాజ్యంగా అభ్యర్థుల ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉన్న అవకాశాలన్నీ చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అభ్యర్థుల వ్యయాన్ని రూ. 5లక్షలకు పరిమితం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే నిర్ణయం తీసుకున్నా, ఇపుడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు చేస్తున్న ఖర్చును పరిశీలిస్తే వీరిలో నూటికి తొంభై శాతం మంది ఎపుడో పరిమితిని దాటినట్లు తేలుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన ఈ నెల 8వ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అంతకు ముందు నుంచే అధికార, విపక్షాలకు చెందిన ఆశావహులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈ నెల 8వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినా, నేటికీ పలు డివిజన్లలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల చుట్టూ తిరిగే కార్యకర్తలు, నేతలు, అనుచరులకు రోజువారీ అయ్యే ఖర్చులు లెక్కలేస్తే వారు ఎపుడో రూ. 5లక్షల పరిమితిని దాటేశారు. అధికార టిఆర్‌ఎస్, విపక్షాలైన కాంగ్రెస్, టిడిపి, బిజెపి, మజ్లిస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ సమర్పించిన రెండురోజులకే రూ. 5లక్షల పరిమితిని దాటేశారని చెప్పేందుకు వారి ఆర్భాటం, మందీ మార్భలం ఉదాహరణలుగా చెప్పవచ్చు. అంతేగాక, ప్రతి అభ్యర్థి రోజువారీగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత డివిజన్ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలంటూ స్పష్టమైన ఆదేశాలున్నా, మొత్తం అభ్యర్థులు 1333లో మూడో వంతు అభ్యర్థులు ఈ నిబంధనను పాటించటం లేదు. కొందరు అభ్యర్థులు తమ పేరిట పాటల సీడీలను ప్రచార రథాల్లో ప్లే చేయటంతో పాటు కళా బృందాలతో ఆటాపాటా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారంటే వారి రోజువారీ వ్యయాన్ని అంచనా వేయవచ్చు. మరికొందరు తాము గెలిస్తే ఏం చేస్తామో చూడండంటూ ఆడియో క్యాసెట్లను సైతం విడుదల చేశారు. ఈ రకంగా ప్రచారానికి ఖర్చు పెట్టుకున్న తర్వాత కూడా అభ్యర్థులు, తనతో పాటు ఉన్న నేతలు, కార్యకర్తలకు రవాణా, రోజువారి టిఫిన్లు, భోజనాలు, నైట్ బిర్యానీలు వంటివి ఎలా వెచ్చించగలరో ఆలోచించాల్సిన అవసరముందని మేధావులు వాదిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రోజువారీ కాకపోయినా కనీసం మూడురోజులకోసారైనా మూడురోజుల వ్యయానికి సంబంధించిన లెక్కలను సమర్పించాల్సి ఉందని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి తెలిపారు.
పంపకాలకు మార్గాలెన్నో..!
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో ప్రాంతాల వారీగా పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు పనిలో పనిగా బూత్‌ల కేటాయింపును కూడా చేపట్టారు. అయితే ఒక్కో బూత్ పరిధిలో బడా నేతలు, సామాన్య కార్యకర్తలు, ఆ బూత్‌లోని ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని భారీగా డబ్బు పంపకాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరికొందరు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇప్పటికే ఒకటి, రెండుసార్లు గెలిచిన వారు తమ డివిజన్ పరిధిలోని కుల సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ సంఘాలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, యువజన సంఘాలు, స్వయం సహాయక బృందాల వారీగా ప్యాకేజీల వారీగా డబ్బు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుడిమల్కాపూర్ డివిజన్‌లో ఇటీవలే రాత్రికి రాత్రే పార్టీ మారి ఓ ప్రధాన పార్టీ టికెట్ దక్కించుకుని బరిలో ఉన్న అభ్యర్థి స్థానికంగా తనకున్న కేబుల్ వ్యాపారానే్న ఆసరాగా చేసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రకంగా మరికొన్ని ప్రాంతాల్లో వైన్ షాపులు, పెట్రోల్ బంకులు, బిర్యానీ హోటళ్లు వంటి ఇతరత్రా వ్యాపారాలున్న అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారపరంగా ఆశలు చూపుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బిర్యానీ హోటళ్లున్న ఓ ప్రజాప్రతినిధి తన సెగ్మెంట్‌లోని ఓటర్లకు ఈ రకంగా గాలం వేస్తున్నట్లు సమాచారం.