అదిలాబాద్

‘అంతా’మొక్కుబడి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 5: జిల్లాల పునర్విభజన అనంతరం తొలిసారిగా ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సమావేశం మొక్కుబడితంతుగా ముగిసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి నగేష్‌తో పాటు ముగ్గురు శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, నలుగురు జిల్లా కలెక్టర్లు జడ్పీ వేదికగా సమావేశానికి హాజరుకాగా ప్రజాసమస్యలపై లోతుగా చర్చజరగకుండానే, అధికారుల నుండి సరైన సమాధానాలు రాకుండానే సమావేశం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన అసంపూర్తి అభివృద్ది పనులు, గతంలో ఇచ్చిన హామీలకు పరిష్కారం లభించకపోవడంపై సభ్యులు అసంతృప్తిగళం వినిపించగా అధికారుల నుండి సరైన సమాధానాలు రాకపోవడంతో మంత్రులు సైతం నోరు మెదపలేక మిన్నకుండిపోయారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా 2018 నాటికి పూర్వ జిల్లాలోని అన్ని గ్రామాలకు శుద్దజలం అందించే ప్రక్రియపై వాటర్‌గ్రిడ్ ఎస్‌ఈ సమగ్ర సమాచార నివేదికను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తొలుత సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే గతంలో తాగునీటి సరఫరా కోసం నీటి ఎద్దడి గ్రామాలకు, ఏజెన్సీ ప్రాంతాల్లో వేసిన శిలాపలకాలు వెక్కిరిస్తుండగా పలుచోట్ల పైపులైన్లు అస్తవ్యస్తంగామారి సర్కారు ధనం దుర్వినియోగమవుతున్న విషయాన్ని సభ్యులు లేవనెత్తారు. ముఖ్యంగా ఉట్నూరు ఏజెన్సీ పరిధిలోని ఐదు మండలాలకు కెరమెరి మండలం కొమురంభీం ప్రాజెక్టు ద్వారా అందించే తాగునీటి పథకాల ద్వారా నిధులు ఖర్చుచేసినా చుక్కనీరు రాలేదని, తిరిగి వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ పనులను అదే ఎల్‌ఆండ్‌టి సంస్థకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాంకిడి జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు ఆరోపించారు. ఇలాంటి సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ అప్పగిస్తే 2019 వరకు కూడా వాటర్‌గ్రిడ్ నీళ్లు వచ్చే ప్రసక్తేలేదని, ఈ విషయం పునరాలోచించాలని సూచించారు. ఎంపి నగేష్ మాట్లాడుతూ జిల్లాలో రహదారుల గుండా పైపులైన్ వ్యవస్థ కనబడుతున్నా క్షేత్రస్థాయిలో నీటి సామర్థ్యం, సాంకేతికత అంశాలపై సరైన స్పష్టత కనబడడం లేదని, అధికారులు పర్యవేక్షించి పకడ్బందీగా వాటర్‌గ్రిడ్ పనులు చేపట్టాలని సూచించారు. మంత్రి జోగురామన్న మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి శుద్దజలం అందించే ప్రక్రియలో భాగంగా వచ్చే నెల డిసెంబర్ చివరి వరకు 356 ఆవాస గ్రామాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. పలువురు జడ్పీటీసీలు మాట్లాడుతూ ఏజెన్సీలో 270 గ్రామాలకు తాగునీరందించేందుకు రూ.10కోట్లు ఖర్చుచేసినా ఎల్ ఆండ్‌టి కాంట్రాక్టర్ మాత్రం ఈ ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రజలకు నీరందించకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ శాఖపై జరిగిన చర్చకు అధికారుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బేల ఎంపిపి రఘుకుల్ రెడ్డి, బజార్‌హత్నూర్ జడ్పీటీసీ నారాయణ, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆసిఫాబాద్ జడ్పీటీసీ ఏమాజీ రైతులు మార్కెట్‌లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిలదీశారు. ఫసల్‌బీమా యోజన కింద పరిహారం అందడం లేదని, నకిలీ కల్తీ విత్తనాలతో జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా మోసపోయారని ఆరోపించారు. గుడిహత్నూర్ జడ్పీటీసీ కేశవ్‌గిత్తె మాట్లాడుతూ మార్కెట్‌లో సోయాబిన్‌కు మద్దతు ధర లభించకపోగా రైతులు పండించిన మినుము, పెసర పంటకు కొనుగోలు చేసేవారే కరువయ్యారని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ బోథ్ ఇచ్చోడ ప్రాంతాల్లో ఆయిల్‌ఫెడ్ ద్వారా సోయాబిన్ కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. కెరమెరి జడ్పీటీసీ అబ్దుల్ కలాం మాట్లాడుతూ ఇటీవలే కెరమెరిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కరెంట్‌షాక్‌తో తల్లికొడుకులిద్దరూ మృతి చెందారని, వారికి ప్రభుత్వం వెంటనే పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. కుంటాల జడ్పీటీసీ మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల మినుము, వరి పంట దెబ్బతిందని, వెంటనే సర్వే నిర్వహించి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఉట్నూరు జడ్పీటీసీ మాట్లాడుతూ ఉట్నూరు ఏజెన్సీ కేంద్రంలో వ్యవసాయ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరగా అక్కడి ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని పలు గ్రామాలు కొత్తగా ఏర్పడిన మూడు జిల్లాల్లో కలిసిపోయాయని, దీంతో ఆ శాఖల మద్య సమన్వయంలేక అభివృద్ది జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో 7432 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వివరించారు. వరి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు రైతులకు అందుబాటులో ప్రారంభించడం జరుగుతోందని, గ్రేడ్-1 రకానికి కనీస మద్దతు ధర రూ.1510, బిగ్రేడ్ రకానికి 1470 చెల్లించడం జరుగుతుందని అన్నారు. నిర్మల్ జడ్పీటీసీ మాట్లాడుతూ పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబిన్ వేయాలని అందరూ ప్రచారం చేస్తేనే రైతులు సోయాబిన్ వేశారని, తీరా మార్కెట్‌లో ధర ఇవ్వకపోవడం వల్ల నష్టపోతున్నారని, కనీసం క్వింటాలుకు రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెబ్బన జడ్పీటీసీ మాట్లాడుతూ పత్తి కొనుగోళ్ళల్లో ఎలక్ట్రానిక్ కాంటాలు వినియోగించడం లేదని, తూకంలో కోత కారణంగా రైతులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దండేపల్లి జడ్పీటీసీ మాట్లాడుతూ ముత్యం పేట సబ్‌స్టేషన్ పూరె్తై రెండు నెలలు గడుస్తున్నా ఎందుకు విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదని ప్రశ్నించారు. వాంకిడి జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ తమ మండలంలోని పది గ్రామాలకు స్వాతంత్య్రం వచ్చి 60ఏళ్లు గడిచినా కరెంట్ సౌకర్యం ఇవ్వకుండా అధికారులు కుంటిసాకులతో తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణంకోసం భారీఎత్తున పనులు చేపడితే ఒక్క రూపాయి కూడా లబ్దిదారులకు విడుదల కాలేదని, అధికారుల తీరుపై సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి నిధులు రాకపోతే తామేలా ఇస్తామని సమాధానాలతో దాటవేశారు. ఈ సమావేశానికి జడ్పీ సి ఈవో జితేందర్ రెడ్డి, ఆదిలాబాద్ కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి, మంచిర్యాల కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, నిర్మల్ కలెక్టర్ ఇల్లంబర్తి, ఆసిఫాబాద్ కలెక్టర్ చంపాలాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, రేఖానాయక్‌తో పాటు అయా శాఖల జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపిపిలు పాల్గొన్నారు.

జ్వరాల పరిస్థితులపై వాకబుచేసిన తహశీల్దార్
కుభీర్, నవంబర్ 5: మండలంలోని బ్రహ్మేశ్వర్‌లో విషజ్వరాలు ప్రభలి ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకర్ శనివారం బ్రహ్మేశ్వర్‌ను సందర్శించి బాధితుల పరిస్థితులపై వాకబుచేశారు. ఈ సందర్బంగా డాక్టర్ శ్యాంకుమార్ మాట్లాడుతూ జ్వరాలు అదుపులో ఉన్నందున మరో రెండు రోజుల తర్వాత ఆరోగ్య శిభిరాన్ని విరమించుకుంటామని తెలిపారు. ఇక్కడే ఉన్న ఎంపిడివొ దేవెంధర్‌రెడ్డి గ్రామంలో యుద్ద ప్రాతిపదికన పారిశుద్య పనులు పూర్తిచేసి అంతటా బ్లీచింగ్‌చేయాలని సర్పంచ్ శ్యాంరావును ఆదేశించారు.

ప్రజలతో మున్సిపల్ అధికారులు స్నేహపూర్వకంగా ఉండాలి
* మున్సిపల్ చైర్ పర్సన్ సునీతారాణి
బెల్లంపల్లి, నవంబర్ 5: మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని, ఐక్యతతో పనిచేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ పసుల సునీతారాణి అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల ముగింపు సందర్బంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా విజిలెన్స్ వారోత్సవాల సందర్బంగా సిబ్బంది ఐక్యతతో పనిచేయాలని కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు. బెల్లంపల్లిలో రెవెన్యూ, పోలీసు, సింగరేణి అధికారులతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తమకు సాధ్యం కాని పనులను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జి సానిటరీ ఇన్‌స్పెక్టర్ చిలుముల శంకర్, టిపి ఎస్ సంపత్, ఇంచార్జి ఆర్ ఐ లింగయ్య, జూనియర్ అసిస్టెంట్ జీవన్, ఏ ఈ సందీప్, పి ఆర్‌పి రఘురాం, కౌన్సిలర్లు యుసుఫ్, లింగంపల్లి రాములు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రైతు సమస్యల పరిష్కారం కోసమే భరోసాయాత్ర
* కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి హరినాయక్
* కడెం నుండి బెల్లాల్ వరకు పాదయాత్ర
* కాంగ్రెస్ నేతలు, రైతుల రాస్తారోకో
కడెం, నవంబర్ 5: రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, అలాగే రైతుల పూర్తి రుణమాఫిని చేయాలని విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు మంజూరుచేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాయాత్ర కార్యక్రమాన్ని చేపట్టిందని, కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జి హరినాయక్ అన్నారు. శనివారం కడెం మండలంలోని బెల్లాల్ గ్రామపంచాయతీలో గల నర్సింగాపూర్ పెర్కపల్లి గ్రామం నుండి కడెం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసాయాత్ర కార్యక్రమం చేపట్టారు. దాదాపు 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. బెల్లాల్ గ్రామంలో వరిపంట పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను పై నాయకులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎంతవరకు రుణమాఫీ చేసిందని రైతులను అడిగి నేతలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో రుణమాఫీ పేరిట రైతులను మోసం చేస్తుందని వారు ఆరోపించారు. గతంలో రాష్ట్రంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న విషయాన్ని నాయకులు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం జరుగుతుందని వారు భరోసా ఇచ్చారు. అనంతరం రైతు భరోసాయాత్రలో భాగంగా మండల కేంద్రం కడెంలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఖానాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి హరినాయక్ మాట్లాడుతూ టి ఆర్ ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రైతులను అన్యాం చేస్తున్నారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదాల పద్దతిలో రుణమాఫి చేసి రైతులకు తీరని అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో రైతుల పంటలకు గిట్టుబాటు దర కల్పించలేకపోయిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ పథకం మంజూరుకావడం లేదన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, రైతులు తహసిల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కడెం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు టి.సంతోష్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు సతీష్‌రెడ్డి, అంబారిపేట్ ఎంపిటిసి ఎం.తిరుపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి రమేష్, మైనార్టీ సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి శేఖ్ రఫిక్, ముజఫర్ అలి, దుల్లె బక్కన్న, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గోల్ల వెంకటేష్, స్వామి, రాజన్న, మల్లేష్, మదు, సత్యంచారి, లచ్చన్న, శంతన్‌రెడ్డి, రాజేంధర్‌రెడ్డి, మహేంధర్‌రెడ్డి, గంటలచ్చన్న, గంగరాజం, తరి శంకర్, నాయకులు సత్యం, దయానంద్, గంగాధర్, నరేంధర్, శ్యాం, మజిద్, రైతులు పాల్గొన్నారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం సర్కారు మెడలువంచుతాం
విద్యార్థి గర్జనలో మాజీ మంత్రి సిఆర్‌ఆర్
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 5: గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయకపోతే విద్యార్థులతో కలిసి పోరాడుతూ సర్కారు మెడలువంచి సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం యూత్ కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంలో నిర్వహించిన విద్యార్థి గర్జనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు 201415, 201516 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు రాకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అన్నారు. ఇప్పటికే ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలల ఫీజులు చెల్లించకపోవడంతో వారు ధృవీకరణ పత్రాలు పొందడం లేదన్నారు. దీంతో ఉద్యోగాలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు స్కాలర్‌షిఫ్ నిదులు రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తీసుకవస్తున్నాయని దీంతో విద్యార్థులు మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరిస్తున్నారని, ఇంటికో ఉద్యోగం చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. దళితులకు మూడెకరాల భూమి, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మెన్ దిగంబర్‌రావు పటేల్, పట్టణ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, కౌన్సిలర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయమూర్తుల నివాస భవనాలను ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 5: ఆదిలాబాద్‌లోని కైలాస్‌నగర్ ప్రాంతంలో రూ.3.61 కోట్లతో నూతనంగా నిర్మించిన జూడిషియల్ అధికారుల నివాస భవనాలను హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ఎంఎస్‌కె జైస్వాల్, శంకర్ నారాయణ శనివారం ప్రారంభించారు. బ్లాక్ ఏ, బ్లాక్ బిలో మొత్తం 4 నివాస గృహాలకు గాను ప్రతి ఒక్క నివాస భవనం 2525 స్కేర్‌ఫీట్ల పరిమాణంలో నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ఉదయగౌరి పూర్ణకుంభంతో, మంగళవాయిద్యాలతో సీనియర్ న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు బుద్ద ప్రకాష్ జ్యోతి, ఎల్లంబర్తి, ఆర్‌వి కర్ణన్, ఎం.చంపాలాల్, ఆదిలాబాద్ ఫ్యామిలి కోర్టు జిల్లా న్యాయమూర్తి అరుణ సారిక, ప్రభుత్వ న్యాయవాది జోషి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ నజీర్ ఆహ్మాద్, ఈఈ వెంకట్ రెడ్డి, జిల్లాలోని లాయర్లు, కోర్టు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణుల కోసమే అంబులెన్స్‌లు
* ఎంపి ల్యాడ్ నిధులతో ప్రారంభించిన మంత్రులు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, నవంబర్ 5: వెనకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల పేద గిరిజనులకు అత్యవసర వైద్యసేవలందించేందుకు ఎంపిల్యాడ్ నిధులతో 7 అంబులెన్స్‌లను శనివారం మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రారంభించారు. జడ్పీ సమావేశం మధ్యాహ్న విరామ సమయంలో ఎంపి గెడం నగేష్ నియోజకవర్గ నిధుల కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.11లక్షల 97వేల నిధులతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేయగా, మొత్తం 7 అంబులెన్స్‌లకు తన కోటా నుండి రూ.83లక్షల 79వేల నిధులు ఖర్చుచేసినట్లు ఎంపి గెడం నగేష్ తెలిపారు. మారుమూల ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు నగేష్ ఏడు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం పట్ల మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు అభినందనలు తెలిపారు. ఇవి నిరంతరం గ్రామీణ వైద్యసేవలకే అందుబాటులో ఉంచాలని వారు కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ శోభా సత్యనారాయణగౌడ్, శాసన సభ్యులు విఠ్ఠల్ రెడ్డి, బాపురావు, ఎమ్మెల్సీ సతీష్, జడ్పీటీసీ ఇజ్జిగిరి అశోక్, జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సేద్యానికి నిరంతర విద్యుత్
* మంత్రి జోగు రామన్న
తలమడుగు, నవంబర్ 5: రైతుల అభివృద్ధే ధ్యేయంగా పెట్టకొని సిఎం కె.చంద్రశేఖరరావు రైతుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని అటవీ,పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామం లో రూ.కోటి 60లక్షల నిధులతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంత్రి రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న సమావేశంలో మంత్రి మాట్లాడు తూ కజ్జర్ల ప్రజలు గత 10 సంవత్సరాలుగా విద్యుత్ కొరతను ఎదుర్కోవడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరంలోనే రైతుల సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ఉపకేంద్రం ద్వారా కజ్జర్ల గ్రామంతో పాటు 16 గ్రామాల ప్రజలకు నిరంతర విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు 1650 ఎకరాలకు సాగునీరు ద్వారా రైతులు లబ్దిపొందుతారన్నారు. రైతు లు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికై తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీపై డ్రిప్ పరికరాలను అందిస్తోందన్నారు. గ్రీన్‌హౌస్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీపై ఉద్యాన పంటలకు రుణా లందజేస్తోందని, బిసి, ఓసి రైతులకు 75శాతం రాయితీతో రుణాలు ఇవ్వ డం జరుగుతుందన్నారు. రైతులు గ్రీన్‌హౌస్ పథకానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్థికంగా లబ్దిపొందాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ద్వారా ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పారిశ్రామికంగా ఎంతో మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. రైతుల అభివృద్ది కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేవపెట్టి అమలు చేయడం జరుగుతుందని, రైతులు ప్రభుత్వ రాయితీలను వినియోగించుకోవాలని అన్నారు. బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు మాట్లాడుతూ రైతుల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. కజ్జర్ల గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌సి చౌహన్ వసంత్‌రావు, తహసీల్దార్ రాయిసిడాం చిత్రు, జిల్లా సంక్షేమ అధికారిణి ఉమాదేవి, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ ఆరె రాజన్న, సర్పంచ్ వి.నారాయణ రెడ్డి, జడ్పీటీసీ గంగమ్మ, ఎంపిపి ఎస్.రాము, మావల సర్పంచ్ ఉష్కం రఘుపతి, టీఆర్‌ఎస్ నాయకులు లింగారెడ్డి, అడ్డి బోజారెడ్డి, కిరణ్‌కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.