హైదరాబాద్

కార్తీక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివాలయాల్లో తెల్లవారుఝము నుంచి భక్తుల సందడి నెలకొంది. ఎక్కడ చూసినా కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, పలు చోట్ల శ్రీసత్యనారాయణస్వామి కథలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరగటంతో నగరం కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకుంది. ఈక్రమంలో పాతబస్తీ కిషన్‌బాగ్‌లోని శ్రీకాశీబుగ్గదేవాలయం, అంబర్‌పేటలోని శివం, శివార్లలోని కీసరతో పాటు అన్ని దేవాలయాల్లో భక్తుల సందడి కన్పించింది. అంతేగాక, పలు దేవాలయాలు, కమ్యూనిటీ హాళ్లతో పాటు కళ్యాణమండపాల్లోనూ వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక సంఘాలతో పాటు యువజన సంఘాలు, మహిళా సంఘాలు సామూహిక కార్తీక దీపారాధన కార్యక్రమాల్ని నిర్వహించి శివుడ్ని స్మరించుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీ నుంచి నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి సోమవారం భక్తులు పొటెత్తారు.
దర్శనమిచ్చిన పూర్ణచంద్రుడు
ఆకాశంలో ఓ ఆద్భుతం ఆవిష్కృతమైంది. సోమవారం అంతరిక్షంలో చోటుచేసుకోనున్న అరుదైన ప్రక్రియతో చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి, మామూలు కన్నా అత్యంత ప్రకాశంవంతంగాను, పెద్దగాను దర్శనమిచ్చాడు. ఖగోళ పరిభాషలో సూపర్‌మూన్ అనే ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు జనం ఎంతో ఆసక్తిని చూపారు. ముఖ్యంగా ఎతె్తైన ప్రదేశాలైన బిర్లా ప్లానేటోరియం, బహుళ అంతస్తు భవనాలు, పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు వంటివి ఎక్కి జనం పూర్ణచంద్రుడ్ని దర్శించుకున్నారు. విద్యుత్ కాంతులు, కాలుష్యం కారణంగా నగరంలో కన్నా శివారుల్లో, గ్రామ ప్రాంతాల్లో ఈ పూర్ణచంద్రుడు అందంగా, అద్భుతంగా దర్శనమిచ్చాడు.
చంద్రుడు భూమి చుట్టు తిరుగుతున్న కక్ష్య స్పష్టమైన వృత్తం ఆకారంలో లేకపోవటం వల్లే అపుడపుడు చంద్రుడికి, భూమికి మధ్యనున్న దూరం తగ్గి, పెద్దగా కన్పిస్తుంటాడని, ఇలాంటి అరుదైన దృశ్యం ప్రతి 16 నుంచి 20 ఏళ్లకు ఓ సారి కన్పిస్తోందని ఖగోళశాస్తవ్రేత్తలు అంటున్నారు.
భక్తులతో పోటెత్తిన కీసరగుట్ట
కీసర: కార్తీకమాస భక్తులతో సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం సెలవుకార్తీక పౌర్ణమి కావటంతో నగర నలుమూలల నుంచి ఉదయం ఐదు గంటల నుండే కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. దాదాపు లక్షా యాభైవేల మంది భక్తులు శ్రీరామ లింగేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు. కీసరగుట్టకు చేరుకున్న భక్తులు ముందుగా స్వామి వారిని దర్శించుకొని, యాగశాలలో కార్తీక దీపాలు వెలిగించారు. గుట్టపరిసర ప్రాంతాల్లో ఉన్న శివలింగాలకు పంచామృతాలతో భక్తులు అభిషేకాలు నిర్వహించి, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గుట్ట దిగువ భాగాన గల పార్కులో, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కుటుంబ సమేతంగా వనభోజనాలు చేసి, అటాపాటలతో పార్కులో సాయంత్రం వరకు గడిపారు. కార్తీక పౌర్ణమి సందర్బంగా పండితులు స్వామి వారికి నానావిధ పుష్పార్చన, మహాలింగదీపోత్సవము, జ్వాలా తోరణము తదితర పూజాకార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారు. రాచకొండ సిపి మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో శాంతిభధ్రతలను పోలీసులు పర్యవేక్షించారు. ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులకు క్యూలైన్లు దాటిపోవడంతో స్వామి దర్శనం కోసం గంటల తరబడి వేచిఉండాల్సివచ్చింది. విఐపిల తాకాడి పెరగటంతో అభిషేకం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి ఐదుగంటల సమయం పట్టింది. కాగా ఆలయ చైర్మన్ టి. ఉమాపతిశర్మ, ఇఓ వెంకటేశ్‌లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. నాగారం గ్రామంలోని శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తులు సామూహిక అభిషేకాలు నిర్వహించారు.
స్వామివారి సేవలో ప్రముఖలు
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరసామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు తనికెళ్లభరణి, రాచకొండ కమీషనరేట్ మహేశ్‌భగవత్, మేడ్చల్ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి, అడిషనల్ సిపి శశిధర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాకోర్టు న్యాయమూర్తి నీరజ, మేడ్చల్‌కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్, బిజెపి శాసన సభాపక్షనేత కిషన్‌రెడ్డిలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని శివాలయాల్లో కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకోని భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం నుంచే భక్తులు శివలింగాలుకు పంచామృత అభిషేకాలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. నేరేడ్‌మెట్‌లోని శ్రీఅన్నపూర్ణ కాశీవిశ్వనాథ దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత, ఏకాదశ రుద్రాభిషేకాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రత్యేక శివార్చనలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో వందలాది మంది జంటలు పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు నాగరాజు, సంజీవ్ శర్మ నిర్వహించారు. ఆలయ కమిటీ వారు దీపాల ఏర్పాటు కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సాయంత్రం ఆకాశ దీపా ఆవిష్కరణలో వందలాధి మంది భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. వాణినగర్‌లోని శ్రీవిజయ వినాయక దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు జరిగాయి. గౌతంనగర్‌లోని అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీతో కిటకిటలాడాయి.
నల్లగుట్ట నర్సింహస్వామి ఆలయంలో..
జీడిమెట్ల: సూరారం డివిజన్ హెచ్‌ఎఎల్ కాలనీలోని నల్లగుట్ట నర్సింహస్వామి ఆలయంలో సోమవారం కార్తీక మాస పూజలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్ విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. వివేక్ మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసమని అన్నారు. భగవంతున్ని భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని చెప్పారు. ఆ భగవంతుని కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అముర ఇంద్రసేనాగుప్త, నాయకులు యాదగిరి, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
మేడ్చల్ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో..
మేడ్చల్: కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా మేడ్చల్‌లోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆతిపురాతన దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు దీపారాధన చేసి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. సాయంత్రం వందలాది భక్తలు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దాత్రిక కాశీనాథ్ పాల్గొన్నారు.
కార్తీకపౌర్ణమి పర్వదినాన్ని సోమవారం మేడ్చల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ముఖ్యంగా కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రజలు కూడా తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహించారు. రాత్రి దీపావళిని తలపించేలా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.
పలు ఆలయాల్లో లక్షదీపార్చన
పట్టణంలోని సాయిబాబ ఆలయంలో కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా లక్షదీపార్చన కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిళలు భారీగా పాల్గొని దీపాలు వెలిగించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. గడిమైసమ్మ తల్లి దేవాలయంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు. గుండ్లపోచంపల్లి, అత్వెల్లి తదితర గ్రామాలలో భక్తులు వందలాదిగా పాల్గొని దీపాలను వెలిగించి తమ భక్తిపారవశ్యాన్ని చాటుకున్నారు. పలువురు తమ మొక్కులను తీర్చుకున్నారు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్‌కేసర్: కార్తీక ఫౌర్ణమి సందర్భంగా ఘట్‌కేసర్ మండలంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండల కేంద్రంతో పాటు సంస్కృతి టౌన్‌షిప్, ఎన్‌ఎఫ్‌సినగర్, పోచారం, ఎదులాబాద్, శివారెడ్డిగూడ గ్రామాలలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఉదయం నుండి రాత్రి వరకు మహిళలు నూతన వస్త్రాలు దరించి ఆలయాలకు చేరుకుని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్తీక పౌర్ణమి రోజున శివుడు భూలోకానికి వచ్చి తనను పూజించిన భక్తులకు ఆయూరారోగ్యాలు, సకల సంపదలు కల్పిస్తాడనే ప్రగాడ విశ్వాసంతో మహిళలు తెల్లవారు జాము నుండి పూజలు జరిపారు. సంస్కృతి టౌన్‌షిప్ ఆవరణలోని కళావేదిక వద్ద కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు బి.హరిప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు దీపాలను వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించిన ప్రతి ఒక్కరూ భగవంతుని కృపకు పాత్రులు అవుతారని చెప్పారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆయా గ్రామాలలోని ఆలయాలలో భక్తులు, మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు.
శ్రీఅభయాంజనేయ స్వామి దేవాలంయంలో
హైదరాబాద్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం నగరంలోని చిక్కడపల్లి సూర్యనగర్‌లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. దేవాలంయంలో గత నాలుగు రోజుల నుండి ప్రత్యేక కార్యక్రమాలు కోనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుఝము నుంచి భక్తుల సందడి నెలకొంది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయంను దేదీప్యమానంగా అలకరించారు. చిక్కడపల్లి వీరభద్రీయ కుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక మహిళ భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుని సోమవారం రాత్రి వివిధ రూపాలలో దీపాలంకరణ చేశారు. కార్యక్రమంలో వీరభద్రీయ సంఘం ప్రతినిధులతో పాటు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.