హైదరాబాద్

‘ఆన్‌లైనే’ ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: నల్లధనం, నకిలీ కరెన్సీకి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దును గ్రేటర్‌లో మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు జిహెచ్‌ఎంసి నగదు రహిత సేవలను ప్రోత్సహించనుంది. గత నెల 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత రద్దయి నోట్లతో ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సు, భవన నిర్మాణ అనుతుల ఛార్జీలను స్వీకరించిన జిహెచ్‌ఎంసికి రూ. 247 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. దీంతో మున్ముందు కూడా జిహెచ్‌ఎంసి నగదు రహిత సేవలను ప్రోత్సహించనుంది. ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి పరిధిలో 13లక్షల పై చిలుకు ఆస్తిపన్ను బకాయిదారులు, మరో లక్ష మంది ట్రేడ్ లైసెన్సులున్న వ్యాపార సంస్థలున్నా, వీరిలో కేవలం 12 శాతం మంది వివిధ రకాల బకాయిదారులు మాత్రమే ఆన్‌లైన్‌లో పేమెంట్లు చేస్తుండగా, ఇపుడు నగదు రహిత సేవలతో దీన్ని నూటికి నూరు శాతం పెంచుకునే దిశగా బల్దియా కృషిని ప్రారంభించింది. ఇందుకు ముఖ్యంగా డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేస్తూ పన్నులు, ఇతర ఛార్జీలు చెల్లించే వినియోగదారుడికి సుమారు 0.5శాతం మొదలుకుని చెల్లించే మొత్తంలో రెండు శాతం వరకు కూడా కన్స్యూమర్ ట్యాకు భారం పడుతుందని, దీంతో ఎక్కువ మంది ముందుకు రావటం లేదన్న విషయాన్ని గుర్తించిన జిహెచ్‌ఎంసి ఈ ట్యాక్సును మినహాయించాలని ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్సును నియమించినట్లు, ఈ విషయంపై త్వరలోనే కేంద్రం నుంచి ఓ నిర్ణయం వెలువడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను జిహెచ్‌ఎంసి ఇప్పటి వరకు కేవలం ఆస్తిపన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఇచ్చిన నగదు బహుమతులను ఇపుడు ట్రేడ్‌లైసెన్సులు రెన్యువల్ చేసుకునే వారికి కూడా వర్తింపజేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు వివరించారు. ప్రతి సంవత్సరం నవంబర్ మాసం మొదలుకుని తదుపరి సంవత్సరం మార్చి చివరి వరకు మాత్రమే ఆస్తిపన్ను వసూళ్ల హడావుడి ఉండేది. కానీ ఈ సారి కాస్త ముందు నుంచే వసూళ్లపై దృష్టి సారించటం, ఆ తర్వాత రద్దయిన నోట్లతో పన్ను స్వీకరించటంతో గత సంవత్సరం కన్నా ఇప్పటి వరకు వంద కోట్లు ఎక్కువ కలెక్షన్‌లో బల్దియా ఉంది.

చెల్లించనున్న నగదు పురస్కారాలు
ఈ వారం రోజుల్లో ఆస్తిపన్ను చెల్లించే వారికి మొదటి బహుమతిగా రూ. 50వేలు, రెండో బహుమతిగా రూ. 25వేలు, మూడవ బహుమతి రూ. 10వేలు(ఇద్దరికి), కన్సోలేషన్ బహుమతిగా రూ. 2500(8మందికి) అందజేయాలని నిర్ణయించారు. అలాగే మొట్టమొదటి సారిగా ట్రేడ్‌లైసెన్సులకు కూడా నగదు పురస్కారాలను ఇవ్వనున్నారు. ఈ ఛార్జీలు తక్కువగా ఉండటంతో ఈ వారం చెల్లించిన వారిలో ఆరుగుర్ని ఎంపిక చేసి ఒక్కోక్కరికి రూ. రెండున్నర వేల నగదు పురస్కారాలను అందించాలని జిహెచ్సి భావిస్తోంది.

ప్రధాన వరుల నుంచి వసూలైన ఆదాయం
వనరు గత.ఆర్థిక సం.టార్గెట్ వసూలు ప్రస్తుత సం. వసూలైంది
ఆస్తిపన్ను 1250 1113 1500 800
ట్రేడ్‌లైసెన్సు 100 50 150 29

సంపులో పడి
కార్మికుడి మృతి
ఖైరతాబాద్, డిసెంబర్ 6: విద్యుదాఘాతానికి గురైన ఓ కార్మికుడు సంపులో పడి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుని బంధువులు, పోలీసుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రాములు (40) గత కొంత కాలంగా నగరానికి వచ్చి బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 13లోని అంబేద్కర్‌నగరంలో నివాసం ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇదే క్రమంలో అదేప్రాంతానికి చెందిన అనిల్ అనే వ్యాపారి ఇల్లు శుభ్రం చేసేందుకు పిలవగా వెళ్లాడు. గత మూడు రోజులుగా పనులు చేస్తున్నాడు. మంగళవారం ఉదయమే శుభ్రం చేసేందుకు వెళ్లగా సంపులో భారీగా చెత్తాచెదారం చేరిందని దానిని కూడా శుభ్రం చేయాలని పురమాయించారు. అందులోకి దిగుతున్న సమయంలో పడి మృతి చెందాడు. మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చాలా సేపటి తరువాత సదరు వ్యాపారి కుటుంబం తెలియజేసింది. మొదట లోపల పడిపోవడం వల్లే చనిపోయారని చెప్పినా అక్కడి విద్యుత్ తీగలు అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు విద్యుత్ షాక్‌తో మృతిచెందాడని నిర్ధారించుకున్నారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదంటూ సంఘటన జరిగిన ఇంటి ముందే బైఠాయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం రాత్రి ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బుధవారం పోస్టుమార్టం ముగిసిన తరువాత తిరిగి ఇదే ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకువచ్చి ఆందోళన చేస్తామని బంధువులు హెచ్చరించారు.