హైదరాబాద్

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఇంచార్జి అడిషనల్ జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు.
ఇంటర్మీడియెట్ పరీక్షల ఏర్పాట్లపై జిల్లా పరీక్షల కమిటీ సమావేశాన్ని బుధవారం తన చాంబరులో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి 5 నుండి 24 వరకు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 5.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా థియరీ పరీక్షలు మార్చి 2 నుండి 22 వరకు ఉదయం 9.00 గంటల నుండి 12.00 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. పరీక్ష కేంద్రాలు అధికంగా ఉన్నాయని, ఆయా కేంద్రాలకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, కేంద్రాల వద్ద నిఘా విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరవేసే సమయంలో ట్రాఫిక్ రద్దీ లేకుండాచూసుకోవాలని, బండిల్స్‌ను జాగ్రత్తగా తీసుకువెళ్లాలని సూచించారు.
పరీక్ష కేంద్రాలలో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట ఎఎన్‌ఎమ్‌లు అందుబాటులో ఉండలా చర్యలు తీసుకోవాలని అదనపు డిఎం అండ్ హెచ్‌ఓ డా. పద్మజను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని, జిల్లాలోని నలుమూలల నుండి ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు నిర్ణీత సమయంలోపు చేరుకునేందుకు వీలుగా తగు సంఖ్యలో బస్సులను ఏర్పాటుచేయాలని ట్రాన్స్‌కో, ఆర్టీసి అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మంచినీరు అందుబాటులో ఉంచాలని జలమండలి అధికారులను ఎజెసి ఆదేశించారు. ఇంటర్మీడియెట్ పరీక్షల నిమిత్తం పాఠశాల విద్యాశాఖకు చెందిన సిబ్బందిని డిప్యూట్ చేయాల్సిందిగా డిఈఓను కోరారు. ఈ సమావేశంలో ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, టిఎస్‌ఆర్టీసి రీజినల్ మేనేజర్ ఎం.వి.రెడ్డి, జలమండలి సిజిఎం ఎ.ప్రభాకర్, టిఎస్పిడిసిఎల్ అధికారులు పాల్గొన్నారు.

క్రిమినల్ కోర్టులో మీడియేషన్ సెంటర్లు ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 3: మధ్యవర్తిత్వం ద్వారా కేసులను సత్వరమే పరిష్కరించడమే మీడియేషన్ సెంటర్ల ముఖ్య ఉద్దేశ్యమని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్‌పర్సన్ టి.రజనీ తెలిపారు. బుధవారం ఎర్రమంజిల్ స్పెషల్ కోర్టు, నాంపల్లి క్రిమినల్ కోర్టులలో మీడియేషన్ సెంటర్లను జస్టిస్ రజనీ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసులను దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎక్కువ సమయం వృధాకాకుండా ఇరుపక్షాలకు సంబంధించిన కక్షిదారులను మీడియేషన్ సెంటర్‌ను పిలిపించి వారి మధ్య సంధి కుదిర్చేందుకు న్యాయవాదులు మధ్యవర్తిత్వం చేస్తారన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైన కేసులు గతంలో చాలా ఉన్నాయని, దానివలన ఇరుపక్షాల వారికి త్వరగా ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం సివిల్ కేసులకే పరిమితం కాకుండా క్రిమినల్ కేసులలో కూడా మధ్యవర్తిత్వానికి ఆస్కారం ఉందన్నారు. ఎర్రమంజిల్ స్పెషల్ కోర్టులో ఏర్పాటుచేసిన మీడియేషన్ సెంటర్లో 15 మంది న్యాయవాదులు, అదేవిధంగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఏర్పాటుచేసిన మీడియేషన్ సెంటర్లో మరో 15 మంది న్యాయవాదులు కక్షిదారుల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు అందుబాటులో ఉంటారని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసులకు సంబంధించిన చివరి తీర్పు లోక్‌అదాలత్‌లో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మీడియేషన్ సెంటర్ల ఏర్పాటులో న్యాయవాదులు చూపించిన చొరవకు వారిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

ముగిసిన త్యాగరాయ ఆరాధనోత్సవాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 3: శ్రీకృష్ణ నాట్యమండలి ఆధ్వర్యంలో గత ఐదురోజులుగా జూబ్లిహిల్స్‌లోని నటరాజ కళామందిరంలో జరుగుతున్న త్యాగరాయ ఆరాధనోత్సవాలు బుధవారం సాయంత్రంతో ముగిసాయి. ఉదయం త్యాగరాజ స్వామికి సహస్రనామార్చన అనంతరం ముప్ఫై మంది చిన్నారులు పంచరత్న కీర్తనలను ఆలపించారు. అనంతరం చెన్నైకి చెందిన మురగన్‌రాజన్న బృందం నాదస్వర కచేరీ జరిగింది. ఈ కచేరీలో పదిమంది సన్నాయి వాయిద్య కళాకారులు, పదిమంది డోలు వాయిద్య కళాకారులు పాల్గొన్నారు. హంసధ్వని రాగంలో ‘వాతాపి గణపతిం...’ కీర్తనతో ప్రారంభించి శుద్ధసావేరి రాగంలో ‘కాల హరణమేలరా...’ కీర్తనను చిట్ట స్వరాలతో ఒకరినొకరు పోటీపడి నాదస్వరంపై రాగాలు పలికించారు. అనంతరం కళ్యాణి రాగం ఖండచాపు తాళంలో ‘అమ్మా రావమ్మా తులశమ్మ...’ అనే కీర్తనతో మరో పదికీర్తనలు కూడా నాదస్వరాల రాగాలు పలికించారు. భోజన విరామం అనంతరం పదిహేను సంవత్సరాలలోపు వయస్సుగల బాలబాలికలు త్యాగరాజ, ముత్తుస్వామి, పురందర దాసు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. చివరి కార్యక్రమంగా తంజావూరుకు చెందిన ఆచార్య విశ్వనాథశర్మ, ఆచార్య శకుంతల రామస్వామిల గాత్రయుగళ కచేరి జరిగింది. నాట రాగంలో ‘మహాగణపతిం మనసా స్మరామి...’ దీక్షితార్ కృతితో కార్యక్రమం ప్రారంభించి హిందోళ రాగంలో ‘సామజవరగమన...’ త్యాగరాజ కీర్తనను రమ్యంగా ఆలపించారు. ఈ కీర్తనలో ఆ ఇరువురు ఒకరినొకరు పోటీపడుతూ స్వరాలను పలికి ప్రేక్షకుల హర్షద్వనులు అందుకున్నారు.