హైదరాబాద్

తెలంగాణ పోలీస్.. దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, శాంతిభద్రతలు కాపాడుతూ, విచ్ఛిన్నకర శక్తులను అణచివేస్తూ, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపిన ఘనత తెలంగాణ పోలీసులకే దక్కుతుందని డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో సహకరిస్తున్నారని, రాష్ట్రంలో పోలీస్ శాఖ భద్రతకు నిబద్ధతతో పని చేస్తోందన్నారు. ఆదివారం తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారులు అత్యున్నత ప్రమాణాలతో జీవించాలని కాంక్షించారు. ఎస్‌ఎల్‌ఎన్ టర్మినస్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఎస్‌పి రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి ఎస్‌ఎల్‌ఎన్ రెడ్డి జ్ఞాపకార్థం, ఈ భవనం పునరుద్ధరణకు పూనుకున్నామని, పోలీస్ శాఖకు తమ సహకారాన్ని విస్తరించడంలో తమ వంతు కర్తవ్యంగా ఈ భవనాన్ని నిర్మించామన్నారు. అదేవిధంగా 2009లో నీలోఫర్ ఆసుపత్రి వద్ద ఇద్దరు వ్యక్తులు ఉండేందుకు వీలుగా భద్రతా సదుపాయాలతో నిర్మించామని, 2015లో సైబరాబాద్ కమిషనరేట్‌కు ఒక కొత్త బొలెరో జీపు, ఐదు మోటార్ సైకిళ్లు బహూకరించామన్నారు. ఇంకా ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు జితేందర్‌రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రావు, పలువురు రిటైర్డ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సహకరించిన అధికారులు, దాతలను సత్కరించారు.
ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్
మంత్రి హరీష్‌రావు ధ్వజం
వికారాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణం పనులను కాంగ్రె స్ పార్టీ ఓ వైపు అడ్డుకుంటూనే మరోవైపు అదే ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేస్తోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. ఆదివారం వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం వికారాబాద్ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు వెనుకబడినందున సస్యశ్యామలం చేయాలని యుద్దప్రాతిపదికన ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఓ పక్క సిఎం కేసిఆర్ ప్రత్యేక దృషి పెట్టగా కాంగ్రెస్ మాత్రం అడుగడునా అడ్డుపడుతోందని ఆరోపించారు. పాలమూరు పథకానికి సిఎంలుగా రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నపుడు సర్వేకు అంచనా గాని, సర్వేకు టెండర్లు పిలవలేదని అలాంటిది ప్రాజెక్టులు ఎలా నిర్మించేవారని ప్రశ్నించారు. 15 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు నిర్మించే పాలమూరు ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లాలోని ఐదు లక్షల ఎకరాలకు నీరందించేలా నిర్మాణం జరుగుతోందని తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి ప్రాజెక్టుకు నీరు తేవాలని ఆలోచించగా, కాంగ్రెస్ జూరాల నుండి నీరు తేవాలని పట్టుబట్టడం అవగాహన లోపమేనని ఎద్దేవా చేశారు. జూరాల నుండి నెట్టంపాడు, కోయిల్‌సాగర్‌తో పాటు మరికొన్నింటికి నీరు ఇవ్వాల్సి ఉంటుందని అలాంటపుడు ఎలా ఎత్తిపోతలకు అందుతాయో చెప్పాలని అన్నారు. శ్రీశైలం పెద్ద రిజర్వాయర్ అని, ఓపెన్ హౌజ్ కడతామని చెప్పగా సింహాలు, చెట్లు నాశనమవుతాయని అది పర్యావరణానికి ముప్పని గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్ళింది స్వయానా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొల్లాపూర్‌లో పోటీ చేసిన హర్షవర్ధన్ అని వెల్లడించారు. చెన్నైలో దానిపై కేసు వేశారని గుర్తుచేశారు. అక్కడ పనులు నిలిపి వేయాలని కేసు వేసింది, ఇక్కడ పనులు జరగాలని పాదయాత్ర చేస్తున్నది కాంగ్రెస్ నాయకులేనని చెప్పారు. కాంగ్రెస్‌ది ఓ డ్రామా అని రెండు గొంతులు, రెండు తలకాయలని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా ప్రజలు అమాయకులేమీ కాదని తెలిపారు. బహిరంగసభకు హాజరవుతున్న దిగ్విజయ్ సింగే కాంగ్రెస్ వైఖరిపై సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టు కోసం భూసేకరణ చేస్తే ప్రజలను రెచ్చగొట్టి పనులను ఆపే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎట్టకేలకు అండర్ గ్రౌండ్ పంప్‌హౌజ్ కడితే అవినీతి జరిగిందని అబద్దపు ప్రచారం చేశారని, అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టడంతో 13 కోట్ల ఆదాతోపాటు సాంకేతిక ఇబ్బందులు, అటవీశాఖ అడ్డంకులు తొలగిపోయాయని స్పష్టం చేశారు. పనులు జరగొద్దని దానిపైనా హైకోర్టులో కేసు వేయడం విడ్డూరమని అన్నారు. ఇదిలా ఉండగా నీరు మళ్ళిస్తున్నారని ప్రాణహిత టన్నల్‌ను కాంగ్రెస్ నాయకులు చూడటం సిగ్గుచేటన్నారు. 2008లో ప్రాణహితకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేసి 2014 వరకు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో పనులకు ప్రభుత్వం 15 కోట్లు కాగా, మొబలైజేషన్ పేరిట 100 కోట్ల రూపాయల బిల్లులను స్వాహా చేశారని ఆరోపించారు. అపుడున్న మంత్రే నీరు వచ్చే పరిస్థితి లేదని వౌఖికంగా చెప్పి పనులు ఆపారని గుర్తుచేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇపిసి పద్దతిలో పనులు చేసి లూటీ చేయగా, తమ ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం పని ఆధారంగా బిల్లులు చెల్లించి అవినీతిని అరికట్టామని స్పష్టం చేశారు. పాలమూరు పథకంపై కాంగ్రెస్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్ళడంతో ఎన్విరాన్‌మెంట్ పర్మిషన్ తేవాల్సి ఉంటుందని, అది మూడు కాలాల పాటు పరిశీలించిన తర్వాత అనుమతిస్తుందని, అది పక్కనబెట్టి టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి కాంగ్రెస్ పూనుకుందని అన్నారు. ఇసి లేనందున స్టే ఇచ్చి కేవలం తాగునీటి పనులు మాత్రమే చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయని, కాని ఏ ప్రాజెక్టు చేపట్టినా తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు తేవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని వివరించారు. రంగారెడ్డి జిల్లా వెనుకబాటుకు కారణం కాంగ్రెస్సేనని చెప్పారు. జలయజ్ఞం పేర 34 ప్రాజెక్టులను ప్రారంభించిన కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేయలేదని, వేగంగా పనిచేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రకరకాల కష్టాల తెస్తున్నారని ఓ వైపు భూనిర్వాసితులను రెచ్చగొట్టి, మరోవైపు కేసులు వేస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 4.50 ఎకరాలకు సాగునీరందివ్వడంతో వలస వెళ్ళినవారు తిరిగి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. 600 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని బయట ప్రచారం చేసిన ఓ ఎమ్మెల్యే శాసనసభలో 1600 కోట్లు కావాలని అవీ ఒకే విడతలో కేటాయించాలని చెప్పి తన నైజం బయట పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. నాలుగు ప్రాజెక్టుల నిర్మాణానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామని, ఇంకా పెడతామని పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. భూనిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు లక్షలు చెల్లించి చేతులు దులుపుకోగా, తమ ప్రభుత్వం ఆరు లక్షలు ఇస్తోందని, అయినా రైతులను నష్టపరిహారం ఎక్కువ డిమాండ్ చేయాలని రెచ్చగొడుతున్నారని వివరించారు. కాంగ్రెస్ ఇప్పటికైనా మోసపూరిత విధానం మానుకోవాలని, మాయమాటలను ప్రజలను నమ్మబోరని పేర్కొన్నారు. అన్ని అనుమతులు చెచ్చి పనులు ప్రారంభించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసి టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని, అబద్దపు మాటలు చెప్పబోమని అన్నారు. పరిగిలో కాంగ్రెస్ ఏర్పాటు చేసే సభతో అవకాశవాదాన్ని నగ్నంగా బయటపెడుతున్నారని, స్టే తెచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టాలనుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కేసు వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి ముందుకు సాగాలని హితవు పలికారు. సమావేశంలో రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి, చేవెళ్ళ ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బి.సంజీవరావు, కె.యాదయ్య, ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల అభ్యర్థి జనార్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్, ధారూర్ మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, నరోత్తంరెడ్డి పాల్గొన్నారు.