హైదరాబాద్

ఆదా దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: విద్యుత్ వినియోగాన్ని ఆదా చేసేందుకు ఇప్పటికే జిహెచ్‌ఎంసి సొలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. కేవలం జిహెచ్‌ఎంసి ఆఫీసుల్లోనే గాక, నగరంలోని ఇళ్లు, ఆఫీసులు, ఇతర ప్రాంతాల్లో విద్యుత్‌ను ఆదా చేసే దిశగా ప్రజల్లో అవగాహన పెంపొందించటంతో పాటు అందుకు అవసరమైన ఎల్‌ఇడి లైట్లను సైతం బల్దియాకు చెందిన అన్ని ఆఫీసుల్లో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసు లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం తొమ్మిది వాట్స్ బల్బు, ఇరవై వాట్స్ ట్యూబ్‌లైట్లతో పాటు ఫ్యాన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటిని అందుబాటులోకి తెచ్చిన కేవలం 15 రోజుల్లో 30 స్టాళ్లలో దాదాపు లక్షా 25వేల పై చిలుకు ఎల్‌ఇడి లైట్లు, ఫ్యాన్లు అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. వీటి వినియోగం ద్వారా 2141 కిలోవాట్ల విద్యుత్ వినియోగం తగ్గటంతో పాటు సంవత్సరానికి 14వేల 460 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు 11వేల 723 టన్నుల కార్బన్ డై యాక్సైడ్ ఉత్పత్తిని కూడా తగ్గి, వాతావరణంలో కాలుష్యం శాతం తగ్గే అవకాశముంది. పర్యావరణ హితమైన ఈ ఎల్‌ఇడి లైట్లను ప్రస్తుతం వినియోగిస్తున్న సాంప్రదాయక విద్యుత్ లైట్ల స్థానంలో ఉపయోగించాలని జిహెచ్‌ఎంసి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపట్టింది. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగులు పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈఈఎస్‌ఎల్ ద్వారా ప్రవేశపెట్టి ‘ఉజాలా’ ద్వారా సబ్సిడీ రైట్లకే ఈ లైట్లను అందిస్తోంది. గ్రేటర్‌లో గడిచిన 15 రోజుల్లో ఇప్పటి వరకు ఒక్కోక్కటి రూ. 70 చొప్పున తొమ్మిది వాట్ల ఎల్‌ఇడి బల్బులు లక్షా 4వేల 167 అమ్ముడుపోగా, 20వేల 520 వరకు ట్యూబ్‌లైట్లు ఒక్కోక్కటికి రూ. 230, అలాగే 350 వాట్ల ఫ్యాన్లు ఒక్కోక్కటి రూ. 1150కి విక్రయించినట్లు ఈఈఎస్‌ఎల్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సాంప్రదాయక లైట్ల స్థానంలో వీటిని వినియోగిస్తే దాదాపు 40 శాతం విద్యుత్ ఆదా అవుతోందని వారు తెలిపారు.
మున్ముందు మొత్తం ఎల్‌ఇడి వెలుగులు
కరెంటు ఆదా కావటంతో పాటు సబ్సిడీ ధరకు అందుబాటులో ఉన్న ఎల్‌ఇడి లైట్లను వినియోగిస్తూ గ్రేటర్‌లో ఎల్‌ఇడి వెలుగులు నింపేందుకు జిహెచ్‌ఎంసి సిద్దమవుతోంది. ఇందుకు గాను జిహెచ్‌ఎంసి ఎలక్ట్రికల్ విభాగం వందకు పై చిలుకు వార్డుల్లో ఈ బల్బుల వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టంది. అలాగే జిహెచ్‌ఎంసిలో విద్యుత్‌కు బదులు సౌరశక్తిని వినియోగించుకునేందుకు ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు ‘ది ఎనర్జీ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్’ అనే సంస్థను జిహెచ్‌ఎంసి నియమించుకుంది. ఈ సంస్థ కసరత్తు ఫలించి సోలార్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే జిహెచ్‌ఎంసి ప్రతినెల చెల్లిస్తున్న లక్షలాది రూపాయల కరెంటు బిల్లులో దాదాపు 40 శాతం తగ్గే అవకాశాలున్నాయి.

అర్ధం అయ్యేలా చెప్పడమే
విజయ రహస్యం
డా. సి వి నర్సింహారెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 23: మన మనస్సులోని భావాలు, ఆలోచనలను ఇతరులకు అర్ధమయ్యేలా స్పష్టంగా చెప్పగలగడమే విజయ రహస్యమని పిఆర్ గురు డాక్టర్ సి వి నర్సింహారెడ్డి పేర్కొన్నారు. గీతం యూనివర్శిటీలో కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ స్కిల్స్ ఫర్ ఎంప్లాయిబిలిటీ అనే అంశంపై పిఆర్‌ఎస్‌ఐ నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ వంటి వారు తమ భావాలు, ఆలోచనలను ఇతరులతో స్పష్టంగా వ్యక్తీకరించి తమ లక్ష్యాలను సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ వైస్ ఛాన్సలర్ ఎన్ శివప్రసాద్, ప్రొఫెసర్ సిహెచ్ సంజయ్, వై బాబ్జీ, డాక్టర్ పి వేణుగోపాల్‌రెడ్డి, జి అనీజ తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌సిఎల్ గ్రాంట్ విజేతల వెల్లడి
ఆరోగ్యం, పర్యావరణం, విద్య అనే మూడు విభాగాల్లో హెచ్‌సిఎల్ గ్రాంట్ విజేతల పేర్లను ప్రకటించింది. పర్యావరణంలో ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ సంస్థకువ, ఆరోగ్యంలో చైల్డ్ ఇన్ నీడ్ ఇనిస్టిట్యూట్‌కు, చదువులో మెల్‌జోల్ సంస్థలకు ఈ ఫౌండేషన్ గ్రాంట్ దక్కింది. ఈ కార్యక్రమంలో గ్రాంట్ జ్యూరీ చైర్‌పర్సన్ రాబిన్ అబ్రామ్స్ మాట్లాడుతూ ఫండ్‌కు మించి విలువను హెచ్‌సిఎల్ గ్రాంట్ అందిస్తోందని చెప్పారు.
మానీష్ ఠాకూర్‌కు వికెఆర్‌వి రావు ప్రైజ్
కొల్‌కటాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ సంస్థ ప్రొఫెసర్ మానిష్ కె ఠాకూర్‌కు దేశంలో ప్రతిష్టాత్మక వికెఆర్‌వి రావు ప్రైజ్ దక్కింది.
ఆస్కిలో దోసెల ఉత్సవం
అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియాలో గురువారం నాడు దోసెల ఉత్సవాన్ని నిర్వహించారు. హోటల్ మేనేజిమెంట్ పిజి డిప్లొమో విద్యార్ధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహారం, మాంసాహారం ఉపయోగిస్తూ అనేక రకాల దోసెలను విద్యార్ధులు ప్రదర్శించారు.

గ్రూప్- 2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఈనెల 26న నిర్వహిస్తున్న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషనర్ ఈనెల 26న నిర్వహించనున్న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణపై లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్స్‌తో సమీక్ష నిర్వహించారు. గ్రూప్-2 పరీక్ష ఉదయం 10గంటల నుండి 12.30గంటల వరకు నిర్వహిస్తారని, 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 23200 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, మొత్తం ఎనిమిది లైజన్ ఆఫీసర్‌లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్‌లను నియమించినట్లు చెప్పారు. పరీక్షకు సంబంధించి జిల్లా యంత్రాంగం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినందున, అభ్యర్థులు క్రమశిక్షణతో, ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని కోరారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్/ఓటర్/పాన్ కార్డు తమ వెంట తప్పకుండా తెచ్చుకోవాలని, పరీక్ష కేంద్రాలలో ఉదయం 9గంటల నుండి 9.45 నిమిషాల వరకు అనుమతిస్తారని, తరువాత ఒక నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించబడరని, పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలు నుంచి బయటకు పంపమని తెలిపారు. బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నుతో మాత్రమే పరీక్ష రాయాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు, గడియారాలు, పర్సులు, వైట్ ఫ్లూయిడ్స్ లోనికి అనుమతించబడవని అన్నారు. గర్భిణులు, వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేస్తున్నారని, అంధులు, రెండు కాళ్లు లేని నడవలేని వారికి సహాయార్థం వచ్చే వ్యక్తి కూడా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులు వారికి కావాల్సిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం 18004250817కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ నెంబరు 26వ తారీఖు ఉదయం 5 గంటల నుండి పరీక్ష పేపర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అందచేసే వరకు పనిచేస్తుందని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అభ్యర్థులు ఇబ్బందిపడకుండా పరీక్ష జరిగే రోజు ఉదయం వేళ, పరీక్ష ముగిసిన అనంతరం అధిక మొత్తంలో ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎఎన్‌ఎంలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు సరిపడు మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ అసిస్టెంట్ సెక్రెటరీ విశాల, జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్, రమేశ్ పాల్గొన్నారు.