రాష్ట్రీయం

ఈ ఏడాదీ..ఎండలు ఎక్కువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: చలికాలం పూర్తయి, ఎండాకాలంలో అడుగువేస్తున్న సమయంలోనే సూర్యభగవానుడు అప్పుడే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి చివర, మార్చి తొలి పక్షంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావలసి ఉండగా, అప్పుడే చండప్రచండంగా మండిపోతున్నాడు. ఎండాకాలం మరో నాలుగు నెలలపాటు ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పగటిపూట భయంకరమైన ఎండలు ఉంటాయని అంచనావేస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ మధ్య వరకు ఎండలు ఉధృతంగానే ఉండవచ్చని సంబంధిత శాఖలు అంచనావేశాయి. హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఎండాకాలంలో నమోదయ్యే ఉష్ణోగ్రత కన్నా ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ అధికంగా ఉంటుందని ఆయన వివరించారు.
అయితే వాతావరణ పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతుందని, తమ శాఖ ఈ అంశంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుందని వివరించారు. ఈ ఎండాకాలానికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) ఇప్పటికే ప్రాథమిక నివేదికలను తెలంగాణతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. ఎండాకాలంలో వేడిగాడ్పుల వల్ల చాలా మంది అనారోగ్యానికి గురికావడం, మరణించడం జరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతుందని, వేడిగాడ్పులు కూడా ఉధృతంగా ఉంటాయని ఎన్‌డిఎంఎ అంచనా వేసింది. ఎండాకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్‌డిఎంఎ సమగ్ర నివేదికలను మార్చి రెండోవారం వరకు అన్ని రాష్ట్రాలకు పంపిస్తుందని ఎన్‌డిఎంఎ ప్రతినిధి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.
ప్రధానంగా రైతుకూలీలు, ఇతర కూలీలు ఎండల్లో ఎక్కువగా పనిచేయడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశాలుంటాయని ఎన్‌డిఎంఎ భావిస్తోంది. పగటి వేళ 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మరీ ముఖ్యంగా పనె్నండు గంటల నుండి మూడు గంటల వరకు ఎండల్లో తిరగవద్దని ఎన్‌డిఎంఎ రూపొందించిన సూచనల్లో ప్రధానంగా పేర్కొంటున్నారు. ఎండల్లో పనిచేయాల్సి వచ్చినా, తిరగాల్సి వచ్చినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో ప్రజల అవసరాల కోసం తాగునీటిని అందించే ఏర్పాట్లు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తోందని ఆయన వివరించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ప్రధానంగా ఎండాకాలంలో కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించినందువల్ల ఈ కార్యక్రమం కింద పనులు ఉదయం, సాయంత్రం మాత్రమే జరిగేట్లు చర్యలు తీసుకోవాలని ఎన్‌డిఎంఎ సూచించింది.
ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎండాకాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ముందస్తు చర్యలు చేపట్టింది. మనుషులతో పాటు, పశుపక్ష్యాదులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ తాగునీటి శాఖ, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు తాగునీటి అంశంపై పక్కా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, మున్సిపల్ వ్యవహారాలు, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.