హైదరాబాద్

బల్దియా ఆన్‌లైన్ జపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: మహానగరంలోని కోటి మందికి జిహెచ్‌ఎంసి అందించే సేవల్లో మానవ ప్రమేయం, అవీనితి తావు లేకుండా పారదర్శకంగా సేవలందించేందుకు జిహెచ్‌ఎంసి ఆన్‌లైన్ మంత్రాన్ని జపిస్తోంది. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతులు, బర్త్,డెత్ సర్ట్ఫికెట్లతో భవన నిర్మాణం పూర్తయిన తర్వాత జారీ చేసే అక్యుపెన్సీ సర్ట్ఫికెట్లను కూడా ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న జిహెచ్‌ఎంసి ఇపుడు కొత్త ట్రేడ్ లైసెన్సు తీసుకునేందుకు ఆస్తిపన్ను స్వీయ నిర్థారణ వంటి విధానాన్ని కూడా ఆన్‌లైన్ చేసింది. దీంతో ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి అందిస్తోన్న ఆన్‌లైన్ సేవల జాబితాలో ట్రేడ్ లైసెన్సును కూడా చేర్చింది.
నగరంలో లక్షల సంఖ్యలో వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉండగా, జిహెచ్‌ఎంసి జారీ చేసిన ట్రేడ్ లైసెన్సులు కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. కొన్ని సార్లు కొత్తగా ఏర్పాటయ్యే వ్యాపార, వాణిజ్య సంస్థలు ట్రేడ్ లైసెన్సులు తీసుకునేందుకు ముందుకొచ్చినా, సర్కిల్ కార్యాలయాల్లో ఈ లైసెన్సులు జారీ చేసే సహాయ వైద్యాధికారులు అందుబాటులో లేకపోవటం, లైసెన్సింగ్ అధికారులు, వ్యాల్యుయేషన్ అధికారులు తమ చుట్టూ చక్కర్లు కొట్టించుకోవటం వంటి పరిణామాలు చోటుచేసుకోవటంతో లైసెన్సు తీసుకోకుండానే వ్యాపారులు వెళ్లిపోయేవారు. దీంతో నగరంలో ఎప్పటికపుడు వేల సంఖ్యలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు నిర్మితమవుతున్నా, ట్రేడ్ లైసెన్సులు పెరగకపోవటంతో ఖజానాకు గండి పడుతోంది. ఈ నష్టాన్ని పూరించుకునేందుకు జిహెచ్‌ఎంసి నేరుగా వ్యాపారులే తమకు కావల్సిన ట్రేడ్ లైసెన్సు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ లైసెన్సు జారీలో కూడా మానవ ప్రమేయం లేకుండా, అవినీతి జరగకుండా ఉండేందుకు గాను ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు సమర్పణ, సిటిజన్ సర్వీసు సెంటర్లలోనే ఛార్జీలను చెల్లించి లైసెన్సు పొందేందుకు వీలుగా ఈ పద్దతిని ప్రవేశపెట్టారు. వ్యాపారులకు లైసెన్సు పొందే ప్రక్రియపై అవగాహనను కూడా కలుగుతుంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ ఆన్‌లైన్ స్వీయ నిర్థారణ విధానంతో వ్యాపారులు మరింత సులభతరంగా లైసెన్సులు పొందుతారని జిహెచ్‌ఎంసి భావిస్తోంది.
సత్ఫలితాలిస్తున్న చర్యలు పెరుగుతున్న లైసెన్సులు
2011-12 ఆర్థిక సంవత్సరంలో 32572 లైసెన్సుల నుంచి రూ.19.81కోట్లు వసూలు చేయగా,2012-13 నాటికి అది కాస్త లైసెన్సుల సంఖ్య 39563కు పెరిగి రూ.25.5 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే 2013-14లో 41256 లైసెన్సుల నుంచి రూ. 25.65కోట్లు, 2014-15లో 51330 లైసెన్సుల నుంచి రూ. 33.89కోట్లు, 2015-16లో 42836ల నుంచి రూ. 28.51 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్న జిహెచ్‌ఎంసి వర్తమాన ఆర్థిక సంవత్సరం 2016-17లో ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్సుల సంఖ్య 70597కు పెంచుకుని, రూ.38.84 కోట్లు వసూలు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపుకు ఇంకా సమయం ఉన్నందున ఈ సారి ట్రేడ్ కలెక్షన్ పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
దరఖాస్తులు సమర్పించే విధానం
* ట్రేడ్ లైసెన్సు కావల్సిన వారు వెబ్‌సైట్‌కు వెళ్లి అందులో ఈ-రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకుని, అందులో ట్రేడ్ లైసెన్సు ఫోల్డర్‌లోకి వెళ్లాలి.
* ఈ-రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాపారస్తుడు తమ మొబైల్ నెంబర్‌ను నమోదు చేసుకోవాలి. దీంతో రిజిస్ట్రర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు వన్ టై పాస్‌వర్డ్(వోటిపి) వస్తోంది.
* వన్‌టైం పాస్‌వర్డ్‌ను అప్లై చేయగానే ట్రేడ్ లైసెన్సు దరఖాస్తు ఫారం డిస్‌ప్లేపై వస్తుంది.
* అందులో వ్యాపారస్తుడు, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు తమ ట్రేడ్ వివరాలు, సర్కిల్, వార్డు, ప్రాంతం, వ్యాపార సంస్థ నెలకొల్పిన చిరునామా, సబ్ కేటగిరి, రోడ్డు వెడల్పు, ఏరియా తదితర వివరాలను నమోదు చేయాలి. అలాగే సంస్థలను ఏర్పాటు చేస్తున్న భవనం తాలుకూ నిర్మాణ అనుమతుల వివరాలు, బిల్డింగ్ అక్యుపెన్సీ సర్ట్ఫికెట్, ఆస్తిపన్ను రసీదు, లీజు, రెంటల్ డీడ్, లోకేషన్ ప్లాన్ వంటి తదితర డాక్యుమెంట్ల జిరాక్స్‌తో పాటు నిర్వాహకుడి ఫొటోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
* అన్ని వివరాలు, డాక్యుమెంట్లు సక్రమగా అప్‌లోడ్ చేయగానే దరఖాస్తు నెంబర్ ఎస్‌ఎంఎస్ రూపంలో మొబైల్ ఫోన్‌కు వస్తుంది. ఏ అధికారికి ఈ ట్రేడ్ లైసెన్సు దరఖాస్తు వెళ్లిందో, ఆ అధికారి ఫోన్ నెంబర్ కూడా మేసేజ్‌లో వస్తుంది.
* ఈ దరఖాస్తు నెంబర్‌పై సిటిజన్ సర్వీసు సెంటర్ సూచించే లైసెన్సు ఫీజును జమ చేయాలి. అపుడు తాత్కాలిక ట్రేడ్ లైసెన్సు జారీ అవుతోంది. ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్, ఎల్‌వో, ఏఎల్‌వో, వివోలు తగు విచారణ జరిపి నివేదికను లైసెన్సు జారీ చేసే డిప్యూటీ, జోనల్ కమిషనర్లకు, వ్యాల్యుయేషన్ ఆఫీసర్లకు పంపుతారు.
* దరఖాస్తుదారుడిచ్చే వివరాలను పరిగణలోకి తీసుకుని ట్రేడ్ లైసెన్సుకు సంబంధించి ట్రేడ్ లైసెన్సు ఇండెక్స్ నెంబర్(టిన్) నెంబర్ జారీ అవుతోంది.

ధర్నా చౌక్ వద్ద ఐదు రూపాయల
భోజన పథకం ప్రారంభం
చిక్కడపల్లి, మార్చి 2: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రవేశపెట్టిన ఐదు రూపాయల భోజనం పథకం సత్ఫాలిస్తుండంతో వీటి సంఖ్యను పెంచారు. ఐదు రూపాయల భోజన పథకాన్ని గురువారం ఇందిరాపార్కు వద్ద నున్న ధర్నా చౌక్‌లో ప్రారంభించారు. జిహెచ్‌ఎంసి సర్కిల్-9 ఎఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ స్థానిక కార్పొరేటర్ జి.లాస్య నందితతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిహెచ్‌ఎంసి, హరేరామ హరేకృష్ణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటుచేశామని అన్నారు. నిత్యం ధర్నాలకు ఎంతో సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడకు వస్తూ ఉంటారని, వారంతా ఎక్కువ శాతం ఆర్ధికంగా వెనుకబడి ఉంటారని చెప్పారు. ఇక్కడ హోటల్స్‌లో డబ్బులు ఖర్చు పెట్టి తినే పరిస్థితి లేక చాలా మంది ఆకలితో తిరిగి వెళ్లిపోతూ ఉంటారని, అటువంటి వారికోసం 5 రూపాయల భోజన పథకం ఇక్కడ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గతంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ ఇ-సేవ వద్ద, బాగ్‌లింగంపల్లి సుందరయ్య విఙ్ఞన కేంద్రం వద్ద, అశోక్ నగర్ నగర గ్రంధాలయం వద్ద ఐదు రూపాయల భోజన పథకాన్ని ఏర్పాటుచేశామని, అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేశామని, ప్రజలు దీనిని సద్వినియోగపరచుకోవాలని కోరారు. త్వరలోనే ధర్నా చౌక్‌లో మంచినీటి వసతిని కూడా ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు దశరథ్, ఆనంద్ పాల్గొన్నారు.