హైదరాబాద్

ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఖైరతాబాద్, మార్చి 19: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సి స్థానానికి ఆదివారం జరిగిన పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఆదివారం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఎన్నికల్లో మొత్తం 82.48 శాతం ఓట్లు పోల్ కాగా హైదరాబాద్‌లో 70.04 పోలింగ్ శాతం నమోదయిందని రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌తో పాటు ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఇద్దరు వీడియో కెమెరామెన్‌లను కూడా కేటాయించి వీడియోగ్రఫీ చేయించినట్టు తెలిపారు. నగరంలోని అంబర్‌పేట ఇండోర్ స్టేడియం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్టు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని తెలిపారు. ఈ ఎన్నికలకు నియమించి ప్రత్యేక పరిశీలకులు రజత్‌కుమార్ ఆదివారం నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి తనిఖీ చేశారు. హైదరాబాద్‌తో పాటు ఆయా జిల్లాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను అంబర్‌పేట స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఈనెల 22న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని రిటర్నింగ్ అధికారి అద్వైత సింగ్ తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో
80.64 శాతం పోలింగ్

హైదరాబాద్, మార్చి 19: రంగారెడ్డి జిల్లాలో ఆదివారం రంగారెడ్డి- మహబూబ్‌నగర్ - హైదరాబాద్ నగర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 80.64 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు.
మొత్తం 6528 ఓట్లకు 5264 ఓట్లు పోలైనట్లు చెప్పారు. 3075 మంది పురుషులు, 2189 మంది మహిళలు ఓట్లు వేశారని తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగి 10 గంటలకు 19.87 శాతం నమోదైందని చెప్పారు. ఉదయం 11 గంటల అనంతరం పుంజుకుందని 12 గంటలకు 42.63 శాతం నమోదైందని చెప్పారు. తరువాత మద్యాహ్నం 2 గంటలకు 57.63 శాతం, 4 గంటలకు 66.84 శాతం, పోలింగ్ ముగిసే సమయానికి 80.64 శాతం నమోదైందని అన్నారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 22న అంబర్‌పేట్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుందని తెలిపారు.