మెయన్ ఫీచర్

వందేళ్ల క్రితమే.. ‘స్వచ్ఛ్భారత్’కు నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబర్మతీ ఆశ్రమంలోని వారందరినీ చంపారణ్‌కు గాంధీజీ పిలిపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తల్ని ఆహ్వానించారు. అందరూ కలిసి వీధులన్నింటినీ శుభ్రపరిచారు. పెంటకుప్పల్ని ఎత్తివేయడం, నీళ్లకుంటల్ని మట్టితో పూడ్చడం, పారిశుద్ధ్య కార్యక్రమాల ఆవశ్యకతను ఇంటింటికీ వెళ్లి బోధపరచడం వంటి కార్యక్రమాలన్నీ ఏకబిగిన సాగాయి. మురికివాడల్లో నివసిస్తున్న పేదల కోసం ఆరుబయలు పాఠశాలలు ఏర్పాటుచేసి, విద్యాబోధన కార్యక్రమం ప్రారంభించారు.

వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో చిరకాలంగా రైతులు అవస్థలు పడుతూనే ఉన్నారు. వలస రాజ్యపాలన కాలం నుంచి ఇప్పటికీ అన్నదాతలు సవాళ్లకు ఎదురీదుతూ పొలానే్న నమ్ముకుని కాలాన్ని నెట్టుకొస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి, పాలకుల విధానాలతో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా కర్షకులు వారి వృత్తిని వీడిపోలేదు. తమ సమస్యలపై వీరు ఆందోళన చెయ్యడం 19వ శతాబ్దిలో ప్రారంభమైనా, సంఘటిత రీతిలో రైతు ఉద్యమం విజయవంతం కావడం తొలిసారిగా 1917లో జరిగింది. ఆ పోరుకు నాయకత్వం వహించినవాడు జాతిపిత గాంధీజీ. దేశంలో గాంధీజీ నిర్వహించిన మొదటి ఉద్యమం కూడా అదే! ఈ ఏడాది ఏప్రిల్‌కు నూరేళ్లు పూర్తవుతున్న చారిత్రాత్మక ఘటనే- ‘చంపారణ్’ ఉద్యమం. ఇది రైతు ఉద్యమంగానే కాక, అనేక విశిష్టతలను సంతరించుకొంది. ఉత్తర బిహార్‌లో చంపారణ్ జిల్లా ఉంది. ఈ జిల్లాలోని మోతీహారీ, చెట్టియా పట్టణాలకు ఆనుకుని సుమారు 2,500 గ్రామాలున్నాయి. చంపారణ్ పూర్వనామం ‘చంపారణ్యం’. ఈ ప్రాంతంలో సువిశాల భూమిని రైతులు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ప్రశాంతంగా వుండేవారు. 19వ శతాబ్దంలో తెల్లదొరలు అక్కడికి వలస వచ్చి, ఈ భూములు ‘నీలిమందు’ను పండించడానికి అనువుగా వుంటాయని భావించారు. రైతులను తమ కౌలుదార్లుగా మార్చేసుకుని, వరికి బదులు నీలిమందు పండించాలని తెల్లదొరలు ఆదేశించారు. ఇలా పండించిన నీలిమందును తెల్లదొరలు నిర్ణయించిన అతి తక్కువ ధరకే రైతులు విక్రయించాలి. దీంతో రైతుల ఆదాయం తగ్గిపోవడం అటుంచి, భూసారం కూడా క్రమంగా క్షీణించసాగింది. రైతులు తెల్లదొరలతో చేసుకున్న ఒప్పందానే్న ‘తీన్ కటియా’ ఒప్పందం అంటారు. ఇది తమకు నష్టాన్ని కలిగించేదే అయినా, దిక్కులేని స్థితిలో దశాబ్దాల పాటు రైతులు కొనసాగిస్తూ వచ్చారు.
తెల్లదొరల ఇళ్లలో ఏ శుభకార్యాలు జరిగినా రైతులు ముడుపులు ఇవ్వాల్సిందే. దొరలు వేసవి విడిదికి వెళ్లాలన్నా, కొత్త ఏనుగును కొనుక్కున్నా రైతులు నజరానాలు చెల్లించవలసిందే! ఎదురుతిరిగిన వారిని చెట్లకుకట్టి కొరడాలతో కొట్టేవారు. ఒక్కోసారి రైతుల ఇళ్లలోకి చొరబడి పలు రకాల అకృత్యాలు చేస్తూండేవారు. వాళ్ల సామాన్లను జప్తు చేస్తూండేవారు. ఈ నేపథ్యంలో రైతులు దారిద్య్రంలోకి కూరుకుపోతూ పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో చంపారణ్‌కు చెందిన రాజ్‌కుమార్ శుక్లా అనే వ్యక్తి 1916లో జరిగిన కాంగ్రెస్ మహాసభ వద్దకు వెళ్లి, అక్కడి పెద్దలకు తమగోడు విన్నవించుకుందామని ప్రయత్నించాడు. వాళ్లెవరూ అతని ఆవేదనను పట్టించుకోలేదు. ఆ తర్వాత శుక్లా గాంధీజీ వద్దకు వెళ్లి, రైతుల పరిస్థితిని వివిరించాడు. 1917లో శుక్లాతో కలసి ఆయన చంపారణ్ ప్రాంతానికి వెళ్లి అక్కడి రైతుల స్థితిగతులను తెలుసుకున్నారు. కర్షకులను ఆదుకునేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని గాంధీజీ నిర్ణయించారు. చంపారణ్ వెళ్లే ముందు ముజప్పర్ పట్టణంలో గాంధీజీ తన మిత్రుడైన జెబి కృపలానీని కలుసుకుని తన పర్యటన గురించి వివరించారు. న్యాయవాదులు, అధ్యాపకులు, విద్యార్థులు మొదలైన వారిని కృపలానీ సమావేశ పరచి గాంధీజీ చేపట్టబోయే ఉద్యమం గురించి వివరించారు. వారందరూ గాంధీకి సంపూర్ణ సహకారం అందిస్తామని వాగ్దానం చేశారు. వారంతా గాంధీతో కలసి చంపారణ్ వెళ్లి అక్కడి రైతుల పరిస్థితులపై అన్ని విషయాలూ తెలుసుకున్నారు.
గాంధీజీ చేపట్టిన ఈ ఉద్యమం తెల్లదొరల్లో తీవ్ర అలజడిని కలిగించింది. 1917 ఏప్రిల్ 15న గాంధీజీ బృందం మోతీహారికి వెడుతూండగా ఉద్యమాన్ని నిలిపివేయాలంటూ బ్రిటిష్ సర్కారు హెచ్చరించింది. ఆ తర్వాత గాంధీజీతో పాటు పలువురు ఉద్యమ నాయకులను ప్రభుత్వం అరెస్టు చేసింది. దేశసేవ చేసేందుకు తాను దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి స్వదేశానికి వచ్చానని, అరెస్టులకు భయపడి ఉద్యమాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదని గాంధీ ప్రకటించారు. తాను చంపారణ్‌ను విడిచి వెళ్లలేనని, బ్రిటిష్ అధికారుల ఆజ్ఞల కంటే తన అంతర్వాణి ఆదేశం పాటించడం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు తనను అరెస్టు చేశాక కోర్టులో గాంధీజీ తన వాదనను తానే వినిపించుకున్నారు. చట్టం దృష్టిలో తాను నేరం చేశానని భావిస్తే ఏ శిక్ష అయినా విధించుకోవచ్చని ఆయన జడ్జితో అన్నారు. వంద రూపాయల జరిమానా విధించాక, అంత డబ్బు తన వద్దని లేదని తెలపడంతో గాంధీజీని కోర్టు విడుదల చేసింది. ఆ తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసుల సమక్షంలో గాంధీజీ రైతులతో సమావేశాలు జరిపి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
గాంధీజీ వెంట వచ్చిన న్యాయవాదులందరూ మంచి ప్రాక్టీసు ఉన్నవారే. అందుచేత వాళ్లందరూ తమ వెంట వ్యక్తిగత నౌకరును, వంటవాడిని తెచ్చుకున్నారు. ఇష్టమైన వంటలు వండించుకుని తినేవారు. ఈ పరిస్థితి గాంధీజీకి నచ్చలేదు. ‘తక్షణం మీ నౌకర్లను, వంటవాళ్లను పంపించి వెయ్యండి. మనం ఇక్కడికి ప్రజాసేవ చెయ్యడానికి వచ్చాం. ఎవరి పనులు వారు చేసుకుని, అంతా కలసి వండుకుని- ఒకే తిండి, అదీ శాకాహారం తినాలి-’ అని చెప్పారు. న్యాయవాదులంతా బుద్ధిమంతులైన విద్యార్థుల్లా తల వూపి, తమ నౌకర్లను వెనక్కి పంపించి వేశారు. ఆ ఊరి ప్రజలు తన వసతి కోసం ఇచ్చిన పాత ఇంటిని గాంధీజీయే స్వయంగా శుభ్రం చేసుకునేవారు. రైతుల నుంచి తీసుకున్న ఫిర్యాదులన్నింటినీ గాంధీజీ ప్రభుత్వానికి పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక కమిటీని వేసి మూడు నెలల్లోగా సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకూ గాంధీజీ చంపారణ్‌లోనే ఉండిపోయారు. ఆ సమయంలోనే రైతుల ఆర్థిక బాధలు, కుటుంబ పరిస్థితులు, వ్యవసాయంలో ఇబ్బందులు వంటి విషయాలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. నిరక్షరాస్యత వల్ల రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని గుర్తించారు.
అప్పటికే తాను స్థాపించిన సబర్మతీ ఆశ్రమంలోని వారందరినీ చంపారణ్‌కు గాంధీజీ పిలిపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తల్ని ఆహ్వానించారు. అందరూ కలిసి వీధులన్నింటినీ శుభ్రపరిచారు. పెంటకుప్పల్ని ఎత్తివేయడం, నీళ్లకుంటల్ని మట్టితో పూడ్చడం, పారిశుద్ధ్య కార్యక్రమాల ఆవశ్యకతను ఇంటింటికీ వెళ్లి బోధపరచడం వంటి కార్యక్రమాలన్నీ ఏకబిగిన సాగాయి. మురికివాడల్లో నివసిస్తున్న పేదల కోసం ఆరుబయలు పాఠశాలలు ఏర్పాటుచేసి, విద్యాబోధన కార్యక్రమం ప్రారంభించారు. గ్రామీణులకు వైద్య సదుపాయం కలిగించేందుకు డాక్టర్ దేవ్ అనే వైద్యుడు ముందుకు వచ్చాడు. ఈ అనుభవాలతో గాంధీజీ- దేశం బాగుపడాలంటే దారిద్య్రం, అపరిశుభ్రత అంతం కావాలని, లేకుంటే ప్రగతి సాధ్యం కాదని స్థిర నిర్ణయానికి వచ్చారు.
గాంధీజీ గ్రామస్తులకు విద్య నేర్పించడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం తెల్లదొరలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇలా అయితే పేదలు తమ మాట ఏం వింటారనే ఉద్దేశంతో ఒక చోట బడిని తగలబెట్టించారు. అప్పుడు ఆ వూళ్లోవున్న కొందరు ధనిక రైతులు కలిసి తగలబడిపోయిన గుడిసె స్థానంలో బడి కోసం పక్కా భవనాన్ని నిర్మించారు. ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుగుతూండగానే- గాంధీజీ పంపించిన ఫిర్యాదులపై ప్రభుత్వ నిర్ణయం వెలువడింది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు రైతుల పరిస్థితులకు సంబంధించి అవగాహనకు వచ్చాక ఒక చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం- వందేళ్లకు పైగా అమలులోవున్న ‘తీన్‌కటియా’ పద్ధతిని రద్దుచేశారు. రైతుల నుండి యజమానులు వసూలుచేసే శిస్తును 26 శాతం వరకూ తగ్గించారు. నీలిమందును పండించడమా? మానడమా? అనేది రైతుల ఇష్టం తప్ప ఎలాంటి నిర్బంధానికి అవకాశం వుండదు. నీలిమందు ధర నిర్ణయం యజమాని ఇష్టం బట్టి మాత్రమే వుండదు. పరస్పర అంగీకారంతో నిర్ణయించబడుతుంది. ఇవన్నీ రైతులు చిరకాలంగా కోరుతున్న విషయాలే. ఇలా గాంధీజీ పూనికతో దేశంలో చేపట్టిన తొలి కర్షక ఉద్యమం ఘన విజయాన్ని సాధించింది. ప్రజానాయకుడిగా ఆయన పేరుప్రఖ్యాతులు దేశమంతటా మార్మ్రోగడం ప్రారంభమైంది. ఇవాళ మనం ‘స్వచ్ఛ్భారత్’ పేరిట చేబడుతున్న కార్యక్రమాలకు కూడా అలనాటి కర్షక ఉద్యమం నాంది పలికింది.
‘మన దేశంలో యువ కమ్యూనిస్టులు పుట్టడానికి చాలాకాలం ముందే నేను శ్రామిక సమస్యను సొంత సమస్యగా స్వీకరించాను. దక్షిణాఫ్రికాలో వుండే రోజులలో వారి కోసం ఉద్యమించాను. నేను వారితో జీవించాను. వారి కష్టసుఖాలు పంచుకున్నాను. అందుచేత శ్రామికుల పక్షాన మాట్లాడే హక్కు నాకుంది-’ అని గాంధీజీ ‘యంగ్ ఇండియా’ పత్రిక (26 మార్చి 1931 సంచికలో) పేర్కొన్నారు. ఆయన మాటలు అతిశయోక్తి కాదని నిరూపించిన ఉద్యమం- చంపారణ్ కర్షక ఉద్యమం. ఈ ఉద్యమానికి నూరేళ్లు పూర్తయిన సందర్భంలో రైతుల సమస్యల పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపించవలసిన బాధ్యత మన ప్రజాస్వామిక ప్రభుత్వాలపై ఉన్నది.
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969