కృష్ణ

‘కృష్ణా’పై బాబు.ఎ ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 18: గడిచిన రెండేళ్ల కాలంలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించి బదిలీ అయిన అహ్మద్ బాబు అలియాస్ బాబు.ఎ జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు. స్వాతంత్య్రోమానికి ఊపిరి పోసిన జిల్లాలో సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. నాడు స్వాతంత్య్రోద్యమంలో జిల్లాకు లభించిన పేరు ప్రఖ్యాతలు నేడు మళ్లీ బాబు.ఎ రూపేణా సాంకేతిక విప్లవం ద్వారా జాతీయ స్థాయి ప్రాచుర్యం పొందింది. పాలనా విధానంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు. బాబు.ఎ ప్రవేశ పెట్టిన సంస్కరణలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుని దేశ వ్యాప్తం చేశాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సాంకేతికతను జోడించి దళారీ వ్యవస్థను రూపుమాపారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందించాలనే తపనతో సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసి సఫలీకృతులయ్యారు. 2015 జనవరి 12వతేదీన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బాబు.ఎ రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆకర్షించి ఆయన ప్రశంసలు అందుకున్నారు. అవినీతికి పరాకాష్టగా మారిన జిల్లా పౌర సరఫరా శాఖను ప్రక్షాళన చేశారు. చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తున్న రేషన్ పక్కదారి పట్టకుండా ఈ-పోస్‌ను తీసుకువచ్చి అవినీతికి చెక్ పెట్టారు. ఈ విధానం ద్వారా కోట్లాది రూపాయలు ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూడగలిగారు. అలాగే ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా ఎరువుల దుకాణాల్లో కూడా ఈ-పోస్‌ను తీసుకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని తనదైన శైలిలో ఎదుర్కొన్నారు. నగదు రహిత సేవలపై జిల్లా వాసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఆ దిశగా పయనింప చేశారు. నగదు రహిత సేవల్లో దేశంలోనే కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలవటంతో ప్రధాని నరేంద్ర మోదీ నుండి జాతీయ స్థాయి అవార్డును అందుకుని శభాష్ అనిపించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాలు, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులో విజయవంతంలో బాబు.ఎ కీలక పాత్ర పోషించారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏ మాత్రం లొంగకుండా జిల్లాను అభివృద్ధి వైపు పయనింప చేశారు. బాబు.ఎ దూకుడును మంత్రులు విభేదించినా ఏ మాత్రం నెరవలేదు. పోలవరం ఎడమ కాలువ తవ్వకం పనులు, ఆ ప్రాంత బాధిత రైతులకు పరిహారం అందించడంలో అవిరళ కృషి సల్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విధేయుడుగా పేరు తెచ్చుకున్నారు.
టీమ్-కృష్ణా సహకారం మరువలేనిది : బాబు.ఎ
జిల్లా అభివృద్ధిలో టీమ్-కృష్ణా అందించిన సహకారం మరువలేనిదని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. తన ఆదేశాలను తూచా తప్పకుండా పని చేసి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చారన్నారు. టీమ్-కృష్ణా లేకుంటే తాను ఈ విజయం సాధించే వాడిని కాదన్నారు. జిల్లాలో రెండు సంవత్సరాల మూడు నెలల పాటు కలెక్టర్ బాధ్యతలు నిర్వర్తించడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. తాను ఎక్కడున్నా జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు.