రంగారెడ్డి

కాంగ్రెస్ కౌన్సిలర్‌పై అనర్హత వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 26: తాండూరు మున్సిపాలిటీలో 2014లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలలో పట్టణంలోని మున్సిపల్ వార్డు నెంబర్ 23 నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన మహ్మద్ ముక్తార్ అహ్మద్ నాజ్ కౌన్సిలర్ పదవికి అనర్హుడుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివ్య బుధవారం ప్రకటించారు.
మున్సిపల్ కమిషనర్ ఎన్.సంతోష్ కుమార్ అదే వార్డులో టిఆర్‌ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్‌గా పోటీ చేసి అప్పట్లో ఓటమి పాలై ద్వితీయ స్థానంలో నిలిచిన జుబేర్ పటేల్‌ను 23వ వార్డు కౌన్సిలర్‌గా అధికారులు ఎన్నికల నియమావళిని అనుసరించి ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్‌లో కమిషనర్ అభ్యర్థుల సంఖ్య మళ్లీ 7కు తగ్గింది. ఎన్నికల నిబంధల ప్రకారం ముగ్గురికి మించి సంతానం ఉన్నట్లు నాజ్‌పై ఎన్నికల సమయంలోనే ఫిర్యాదు చేశారు. సమగ్రంగా విచారణ అనంతరం ముక్తార్ నాజ్ గెలుపును రద్దు చేసి, ద్వితీయ స్థానంలో ఉన్న జుబేర్‌ను కౌన్సిలర్‌గా ప్రమాణం చేయంచడం ఒకే రోజులో జరిగిపోయాయ.

ప్రజల ఆదరణే టిఆర్‌ఎస్ బలం: నాయని
చిక్కడపల్లి, ఏప్రిల్ 26: ప్రజల ఆదరణే టిఆర్‌ఎస్ బలమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం పార్టీ ఫండ్ కోసం లోయర్ ట్యాంక్ బండ్‌లోని స్నోవరల్డ్‌లో చేపట్టిన కూలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్నో వరల్డ్‌లో స్థానిక కార్పొరేటర్ జి.లాస్యనందిత, మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరెడ్డితో కలసి టిక్కెట్లను విక్రయించారు. టిఆర్‌ఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని, ఎప్పటికీ ప్రజల ఆదరణ ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. స్నో వరల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రవౌళి లక్ష రూపాయల చెక్కును హోం మంత్రికి అందచేశారు. కార్యక్రమంలో స్థానిక టిఆర్‌ఎస్ నాయకుడు యాదగిరి పాల్గొన్నారు.
బాలానగర్: వరంగల్ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ అన్నారు. బుధవారం ఫతేనగర్ డివిజన్ పరిధిలొని పలు ప్రాంతాలలో కూలీ పనులు చేశారు. భవార్చి రెస్టారెంట్‌లో పని చేయగా యజమాన్ని ఫరియుద్దిన్ రూ.15వేలు సంపాందించారు. శోభన కాలనీలో బేకరిలో సెల్స్‌మెన్‌గా పని చేసి రూ.5వేలు సంపాదించారు. ఫతేనగర్ స్టీల్ షాపు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్‌సింగ్, సెక్రటరీ తిలక్ వద్ద కూలీ పనులు చేసి రూ.50వేలు సంపాందించారు. బాలానగర్ ఫేజ్-1 కో-అపరేటివ్ టెనిట్స్ అసోసియేషన్ సభ్యులతో పని చేసి రూ.లక్ష సంపాందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భిక్షపతి, దత్తారావు, లక్ష్మణ్, అఫ్జల్, బస్వరాజ్, బాలకృష్ణ, ఉమావతి, ఇమ్రాన్, శశి, శిల్ప, జ్యోతి, అనురాధ, కృష్ణకుమారి పాల్గొన్నారు.
కెపిహెచ్‌బికాలనీ: వరంగల్‌లో జరగనున్న టిఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహణ ఖర్చులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూలీ పని చేసి సంపాదించాలని పార్టీ నిర్ణయించడంతో కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్లు గులాబీ కూలీలుగా డబ్బులను సంపాదించారు. బుధవారం బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ కావ్యాహరీష్‌రెడ్డి, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పన్నాల హరీష్‌రెడ్డి కూలీలుగా మారి రూ.1.56లక్షలు సంపాదించారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు సాయినాథ్‌రెడ్డి, అంజిరెడ్డి, ప్రభాకర్‌గౌడ్, అరుణ, శ్రీలత, శోభ, టిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాసులు, ముత్యపాగ శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, అశోక్ పాల్గొన్నారు. కెపిహెచ్‌బికాలనీ టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జనగాం సురేష్‌రెడ్డి, ఏనుగు వెంకటేశ్వర్‌రెడ్డిలు కాలనీలోని అన్ని ఫేజ్‌లలో తిరుగుతూ కూలీ పని చేసి డబ్బు సంపాదించారు.

ఉపాధిహామీ పథకం కింద వ్యవసాయ పనులు
కీసర, ఏప్రిల్ 26: జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద వ్యవసాయ సంబంధిత పనులు చేపట్టేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎంపిడిఓ, ఇఓఆర్‌డిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, ఫామ్‌పాండ్స్, కాలువలు, బావుల పూడికతీత వంటి పనులు చేపట్టాలని తెలిపారు. వర్షాలు కురిసేలోపు ఉపాధిహామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని వివరించారు. ప్రతి గ్రామంలో రోడ్ల ప్రక్కనే చెత్తకుప్పలు వేస్తున్నారని, ఈ పథకం కింద నాడెపుసోప్ కిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్‌వాడీ పాఠశాల, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకోవాలంటే మెటీరియల్ కాంపోనెంట్ అవసరమని ముందుగా ఉపాధిహామీ పథకం కింద మట్టి పనులు చేపట్టినట్లయితే, దానికి అర్హత వస్తుందని తెలిపారు. ఉధ్యానవన పంటలు సాగు చేసే రైతులు ఉపాధిహామీ పథకాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. భూమి చదును చేయటం, గట్లు, ఫామ్‌పాండ్స్, పూడికతీత పనులు చేపట్టేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉపాధిహామీ చెల్లింపులకు ఇబ్బందులు ఉన్న దృష్ట్యా, గ్రూప్‌లోన్‌ల కింద డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శనివారం ఈ అంశంపై అధికారులు నివేదిక అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ కౌటిల్య, డిపిఓ సురేశ్‌మోహన్ పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఘట్‌కేసర్, ఏప్రిల్ 26: నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తు ఆక్రమణదారుల గుండెల్లో అధికారులు రైళ్లు పరిగెత్తిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం సంస్కృతి టౌన్‌షిప్ ఆవరణలోని ప్రభుత్వ స్థలంలో వెలసిన దుకాణాల సముదాయాలను తొలగించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఎలాంటి అనుమతుల లేకుండా చౌదరిగూడ పంచాయతీ డాక్టర్స్ కాలనీలో నిర్మించిన 20 ఇళ్లను బుధవారం కూల్చివేశారు. ఇవోపిఆర్‌డి సునంద నేతృత్వంలో అక్రమ నిర్మాణాలపై కొరడ ఝలిపిస్తు కూల్చివేతలు జరుపుతున్నారు. చౌదరిగూడ పంచాయతీ పరిధి డాక్టర్స్ కాలనీలోని సర్వే నెంబర్లు 769, 780, 783లో ఓ బిల్డర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ఇటీవల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో నోటీసులు జారి చేసినప్పటికీ ఖాతరు చేయకుండా నిర్మాణాలకు కొనసాగిస్తుండటంతో ఘట్‌కేసర్ ఇఓపిఆర్‌డి సునంద, షామీర్‌పేట్ ఇఓపిఆర్‌డి మల్లిఖార్జున్, చౌదరిగూడ ఇన్‌చార్జి కార్యదర్శి రవి, బిల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది గురువారం జెసిబితో కూల్చివేతలు జరిపారు. అధికారులు జెసిబిలతో కూల్చివేతలు జరుపుతుండగా బిల్డర్లు అడ్డుకునే యత్నం చేయటంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం జరిపి ఆంధోళనకారులను చెదరగొట్టి కూల్చివేతలను పూర్తి చేశారు. అనంతరం ఘనపూర్ గ్రామంలో ఓ కళాశాల ఆధ్వర్యంలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని, ఎన్‌ఎఫ్‌సినగర్‌లో పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాన్ని జెసిబితో కూల్చివేతలు జరిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి అన్ని రకాల పన్నులు చెల్లించి అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
మేడ్చల్: మేడ్చల్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ గుండ్లపోచంపల్లిలో బుధవారం అధికారులు అక్రమ లైఔట్లపై కొరడా ఝళిపించారు. అక్రమ లేఅవుట్ల కూల్చివేతకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. కుత్బుల్లాపూర్ ఇఓపిఆర్డీ జ్యోతిరెడ్డి నేతృత్వంలో ఆరుగురు కార్యదర్శులతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. బృందం ఉదయం గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరకుని గ్రామ పరిధిలోని అక్రమ లేఔట్లను వివరాలను పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోని పలు అక్రమ లేఔట్ల వద్దకు కూల్చివేత నిమిత్తం జెసిబి వాహనాలతో చేరుకున్నారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 109, 416 నుండి 419లో నిర్మించిన అక్రమ లేఔట్లలోని రోడ్లను జెసిబి సహయంతో తొలగించారు. అక్కడి నుండి తిరిగి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం తర్వాత గుండ్లపోచంపల్లి అనుబంధ గ్రామమైన మైసమ్మగూడకు చేరుకుని అక్కడ కూడా కోమటికుంట చెరువు వద్దనున్న ఓ అక్రమ లేఔట్‌ను గుర్తించి హద్దురాళ్లను ప్రహరీగోడను తొలగించారు. గురువారం గ్రామంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసే కార్యక్రమాన్ని చేపడతామని ప్రత్యేక బృందం అధికారి జ్యోతిరెడ్డి పేర్కొన్నారు. అనధికార నిర్మాణాలపై స్పష్టత లేకపోవడంతో ప్రత్యేకాధికారి జ్యోతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తుగా తాఖీదులు జారీ చేయకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కార్యదర్శి చంద్రప్రకాశ్ పాల్గొన్నారు.

పురోగతిపై భారతదేశ ఆర్థిక రంగం పరుగులు
ఉప్పల్, ఏప్రిల్ 26: దేశ ఆర్థిక పురోగతి 2017 సంవత్సర రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉంటుందని కెనడాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, వ్యూహకర్త ఎకానోమావ్, ఐఎన్‌సి కంపెనీ అధ్యక్షుడు వౌరీన ఫారో అభిప్రాయపడ్డారు. బుధవారం తార్నాకలోని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆర్థిక సవాళ్లు, హైదరాబాద్‌కు ఉన్న అవకాశాలు అనే అంశంపై చర్చా గోష్ఠి జరిగింది. భారతదేశ జిడిపిపై మారుతున్న ప్రపంచ వ్యాపార లావాదేవీలు సైతం ముడిపడి ఉన్నాయని చెప్పారు. ఆసియా, యూరప్, అమెరికాలో వాణిజ్య కార్యకలాపాలలో వస్తున్న మార్పులపై సమగ్రంగా అధికారులతో చర్చించారు. ఆసియా ఆర్థిక వ్యవస్థ పునర్ నిర్మాణ దశలో ఉందని, చైనా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపారు. జపాన్ ఆర్థిక రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటుందని, భారతదేశ ఆర్థిక రంగం పురోగతిపై పరుగులిడుతుందన పేర్కొన్నారు. తక్కువ వ్యాపార పెట్టుబడులు, వౌలిక వసతుల కొరత, సరుకుల సరఫరా ప్రతిబంధకాల వంటి సమస్యలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారాయన్నారు. దేశ ఆర్థిక రంగంలో ఉన్న లోటుపాట్లు, అవకాశాలు, సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు.విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలపై, వౌలిక సదుపాయాల కల్పనలో సంస్థాగత పెట్టుబడులను ఆకర్శించాలని సూచించారు. ముంబైలోని కెనేడియన్ కాన్సులేట్, ఢిల్లీలోని కెనేడియన్ హైకమిషన్ ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో పాల్గొనేందుకు ఆహ్వానించారు.
కార్యక్రమంలో హెచ్‌ఎండిఎ కమిషనర్ టి.చిరంజీవులు అధ్యక్షత వహించగా లీగ్రూపునకు చెందిన అంతర్జాతీయ పట్టణాభివృద్ధి నిపుణులు జాన్‌ఫారో, అంతర్జాతీయ సంస్థాగత అభివృద్ధి నిపుణులు అలన్ స్టాన్ బరీ, లీ గ్రూపు ఎండి డాక్టర్ ఎంపి రాజు పాల్గొన్నారు.

‘ప్రజా పోరు’కు భారీగా తరలిరావాలి
బాలాపూర్, ఏప్రిల్ 26: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి తాండూరులో తలపెట్టిన ‘ప్రజాపోరు’ బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని టిడిపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం టిడిపి సరూర్‌నగర్ మండల అధ్యక్షుడు ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సామ రంగారెడ్డి ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధనాలకు వ్యతిరేకంగా ఈనెల 28న తాండూరులో తలపెట్టిన ప్రజాపోరు బహిరంగ సభకు రైతులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, యవకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే సభకు టిడిపి శ్రేణులు భారీగా రావాలని అన్నారు. ప్రజా సమస్యలపై నిలదీయడానికి కూడా అసెంబ్లీలో మైకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా లభించడం లేదన్నారు. మిర్చి, కంది, పసుపునకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తమ పంటలను తగుల బెట్టుకుంటున్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో మిర్చి రైతులకు రూ.1500 ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నట్లు గుర్తుచేశారు. కెసిఆర్‌కు బంగారు తెలంగాణలో రైతుల అత్మహత్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కందుకూర్ మండల పార్టీ అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య, జిల్లెలగూడ నగర పంచాయతీ అధ్యక్షుడు వంగూర్ యాదయ్య, దొడ్డ మల్లికార్జున్, వాసుసాగర్, సోమిరెడ్డి, అంబికనాథం, సుందర్ రామయ్య, రవికుమార్, పాల్గొన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో
ఓయూ పాత్ర కీలకం
* అక్షర జ్ఞానానికి పునాది ఓయూ: రాజ్యసభ సభ్యుడు కెకె
* రాజకీయ భావాలు వేరైనా.. స్నేహభావం ఒక్కటే: వరవరరావు

నాచారం, ఏప్రిల్ 26: వందేమాతరం ఉద్యమం నుండి నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికైందని రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల పురస్కరించుకొని ఠాగుర్ అడిటోరియంలో ‘తెలంగాణ నిర్మాణం - ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర’ అనే ఆంశంపై కేశవరావు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్స్‌టీ రాజకీయ విజ్ఞానానికి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. 1956 నుంచి విద్యార్థి ఉద్యమాలతో సాధించిన విజయలు ఎన్నో ఉన్నాయని.. అనాటి విజయాలతో రాజకీయ ప్రముఖులుగా ఎందరో మహానుభావులు ఎదిగారని తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ విభిన్న రాజకీయ భావాలకు వేదికైన ఓయూలో స్నేహభావానికి ఒక్కటిగా ఉంటూ ఐక్యత సాధిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో ఓయూకు ప్రత్యేకమై పాత్ర ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వరవరరావు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటూ అనేక ఉద్యమాలకు బాటవేసిందని తెలిపారు. నాటి తెలంగాణ పోరాటం మొదలుకొని నేటి ప్రత్యేక రాష్ట్రం వరకు ఉద్యమ నిలయంగా ఓయూకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.
మాజీ వైస్ చాన్స్‌లర్ సులేమాన్ సిద్దిఖి మాట్లాడుతూ అనాటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ విద్యావ్యాప్తికి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని తెలిపారు. భాష ప్రతిపాదికన ఏర్పాటైన ఓయూ ప్రపంచ దేశాల భాషలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.

తాళాలు పగులగొట్టి చోరీ
20 లక్షల విలువ చేసే నగలు మాయం
చిక్కడపల్లి, ఏప్రిల్ 26: ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులకొట్టి భారీ చోరీకి పాల్పడిన ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గాంధీనగర్ భాగ్యలక్ష్మినగర్‌లో కైలాష్ ప్రసాద్, డాక్టర్ లక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. కైలాష్ ప్రసాద్ రిటైర్ అవటంతో ఖాళీగా ఉంటునారు. భార్య లక్ష్మి మహేశ్వర మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం కైలాష్ ప్రసాద్ పుటపర్తి వెళ్లగా లక్ష్మి యథాప్రకారం కళాశాలకు వెళ్లారు. రాత్రి లక్ష్మి ఇంటికి తిరిగి వచ్చే సరికి తాళాలు పగుల కొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. కంగారుపడి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉండాల్సిన 20 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే స్థానికుల సాయంతో గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు ప్రారంభించామని.. సిసి కెమెరా ఫుటేజీలు కూడా పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సిఐ శ్రీనివాస్ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే సెంట్రల్ జోన్ డిసిపి జోయల్ డేవిస్, చిక్కడపల్లి ఎసిపి జె.నర్సయ్య, గాంధీనగర్ సిఐ శ్రీనివాస్, డిఐ శ్రీనాధ్‌రెడ్డి ఇతర సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తక్కువ ధరలకు
బైక్‌లు ఇప్పిస్తానని..
బాలాపూర్, ఏప్రిల్ 26: అతి తక్కువ ధరలకు టూ విల్లర్ వాహనాలను ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంఘటన బుధవారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఎలక్షన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సుధీర్ (37) మీర్‌పేట్ ఆర్‌టిసి కాలనీలో నివాసం ఉంటూ, స్టార్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పని చేస్తూ ఉంటాడు. రూ.65వేలు విలువ గల బైక్‌లను రూ.45వేలకు ఇప్పిస్తానని పలువురి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. గతంలో కొందరి తక్కువ ధరకు బైకులు ఇప్పించాడు. తక్కువ ధరలకు బైకులు ఇప్పిస్తానని అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితులు తమకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అలరించిన నృత్యోత్సవం
ముగింపు వేడుకలో నృత్యాలతో మైమరపించిన కళాకారులు
గచ్చిబౌలి, ఏప్రిల్ 26: అంతర్జాతీయ నాట్య శిక్షణ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ’నాట్య భారతీయం’ నృత్యోత్సవాలు ఘనంగా ముగిసాయి. శిల్పాకళావేదికలో మూడు రోజులుగా జరుగుతున్న వేడుకల ముగింపు కార్యక్రమానికి కేంద్రసాహితి అకాడమీ సెక్రెటరీ కె.ఎస్ రావు, ప్రముఖ పాత్రికేయులు సునీల్ కోఠారి, పురాణం మాధవి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమతి జొన్నలగడ్డ అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి చివరి రోజు ఉత్సవాలను ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన మధులత మహాపాత్ర బృందం ఒడిస్సీ శైలిలో ప్రదర్శించిన పల్లవి, హరిస్మరణే అంశాలపై అద్భుతంగా నృత్యం చేశారు. ప్రముఖ భరతనాట్య కళాకారుణి స్మిత మాధవ్ బృందం ప్రదర్శించిన శబ్దం, మాధవ హృదయ కేళినే అంశాలపై నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కూచిపూడి కళాకారుణి కాత్యాయిని గంటి శంకరీ, శ్రీరాజరాజేశ్వరి అంశాలను కూచిపూడి శైలిలో నృత్యం చేసి అలరించారు. కథక్ కళాకారిణి సంజయ్ జోషి బృందం గణేష్ వందన, అర్ధనారీశ్వర, తరంగ్ అంశాలపై నృత్యం చేసి నృత్య కళాప్రియులను అలరించారు. అజయ్ చక్రవర్తి బృందం కూచిపూడి శైలిలోప్రదర్శించిన ‘జయవిజయ’లు నృత్య రూపకం కనువిందు చేసింది. శ్రీమతి దేవి రమణమూర్తి శిష్యబృందం గజల్స్ ఆలపించి అలరించారు. అనంతరం ఐడిఆర్‌టిసి డైరెక్టర్ కళాకారులకు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.

మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 26: ఓ మహిళను అత్యాచారం చేసి ఆపై అతి దారుణంగా హత్య చేసిన మిస్టరీని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు చేదించారు. శంషాబాద్ డిసిపి పద్మజ, రాజేంద్రనగర్ ఎసిపి కె.గంగారెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. హసన్‌నగర్ మదీనామజీద్ ప్రాంతానికి చెందిన ఫాతిమా బేగం(49). వీరికి నలుగురు సంతానం. నాలుగు సంవత్సరాల క్రితం మొదటి భర్తను వదిలేసి వేరే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. ఇటీవలే అతను రాజస్థాన్‌కు వెళ్లిపోవడంతో ఫాతిమాబేగం మానసికంగా కుంగిపోయి తాగుడుకు బానిసై రోడ్లపై తిరుగుతుంది. ఈనెల 19న వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆసీఫ్‌ఖాన్(21) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వట్టేపల్లి రైల్వే సమీపంలో ఫాతిమాబేగం ఒంటరిగా కనిపించింది. ఆసీఫ్‌ఖాన్ ఆమె వద్దకు వెళ్లి మాట్లాడుకొని బైక్‌పై ఎక్కించుకొని మైలార్‌దేవ్‌పల్లి ప్రైమ్ ఫంక్షన్‌హాల్ ముందు ఉన్న నిర్మానుష్యంగా ఉన్న పొదల్లోకి తీసుకొని వెళ్లాడు. వీరిని ప్రైమ్ ఫంక్షన్ హాల్ ముందు ఎసి, కూలర్‌షాపులో పనిచేసే అబ్దుల్ హర్షద్‌ఖాన్(20), ఖాదర్‌ఖాన్(42) అనుకరిస్తూ వెళ్లారు. ఇరువురిని బెదిరించి ఫాతిమాబేగంపై అత్యాచారం చేశారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఆసీఫ్‌ఖాన్ తిరిగి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అది ఒప్పుకొని ఫాతిమాబేగం పెద్దగా అరిచింది. భయపడిన ఆసీఫ్‌ఖాన్ పక్కనే ఉన్న బండరాయితో ఫాతిమా కాళ్లపై మోదాడు. దీంతో ఫాతిమాకు రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఆసీఫ్‌ఖాన్ పారిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం సమయంలో స్థానికులు ఫాతిమాబేగం మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టి ఎలాంటి క్లూ దొరకలేదు. ఏసి కూలర్‌షాపులో పనిచేసే యువకులపై పోలీసులకు అనుమానం వచ్చి వారిని విచారించారు. దీంతో యువకులు భయపడి జరిగిన విషయాన్ని పోలీసులకు వెల్లడించారు. ఫాతిమాను తీసుకువచ్చిన వ్యక్తి తమకు తెలియదని, చూస్తే గుర్తు పడుతామని పోలీసులకు తెలిపారు. పోలీసులు అప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా వేశారు. తిరిగి రెండురోజుల తరువాత మహ్మద్ ఆసీఫ్‌ఖాన్ మరో యువతిని తీసుకొని మళ్లీ అదే ప్రాంతానికి వచ్చాడు. అది గమనించిన కూలర్‌షాపు యువకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అప్రమత్తమై ఆసీఫ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో హత్య చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ప్రధాన నిందితుడైన మహ్మద్ ఆసీఫ్‌ఖాన్‌తో పాటు హర్షద్‌ఖాన్, ఖదీర్‌ఖాన్‌ను రిమాండ్‌కు తరలించారు. విలేఖరుల సమావేశంలో మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ పి.జగదీశ్వర్, ఎస్సైలు లక్ష్మికాంత్, మహేంద్రనాధ్ ఉన్నారు.