హైదరాబాద్

మాకూ సమానత్వం కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: తమకు సమానత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎల్‌జిబిటి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణకాంత్ పార్కు నుంచి ప్రారంభమైన ర్యాలీ అమీర్‌పేటలోని బిజెగూడ వరకు సాగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది హిజ్రాలు ఇందులో పాల్గొన్నారు. ఇతరులకు ఎలా కల్పిస్తున్నారో తమకు కూడా హక్కులు కల్పించాలని ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.

మొండిబకాయిలపై బిగుస్తున్న ఉచ్చు
* రెడ్‌నోటీసులకు సిద్ధమవుతున్న గ్రేటర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 21: మహానగర పాలకల సంస్థకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు కేవలం మరో 40రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో వసూళ్లను ముమ్మరం చేశారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఆస్తిపన్ను సంబంధిత వివాదాలను, ఫిర్యాదులను, కోర్టు కేసులను పరిశీలించేందుకు ‘ప్రాపర్టీ ట్యాక్సు పరిష్కారం’ శిబిరాలను మొదలుపెట్టారు. ఇందులో బకాయిదారులకు సందేహాలను నివృత్తి చేయటంతో పాటు సకాలంలో పన్ను చెల్లించాలని కోరనున్న సిబ్బంది, ఆ తర్వాత పెద్దమొత్తంలో బకాయిలు ఉన్నవారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి లక్షలు, కోట్లలో పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్లకు ఉచ్చు బిగించనున్నారు. గత సంవత్సరం ఇదేవిధంగా మొండి బకాయిలు చెల్లించని వారి ఇళ్లు, ఆఫీసుల ముందు చెత్తడబ్బాలను పెట్టి మరీ పన్ను వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయస్థానం జిహెచ్‌ఎంసి అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. కానీ ఈసారి చెత్త డబ్బాలను పెట్టకుండా కొత్త విధానంలో పన్నువసూలు చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త రాష్ట్రం సిద్ధంచిన తర్వాత ఈ ఏటా ఆస్తిపన్ను వసూలు అధికారులకు సవాలుగా మరిందని చెప్పవచ్చు. గత ఆర్థిక సంవత్సరం రూ. వెయ్యి 19 కోట్ల ఆస్తిపన్నును వసూలు చేసిన అధికారులు ఈసారి రూ. 1100 కోట్లను టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 1200 లోపు ఆస్తిపన్ను చెల్లించే పేద, మధ్య తరగతి ప్రజలకు రూ. 101కు ఆస్తిపన్నును కుదించటంతో ఈసారి జిహెచ్‌ఎంసికి మూడు నుంచి మూడున్నర లక్షల ఖాతాల నుంచి సుమారు రూ. 90 కోట్ల వరకు వసూళ్లు తగ్గనున్నాయి. అదిమినహా వెయ్యి కోట్ల పన్ను వసూళ్లను అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు పన్ను వసూళ్లు కనీసం ఆరువందల కోట్లు కూడా దాటలేదు. కొద్దిరోజుల క్రితం కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించినపుడు రూ. 445 కోట్ల టార్గెట్‌ను 45 రోజులకు నిర్థారించారు. అంటే, రోజుకి రూ. 10 కోట్లు వసూలు చేయాల్సిందేనన్న మాట. చెత్త డబ్బాలను పెట్టిమరీ పన్ను వసూలు చేసే విధానానికి ఈసారి దూరంగా ఉండాలని భావిస్తున్న అధికారులు తమ ముందున్న మరో రూ. 400 కోట్ల పైచిలుకు పన్నును ఎలా వసూలు చేస్తారో వేచి చూడాలి!
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
- మంత్రి మహేందర్ రెడ్డి -
ఖైరతాబాద్, ఫిబ్రవరి 21: రాబోవు వేసవి కాలంలో రంగారెడ్డి జిల్లాలో నీటి ఎద్దడిని నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలోని జిల్లా జెడ్‌పిటిసి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ సునీతారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తీవ్రంగా నీటి సమస్య ఉందని దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయిలో జరుగుతున్న సమావేశాలకు అధికారులు హాజరుకావడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన జాయింట్ కలెక్టర్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జెడ్‌పిటిసిల పరిధిలో ఎంత నిధులు వస్తున్నాయి, వాటితో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని ప్రశ్నిస్తే ఏ అధికారీ స్పష్టంగా సమాధానం చెప్పడం లేదని, తాము కూడా పత్రికల్లో చూసుకోవాల్సిన దుస్థితి నెలకొందని మంత్రికి విన్నవించారు.
వెంటనే స్పందించిన ఆయన సభ్యులందరికీ నిధులు వారి వారి ప్రాంతాల్లో జరుగుతున్న పనుల వివరాలను పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉపాది హామీ పథకం సక్రమంగా అమలు కావడం లేదని సభ్యులు ప్రశ్నించారు. జిల్లాలో 33 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించామని అందులో 24 మండలాల్లో ఉపాధి హామీ కింద కూలీలకు పని కల్పిస్తున్నట్టు అధికారులు వివరించారు. పనులు పూర్తి అయిన చాలా రోజుల తరువాత టెక్నికల్ అధికారులు సర్వే చేస్తూ డబ్బులు అందించడంలో ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. అలాంటి వాటిని పూర్తిగా పరిష్కరిస్తామని మంత్రి సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిఇటిల కొరత ఉందని, వాటిని భర్తీ చేయాలని కోరారు. దీంతో పాటు ధారూర్ మండలంలో పది వరకు పాఠశాలలు మాత్రమే ఉన్నాయని, పది పూర్తి చేసిన వారు సుదూర ప్రాంతాల్లోని జూనియర్ కాలేజీలకు వెళ్లాల్సి వస్తుందని, మండలంలో ఒక జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని విన్నవించారు. వీటిపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రెవెన్యూ అధికారుల అలసత్వం వల్ల జిల్లాలోని విలువైన భూములను బడా కంపెనీ కబ్జాలు చేసుకొని అమాయకులకు అమ్మేస్తున్నారని, ఒకే భూమిని పది మందికి రిజిస్ట్రేషన్ చేస్తూ లబ్దిపొందడమే కాకుండగా ఎంతో మందిని ఆవేదనకు కారకులౌతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే సదరు సంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్ల విస్తరణ, మరమ్మతు పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని, దీంతో ఎందరో ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారని సభ్యులు అన్నారు. ఆలస్యానికి గల కారణాలను విశే్లషించి, కాంట్రాక్టర్ల తప్పిందం ఉంటే వెంటనే మార్చి కొత్త వారితో పనులు పూర్తిచేయించాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఈ వేసవిలో నీటి సమస్యను ఎదుర్కొనేందుకు రూ. 40 కోట్ల నిధులతో పనులకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా బోర్ల మరమత్తులు నిర్వహించడంతో పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తామని చెప్పారు. జిల్లాలో రూ. 1200 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా రాష్ట్రంలో మొదటిసారిగా రంగారెడ్డి జిల్లాలోనే ఇంటింటికీ నీటిని సరఫరా చేయనున్నట్టు వివరించారు. నిజమైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కీసరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశం అనంతరం ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన రాజు, పశుగణాభివృద్ధి చైర్మన్ నారాయణరెడ్డిలను మంత్రి సన్మానించారు. నూతనంగా ఎన్నికైన నవాబ్‌పేట్ జెడ్‌పిటిసి రామిరెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సమావేశంలో ఎంపి నర్సయ్య, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సంజీవరావు, కాలేయాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్‌పి వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్లు రజత్‌కుమార్ సైని, అమ్రపాలి, జెడ్‌పి సియిఓ రమణారెడ్డి, జెడ్‌పిటిసీలు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం కోసం
నేటి నుంచి రిలే దీక్షలు
ఖైరతాబాద్, ఫిబ్రవరి 21: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి ఈనెల 27 వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బాధితులకు న్యాయం ఆలస్యం అవుతోందని మండిపడ్డారు. ఇటీవల ముఖ్యమంత్రి విశాఖలో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ విషయం కోర్టులో ఉందని దీంతో తామేమీ చేయలేమని ప్రకటించడం ఎంతోమందికి ఆవేదన కలిగించిందన్నారు. విషయం కోర్టుకు పోకముందు కూడా ప్రభుత్వం ఈ విషయంలో పెద్ద చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. సంస్థ దేశంలోని నాలుగు రాష్టల్ల్రో మోసాలకు పాల్పడిందని, భారీ ఆస్తులు ఏపిలో ఉన్నందున ఏపి ప్రభుత్వం అధికంగా చొరవ తీసుకుంటేనే బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో తాము రిలే నిరాహార దీక్షలకు దిగుతున్నట్టు చెప్పారు. 22న అన్ని ప్రధాన పట్టణాల్లో ఉదయం 9 గంటలకు కలెక్టర్ కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్ష ప్రారంభిస్తామని చెప్పారు. 23న రిలే నిరాహార దీక్ష, కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పిస్తామని చెప్పారు. 24న రిలే నిరాహార దీక్ష, ఎస్‌పికి వినతి పత్రం అందజేత, 25న రిలే నిరాహార దీక్ష, సంస్థ చైర్మన్, డైరెక్టర్లు, బినామీల దిష్టిబొమ్మల దగ్ధం చేస్తామని ప్రకటించారు. 26న ఆత్మహత్యకు పాల్పడ్డ అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ, 27న అన్ని పార్టీల నాయకులతో సాయంత్రం దీక్ష ముగింపు ఉంటుందని చెప్పారు. అనంతరం తమ ఉద్యమాన్ని దేశరాజధానిలో చేస్తామని వివరించారు.
ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై దృష్టి సారించాలి
ఖైరతాబాద్, ఫిబ్రవరి 21: ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై దృష్టి సారించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. ఆదివారం బంజారాహిల్స్ కేబిఆర్ పార్క్ వద్ద వాక్ వాటర్ సొసైటీ ఆధ్వర్యంలో నీటి పొదుపుపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన వాక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల నీటిసమస్య రాబోవు కాలంలో తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ నీటి పొదుపు గురించి తెలుసుకొని మరికొంతమందికి అవగాహన కల్పించాలని సూచించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఈ వేసవిలో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మేయర్ వాకర్స్‌తో, వాటర్ సొసైటీ సభ్యులతో నేనే నీటిని సంరక్షిస్తాను అని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
అటవీ ప్రాంతంలో
చెలరేగిన మంటలు
హయత్‌నగర్, పిబ్రవరి 21: మన్సురాబాద్ జిఎస్‌ఐ అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 4గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు.
మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతం సుమారు 5 కిలోమీటర్ల మేర మంటలు చెలరేగాయి. సాయంత్రం 5గంటలకు మొత్తం మంటలను ఆర్పివేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
అనుమతి లేని పర్మిట్
రూమ్‌లపై ఎస్‌ఓటి దాడులు
కీసర, ఫిబ్రవరి 21: అనుమతి లేని పర్మిట్‌రూమ్‌లపై ఎస్‌ఓటి పోలీసులు దాడిచేసి అక్రమంగా మద్యం సేవిస్తున్న 21 మందిని అరెస్ట్ చేసిన సంఘటన భోగారం గ్రామంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెలితే భోగారం గ్రామంలోని దుర్గావైన్స్ యాజమాన్యం కొన్ని నెలలుగా అనుమతులు లేకుండా వైన్‌షాప్ ప్రక్కనే పర్మిట్‌రూమ్ కొనసాగిస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఓటి పోలీసులు శనివారం రాత్రి పర్మిట్‌రూమ్‌లపై దాడులు నిర్వహించారు. మద్యం సేవిస్తున్న 21 మందిని అరెస్ట్‌చేసి కేసులు నమోదు చేసారు. సిఐ గురువారెడ్డి దర్యాప్తు జరుపుతున్నారు.

బాంబు పేలుళ్ల బాధితులకు అందని సహాయం
దిల్‌సుఖ్‌నగర్, ఫిబ్రవరి 21: మూడేళ్ల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల బాధితులకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించడంలో విఫలమైందని ఓబిసి ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డి.జయప్రకాష్ అన్నారు. ఇందుకు నిరసనగా బాంబు పేలిన ప్రదేశంలో ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. పలువురు రాజకీయ నేతలు మృతిచెందినవారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుడులో గాయపడి అంగవైక్యం చెందినవారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. సహాయం అందనివారికి ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ఉద్యోగం, ఉపాధి ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు. తాను కూడా బాంబు దాడిలో గాయపడ్డానని అన్నారు. ఈ దుర్ఘటనను ప్రజలు మరవలేక పోతున్నారని పేర్కొన్నారు. ఘటనా సమయంలో ప్రాణాలు కోల్పోయినవారికి, అంగవైకల్యం చెందినవారికి, క్షతగాత్రులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వాలు, నేతలు విస్మరించారని విమర్శించారు. కార్యక్రమంలో చందర్‌నాయక్, సయ్యద్ రహీమ్, వికాస్, అనిల్, అంజయ్య, విద్యార్థులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంటా.. ఏదీ..ఎక్కడా?
* పరోక్షంగా అక్రమార్కులకు అండ
* యధేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు
* చిన్న ఫ్లాట్ యజమానులకే నిబంధనలా?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 21: మహానగర పాలక సంస్థ ఉన్నోడికి ఓ చట్టం, పేదవాడికి మరో చట్టాన్ని అమలు చేస్తోందన్న విమర్శలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతుల జారీ విషయంలో వారికి ఇష్టారాజ్యంగా నిబంధనల్లో మార్పులు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి బహుళ అంతస్తు భవనాలు, కమర్షియల్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్ నిర్మించే బడాబాబులకు అనుమతులిచ్చేందుకు, అసలు వారు అనుమతుల్లేకుండా నిర్మాణాలు కొనసాగించేందుకు పరోక్షంగా అండగా నిలుస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, తొలగించేందుకు రెండేళ్ల క్రితం జోన్లవారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్స్‌ఫోర్స్‌మెంట్ ప్రస్తుతం పత్తాలేకుండా పోయింది. పేద, మధ్య తరగతులకు చెందిన ప్రజలు అరవై, ఎనభై, వంద, నూట యాభై గజాల్లో నిర్మించుకునే ఇళ్లకు నిబంధనలను చూపుతూ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కుంభకోణాలు, అవకతవకల్లో ఏన్నోఎళ్ల నుంచి ముందువరుసలో ఉన్న సర్కిల్ 10లో మళ్లీ అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. గతంలో అక్రమనిర్మాణాలు, వాటి విషయంలో గ్రేటర్ అధికారుల పాత్ర విషయంపై కోర్టు ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టిన విచారణలో కూకట్‌పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో అక్రమనిర్మాణాలు అధికంగా ఉన్నట్లు నివేదిక వచ్చినా, ఈ రెండు ప్రాంతాల కన్నా ఎక్కువ అక్రమ నిర్మాణాలు సర్కిల్ 10లో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఈ సర్కిల్‌లో ఎక్కువగా నివసించే ధనిక వర్గాలు, బడాబాబులు, పారిశ్రామికవేత్తల డబ్బు మాఫియా కీలకంగా పనిచేస్తున్న కారణంగా ఇక్కడి అక్రమ నిర్మాణాలు వెలుగులోకి రావటం లేదు. ముఖ్యంగా ఈ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ ఏసిపి అనుమతుల జారీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పంజాగుట్ట శ్మశానవాటిక స్థలంలో ఓ బడా షాపింగ్ మాల్ నిర్మాణ అనుమతుల జారీ విషయంలో సంబంధిత సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించకపోవటం పట్ల కొద్దినెలల క్రితం అప్పటి కమిషనర్ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయటం ఇక్కడి అవినీతి, నిబంధనల ఉల్లంఘనకు నిదర్శనంగా చెప్పవచ్చు. శ్మశానవాటిక స్థలంలో బడా నిర్మాణానికి వర్తించని నిబంధనలను వందగజాల మురికివాడల స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి ఎలా వర్తిస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది.
బ్యాంకుల నుంచి రుణ మంజూరీకి అవసరమైన నిర్మాణ అనుమతి కోసం సర్కిల్ కార్యాలయానికి ఆశ్రయిస్తే వారికి టౌన్‌ప్లానింగ్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. లేనిపోని నిబంధనలు పెట్టి వారి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇదేమీటి మహాప్రభో అంటూ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే అక్కడ కూడా న్యాయం జరగటం లేదు. సర్కిల్ వారీగా అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించే టౌన్‌ప్లానింగ్ అధికారుల అక్రమార్జనలో ఉన్నతాధికారులకు కూడా వాటా ఉన్నందున, వీరు గట్టిగా ఏసిపిలను ప్రశ్నించలేకపోతున్నారు.
గ్రామపంచాయతీలు మొదలుకుని మున్సిపాల్టీలు, గ్రేటర్ కార్పొరేషన్లలో కూడా లంచాలు చెల్లించనిదే పనులు కావటం లేదన్న విషయాన్ని బాహాటంగానే అంగీకరించిన ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ ప్రకారం కొత్త విధానం ఎపుడొస్తుందో, ఈ అవినీతి, అక్రమాలకు ఎపుడు బ్రేక్ పడుతుందోనని జనం ఎదురుచూస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నా, క్షేత్ర స్థాయి తనిఖీల పేరిట ప్రజల ముక్కు పిండి మరీ లంచాలు వసూలు చేసే అక్రమార్కులకు ముఖ్యమంత్రి ఎలా చెక్ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.
మేయర్ ఆదేశాలు ఫలిస్తాయా?
అక్రమ నిర్మాణ క్రమబద్ధీకరణ కోసం ప్రస్తుతం బిపిఎస్, ఎల్‌ఆర్‌ఎస్ స్కీంలను సర్కారు అమలుచేస్తున్న తరుణంలో, ఇందుకు కటాఫ్ తేదీగా నిర్ణయించిన అక్టోబర్ 28వ తేదీ తర్వాత నుంచి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు చేపట్టాలని మేయర్ బొంతు రామ్మోహన్ కొద్దిరోజుల క్రితం జారీ చేసిన ఆదేశాలు అమలవుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. అక్రమనిర్మాణాలకు అండగా నిలిచే అధికారులు పాలకుల ఆదేశాలను అమలు చేస్తూ, వీటిని అడ్డుకుంటారా? లేక యజమానులకు తప్పించుకునే సలహాలిచ్చి చోద్యం చూస్తారా? వేచి చూడాలి!

పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు చైతన్యవంతులు కావాలి
* మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఘట్‌కేసర్, ఫిబ్రవరి 21: ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలకు పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించి పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో చిన్నపిల్లలకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చాలామందికి అవగాహన లేక చిన్న పిల్లలకు పోలియో చుక్కలను వేయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో పిల్లలు పోలియో బారిన పడి జీవితకాలం అంగవైకల్యంతో బాధపడుతున్నారని తెలిపారు. మారుమూల ప్రాంతాలతో పాటు వలసలు వచ్చి ఉన్నవారిని సైతం వదలకుండా పోలియో చుక్కలను వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. చిన్న పిల్లలందరికీ అందేలా యువత ప్రజలను చైతన్యపర్చాలన్నారు.
ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని సబ్ సెంటర్‌లో ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. పోలియో మహమ్మారిని దరి చేరనీయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.
చౌదరిగూడ గ్రామంలో సర్పంచ్ నక్క వరలక్ష్మి, ఎంపిటిసి సభ్యురాలు రమాదేవి, మాజి సర్పంచ్ బైరు రాములుగౌడ్, ఎన్‌ఎఫ్‌సినగర్‌లో సర్పంచ్ స్టీవెన్, ఎంపిటిసి సభ్యుడు జంపాల రమేశ్, కొర్రెముల గ్రామంలో వైస్ ఎంపిపి గ్యార లక్ష్మయ్య, సర్పంచ్ బైనగారి నాగరాజు, టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి తరిణే మహింద్రాచారి తదితరులు పిల్లలకు పోలియో చుక్కలను వేశారు.

ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 21: రైతులు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటల సాగుకు ప్రాథాన్యతనివ్వాలని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు శిక్షణ కేంద్రం ఎడిఎ మేరీరేఖ సూచించారు. ఆదివారం మండల పరిధిలోని తులేకలాన్ గ్రామంలో రైతులకు పంటల సాగుపై ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. వరి, పత్తిపంటలను సాగు చేసే కంటే రైతులు ఇతర పంటలను సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. మొక్కజొన్న, పెసర, మినుము, అలసంద, కంది, కొర్ర, రాగి, సజ్జ, జొన్న, కూరగాయల పంటలను సాగుకు రైతులు అధిక ప్రాథాన్యతనివ్వాలన్నారు. కంది పంటకు ఎండు తెగుళ్లు రాకుండా ట్రైకో డెర్మ కిలో విత్తనానికికు పది గ్రాములను చొప్పున వేసి విత్తనశుద్ధి చేయాలని సూచించారు. అడవి పందుల బెడద నివారణకు ఆముదం నూనె, సల్ఫర్‌ను వినియోగించి సుతిల్ తాడును అందులో ముంచి పంట చుట్టు కడితే ఫలితం ఉంటుందని చెప్పారు.
ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల సూచనలు పొంది వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎఇఓ శ్రావణ్‌కుమార్, రఘు పాల్గొన్నారు.

టిఎస్‌ఎంఎస్ ఐడిసి అవినీతిపై విచారణ జరపాలి
నల్లకుంట, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం (టిఎస్‌ఎంఎస్ ఐడిసి) అవినీతిపై శాఖపరంగా విచారణ జరపాలి పిడబ్ల్యుడి కాంట్రాక్టర్ పెరుమల్ల కొండలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి మెడికల్ కళాశాలలోని పలు భవనాల మరమ్మతులు, నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన ఏఇ సురేందర్‌రెడ్డి, డిఇ రవీందర్ రెడ్డిపై సమగ్ర రీతిలో దర్యాప్తు జరిపి కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలుగా వివిధ అభివృద్ది పనులలో వీరు సుమారు 40 కోట్లను స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో భవనాల నిర్మాణాలు, మరమ్మత్తులు ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు కల్పించడానికి ఈ సంస్ధ తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్‌ఫ్రాస్జ్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేసారని అన్నారు.
రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్లోరింగ్, గోడలు పాడుకాకుండా నిర్మాణాలలో ఆధునికమైన రీతిలో డ్రైనేజ్ సౌకర్యాలలో నాణ్యాత ప్రమాణాలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని పేర్కోన్నారు. ఈప్రొక్యూర్‌మెంట్ విధానంవల్ల కాంట్రాక్టు పనులు చేపట్టాలని ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా పనలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసిందని ఆయన గుర్తు చేశారు. డమీ ఎస్టిమేషన్స్ డబుల్‌పేమెంట్ రుజువు చూపలేని ఫైళ్ళలో వీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భారీ కుంటకోణానికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బంధువులమని పేర్కోంటూ ఈ విభాగంలో పలుమార్లు డిడీలను సైతం ఇష్టానుసారంగా వాడుకున్నారని తెలిపారు. ఈ ప్రొక్యూర్‌మెంట్ విధానంవల్ల వీరికి కమీషన్లు, పర్సెంటేజీలు రాకపోవడం తమకు అనుకూలురు అయిన వారికి కాంట్రాక్టులు దక్కకపోవడంతో ఇష్టారాజ్యంగా వారు అవినీతి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు.
పనులు పూర్తి అయినా కాని కాంట్రాక్టర్‌లకు డబ్బలు ఇవ్వాలంటే 20 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎండి వేణుగోపాలరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా వీరి ఆగడాలను నియంత్రించలేక పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఇలాంటి అవినీతి ఉద్యోగుల ఆట కట్టించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

భావస్వేచ్ఛ పేరుతో దేశ విచ్ఛిన్నకర శక్తులకు మద్దతా?
ఖైరతాబాద్, ఫిబ్రవరి 21: భావస్వేచ్ఛ పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటూ నినాదాలు చేసిన వారికి రాహుల్‌గాంధీ మద్దతు ఇస్తారా అంటూ బిజెపి అనుబంధ ఓబిసి మోర్చా మండిపడింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బిజెపి నాయకులు సాంబమూర్తి, కాటం నర్సింహలు మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో దేశంలో బలమైన ప్రభుత్వం కొనసాగడం ఇష్టం లేక అంతర్గత అలజడులను కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ఆనాడు గాంధీ మహాత్ముడు జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేయగా, అదే జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ దేశ విచ్ఛిన్నకర శక్తులకు చేయూత నివ్వడం ఎంతో ఆవేదన కలిగించే అంశమని అన్నారు. రాజీవ్‌గాంధీ ఎల్‌టిటిఇని పెంచి పోషిస్తే వారి ఆగడాలకే బలైన విషయాన్ని రాహుల్ గుర్తించాలని అన్నారు. బిసి వర్గానికి చెందిన మోదీ ప్రధాని కావడం రాహుల్‌కి ఇష్టం లేదని, పదవి దూరం కావడంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వీరి దుశ్చర్యలను దేశప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు బిజెపి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటే అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే అంతర్గత అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వారి స్వార్ధ ప్రయోజనాల కోసం భావి భారతాన్ని తీర్చిదిద్దాల్సిన విద్యార్థుల్లో విషాన్ని నింపే సంస్కృతిని వీడనాడాలని హితవుపలికారు. ఈ సమావేశంలో ధనుంజయ్, సైదయ్య, సురేష్, నర్సింహ, వినోద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
మాతృభాషలో మాట్లాడేందుకు మొహమాటపడితే
తల్లిని అవమానపర్చినట్టే
వికారాబాద్, ఫిబ్రవరి 21: మాతృభాష తెలుగులో మాట్లాడేందుకు మొహమాటపడితే తల్లిలాంటి భాషను అవమానపర్చినట్టేనని టిఎస్‌యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటరత్నం అన్నారు.
ఆదివారం టిఎస్‌యుటిఎఫ్ కార్యాలయంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రంలో తెలుగు తల్లిదండ్రులకు పుట్టి తెలుగు జాతి తత్వ సంపత్తిచే అభివృద్ధి చెందిన వారంతా తెలుగులోనే మాట్లాడాలని చెప్పారు. ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషను పెంపొందించుకోవాలి తప్ప మరువకూడదని పేర్కొన్నారు. తెలుగు పండితుడు జి.కృష్ణ మాట్లాడుతూ ఇతర భాషలపై వ్యామోహంతో అమృతం లాంటి మాతృభాషను ఏవగించుకోవడం సరైంది కాదని తెలిపారు. మాతృభాషలో మాట్లాడేందుకు సందేహిస్తున్న వారంతా మాతృభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు.
ఎ.కిష్టయ్య మాట్లాడుతూ తల్లిద్వారా నేర్చుకున్న మాతృభాషను మరిస్తే భాష ఘోషిస్తుందని అన్నారు. టిఎస్‌యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.బాబురావు మాట్లాడుతూ మాతృభాష గొప్పదనాన్ని తెలిపి మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జి.రాములు, జంగయ్య, ఉమేష్, రాజులు పాల్గొన్నారు.

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ని మల్కాజిగిరిలో ఆపాలి

మల్కాజిగిరి, ఫిబ్రవరి 21: సౌత్ సెంట్రల్ రైల్వే 50వ ఏట అడుగు పెట్టినా రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటంలో ఘెరంగా విఫలం చెందుతున్నారనే విమర్శలు గుప్పుమంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలును మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌లో కనీసం అర నిమిషం పాటైన ఆపాలని ఎన్నో ఏళ్లుగా రైల్వే శాఖ అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోలేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ మొదలు కొని మల్కాజిగిరి, బొల్లారం, మెడ్చల్ వంటి పెద్ద స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపితే ప్రయాణికులకు సౌకర్యార్ధంగా ఉంటుంది. ఈమార్గం ద్వారానే బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రైళ్లపైనే ఆధార పడుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లకు మంచి కలెక్షన్లు కూడా వస్తుంటాయి. ప్రయాణికుల స్పందన పుష్కలంగా ఉన్నప్పటికీ వారికోసం అతి చిన్న సమస్యలను పరిష్కరించటంలో రైల్వే ఉన్నతాధికారులు పట్టింపులేని దోరని అవలంభిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో రైల్వే శాఖ నిర్వహించిన సమావేశాల్లో సబర్బన్ ట్రైన్ అండ్ బస్సు ట్రావెలెర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూర్ ప్రస్తావించినా అధికారులు మాత్రం నాన్చివేత దోరని అవలంభిస్తున్నారు.
నగరంపై ప్రయాణికుల వత్తిడి
పెరుగుతున్నా పట్టించుకోరా?
ముఖ్యంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో నగరానికి చేరుకోవలసిన ప్రయాణికులకు నరకం కనబడుతోంది. ముంబాయి నుంచి బయలుదేరే దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు బాసర రైల్వే స్టేషన్‌కు ఉదయం 10-30 గంటలకు వస్తుంది. అక్కడి స్టేషన్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలులో తిరుగు ప్రయాణం అవుతారు. ఈరైలులో ఎక్కువగా నగరానికి సంబంధించిన వారే ఉంటారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌లో ఆపితే ప్రయాణికులంతా దిగేందుకు వారి గమ్యస్థానం చేరేందుకు సౌకర్యార్ధంగా ఉంటుంది. అలా కాకుండా నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లటం జరుగుతోంది.
చాలా సందర్భాల్లో ఫ్లాట్ ఫారం దొరకక ఎంతో సమయం ఎవరికి అందుబాటులోలేని దగ్గర ఆపటంతో ప్రయాణికులు నరకం అనుభవించాల్సి వస్తోంది. తీరా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోదిగిన ప్రయాణికులు నగర శివార్లకు వెళ్లేందుకు మరో రెండు మూడు గంటల సమయంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి రావటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దుందిగల్‌లో శ్రీపెద్దమ్మ తల్లి సింహ దుర్గ ప్రతిష్ఠాపన మహోత్సవం
జీడిమెట్ల, ఫిబ్రవరి 21: కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని దుందిగల్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి సింహ దుర్గ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు తూళ్ల వీరెందర్‌గౌడ్ విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. అతిథులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వివేక్, వీరెందర్‌గౌడ్ మాట్లాడుతూ అమ్మవారి కృపా, కటాక్షలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు. పెద్దమ్మతల్లి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో నాయకులు చినంగి వెంకటేశం ముదిరాజ్, జక్కుల కృష్ణాయాదవ్, చంద్రయ్య, మల్లిఖార్జున్, నీరట్ రాజు, రామకృష్ణ, నర్సింహ పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి
అందరూ కలిసిరావాలి
మహేశ్వరం, ఫిబ్రవరి 21: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కలిసిరావాలని, ఎన్ని నిధులైనా తేవడానికి సిద్ధంగా వున్నామని మాజీ హోంమంత్రి, రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ తెలిపారు. ఆదివారం తుక్కుగూడ, మంఖల్, ఇమాంగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్తాపనలు చేసారు. తుక్కుగూడలో ఆర్టీసి బస్‌స్టేషన్ ప్రారంభోత్సవం, కల్యాణ మంటపానికి శంకుస్థాపన చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహేశ్వరం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాల్సి వుందని, అందుకు ఎన్ని నిధులు ఖర్చయినా తేవడానికి సిద్ధంగా వున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి విషయంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా నివేదికలిస్తే నిధుల కేటాయింపులో చొరవ తీసుకుంటానని అన్నారు. నియోజకవర్గంలో పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశం వుందని స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే తీగల మాట్లాడుతూ, మహేశ్వరం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ, మైక్రోమాక్స్, ఐటి కంపెనీలు వస్తున్నాయని స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. తుక్కుగూడలో నారాయణగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి మంఖల్, ఇమాంగూడలో సిసి రోడ్డు, వాటర్‌ఫిల్టర్లను దేవేందర్‌గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు టి.వీరేందర్‌గౌడ్, ఎంపిపి స్నేహ, వైఎస్ ఎంపిపి స్వప్న, సర్పంచ్ డి.సుధాకర్, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మయ్య, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు
హాల్టింగ్ ఇవ్వాలని దత్తాత్రేయకు వినతి
మేడ్చల్, ఫిబ్రవరి 21: మేడ్చల్ రైల్వేస్టేషన్ గుండా ఆగకుండా వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపేలా కేంద్ర రైల్వేమంత్రిపై ఊత్తిడి తేవాలని కోరుతూ మేడ్చల్ మండల బిజెపి అధ