హైదరాబాద్

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం లక్షా 51వేల 939 మంది విద్యార్థులు 189 కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి అడిషనల్ జెసి అశోక్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ కంట్రోల్‌లో ఉండేలా, పరీక్షా కేంద్రాల వద్ధ నిఘా విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్ధీ లేకుండా చూడాలని, ప్రశ్నాపత్రాల బండిళ్లను జాగ్రత్తగా తీసుకెళ్లాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖను కోరారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని అన్ని పరీక్షా కేంద్రాల్లో మెడికల్ కిట్‌లతో పాటు వోఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచటంతో పాటు కేంద్రాలు ఎక్కువగా ఉన్న చోట ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం నిర్ణిత సమయంలోపు చేరుకునేందుక వీలుగా బస్సులు తగు సంఖ్యలో ఉండేందుకు వీలుగా ఆర్టీసి కూడా ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ధ ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.

పాతబస్తీలో స్టెరాయిడ్స్ గుట్టురట్టు
ఒకరి అరెస్టు 150 ఆక్సిటోసిన్ బాటిళ్ల స్వాధీనం

హైదరాబాద్, మార్చి 1: పాతబస్తీలో స్టెరాయిడ్స్ విక్రయాల గుట్టు రట్టయింది. సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఓ వ్యాపారిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 150 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్‌లోని జనతా కిరాణ స్టోర్‌పై దాడి చేసి మహమ్మద్ ఆరిఫ్ అనే వ్యాపారిని అరెస్టు చేశారు. పాడి పశువులకు ఈ స్టెరాయిడ్ (ఇంజెక్షన్) ఇస్తే అధిక పాలు ఇస్తుందని, ఆ పాలు సేవించిన వారి రోగాల బారిన పడుతున్నారని డ్రగ్ ఇనె్స్పక్టర్ తెలిపారు. వ్యాపారి ఆరిఫ్ గత కొంత కాలంగా ఆక్సిటోసిన్ అనే స్టెరాయిడ్‌ను నగరంలోని డైరీలకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి వ్యాపారి అరీఫ్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు ఖాలీద్ పరారీలో ఉన్నట్టు అదనపు డిప్యూటీ కమిషనర్ ఎన్ కోటిరెడ్డి తెలిపారు.
ఇదేం కాలం?
వాతావరణంలో
అనూహ్యమైన మార్పులు
ప్రబలుతోన్న సీజనల్ వ్యాధులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 1: వేసవి కాలం ఈ సారి కాస్త ముందుగానే రావటంతో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా నగరంలోని పలు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. తెల్లవారుఘాము చల్లగా ఉండటం, ఆ తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు బాగా మండిపోయి, తిరిగి సాయంత్రం ఏడు గంటల నుంచి చల్లటి గాలులు వీయటంతో అసలు ఇది ఏం కాలం అంటూ ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి సంవత్సరం శివరాత్రి చలి గజగజ వణికించి వెళ్లిపోయిన తర్వాత ఎండలు మండుతాయి. వాతావరణంలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకోవటంతో వైరల్ ఫీవర్, జలుబు వంటి స్వల్ప అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా జలుబు, గొంత నొప్పి వంటి లక్షణాలతో ఫీవర్ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు ఎక్కువ మంది రోగులు వస్తున్నారు.
మధ్యాహ్నం పూట ఎండలు బాగా మండిపోతున్నా, వారం రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావటం వాతావరణంలో మార్పులకు నిదర్శనం. కానీ ఈ సారి కాస్త ముందునే ప్రచండ భానుడు ప్రతాపాన్ని చూపుతున్నారు. ఈరోజుల్లో సాధారణంగా 32 డిగ్రీలు నమోదు కావల్సిన పగటి ఉష్ణోగ్రతలు అదనంగా మూడు, నాలుగు డిగ్రీలు నమోదుకావటంతో మధ్యాహ్నం పూట నగరంలో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. మధ్యాహ్నం పనె్నండు గంటల తర్వాత నగరంలో రద్దీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పలుచబడిపోతున్నాయి. తెల్లవారుజాము అయిదారు గంటలసమయంలో వాతావరణం చల్లగా ఉండి చలి గాలులు వీయటం, ఆ తర్వాత పదకొండు గంటల నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగటం, ఆ తర్వాత సాయంత్రం ఏడు, ఎనిమిది గంటల నుంచి చల్లటి గాలులు వీయటంతో వాతావరణంలో మార్పులు అయోమయంగా మారి, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఆవర్తనం కారణంగానే ఎండలు మండిపోతున్నాయని, మున్ముందు మరింత మండిపోయే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సారి కాస్త ముందుగానే మండిపోతున్న ఎండలతో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

సెలక్షన్..కలెక్షన్
వసూళ్ల బిజీలో
జిహెచ్‌ఎంసి యంత్రాంగం
క్రమబద్ధీకరణ ఛార్జీలు..ఆస్తిపన్ను
బకాయిలు
రోజూ కమిషనర్
ప్రత్యేక సమీక్ష

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 1: మహానగర పాలక సంస్థ అధికారులు నేటి నుంచి ఆదాయం సమకూర్చుకునే పనిలో పడనున్నారు. ఒకవైపు బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన, రెండో దఫా ఛార్జీల వసూళ్లు ఒకవైపైతే ఆస్తిపన్ను వసూళ్లతో మరో వైపు బిజీ కానున్నారు.
వాస్తవానికి క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి శాస్ర్తియమైన విధులు టౌన్‌ప్లానింగ్ అధికారులే నిర్వహించాల్సి ఉండగా, ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి ట్యాక్సు సిబ్బంది ఉన్నా, అన్ని విభాగాలను అధికారులు ఇందులో భాగస్వాములను చేశారు. ఈ ఏట ఆస్తిపన్ను టార్గెట్ రూ. 1100 కోట్లు పెట్టుకోగా, ఇందులో ముఖ్యమంత్రి కుదించిన రూ. 85 కోట్లు మినహా 1015 కోట్లలో ఇప్పటికే అధికారులు రూ. 600 కోట్ల వరకు వసూలు చేశారు.
మిగిలిన రూ. 400 కోట్లను మార్చి నెలాఖరు కల్లా వసూలు చేయాల్సి ఉంది. దీనికి తోడు క్రమబద్ధీకరణ దరఖాస్తులను కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి, మొత్తం క్లియర్ చేస్తే అవి మరో సుమారు రూ. 800 నుంచి వెయ్యి కోట్ల వరకు వసూలయ్యే అవకాశముంది.
ఇందుకు గాను ఇప్పటికే కమిషనర్ క్షేత్ర స్థాయి ట్యాక్సు సిబ్బంది అయిన బిల్ కలెక్టర్లు, ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లు మొదలుకుని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల వరకు కూడా టార్గెట్లు విధించారు. ఈ ఏటా లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లలో ముఖ్యమంత్రి ప్రకటించిన పన్ను కుదింపు మొత్తం రూ. 85 కోట్లు మినహా మిగిలిన రూ. 1015 కోట్లు వసూలు చేయాల్సిందేనని కమిషనర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు రూ. 600 కోట్ల వరకు పన్ను వసూలైనట్లు తెలిసింది. ఇక మార్చి మాసంలోని 31 రోజుల్లో సుమారు రూ. 400 నంచి రూ. 540 కోట్ల వరకు పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు గాను మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పన్ను వసూళ్లకు వ్యూహాలు
ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి జిహెచ్‌ఎంసిలోని అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల స్థాయిలో ప్రత్యేకంగా ప్రాపర్టీ ట్యాక్సు పరిష్కారం పేరుతో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తూ వివాదాలను పరిష్కరిస్తున్నారు.
ఈ మాసంలో కూడా రానున్న 6, 13,20,27 తేదీల్లోని ఆదివారాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతేగాక, ప్రతిరోజు పన్ను వసూళ్లకు సంబంధించి కమిషనర్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీంతో పాటు రూ. 50లక్షల వరకు బకాయి పడ్డ ఆస్తిపన్ను బకాయిదారులను ప్రత్యేకంగా కలవడం, ఫోన్ ద్వారా సంప్రదించటం, ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారమివ్వటం వంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.

గుర్రపుడెక్కను తొలగిద్దాం
డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆదేశం
పూర్వవైభవాన్ని సంతరించుకున్న
చిన్నరాయిని చెరువు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 1: నగరంలో దోమలు, క్రిమికీటకాలు ఉత్పత్తికి కేంద్రాలుగా మారిన అన్ని చెరువుల్లోని గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా. బి.జనార్దన్ రెడ్డి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఇప్పటికే ఆయన జారీ చేసిన ఆదేశాలను అమలు చేస్తున్న శేరిలింగంపల్లి, ఆర్సీపురం, మల్కాజ్‌గిరి, సరూర్‌నగర్ ప్రాంతాల్లో పలు చెరువుల్లో అధికారులు గుర్రపు డెక్కను తొలగిస్తున్నారు. మూడురోజుల పాటు నిరంతరంగా జరుగుతున్న ఈ పనులపై సమీక్ష నిర్వహించిన కమిషనర్ నగరంలోని అన్ని చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించాలని ఆదేవించారు. ఇందుకు స్థానిక ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంధ సంస్థల సహకారంతో పనులను త్వరగా ముగించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే గత కొద్దిరోజుల క్రితం అల్వాల్‌లోని 18.62 ఎకరాల్లో ఉన్న చిన్నరాయిని చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వీడ్ హార్వెస్టర్‌తో తొలగించటంతో పాటు నేడు ఆ చెరువు పక్షులు, చేపలతో ఎంతో ఆకర్షణీయంగా మారి, స్థానికులను ఆకట్టుకుంటుంది. అలాగే నగరంలో దోమల నివారణకు యాంటి లార్వా మందులను స్ప్రే చేస్తున్నప్పటికీ నగరంలో ఉన్న 165 చెరువుల్లో పెద్ద ఎత్తున గుర్రపుడెక్క పెరిగి, అవి దోమలకు నిలయంగా మారాయని, దీన్ని తొలగించేందుకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కమిషనర్ సూచించారు. ఈ చెరువుల నుంచి తొలగించిన గుర్రపుడెక్క, ఇతర వ్యర్థాలను వెంటనే జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. ఇందుకు గాను రెండు జెసిబిలు, 25 టన్నుల సామర్థ్యం కల్గిన ఆరు వాహనాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచినట్లు మల్కాజ్‌గిరి సర్కిల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తుది దశలో ఉన్న గుర్రపుడెక్క తొలగింపు పనులను మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో తొలగించి, చెరువును మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి తోడు రామచంద్రాపురంలోని రాయచెరువు, కూకట్‌పల్లి సర్కిల్‌లోని హస్మత్‌పేట చెరువు, రాయదుర్గంలోని మల్కంచెరువులలో గుర్రపుడెక్కను తొలగించే పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. హస్మత్‌పేట చెరువులో గుర్రపుడెక్కను తొలగించే పనులను ప్రస్తుతం 50 మంది కార్మికులు రెండురోజులుగా చేపడుతున్నారని, మరో వారం రోజుల పాటు ఈ పనులు కొనసాగనున్నట్లు తెలిపారు.

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలి
నిరుద్యోగుల జేఏసి డిమాండ్
సచివాలయ ముట్టడికి
విఫలయత్నం
ఇందిరాపార్కు వద్ద
ధర్నా, రాస్తారోకో
తీవ్ర ఉద్రిక్తత, తోపులాటలు,
వాగ్వివాదాలు

ముషీరాబాద్, మార్చి 1: గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం కనీసం మూడ్నెల్లు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటి డిమాండ్ చేసింది. ప్రామాణికంగా సిలబస్ రాలేదు, వచ్చిన తప్పుడు తడకల సిలబస్‌ను ఎలా చదివి ప్రిపేర్ అయ్యేదని ప్రశ్నించింది. ఈమేరకు గ్రూపు, ఇతర నోటిఫికేషన్‌లలో పలు మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జెఏసి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద సచివాలయం ముట్టడికి విఫలయత్నం చేశారు. ధర్నా చౌక్ వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరిన వేలాది మంది విద్యార్థులను రాక్‌పార్క్ వద్ద అడ్డుకున్నారు. విద్యార్ధులకు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ దూసుకురావటంతో ఓదశలో ఆందోళన అదుపుతప్పే ప్రమాదం ఏర్పడింది. డిసిపి కమల్‌హాసన్‌రెడ్డి, చిక్కడపల్లి ఎసిపి జె.నర్సయ్య సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్ధులను శాంతిపజేసి, నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అంతకుముందు ధర్నాచౌక్ వద్ద నిరుద్యోగుల జఏసి చైర్మన్ నీల వెంకటేష్ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. గ్రూప్-2లో 3వేల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీ ఉంటే, కేవలం 439 పోస్టులకు నోడిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. గ్రూపు ఉద్యోగాలలో అవినీతి, అక్రమాలకు తావీయకుండా ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేయాలన్నారు.
ఎస్సై పోస్టులను 1600కు పెంచాలని, ఎస్సై పోస్టుల పరీక్షలలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ మార్కులను ర్యాంకింగ్‌కు తీసుకోవద్దని డిమాండ్ చేశారు. అలాచేస్తే తెలుగు మీడియం విద్యార్ధులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్-1లో మొత్తం ఉద్యోగాలు 1200, గ్రూప్-3లో 8వేలు, గ్రూప్-4లో 36వేలు మొత్తం ఖాళీలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్లు, డిప్యూటీ లెక్చరర్ల 6వేల ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, విద్యార్ధి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, కుల్కచర్ల శ్రీనివాస్, రాజేందర్, ఆశోక్‌గౌడ్, కరుణ, రూప, శివాని, పాండు, క్రాంతినాయక్, రాంబాబు, సురేష్, గజేందర్ పాల్గొన్నారు.