హైదరాబాద్

ఇక జోరుగా తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: హోటళ్లలో పరిశుభ్రత, ఆక్రమణలు, సెల్లార్లలోని నీటిని ఇష్టారాజ్యంగా రోడ్లపై వదలటం, అపార్ట్‌మెంట్లలో సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంటు నిర్వహణ సక్రమంగా లేవంటే ఇకపై తగిన మూల్యం చెల్లించుకోవల్సిందే! స్వచ్ఛ్భారత్ సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేశంలోని మహానగరాలు, పట్టణాల నగర పాలక సంస్థలకు నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఈ ఏడు మెరుగైన ర్యాంకును సాధించేందుకు వీలుగా ఇప్పటికే పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించటం, వారిని చైతన్యవంతులను చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసిన బల్దియా ఇకపై కాస్త కఠినంగానే వ్యవహారించాలని భావిస్తోంది. ఇందుకు గాను వారానికోసారి ప్రతి గురువారం పరిశుభ్రత, శానిటేషన్ వంటి అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. శనివారం ఇమ్లిబన్ ఆర్టీసి బస్టాండు కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కేవలం బల్దియా అధికారులతో కూడిన బృందాలే ఇలాంటి తనిఖీలు నిర్వహించగా, ఇక మున్ముందు జలమండలి, ట్రాఫిక్ పోలీసులను సైతం కలుపుకుని ఈ తనిఖీలు నిర్వహించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. సమావేశంలో భాగంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల సందర్భంగా పలు అపార్ట్‌మెంట్లలోని సెల్లార్లలో నిలిచిన నీటిని అక్రమంగా రోడ్లపై వదలటం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని వివరించారు. మరికొన్ని అపార్ట్‌మెంట్లలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేనందున సెప్టిక్ ట్యాంక్‌లలోని వ్యర్థ జలాలను కూడా రోడ్డుపై అక్రమంగా వదలటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. ఈ విధగా జలాలను రోడ్లపై వదలటంతో పాటు సరైన పరిశుభ్రత నిర్వహించని హోటళ్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలు వంటి అంశాలపై వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ ఉమ్మడి తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలో సాధ్యమైనంత అధికంగా సిమెంటు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. ఇమ్లిబన్ బస్టాండ్‌లోకి రావటానికి మూసీపై కేవలం రెండు వంతెనలున్నందున, మరొక వంతెనను రంగ్‌మహాల్ వద్ద నిర్మించాలని ఆర్టీసి ఈడి కోరగా, ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అథారిటీని కోరనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఆర్టీసికి చెందిన పలువురు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైనే బస్సులను ఆపటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ట్రాఫిక్ అధికారులు సమావేశంలోని ఉన్నతాధికారులకు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటంతో పాటి తరుచుగా నిబంధనలను అతిక్రమించే డ్రైవర్లకు జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జలమండలి ఎండి దాన కిషోర్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ రవీందర్, ఆర్టీసి ఈడి పురుషోత్తమ్‌తో పాటు మెట్రోరైలు, విద్యుత్, రెవెన్యూ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆ రోడ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించండి
వచ్చే నెల 28న నగరంలోని హైటెక్స్ వేదికగా జరుగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును పురస్కరించుకుని దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, ప్రతినిధులు హాజరుకానున్నందున అటువైపు వెళ్లే మెయిన్ రోడ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ సదస్సుకు ప్రదాని నరేంద్రమోది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె కూడా హాజరయ్యే అవకాశమున్నందున అన్ని శాఖల అధికారులు చక్కటి సమన్వయంతో పూర్తి స్థాయిలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అంతేగాక, నగరంలోని మొదటి దశలో 30 జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, 15 జంక్షన్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని కమిషనర్ తెలిపారు. అదే విధంగా రెండో దశ 65 జంక్షన్ల అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. నగరంలో 379 ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, నీటి నిల్వలు లేకుండా తగు చర్యలు చేపట్టాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.